కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు:పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయండి..

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో మెడికల్ కాలేజీల ఏర్పాటును ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
దీనికి చర్యలు చేపట్టాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఆదేశించింది. వైద్య విద్య బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలసి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవి పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పైగా ఆయా మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొంది. అంతేగాకుండా రెండు లేదా నాలుగు ప్రైవేట్ సంస్థలు గ్రూప్‌లుగా ఉన్న కన్సార్టియంతోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించింది. ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభమైన మూడేళ్లలోపు పీజీ కోర్సులను ప్రారంభించాలి. దీనికోసం విద్యార్థి, అధ్యాపకుల నిష్పత్తిని హేతుబద్ధీకరించాలి. అందులో భాగంగా కాలేజీల్లో అధ్యాపకులు, డీన్, ప్రిన్సిపల్, డెరైక్టర్ సహా వివిధ పోస్టుల్లో నియమించడానికి వయో పరిమితిని 70 ఏళ్ల వరకు పెంచిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. గరిష్టంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య సామర్థ్యాన్ని 150 నుంచి 250 వరకు పెంచేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో భూమి, ఫ్యాకల్టీ, సిబ్బంది, పడకల సంఖ్య, పరికరాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలను హేతుబద్దీకరించినట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేసేందుకు ఎంబీబీఎస్, పీజీ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని సూచించింది. మెడి కల్ కాలేజీ లేనిచోట్ల జిల్లా ఆసుపత్రులను ఆధునీకరించి మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంకల్పించింది. ఇలా దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు దశల వారీగా ఏర్పడినట్లు తెలిపింది.
దేశంలో వైద్యుల కొరత ఉన్నందునే...
మన దేశంలో అర్హత కలిగిన వైద్యుల కొరత ఉంది. వైద్య విద్యలో అంతరాలను మనకున్న పరిమిత వనరులు, ఆర్థిక వ్యవస్థతో తీర్చడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిన నేపథ్యంలో పీపీపీ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బలాన్ని కలపడం ద్వారా పీపీపీ నమూనాను రూపొందించడం అవసరమని స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో కొత్త లేదా ఇప్పటికే ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో జిల్లా ఆసుపత్రులతో అనుసంధానించడం వల్ల మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. పైగా వైద్య విద్య ఖర్చులను హేతుబద్ధం చేస్తుంది. ఈ ప్రాముఖ్యతను నీతి ఆయోగ్ నొక్కిచెప్పింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను అభివృద్ధి చేసిందని కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతిని అమలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలు ముందుకు రావాలని కేం ద్రం సూచించింది. రాయితీలతో మెడికల్ కాలేజీకి రూపకల్పన చేయడం, నిర్మించడం, ఫైనాన్స్ చేయడం, నిర్వహించడం వంటివి చేపట్టాలని సూచించింది. దేశంలో జిల్లా కేంద్రాల్లో 60% చోట్లే మెడికల్ కాలేజీలున్నందున ప్రభుత్వం పీపీ పీ పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది.