నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్ ప్రారంభం

దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఢిల్లీలో ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్‌ భారత్, వోకల్‌ ఫర్‌ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్‌ ఫర్‌ వరల్డ్, నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్ లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది.

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్
ఎర్రకోట సాక్షిగా ఆగస్టు 15న ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్‌ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంలో భాగంగా నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్‌ ఐడీ నంబర్‌ ఇస్తారు. ఈ హెల్త్‌ ఐడీ డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్‌ రిపోర్ట్స్‌ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్‌ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు.

మేక్‌ ఫర్‌ వరల్డ్‌
మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్‌ ఫర్‌ వరల్డ్‌ దిశగా భారత్‌ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు.

అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌
రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించే ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ ప్రాజెక్టుని ప్రధాని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్‌ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్‌ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు.

ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
  • రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నాం. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించాం.
  • భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. భారత్‌ బయోటెక్, జైడస్‌ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతులు లభించాయి.
  • నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్‌లు అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్‌లు అందుతున్నాయి.
  • ఎల్‌ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్‌ ప్రపంచం చూసింది.
  • కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు.







#Tags