Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 08 కరెంట్‌ అఫైర్స్‌

Jawaharlal Nehru University: జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళ?

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నూతన ఉపకులపతి(వీసీ)గా తెలుగు మహిళ డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌(59) నియమితులయ్యారు. దీంతో జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళగా శాంతిశ్రీ రికార్డుకెక్కారు. ఐదేళ్లు జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్‌ కుమార్‌ 2021 ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందిన నేపథ్యంలో.. శాంతిశ్రీని నూతన వీసీగా నియమించారు. ఈ మేరకు శాంతిశ్రీ నియామకానికి రాష్ట్రపతి, జేఎన్‌యూ విజిటర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు ఫిబ్రవరి 7న వెల్లడించారు. మహారాష్ట్రలోని సావిత్రిభాయి ఫూలే పుణే యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీ జేఎన్‌యూ వీసీ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఆమె గతంలో జేఎన్‌యూ నుంచి ఎంఫిల్, పీహెచ్‌డీ అందుకున్నారు.

  • శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ 1962 జూలై 15న రష్యాలోని (అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌) సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. 
  • ఆమె తండ్రి డాక్టర్‌ ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలంలోని యలవర్రు.
  • శాంతిశ్రీ తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ ఓరియంటల్‌ ఫ్యాకల్టీ డిపార్టుమెంట్‌లో తమిళం, తెలుగు భాషల ప్రొఫెసర్‌గా పనిచేశారు. 
  • శాంతిశ్రీ మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1983లో హిస్టరీ, సోషల్‌ సైకాలజీలో బీఏ డిగ్రీ అందుకున్నారు.
  • 1985లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ(ఎంఏ) డిగ్రీ పొందారు. 
  • 1990లో జేఎన్‌యూకు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ నుంచి ‘పార్లమెంట్, ఫారిన్‌ పాలసీ ఇన్‌ ఇండియా–ద నెహ్రూ ఇయర్స్‌’పై పీహెచ్‌డీ డాక్టరేట్‌ అందుకున్నారు. 
  • ఉన్నత విద్యావంతురాలైన శాంతిశ్రీ ధూళిపూడి ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. కన్నడం, మలయాళం, కొంకణీ భాషలను అర్థం చేసుకోగలరు.

ఎన్నెన్నో పురస్కారాలు..

  • శాంతిశ్రీ పలు అంశాల్లో 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 
  • మద్రాసు పెసిడెన్సీ కాలేజీ నుంచి 1980–81, 1981–82, 1982–83, 1983–84, 1984–85లో ఎల్ఫిన్‌స్టోన్‌ ప్రైజ్‌. ఈ ప్రైజ్‌ను ఎక్కువసార్లు (ఐదుసార్లు) గెలుచుకున్న రికార్డు ఇప్పటికీ శాంతిశ్రీ పేరిటే ఉంది. 
  • 1998లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌–మాడిసన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సౌత్‌ ఆసియన్‌ డీస్‌ నుంచి ఫెలోషిప్‌. ఆస్ట్రియా నుంచి మరో ఫెలోషిప్‌.

విద్యా రంగానికి సేవలు

  • 1988లో గోవా యూనివర్సిటీలో బోధనా వృత్తిని ఆరంభించారు. 
  • 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యురాలిగా, 2001 నుంచి 2007 వరకూ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా, 2001 నుంచి 2006 దాకా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా బాధ్యతలు. 
  • చైనాలోని హూనన్‌ వర్సిటీలో ఆసియన్‌ అండ్‌ యూరోపియన్‌ స్టడీస్‌ రిసోర్స్‌పర్సన్‌గా విధులు.
  • యూజీసీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌    సైన్స్‌ రీసెర్చ్‌(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) సభ్యురాలిగా పని చేశారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఢిల్లీలోని జేఎన్‌యూ ఉపకులపతి(వీసీ)గా నియమితులైన తొలి మహిళ?
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు    : తెలుగు మహిళ డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌(59)
ఎందుకు : జేఎన్‌యూ వీసీగా సేవలందించిన తెలంగాణవాసి ఎం.జగదీష్‌ కుమార్‌ 2021 ఏడాది ఆఖర్లో పదవీ విరమణ పొందడంతో..

United Nations: అణు కార్యక్రమాలకు నిధుల కోసం సైబర్‌ దాడులు చేస్తోన్న దేశం?

అణు, మిసైల్‌ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్‌ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్‌ స్పెషలిస్టులను ఉటంకిస్తూ... ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఐరాస నిపుణుల ప్యానల్‌ ఫిబ్రవరి 7న ఈ మేరకు వెల్లడించింది.

డీపీఆర్‌కే అంటే..
ఐరాస ప్యానల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్‌చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్‌ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది. కాజేసిన ఈ నిధులను డీపీఆర్‌కే నియంత్రిత అడ్రస్‌లకు తరలిస్తోంది. 2019–2020 మధ్య కూడా సైబర్‌ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసింది. డీపీఆర్‌కే అంటే డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్‌ దాడులకు తెగబడుతోంది.
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు    : ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఐరాస నిపుణుల ప్యానల్‌
ఎందుకు : అణు, మిసైల్‌ కార్యక్రమాలకు నిధుల కోసం..

Russell Reynolds Associates: పర్యావరణ అనుకూల విధానంతో ఉన్న కంపెనీల శాతం?

వచ్చే దశాబ్ద కాలంలో వ్యాపారాలకు సస్టెయినబులిటీ (పర్యావరణానికి అనుకూలంగా వ్యాపార విధానాలను మార్చుకోవడం లేదా వ్యాపారాల్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వడం) కీలకంగా మారనుందని మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ రస్సెల్‌ రేనాల్డ్స్‌ అసోసియేట్స్‌(ఆర్‌ఆర్‌ఏ) తెలియజేసింది. భారత్‌లో 57 శాతం కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నట్టు తెలిపింది. అదే అంతర్జాతీయంగా అయితే 43 శాతం కంపెనీలే పర్యావరణ అనుకూల విధానాలతో ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 9,500 మంది ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చింది.

ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్‌కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్‌ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తెలి పేర్కొన్నారు. ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా హర్దీప్‌ సింగ్‌ పూరి ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
57 శాతం కంపెనీలు పర్యావరణ అనుకూల విధానంతో ఉన్నాయి.
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు    : మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ రస్సెల్‌ రేనాల్డ్స్‌ అసోసియేట్స్‌(ఆర్‌ఆర్‌ఏ)
ఎక్కడ    : భారత్‌
ఎందుకు  : పర్యావరణ పరిరక్షణ కోసం..

Archery: ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు?

లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌–2022లో భారత స్టార్‌ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్‌ ప్రొ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్‌ పియర్స్‌ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఆర్చర్‌?
ఎప్పుడు : జనవరి 30
ఎవరు    : వెన్నం జ్యోతి సురేఖ
ఎక్కడ    : పెన్సిల్వేనియా, అమెరికా
ఎందుకు : లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌–2022లో సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నందున..

Boxing: స్ట్రాండ్‌జా స్మారక టోర్నీని ఏ దేశంలో నిర్వహించనున్నారు?

ప్రతిష్టాత్మక స్ట్రాండ్‌జా స్మారక బాక్సింగ్‌ టోర్నీ–2022లో పాల్గొనే భారత మహిళల జట్టులో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ (52 కేజీలు) ఎంపికైంది. బల్గేరియాలో 2022, ఫిబ్రవరి 18 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 12 కేటగిరీల్లోనూ భారత్‌ తరఫున జాతీయ చాంపియన్స్‌ బరిలోకి దిగనున్నారు. నీతూ (48 కేజీలు), అనామిక (50), శిక్ష (54), సోనియా (57), మీనా  (60), పర్వీన్‌ (63), అంజలి (66), అరుంధతి (71), సవిటీ (75), పూజా రాణి (81), నందిని (ప్లస్‌ 81 కేజీలు) పోటీపడతారు.

మహిళల ఐపీఎల్‌..
2023 ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. 2022 ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్‌ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా 2021 ఏడాది మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీని నిర్వహించలేదు.

CM Shivraj Singh Chouhan: లతా మంగేష్కర్‌ మ్యూజిక్‌ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌(92) జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్‌లోని ఆమె జన్మస్థలం ఇండోర్‌లో ఫిబ్రవరి 7న రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మొక్క నాటారు. ఇండోర్‌లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. 1929, సెప్టెంబర్‌ 28న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో లత జన్మించారు.

లతకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: అమర గాయని లతా మంగేష్కర్‌ స్మృత్యర్థం పార్లమెంటు ఉభయసభలు ఫిభ్రవరి 7న గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు.

కర్ణాటకలో హిజాబ్‌ గొడవ
కర్ణాటకలో హిజాబ్‌ (స్కార్ఫ్‌) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్‌) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు ఫిబ్రవరి 7న హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరయ్యారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్‌ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్‌ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
లతా మంగేష్కర్‌ పేరిట మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు 
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు    : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 
ఎక్కడ    : ఇండోర్, మధ్యప్రదేశ్‌
ఎందుకు : గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌(92) జ్ఞాపకార్థం..

Ukraine Crisis: ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలపై చర్చలు ప్రారంభించిన దేశాలు?

ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఫిబ్రవరి 7న అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయెల్‌ మాక్రాన్‌ చర్చలు జరపగా, జర్మన్‌ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్‌ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో  పుతిన్‌తో మాక్రాన్‌ సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్‌ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌.. ఫిబ్రవరి 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు.

అప్పట్లో కూడా ఆ రెండే..
క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్‌ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్‌ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడైమిర్‌ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉక్రెయిన్, రష్యా, అమెరికాతో చర్చలు ప్రారంభించిన దేశాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు    : ఫ్రాన్స్, జర్మనీ
ఎందుకు : ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు..

IUCN: ఓఈసీఎమ్‌ గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు?

హరియాణ రాష్ట్రం, గురుగ్రామ్‌ జిల్లా, గురుగ్రామ్‌ నగర సమీపంలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్కుకు ఓఈసీఎమ్‌(Other effective area-based conservation measures - OECM) గుర్తింపు లభించింది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం(ఫిబ్రవరి 2) సందర్భంగా ఫిబ్రవరి 2న ఈ గుర్తింపును అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఓఈసీఎమ్‌ గుర్తింపు పొందిన తొలి పార్కుగా ఆరావళి బయోడైవర్సిటీ పార్కు నిలిచింది. అంతగా రక్షితం కాకపోయినప్పటికీ.. గొప్ప జీవవైవిధ్యానికి మద్దతు ఇచ్చే ప్రాంతాలకు ఓఈసీఎమ్‌ గుర్తింపును ఇస్తారని హరియాణా బయోడైవర్సిటీ బోర్డ్‌ చైర్మన్‌ వినీత్‌ కుమార్‌ గార్గ్‌ తెలిపారు. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (IUCN) సంస్థ... ఓఈసీఎమ్‌ గుర్తింపుని ఇస్తోంది.

ఆరావళి బయోడైవర్సిటీ పార్కు 390 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది పాక్షిక–శుష్క వృక్షసంపదను కలిగి ఉంది. ఇందులో 43,000 కంటే ఎక్కువ పొదలు, 101,000 చెట్లు మరియు 300 స్థానిక వృక్ష జాతులు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ పార్క్‌ మైనింగ్‌ సైట్‌ గా ఉండేది. స్థానిక జనాభాతో పాటు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల అపారమైన కృషితో ఇది నగర అడవిగా మార్చబడింది. ఆరావళిలను ఢిల్లీ పచ్చని ఊపిరితిత్తులుగా పరిగణిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఓఈసీఎమ్‌ గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు?
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు    : ఆరావళి బయోడైవర్సిటీ పార్కు
ఎక్కడ    : గురుగ్రామ్, గురుగ్రామ్‌ జిల్లా, హరియాణ
ఎందుకు : అంతగా రక్షితం కాకపోయినప్పటికీ.. గొప్ప జీవవైవిధ్యానికి మద్దతు ఇచ్చినందున..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 07 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags