నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.

శృంగేరి పీఠం నుంచి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ పంపారు. కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. శృంగేరి పీఠం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. శంకుస్థాపన సందర్భంగా మోదీ ప్రసంగించారు.

ప్రధాని మోదీ ప్రసంగం...

  • నూతన భవనం ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చింది.
  • పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేరుస్తుంది.


సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద...
ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంట్ భవనాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్ రోడ్‌ను మెరుగుపరుస్తారు.

సెంట్రల్ విస్టా విశేషాలు..

  • సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపట్టే ప్రాంతం ల్యూటెన్ ఢిల్లీలో ఉంది.
  • గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను సమకూరుస్తోంది.
  • నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది.
  • 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు.
  • ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022 ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యం.
  • ఎలాంటి భూకంపాలకు చెక్కుచెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
  • నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది.
  • నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్ సామర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది.
  • సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది.
  • రాజ్యసభ సీటింగ్ సామర్ధ్యం 384 సీట్లు.
  • ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్‌శక్తి భవన్‌లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది.
  • పార్లమెంటు, ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భమార్గం ఏర్పాటు చేస్తారు.
  • భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగాను, 9 వేల మంది పరోక్షంగాను పాలుపంచుకుంటారు.


ప్రస్తుత పార్లమెంటు భవనం గురించి...

  • బ్రిటిష్ కాలంలో ఈ భవనాన్ని నిర్మించారు.
  • శంకుస్థాపన: 1921 ఫిబ్రవరి 12
  • నిర్మాణానికి పట్టిన కాలం: 6 సం.లు
  • నిర్మాణ వ్యయం: రూ. 83 లక్షలు
  • ప్రారంభోత్సవం: 1927 జనవరి 18
  • ప్రారంభించింది: అప్పటి గవర్నర్ జనరల్ ఇర్విన్
  • రూపం: 560 అడుగుల వ్యాసంతో కూడిన వృత్తాకార కట్టడం
  • ఆకృతి, ప్లానింగ్, నిర్మాణ బాద్యతలు చేపట్టింది: ఎడ్విన్ లుటెన్స్, హెర్బెర్ట్ బేకర్





#Tags