టెన్త్‌ పరీక్షల్లో.. క‌రోనా కారణంగా జ‌రిగిన‌ మార్పులు ఇవే!

పాఠశాల విద్యలో పదోతరగతి కీలక ఘట్టం. పది ఫలితాలే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి.

పదోతరగతిని అభ్యసించే వారు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉంటారు. కాగా, ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల తేదీలు వెలువడ్డాయి. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డులు పదోతరగతి పరీక్షల స్వరూపంలో కీలక మార్పులు చేశాయి. ఈ నేపథ్యంలో... పరీక్షార్థులకు ఉపయోగపడేలా కీలక సబ్జెక్టుల ప్రశ్నపత్ర స్వరూపాలతోపాటు ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

టైమ్‌ టేబుల్‌..

  • తెలంగాణలో మే 17న ఫస్ట్‌ లాంగ్వేజ్, మే 18న సెకండ్‌ లాంగ్వేజ్, మే 19న ఇంగ్లిష్, మే 20న మ్యాథమెటిక్స్, మే 21న జనరల్‌ సైన్స్‌(ఫిజికల్‌ అండ్‌ బయలాజికల్‌ సైన్స్‌), మే 22న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 24,25,26 తేదీల్లో ఓఎస్‌ఎస్‌సీ లాంగ్వేజ్, ఒకేషనల్‌ కోర్సు పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 7న ఫస్ట్‌ లాంగ్వేజ్, జూన్‌ 8న సెకండ్‌ లాంగ్వేజ్, జూన్‌ 9న ఇంగ్లిష్, జూన్‌10న మ్యాథమెటిక్స్, జూన్‌ 11న ఫిజికల్‌ సైన్స్, జూన్‌ 12న బయలాజికల్‌ సైన్స్, జూన్‌ 14 సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 15, 16 తేదీల్లో కాంపోజిట్‌ కోర్సు, ఓఎస్‌ఎస్‌సీ లాంగ్వేజ్, ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఆరు పేపర్లు..
కొవిడ్‌–19ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు పదోతరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు 11 పేపర్లుగా నిర్వహిస్తున్న పరీక్షలను... సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున 6 పేపర్లకు కుదించింది. ఇంతకాలం ఫస్ట్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్‌(ఫిజికల్‌ సైన్స్‌ అండ్‌ బయోలాజికల్‌ సైన్స్‌), సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల పరీక్షలను రెండు పేపర్లుగా నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఆయా సబ్జెక్టులను ఒకే పేపర్‌గా జరపనున్నారు. ప్రతి పేపర్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు. 20 మార్కులు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌కు కేటాయించారు. సెకండ్‌ లాంగ్వేజ్‌ మినహా మిగిలిన సబ్జెక్టుల్లో సమ్మేటివ్, ఇంటర్నల్‌(ఫార్మేటివ్‌) కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సమ్మేటివ్‌ పరీక్షల్లో 80 మార్కులకు కనీసం 28 మార్కులు పొందిన అభ్యర్థులను సైతం ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సెకండ్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు లేవు. ఇందులో కనీసం 20 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. 2020–2021 బ్యాచ్‌ పదోతరగతి విద్యార్థులకు మాత్రమే 6 పేపర్ల విధానం వర్తిస్తుంది.

ఇంగ్లిష్‌..

  • ఈ పేపర్‌లో పార్ట్‌ ఏ,బీ ఉంటాయి. పార్ట్‌ ఏ 40 మార్కులకు ఉంటుంది. సమయం గంటన్నర. పార్ట్‌ ఏలో రెండు రీడింగ్‌ ప్యాసేజ్‌లు ఇచ్చి...ఒక్కోదాన్నుంచి 5 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. వీటి తర్వాత కొంత సమాచారం, ఐడియాలను ఇచ్చి ఇమేజినేషనరీ సంభాషణ రాయమంటారు. దీనికి ఛాయిస్‌గా సమస్యలపై నిర్దేశిత అధికారికి లెటర్‌ రాయమంటారు. ఈ ప్రశ్నకు 12 మార్కులు ఉంటాయి. స్నేహితుడిని ప్రోత్సహిస్తూ ఒక లెటర్‌ లేదా ఒక విషయాన్ని లేదా అవసరాన్ని హైలెట్‌ చేస్తూ పోస్టర్‌ రూపొందించమంటారు. దీనికి 8 మార్కులు ఉంటాయి.
  • పార్ట్‌ బీ: 40 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక పోయమ్‌ ఇచ్చి దానిపై ఐదు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సెంటెన్స్‌ ఎర్రర్స్‌పై 5 మార్కులకు 5 ప్రశ్నలు వస్తాయి. ప్యాసేజ్‌ ఇచ్చి కొన్ని సెంటెన్స్‌లను అండర్‌లైన్‌ చేస్తారు. వాటిపై 10 మార్కులకు 5 ప్రశ్నలు, 5 మార్కులకు 5 ప్రశ్నలు అడుగుతారు. కంప్లీట్‌ ప్యాసేజ్‌పై(సరైన పదం ఎంచుకొని) 5 మార్కులకు ఐదు ప్రశ్నలు అడుగుతారు. కంప్లీట్‌ ప్యాసేజ్‌ (బ్రాకెట్‌లో ఉన్న సరైన పదం ఎంచుకోవాలి)పై 10 మార్కులకు 10 ప్రశ్నలు అడుగుతారు.

మ్యాథమెటిక్స్‌..

  • ఈ పేపర్‌లో పార్ట్‌ ఏ, బీ ఉంటాయి. పార్ట్‌ ఏ సెక్షన్‌ 1లో రెండు గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపులో 6 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ఒక్కో గ్రూపు నుంచి కనీసం 3 ప్రశ్నలకు తగ్గకుండా మొత్తం 6 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సెక్షన్‌ 2లో 8 ప్రశ్నలు ఇచ్చి 4 ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్‌ 3లో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో 4 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి గ్రూపు నుంచి కనీసం 2 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు.
  • పార్ట్‌ బీ 20 మార్కులకు ఉంటుంది. సమయం 30 నిమిషాలు. 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

జనరల్‌ సైన్స్‌..

  • ఫిజికల్‌ సైన్స్‌లో... పార్ట్‌ ఏ, పార్ట్‌ బీ ఉంటాయి. పార్ట్‌ ఏ సెక్షన్‌ 1లో 6 ప్రశ్నలు ఇచ్చి 3 రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. సెక్షన్‌ 2లో 4 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సెక్షన్‌ 3లో 4 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. పార్ట్‌ బీలో 10 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
  • బయలాజికల్‌ సైన్స్‌లో... పార్ట్‌ ఏ, బీ ఉంటాయి. పార్ట్‌ ఏ సెక్షన్‌ 1లో 6 ప్రశ్నలు ఇచ్చి 3 రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. సెక్షన్‌ 2లో 4 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సెక్షన్‌ 3లో 4 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. పార్ట్‌ బీలో 10 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.

సోషల్‌ స్టడీస్‌..
ఈ పేపర్‌లో పార్ట్‌ ఏ, బీ ఉంటాయి. పార్ట్‌ ఏ సెక్షన్‌ 1లో రెండు గ్రూపుల ఉంటాయి. ఒక్కో గ్రూపులో 6 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ప్రతి గ్రూపు నుంచి కనీసం 3 ప్రశ్నలకు తగ్గకుండా.. మొత్తం 6 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సెక్షన్‌ 2లో 8 ప్రశ్నలు ఇచ్చి 4 ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్‌ 3లో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో 4 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి గ్రూపు నుంచి కనీసం 2 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి.

  • పార్ట్‌ బీ 20 మార్కులకు ఉంటుంది. సమయం 30 నిమిషాలు. 20 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు పేపర్లు..
ఆంధ్రప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సైతం పదోతరగతి పరీక్షల స్వరూపంలో మార్పులు చేసింది. మొత్తం 11 పేపర్లను 7 పేపర్లకు కుదించింది. సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, హిందీ, సోషల్‌ సబ్జెక్టు పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌ను 50 మార్కులకు, బయోలాజికల్‌ సైన్స్‌ పేపర్‌ను 50 మార్కులకు నిర్వహించనుంది. విద్యార్థులు సమాధానాలను ప్రత్యేక బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది.

ఇంగ్లిష్‌..
ఈ పేపర్‌లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. నాలుగో సెక్షన్‌లో మాత్రమే ఛాయిస్‌ ఉంటుంది. సెక్షన్‌ 1లో ఒక మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. సెక్షన్‌ 2లో 2 మార్కుల ప్రశ్నలు 8 అడుగుతారు. సెక్షన్‌ 3లో 4 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. సెక్షన్‌ 4లో 8 మార్కుల ప్రశ్నలు 5 అడుగుతారు. ఈ సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు ఛాయిస్‌ ఉంటుంది.

మ్యాథ్స్‌..
ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌1లో ఒక మార్కు ప్రశ్నలు 12 అడుగుతారు. సెక్షన్‌ 2లో 2 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. సెక్షన్‌ 3లో 4 మార్కుల ప్రశ్నలు 8 అడుగుతారు. సెక్షన్‌ 4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. ఈ సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు ఛాయిస్‌ ఉంటుంది.

భౌతికశాస్త్రం..
ఈ పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌ 1లో 12 అర మార్కు ప్రశ్నలు, సెక్షన్‌ 2లో 8 ఒక మార్కు ప్రశ్నలు, సెక్షన్‌ 3లో 8 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ 4లో 5 నాలుగు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌ 4లో ప్రతి ప్రశ్నకు ఛాయిస్‌ ఉంటుంది.

జీవశాస్త్రం..
ఈ పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. సెక్షన్‌ 1లో 12 అర మార్కు ప్రశ్నలు, సెక్షన్‌ 2లో 8 ఒక మార్కు ప్రశ్నలు, సెక్షన్‌ 3లో 8 రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌ 4లో 5 నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌4లో ప్రతి ప్రశ్నకు ఛాయిస్‌ ఉంటుంది.

సోషల్‌ స్టడీస్‌..
ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌ 1లో 12 ఒక మార్కు ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌ 2లో 2 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. సెక్షన్‌ 3లో 4 మార్కుల ప్రశ్నలు 8 అడుగుతారు. సెక్షన్‌ 4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. ఈ సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు ఛాయిస్‌ ఉంటుంది.

ప్రిపరేషన్‌ టిప్స్‌..
ఇంగ్లిష్‌..

  • టెక్ట్స్‌ బుక్‌ను ఆసాంతం చదవడం ద్వారా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో మంచి మార్కులు పొందొచ్చు. రీడింగ్‌ కాంప్రహెన్షన్స్‌ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు తొలుత సదరు ప్యాసేజ్‌లను జాగ్రత్తగా చదవాలి. అనంతరం ప్రశ్నను చదివి.. తిరిగి ప్యాసేజ్‌ను చదువుతూ సమాధానాలు గుర్తించాలి. వీటిలో ఒకటి, రెండు ప్రశ్నలకు సమాధానాలు ప్యాసేజ్‌లోనే ఉంటాయి. మిగతా ప్రశ్నలకు సొంతంగా సమాధానం(ఓపెన్‌ ఎండెడ్‌గా) రాయాల్సి ఉంటుంది. ప్రతి డిస్‌కోర్స్‌కు కనీసం ఒక మోడల్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. బేసిక్‌ గ్రామర్‌పై దృష్టిపెట్టాలి.

మ్యాథ్స్‌..

  • వాస్తవ సంఖ్యలు పాఠ్యాంశంలో యూక్లిడ్‌ భాగహార న్యాయం,ప్రధాన కారణాంకాల లబ్ధం, కరణీయ సంఖ్యలు, సంవర్గమానాలు, ప్రధాన సంఖ్యలపై ప్రశ్నలు వస్తాయి. సమితులు పాఠ్యాంశంలో తక్కువ భావనలు ఉంటాయి. దీంతో ఈ చాప్టర్‌లో ఎక్కువ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. సమితి రూపం, ఉపసమితి, శూన్యసమితి, సమితుల ఛేదనం, సమ్మేళనం, బేధం తదితరాలపై దృష్టిపెట్టాలి. బహుపదులు పాఠ్యాంశంలో బహుపదులు కనుగొనడం, బహుపది రేఖాచిత్రాలు, బహుపది శూన్యాలు, గుణకాల మధ్య సంబంధం, బహుపదుల భాగహారం తదితరాలపై దృష్టిపెట్టాలి. రెండు చలరాశులలో రేఖీయ సమీకరణాల జత పాఠ్యాంశంలో ఏదైనా సమస్యను ఇచ్చి.. రేఖీయ సమీకరణాల జతగా రాయమని అడుగుతారు. ఈ చాప్టర్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. గుణకాలపై పట్టు సాధించడం తప్పనిసరి. వర్గసమీకరణాల పాఠ్యాంశంలో వర్గసమీకరణాల మూలాలు కనుగొనడంపై దృష్టిపెట్టాలి. శ్రేఢులు చాప్టర్‌లో ఇచ్చిన శ్రేఢిని గుర్తించడం, అంక, గుణ శ్రేఢులలో ఎన్‌వ పదం కనుగొనడంపై సాధన చేయాలి. నిరూపక జ్యామితి పాఠ్యాంశంలో ఎక్కువ సూత్రాలు ఉంటాయి. కాబట్టి సూత్రాలను కంఠస్థం చేయాలి. ఇందులో రెండు బిందువుల మధ్య దూరం కనుగొనడంపై తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది.
  • సరూప త్రిభుజాలు చాప్టర్‌లో నిర్వచనాలు, ఉదాహరణలు, సరూప త్రిభుజ ధర్మాలపై దృష్టిపెట్టాలి. వృత్తానికి స్పర్శరేఖలు–ఛేదన రేఖలు పాఠ్యాంశంలో వృత్తానికి బాహ్య బిందువు నుంచి గీసిన స్పర్శ రేఖ.. అల్ప, అధిక వృత్త ఖండముల వైశాల్యాలు, సిద్ధాంతాలు కీలకం. త్రికోణమితి చాప్టర్‌లో త్రికోణమితి నిష్పత్తులు, వాటి మధ్య సంబంధం, త్రికోణమితీయ సర్వసమీకరణ నిరూపణలు–అనువర్తనాలు, పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు తదితరాలు కీలకంగా నిలుస్తాయి. త్రికో ణమితీయ అనువర్తనాల పాఠ్యాంశం నుంచి ఊర్థ్వ,నిమ్న కోణాలు,ఎత్తులు –దూరాలకు సంబంధించిన సమస్యలు తదితరాలపై ప్రశ్నలు వస్తాయి.
  • సంభావ్యత పాఠ్యాంశంలో సంభావ్యత భావన, నిర్వచనం, సులభమైన సమస్యలు
  • నిత్యజీవిత సంఘటనలతో అన్వయం, పూరక ఘటనలు తదితరాలు కీలకంగా ఉంటాయి. పాచికలకు సంబంధించిన ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. క్షేత్రమితి పాఠ్యాంశంలో ఉపరితల వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ఘనాకృతలకు సంబంధిం చిన ప్రశ్నలు వస్తాయి. సంఖ్యాక శాస్త్రంలో మధ్యగతము, బాహుళకము, సగటు, ఓజిన్‌ వక్రాలను ఉపయోగించి విలువలు కనుగొనడంపై దృష్టిపెట్టాలి.

జనరల్‌ సైన్స్‌..

  • ఫిజికల్‌ సైన్స్‌: సమయోజనీయ పదార్థాలకు ఉదాహరణలు, పుటాకార, కుంభాకార దర్పణాలకు మధ్య పోలికలు, బోర్‌ పరమాణు నమూనాకు పరిమితులు, అయర్‌స్టెడ్‌ ప్రయోగం, ఓమ్‌ నియమం, ఆమ్లాలు, క్షారాలు, ఫ్యూజ్‌లు, పట్టికలు, గ్రాఫ్‌లు, ఫ్లోచార్టులు, పేరాగ్రాఫ్‌ల రూపంలో ఇచ్చిన సమాచారాన్ని కీలకంగా భావించాలి.
  • బయోలాజికల్‌ సైన్స్‌: పోషణ పాఠ్యాంశంలో జీవక్రియలు, కిరణజన్య సంయో గక్రియ, జీవుల్లో పోషణ, మానవునిలో జీర్ణవ్యవస్థ, పోషకాహార లోపం తదితరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. శ్వాసక్రియ పాఠ్యాంశంలో శ్వాసక్రియలో పాల్గొనే వాయువుల ఆవిష్కరణ, మానవునిలో శ్వాసక్రియా విధానం, కణశ్వాస క్రియ, మొక్కల్లో శ్వాసక్రియ, ప్రసరణ–పదార్థ రవాణా వ్యవస్థ పాఠ్యాంశంలో గుండె అంతర్నిర్మాణం, హార్థిక వలయం, రక్తపీడనం, రక్తస్కంధనం, మొక్కల్లో పదార్థాల రవాణాపై దృష్టిపెట్టాలి. విసర్జన–వ్యర్థాల తొలగింపు పాఠ్యాంశంలో మానవునిలో విసర్జన, మానవ విసర్జక వ్యవస్థ, నెఫ్రాన్‌ నిర్మాణం, మూత్రం ఏర్పడే విధానం, మూత్ర నాళికలు, మూత్రాశయం, డయాలసిస్, మొక్కల్లో విసర్జన తదితరాలను అధ్యయనం చేయాలి. నియంత్రణ–సమన్వయ వ్యవస్థ పాఠ్యాంశంలో ఉద్దీపన–ప్రతిస్పందన, సమీకృత వ్యవస్థలు–నాడీ సమన్వయం, ప్రచోదన, ప్రతిస్పందన మార్గాలు, కేంద్రనాడీ వ్యవస్థ, స్వయంచోధిత నాడీవ్యవస్థ, మొక్కల్లో నియంత్రణ–ఫైటోహార్మోన్లు కీలక అంశాలుగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి–పునరుత్పాదకత వ్యవస్థ పాఠ్యాంశంలో పాలలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం, అలైంగిక ప్రత్యుత్పత్తి, శాఖీయ ఉత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి, కణవిభజన, ప్రత్యుత్పత్తి –ఆరోగ్యం (హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌) అంశాలను అధ్యయనం చేయాలి. జీవక్రియలో సమన్వయం చాప్టర్‌లో ఆకలి, రుచి, వాసన, నోరు, ఆహారవాహికలో ఆహార ప్రయాణం, జీర్ణాశయం తదితరాల గురించి తెలుసుకోవాలి. అనువంశికత పాఠ్యాంశంలో కొత్త లక్షణాలు –వైవిధ్యాలు, మెండల్‌ ప్రయోగాలు, పర్యావరణం–మన బాధ్యత పాఠ్యాంశంలో ఆవరణ వ్యవస్థ–ఆహారపు గొలుసు, మానవ కార్యకలాపాలు–ఆవరణ వ్యవస్థ, జైవిక పద్ధతులు, జైవిక నియంత్రణ, సహజ వనరుల పాఠ్యాంశంలో కేస్‌ స్టడీస్‌ వ్యవసాయ భూమి (పూర్వం–ప్రస్తుతం) నీటి నిర్వహణ, మన చుట్టూ ఉండే సహజ వనరులు, శిలాజ ఇంధనాలు, సంరక్షణలపై దృష్టిపెట్టాలి.

సోషల్‌ స్టడీస్‌..
భారత ఆర్థిక వ్యవస్థలోని రంగాలు, లింగ నిష్పత్తి, నెహ్రూ ప్రతిపాదిత భూసం స్కరణలు, ఎనేబ్లింగ్‌ యాక్ట్, మహిళలు సమాన హక్కులు పొందలేకపోవడానికి కారణాలు, ద్వీపకల్ప నదులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సేంద్రియ వ్యవసాయం, ప్రాంతీయ పార్టీలు, శీతోష్ణస్థితి, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రపంచపటం, తెలంగాణ పటాలను కీలకంగా అధ్యయనం చేయాలి.