FAAN : డాక్టర్‌ సుందరాచారికి అరుదైన గౌరవం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రభుత్వాస్పత్రి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌వీ.సుందరాచారికి అరుదైన గౌరవం దక్కింది. న్యూరాలజీ విభాగంలో రెండున్నర దశాబ్దాలుగా అందిస్తోన్న సేవలకు గాను ‘ఫెలో ఆఫ్‌ ది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ’ (ఎఫ్‌ఏఏఎన్‌)కు ఆయన ఎన్నికయ్యారు.
Dr.N.V.Sundara Chary

న్యూరాలజీ విభాగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇలాంటి గౌరవం దక్కుతుంది. ఎఫ్‌ఏఏఎన్‌కు న్యూరాలజిస్ట్‌గా రోగులకు అందించిన సేవలు, బోధనా నైపుణ్యాలు, పరిశోధనలు, కమ్యూనికేషన్స్, విభాగాల అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సుందరాచారి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో న్యూరాలజీ హెచ్‌వోడీగా ఉన్న సమయంలో స్లీప్‌ ల్యాబ్‌తో పాటు, స్ట్రోక్‌ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. న్యూరాలజీలో 4 పీజీ సీట్లు కూడా తీసుకువచ్చారు. ఈ క్రమంలో సుందరాచారిని ఫెలోగా ఎంపిక చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ వద్ద గతంలో ఫెలోగా ఎన్నికైన ఇద్దరు వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో అక్కడ నిపుణుల బృందం అన్ని కోణాల్లో పరిశీలించి డాక్టర్‌ సుందరాచారిని ఎఫ్‌ఏఏఎన్‌గా ఎంపిక చేసింది. భారత్‌లో ఈ గుర్తింపు అతికొద్ది మందికి మాత్రమే ఉంది.

#Tags