Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 28 కరెంట్‌ అఫైర్స్‌

Digital Health ID Card: కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఉద్దేశం?

పౌరులకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డును జారీ చేసేందుకు ఉద్దేశించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎమ్‌)’ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 27న ఢిల్లీలో వర్చువల్‌ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2020, ఆగస్టు 15న ఈ మిషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం అమలు చేసింది.

డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డుతో ప్రయోజనాలు..
ఆరోగ్య చరిత్ర నిక్షిప్తం: వ్యక్తి ఆధార్‌ కార్డు లేదా మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్‌ హెల్త్‌ ఐడెంటిఫికేషన్‌(ఐడీ) నంబర్‌ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్‌ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్‌ కార్డు తీసుకెళ్తే హెల్త్‌ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది.

యాప్‌తో అనుసంధానం: డిజిటల్‌ హెల్త్‌ ఐడీ(ఖాతా) వివరాలను ఒక మొబైల్‌ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్‌ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్‌ ఫెసిలిటీస్‌ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఏ) తరహాలో యూనిఫైడ్‌ హెల్త్‌ ఇంటర్‌ఫేస్‌(యూహెచ్‌ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్‌ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి.

టెలీ మెడిసిన్‌ వ్యవస్థ విస్తరణ: దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్‌ వంటి సదుపాయాలు ఈ హెల్త్‌ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్‌ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎమ్‌) ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : పౌరులకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డును జారీ చేసేందుకు

 

DRDO: ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని కొత్త వెర్షన్‌ ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ను భారత్‌ సెప్టెంబర్‌ 27న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలో ఉన్న చండీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి మొదటిసారిగా ప్రయోగించిన ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ క్షిపణి.. ఆకాశంలోని లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. ప్రయోగంలో డీఆర్‌డీవో, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా జి.సతీశ్‌ రెడ్డి ఉన్నారు.

ఆకాశ్‌ ప్రైమ్‌ విశేషాలు...

  • ప్రస్తుతమున్న ఆకాశ్‌ క్షిపణితో పోలిస్తే.. ‘ప్రైమ్‌’ వెర్షన్‌లో దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. దీంతో లక్ష్యాన్ని మరింత కచ్చితత్వంతో తుత్తునియలు చేయవచ్చు.  
  • భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ్‌ ప్రైమ్‌.. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మరింత ఎత్తయిన ప్రదేశాల్లోని లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ    : చండీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్, బాలాసోర్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం 
ఎందుకు  : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు...


World Tourism Day: కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన పోర్టల్‌ పేరు?

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 27న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర పర్యాటక శాఖ ‘టూరిజం ఫర్‌ ఇంక్లూజివ్‌ గ్రోత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొనగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్, పర్యాటక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కమలవర్ధన్‌ రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ పర్యాటక గణాంకాలతో రూపొందించిన ‘నిధి 2.0’ (ద నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పోర్టల్‌ను స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించారు. పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే చర్యల్లో భాగంగా... దేశంలోని పర్యాటక ప్రాంతాలు, హోటల్స్, డెస్టినేషన్స్, వాతావరణ పరిస్థితులు, సౌకర్యాల వివరాలతో నిధి పోర్టల్‌ను రూపొందించామని మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నిధి 2.0 (ద నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పోర్టల్‌ ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా
ఎక్కడ    : అశోకా హోటల్, న్యూఢిల్లీ
ఎందుకు  : పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే చర్యల్లో భాగంగా...


Goods and Services Tax: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీఎస్‌టీ సమీక్ష కమిటీకి నేతృత్వం వహించనున్నారు?

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 27న ఆర్థిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం... ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహించనుండగా, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సార«థ్యం వహిస్తారు. రేట్‌ స్లాబ్‌లు– విలీనం, జీఎస్‌టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్‌ బేస్‌ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నాయి.

కమిటీలు ఇలా... 
బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్‌ ఆర్థికమంత్రి అమిత్‌ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్‌ బాలగోపాల్, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తార్‌కిషోర్‌ ప్రసాద్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎనిమిది సభ్యుల కమిటీలో... ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి టీఎస్‌ సింగ్‌ డియో తదితరులు ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  రాష్ట్రాల మంత్రులతో కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన రెండు కీలక కమిటీలకు నేతృత్వం వహించనున్న వారు?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌
ఎందుకు  : వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ సమీక్షకు...


Retirement: టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్‌?

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ టెస్టు ఫార్మాట్‌కు పలికాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సెప్టెంబర్‌ 27న ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. వన్డే, టి20 ఫార్మాట్‌లలో తన కెరీర్‌ను పొడిగించుకునేందుకు టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు 34 ఏళ్ల మొయిన్‌ అలీ తెలిపాడు. 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన మొయిన్‌ ఇప్పటివరకు 64 టెస్టులు ఆడి 2,914 పరుగులు సాధించాడు. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేసే అతను... టెస్టుల్లో 195 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ టి20 టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.

అగ్రశ్రేణి క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?
సెప్టెంబర్‌ 27న విడుదలైన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి ఆర్చర్‌ జ్యోతి సురేఖ ఏకంగా ఎనిమిది స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ 5వ ర్యాంక్‌లో నిలిచింది. కాంపౌండ్‌ విభాగంలో ఇప్పటివరకు భారత ఆర్చర్‌ సాధించిన అత్యుత్తమ ర్యాంక్‌ ఇదే. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో సురేఖ క్రితంసారి 13వ ర్యాంక్‌లో నిలిచింది. మరోవైపు రికర్వ్‌ విభాగం మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఆన్‌ సాన్‌ నాలుగు స్థానాలు ఎగబాకి కొత్త వరల్డ్‌ నంబర్‌వన్‌గా అవతరించింది. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న దీపిక కుమారి రెండో ర్యాంక్‌కు పడిపోయింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ
ఎందుకు : వన్డే, టి20 ఫార్మాట్‌లలో తన కెరీర్‌ను పొడిగించుకునేందుకు...

NCW: పాడి పరిశ్రమలో మహిళలకు సామర్థ్య శిక్షణ ప్రారంభం

పాడి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మహిళల కోసం దేశవ్యాప్త శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జాతీయ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో చేపట్టే... ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలకు చేయూతనివ్వడం, పాల ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్‌ పెంచడం ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి వీలు అవుతుందని పేర్కొన్నారు. హరియాణా గ్రామీణ జీవనోపాధి మిషన్‌తో కలిసి లాలా లజపతిరాయ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ, యానిమల్‌ సైన్సెస్‌(LUVAS)లో... సెప్టెంబర్‌ 27న మహిళా స్వయం సహాయక బృందాల కోసం ‘వాల్యూ యాడెడ్‌ డైరీ ప్రొడక్ట్స్‌’ అంశంపై ఈ ప్రాజెక్ట్‌లో తొలి కార్యక్రమం నిర్వహించారు. హరియాణలోని హిసార్‌లో ఎల్‌యూవీఏఎస్‌(LUVAS) ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పాడి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మహిళల కోసం దేశవ్యాప్త శిక్షణ ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : జాతీయ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ 
ఎక్కడ    : లాలా లజపతిరాయ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ, యానిమల్‌ సైన్సెస్‌(LUVAS), హిసార్, హరియాణ
ఎందుకు  : మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికి వీలు అవుతుందని...


Temples: ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన దక్షిణాది రాష్ట్రం?

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 27న తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు ఆలయాలను వేదిక చేసేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దేవదాయ శాఖ ఆధ్వర్యంలో...
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మపథం పేరుతో ఆలయ ప్రాంగణాల్లో సాయంత్రం వేళ నాట్యం, శాస్త్రీయ సంగీతం, గాత్ర కచేరీలు, హరికథ, బుర్రకథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటివి ఏర్పాటు చేస్తారు. వారాంతాల్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఏపీ దేవదాయశాఖ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు.

ఉత్తమ ట్రావెల్‌ ఏజెంట్‌గా సదరన్‌ ట్రావెల్స్‌ 
ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్‌ 27) సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. సదరన్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉత్తమ ట్రావెల్‌ ఏజెంట్‌గా అవార్డును దక్కించుకుంది. సెప్టెంబర్‌ 27న హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 27
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు... 

Activist: హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్‌ కన్నుమూత

ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కమలా భాసిన్‌(75) మృతిచెందారు. చాలా రోజులుగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 25న తుదిశ్వాస విడిచారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ మండి బహావుద్దీన్‌లో 1946, ఏప్రిల్‌ 24న జన్మించిన కమల.. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

రాజ్యసభకు ఎన్నికైన సర్బానంద..
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్‌ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్‌ సెప్టెంబర్‌ 27న అస్సాం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మధ్యప్రదేశ్‌ నుంచి ఎల్‌ మురుగన్, పుదుచ్చేరి నుంచి బీజేపీ నేత సెల్వగణపతి, తమిళనాడు నుంచి కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము, కేఆర్‌ఎన్‌ రాజేశ్‌కుమార్‌లు, పశ్చిమబెంగాల్‌ నుంచి సుష్మితా దేవ్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రజిని పాటిల్‌ గెలుపొందారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 25
ఎవరు    : కమలా భాసిన్‌(75)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : కేన్సర్‌ కారణంగా...

UNGA 76th Session: ఏ రెండు దేశాలకు ఐరాస సభలో ప్రసంగించే అవకాశం లేదు?

అఫ్గానిస్తాన్, మయన్మార్‌ దేశాలకు సర్వప్రతినిధి సభలో ప్రసంగించే అవకాశం ప్రస్తుతానికి లేదని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. 76వ సెషన్‌లో ఆఖరు రోజున ప్రసంగించే దేశాల ప్రతినిధుల జాబితాను ఐరాస విడుదల చేసింది. ఇందులో తాలిబన్లు పాలిస్తున్న అఫ్గానిస్తాన్‌తోపాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చెలాయిస్తున్న మయన్మార్‌ పేర్లు లేవు. 2021, సెప్టెంబర్‌ 21న ప్రారంభమైన 76వ సెషన్‌ ఐరాస సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు జరిగాయి.

భారత్‌లో ఫాసిస్ట్‌ ప్రభుత్వ పాలన: ఇమ్రాన్‌
పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అభివర్ణించారు. ఆర్టికల్‌ 370 రద్దు, వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌లో ఇస్లాం వ్యతిరేకులు పరిపాలకులుగా ఉన్నారని, ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ముందుగా రికార్డు చేసిన ఇమ్రాన్‌ ప్రసంగం వీడియోను సెప్టెంబర్‌ 24న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రదర్శించారు.

తక్షణమే ఖాళీ చేయాలి: స్నేహ దుబే
ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో భారత యువదౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్తాన్‌ నోరుమూయించారు. ఇమ్రాన్‌ ప్రసంగానికి ఫస్ట్‌ సెక్రటరీ స్నేహ గట్టిగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ తక్షణమే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్‌ జారీ చేశారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 27 కరెంట్‌ అఫైర్స్‌

 

#Tags