ఇక తెలంగాణ ఎడ్‌సెట్‌లో అన్ని సబ్జెక్టులకు ఒకే ప్రశ్నపత్రం..!

కేయూ క్యాంపస్‌: తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్‌ (బ్యాచ్‌ లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) 2021 ప్రవేశాల విధానాల్లో పలుమార్పులు చేసినట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఎ.రామకృష్ణ వెల్లడించారు.

సోమవారం కాకతీయ యూనివర్సిటీలో కేయూ వీసీ తాటికొండ రమేశ్‌తో కలసి ఆయన వివరాలు వెల్లడించారు. టీఎస్‌ఎడ్‌సెట్‌ 2021లో ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకేలా ఉంటుందని చెప్పారు. బీఎడ్‌ చదువుకోవాలనే అభ్యర్థులకు మెథడాలజీ (సబ్జెక్టుల) విషయంలో నిబంధనలను సులభతరం చేసినట్లు తెలిపారు. టీడీసెట్‌లో ఇకపై ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్‌ను ప్రాతిపదికగా తీసుకొని నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష 1 నుంచి 10 వరకు తెలంగాణ కరికులంతో కూడా ఉంటుందని, మొత్తం మార్కులు 150 కాగా.. వీటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 20, సాంఘిక శాస్త్రం 20(60) ఉండగా టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 20, ఇంగ్లిష్‌ 20, జనరల్‌ నాలెడ్జ్, విద్యారంగ సమస్యలు 30, కంప్యూటర్‌పై అవగాహనకు 20 మార్కులు ఉంటాయని చెప్పారు. ప్రవేశపరీక్ష సమయం 2 గంటలు ఉంటుందని, సిలబస్, మోడల్‌పేపర్‌ టీఎస్‌ఈ ఎడ్‌సెట్‌ 2021 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అపరాధరుసుము లేకుండా ఈనెల 7 వరకు, రూ. 259 అపరాధ రుసుముతో ఈనెల 15 వరకు గడువు ఉందని, ప్రవేశ పరీక్ష ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.

చ‌ద‌వండి: టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు జూలై 16 వరకు పెంపు

చ‌ద‌వండి: సీఎం జగన్‌ కీలక నిర్ణయాలతో ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు..