UN World Tourism Awards: యూఎన్‌డబ్ల్యూటీఓ పర్యాటక అవార్డుకు ఎంపికైన గ్రామం?

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి భూదాన్‌పోచంపల్లి గ్రామం ఎంపికైంది. రూరల్‌ టూరిజం, అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏటా ప్రపంచ పర్యాటక సంస్థ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 2021 సంవత్సరానికి భారత్‌ తరఫున తెలంగాణ నుంచి భూదాన్‌పోచంపల్లి, మేఘాలయా నుంచి కాంగ్‌థాంగ్, మధ్యప్రదేశ్‌ నుంచి లద్‌పురాఖాస్‌లు పోటీపడ్డాయి. వీటిలో భూదాన్‌పోచంపల్లి బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా ఎంపికైంది. 2021, డిసెంబర్‌ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్‌డబ్ల్యూటీఓ జనరల్‌ అసెంబ్లీ 24వ సెషన్‌ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వనున్నారు.

భూదానోద్యమానికి అంకురార్పణ...

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో భూదాన్‌పోచంపల్లి గ్రామం ఉంది. కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయమైన ఈ గ్రామానికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది.

 

సిల్క్‌సిటీగా పేరు..

భూదాన్‌పోచంపల్లి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. టై అండ్‌ డై పద్ధతిలో అంటే సిల్క్‌ దారానికి రంగులద్ది మగ్గాలపై ఇక్కత్‌ వస్త్రాలను రూపొందించడమనే కళ దేశంలో మరెక్కడా లేదు. వారి ప్రతిభతో పోచంపల్లికి ‘సిల్క్‌సిటీ’గా గుర్తింపు వచ్చింది. ఇక్కత్‌ వస్త్రాలకు 2004 జీఐ(పేటెంట్‌) గుర్తింపు వచ్చింది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది.
చ‌ద‌వండి: 2021 జాతీయ క్రీడా పురస్కారాల పూర్తి జాబితా

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ నుంచి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) బెస్ట్‌ టూరిజం విలేజ్‌ అవార్డుకు ఎంపికైన గ్రామం?
ఎప్పుడు  : నవంబర్‌ 16
ఎవరు    : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి గ్రామం
ఎందుకు : ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags