World Press Freedom Index: పత్రికా స్వేచ్ఛ సూచీలో 150వ స్థానానికి పడిపోయిన భారత్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది. భారత్‌లో లక్షకుపైగా వార్తా పత్రికలతో పాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయని నివేదికలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ఎడిషన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయిన మే 3న.. ప్యారిస్‌లోని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. చివరి(180వ) స్థానంలో నార్త్ కొరియా ఉంది.