AP CM YS Jagan : ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు అభినందనలు..మీకు ఏం కావాలన్నా..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాలకోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
AP CM YS Jagan Mohan Reddy

క్యాంపు కార్యాలయంలో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్నారు. వారి నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా, వారిని మరింత ప్రోత్సహించేలా మాట్లాడారు. 

మీకు ఏం కావాలన్నా..
‘‘ఈరోజు ఐఏఎస్‌లుగా ఉన్న చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవే. మీరుకూడా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. కలెక్టర్ల స్థాయికి చేరుకోవాలి. కృషి చేస్తే సాధ్యంకానిది ఏమీ లేదు. సీఎంఓ అధికారి ముత్యాలరాజు జీవితమే దీనికి ఉదాహరణ. ఇప్పటికే మీరంతా ఒక స్థాయికి చేరారు. బాగా కృషిచేసి మంచి స్థానాల్లోకి రావాలి. మీకు ఏం కావాలన్నా తగిన సహాయ సహకారాలు అందుతాయి’’ అని సీఎం జగన్‌ తెలిపారు. 

ఇప్పటివరకూ 179 మందికి ర్యాంకులు..
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల నుంచి ఇప్పటివరకూ 179 మంది వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. ఎస్టీ విద్యార్థుల్లో 9 మంది ఐఐటీలకు ఎంపికకాగా, 21 మంది ప్రిపరేటరీ కోర్సులకు, 59 మంది ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర విద్యాసంస్థలకు ఎంపికయ్యారు. 

ఎస్సీల నుంచి 13 మంది ఐఐటీలకు, 34 మంది ప్రిపరేటరీ కోర్సులకు, 43 ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్ర విద్యాసంస్థలకు ఎంపికయ్యారు. ఇంకా కౌన్సిలింగ్‌ జరుగుతున్నందన మరింత మందికి ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఇంకా నీట్‌, ఇతర వైద్య సంస్థల ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని, వీటిలో కూడా ర్యాంకులు సాధిస్తారని అధికారులు వెల్లడించారు.

#Tags