ఏపీకి దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లు

కోవిడ్‌– 19 నివారణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్‌ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను దిగుమ‌తి చేసుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 17న తన క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కోవిడ్‌–19 నివారణా చర్యలపై సమీక్షించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయో సెన్సార్‌ కంపెనీ ఈ కిట్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఈ కిట్లకు ఐసీఎంఆర్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల టెస్టు కిట్లను ఆర్డర్‌ చేసిందని, రానున్న రోజుల్లో వీటిని అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక పరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు.


ట్రూనాట్‌ కిట్లతోనూ..

రాష్ట్రంలో కోవిడ్‌–19 ప‌రీక్షల కోసం ఇప్పటికే ట్రూనాట్ కిట్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్‌ కిట్లు మన దగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. సుమారు 240కి పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అందువల్లే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జానాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్‌– 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది.

ముఖ్యమంత్రికి కోవిడ్‌–19
టెస్ట్‌..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌–19 పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా వైద్యులు ఆయనకు పరీక్ష చేసి, నెగిటివ్‌గా నిర్ధారించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్‌– 19 నివారణ చర్యల కోసం










#Tags