India-Guyana Relations: గయానాతో 10 ఒప్పందాలు కుదుర్చుకున్న మోదీ..

పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, గయానా నిర్ణయించాయి.

వ్యవసాయం, హైడ్రోకార్బన్లు మొదలుకుని ఫార్మా, డిజిటల్‌ పేమెంట్ల దాకా 10 రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైనికంగా గయానాకు కీలక మద్దతు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా న‌వంబ‌ర్ 20వ తేదీ మోదీ గయానా చేరుకున్నారు. 

గత 56 ఏళ్లలో అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. తన పర్యటనతో ఇరు దేశాల మైత్రీ బంధం సుదృఢమవుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. గయానాలో జన్‌ ఔషధీ కేంద్రం ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించారు. 

మోదీకి అత్యున్నత పురస్కారం..
ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకు గానూ.. గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్ అలీ ఆయ‌న‌కి అందించారు. ఇరు దేశాల సంబంధాల్లో మోదీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇర్ఫాన్ అన్నారు. భేటీ అనంతరం నేతలిద్దరూ మొక్కలు నాటారు. 

గయానా, గ్రెనెడా, బార్బడోస్‌ ప్రధానులు కూడా మోదీతో భేటీ అయ్యారు. తర్వాత గయానాలోని భారతీయులతో ప్రధాని భేటీ అయ్యారు. 185 ఏళ్ల కింద అక్కడికి వలస వెళ్లిన భారతీయులు ఇప్పటికీ దేశ పతాకను సగర్వంగా రెపరెపలాడిస్తున్నారంటూ ప్రశంసించారు. గయానాలో 3.2 లక్షల మందికి పైగా ఎన్నారైలున్నారు. 

Dominica Award of Honour: ప్ర‌ధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం

#Tags