కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు: పిల్లలకు సానుకూల వాతావరణం కల్పించండి..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్ల నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. చదువులు ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి.

ఉపాధ్యాయులు అంతర్జాలం ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇంట్లోనే విద్యనభ్యసిస్తున్న పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ శనివారం ట్విట్టర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించారు. పిల్లలకు మొదటి పాఠశాల వారి ఇల్లేనని, తొలి గురువులు తల్లిదండ్రులేనని చెప్పారు. కరోనా వ్యాప్తి వంటి ప్రతికూల సమయంలో చిన్నారుల విద్యార్జన, ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతవరకు చదువుకున్నారు అనేదానితో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న పిల్లలకు ఏవిధంగా తోడ్పాటు అందించాలో సూచించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

  • ఇళ్లల్లో పిల్లలకు భద్రతతో కూడిన సానుకూలమైన వాతావరణం కల్పించాలి. వారి ఆరో గ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. పోషకాహారం అందించాలి. చిన్నారులకు చదువు, విజ్ఞానంతోపాటు వినోదం కూడా అవసరమే.
  • చిన్నారుల పట్ల కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఇతర కుటుంబ సభ్యులు కూడా బాధ్యత వహించాలి.
  • జాతీయ విద్యా విధానం– 2020 ప్రకారం పిల్లలకు వారి వయస్సును బట్టి కళలను పరిచయం చేయాలి. పిల్లల్లో ఆందోళన, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కళలు ఉపయోగ పడతాయి.
  • చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించాలి. అందుకు గల కారణాలు తెలుసుకోవాలి. విద్యార్జనలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి.
  • ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు అవసరమైన వనరులు సమకూర్చాలి.