గవర్నర్ పదవి... సమర్థమైన ఐపీఎస్అధికారుల కోసం అన్వేషణ

సాక్షి, హైదరాబాద్: త్వరలో పలు రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం ముగిసిపోనున్న నేపథ్యంలో సమర్థమైన వారి కోసం కేంద్రం అన్వేషణ మొదలుపెట్టింది.
రాజకీయ నాయకులతో పాటు ఐపీఎస్ అధికారులను ఈసారి గవర్నర్లుగా నియమించాలని భావిస్తోంది. ఇందుకోసం సరైన ఐపీఎస్ అధికారుల వేట మొదలుపెట్టింది. సాధారణంగా గవర్నర్ పోస్టులో రాజకీయ నాయకులే ఉంటారు. సీనియర్లు, పరిపాలనలో సమర్థులుగా పేరున్న వారిని వారిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గవర్నర్లుగా నియమించడం పరిపాటే. అయితే అప్పుడప్పుడూ సివిల్ సర్వీసెస్ అధికారులను కూడా నియమిస్తూ ఉంటారు. సీనియర్ అధికారులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ (ఏపీ), కిరణ్‌బేడీ (పుదుచ్చేరి), పీఎస్ రామ్మోహన్‌రావు (తమిళనాడు) గవర్నర్లుగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఇటీవలే భేటీ..
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దక్షిణాది నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను గవర్నర్లుగా నియమించాలని కేంద్రంలోని ఓ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారు. పనిపై నిబద్ధత, విధి నిర్వహణలో సమర్థులు, ట్రబుల్ షూటర్లు అని ఆ ఇద్దరు అధికారులకు ఉన్న రికార్డే ఇందుకు కారణం. అందులో భాగంగా తెలంగాణకు చెందిన ఓ ఐపీఎస్ అధికారితో ఆ సీనియర్ నేత ఇటీవల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పదవిని చేపట్టే విషయమై ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఊహించని ఈ ఆఫర్‌కు అవాక్కయిన ఆ అధికారి.. తొలుత నమ్మలేదు. కానీ, సీరియస్‌గా అడిగేసరికి.. తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని, ఆలోచించుకునేందుకు కాస్త సమయం కావాలని కోరినట్లు తెలిసింది.

ఐపీఎస్‌లే ఎందుకు?
రాజకీయ సంక్షోభం, సరిహద్దు, తీవ్రవాదం, ఉగ్రవాదం, తిరుగుబాటు తదితర జఠిల సమస్యలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఐపీఎస్‌లు రాణించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నా యి. పరిపాలనాపరంగా ఉన్న అనుభవం, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడని మనస్తత్వం, క్లిష్ట పరిస్థితుల్లో పరిస్థితులను చేయిదాటకుండా సమన్వయం చేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంటుంది. అందుకే ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వా లు గవర్నర్లుగా నియమిస్తుంటాయి. వామపక్ష తీవ్రవాదం ఉచ్ఛస్థితిలో ఉన్న 2007లో జార్ఖండ్ గవర్నర్‌గా ఐపీఎస్ అధికారి ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం పంపింది. ఆయన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆయనకు ఉమ్మడి ఏపీ బాధ్యతలను కూడా అప్పగించారు. 2014లో రాష్ట్ర విభజన నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఏపీ, తెలంగాణలకు ఆయనే గవర్నర్‌గా విజయవంతంగా విధులు నిర్వహించారు. మరోవైపు కిరణ్‌బేడీ ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరి కంటే ముందే.. 2002లో ఉమ్మడి ఏపీ నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్ రామ్మోహన్‌రావు తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు.