జన్యు మార్పిడి పంటలు

జన్యువుల (డీఎన్‌ఏ) మార్పిడి ఫలితంగా ఏర్పడిన పంటలను జన్యు మార్పిడి పంటలు (Genetically Modified Crops) లేదా 'GM' పంటలు అంటారు. రీ కాంబినెంట్ DNA టెక్నాలజీని ఉపయోగించి, ఒక జాతి మొక్క DNAలో వేరొక జాతి DNAను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడిన మొక్కలను ‘జన్యు రూపాంతర మొక్కలు’గా పేర్కొంటారు.
ప్రపంచంలో మొట్టమొదటగా జన్యుమార్పిడి చేసిన మొక్క పొగాకు (Tobacco- 1982). అయితే మానవ వినియోగం కోసం విడుదల చేసిన మొదటి ఆహార పంట టమోటా. జన్యుమార్పిడి టమోటా సాగుకు అమెరికా ప్రభుత్వం 1994లో అనుమతి ఇచ్చింది. సాధారణ టమోటాల కంటే జన్యుమార్పిడి టమోటాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. తర్వాతి కాలంలో సోయాబీన్, మొక్కజొన్న, వంకాయ, బొప్పాయి, బంగాళాదుంప, చెరకు, వరి, స్వీట్‌కార్న్, పత్తి వంటి పంటల ఈూఅను మార్పుచేసి జన్యుమార్పిడి పంటలను సాగు చేశారు.

వ్యాధి నిరోధకత
జన్యుమార్పిడి ద్వారా మొక్కల్లో వ్యాధి నిరోధకతను పెంచొచ్చు. తక్కువ కాలంలోనే కోతకు వచ్చే, కరువును తట్టుకొనే, అధిక దిగుబడినిచ్చే, అధిక పోషక విలువలు కలిగిన రకాలను ఉత్పత్తి చేయొచ్చు. ఫలితంగా ఆహార కొరతను, పోషక లోపాలను అరికట్టవచ్చు.

గోల్డెన్ రైస్
అధిక మోతాదులో విటమిన్-ఎను కలిగిన బియ్యాన్ని International Rice Research Institute (మనీలా) శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. దీన్నే గోల్డెన్ రైస్ అంటారు. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి సంబంధ సమస్యలు, రేచీకటిని నివారించొచ్చు.

ఆర్కిటిక్ ఆపిల్
2015లో అమెరికా ప్రభుత్వం జన్యుమార్పిడి ఆపిల్‌ను విడుదల చేసింది. ఆపిల్‌ను కోయగానే రంగు మారిపోవడానికి కారణమైన Polyphenol Oxidase అనే ఎంజైమ్‌ను దీన్నుంచి తొలగించారు. అందువల్ల కోసిన తర్వాత జన్యుమార్పిడి ఆపిల్ రంగు మారదు.

జీఎం బొప్పాయి
జన్యు మార్పిడి చేసిన (జీఎం) బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్‌ను తట్టుకుంటుంది.

జీఎం మొక్కజొన్న
ఇది అధిక శాతం విటమిన్లను కలిగి ఉంటుంది. సాధారణ రకం కంటే 169 రెట్లు అధిక విటమిన్-ఎ, 6 రెట్లు అధిక విటమిన్-సిను కలిగి ఉంటుంది. అధిక దిగుబడిని ఇస్తుంది.

జీఎం బంగాళాదుంప
జన్యుమార్పిడి చేసిన బంగాళా దుంపలో అధిక పిండి పదార్థం (స్టార్‌‌చ) ఉంటుంది. లెట్‌బ్లైట్ తెగులును తట్టుకుంటుంది.

బీటీ పత్తి
జన్యు మార్పిడి చేసిన పత్తిని Bt పత్తి అంటారు. Bt అనేది బాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా పేరు. ఈ బ్యాక్టీరియా నుంచి Cry1Ac అనే జన్యువును తీసుకొని, పత్తిలో ప్రవేశపెట్టారు. ఈ జన్యువు ఒక రకమైన విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది పత్తి పంటను అధికంగా ఆశించే పచ్చపురుగు (లేదా) బోల్‌వార్‌‌మ తెగులును నిరోధిస్తుంది. ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. పురుగు మందుల వాడకం కూడా తగ్గుతుంది. రైతుకు లాభదాయకంగా ఉంటుంది.
భారతదేశంలో మొట్టమొదటగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి వాణిజ్య పంట Bt పత్తి (2002). ప్రస్తుతం దేశంలో 96% బీటీ పత్తి విస్తరించింది.

Bt వంకాయ
భారతదేశంలో ప్రవేశపెట్టిన మొదటి ఆహారపంట Bt వంకాయ. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ పంటపై నిషేధం విధించింది.
ప్రపంచ వ్యాప్తంగా జన్యుమార్పిడి పంటల వినియోగంలో అమెరికా ప్రథమస్థానంలో ఉంది. 2011 నాటికి 25 రకాల జన్యు మార్పిడి పంటలు అమెరికాలో వాడుకలో ఉన్నాయి. 2015 నాటికి అమెరికాలో మొక్కజొన్న పంటలో 92%, సోయాబీన్‌లో 94%, పత్తిలో 94% జన్యు మార్పిడి చేసిన రకాలను ఉపయోగిస్తున్నారు.

జన్యుమార్పిడి పంటల వల్ల లాభాలు
- వ్యాధి నిరోధకతను ప్రదర్శించే పంటలను తయారు చేయవచ్చు.
ఉదా: GM బొప్పాయి
- కీటకాలు, పురుగుల దాడి నుంచి తట్టుకొనే పంటలను సాగుచేయొచ్చు.
ఉదా. Bt పత్తి.
- అధిక ఉష్ణోగ్రత, అధిక చలిని తట్టుకొనే పంటలను ఉత్పత్తి చేయొచ్చు.
- నీటి ఎద్దడిని తట్టుకొనే రకాలను ఉత్పత్తి చేయొచ్చు.
- అధిక లవణీయతను తట్టుకొనే పంటలను పండించొచ్చు. అప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లోని ఉప్పునేలల్లో కూడా వ్యవసాయం సాధ్యమవుతుంది.
- అధిక పోషక విలువలు కలిగిన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. ఉదా: గోల్డెన్ రైస్
- అధిక దిగుబడినిచ్చే రకాలను ఉత్పత్తి చేయొచ్చు.
- పంట పక్వానికి వచ్చే కాలాన్ని తగ్గించి, తక్కువ కాలంలో పంటలను పండించొచ్చు.
- ఎక్కువ కాలం నిల్వ ఉండే పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేయొచ్చు.
ఉదా. GM టమోటా

నష్టాలు
- కొన్నిసార్లు జన్యుమార్పిడి పంటలు అలర్జీలను కలగజేస్తాయి.
- జన్యుమార్పిడి పంటలు అంత రుచికరంగా ఉండవు.
- జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తాయి. ప్రాంతీయ నాటు రకాలు కనుమరుగవుతాయి.
- పర్యావరణ వేత్తల అభిప్రాయం ప్రకారం జన్యుమార్పిడి పంటలు అంత శ్రేయస్కరం కాదు.
- జన్యుపరివర్తన పంటల్లో ఉండే విషపదార్థాలకు అలవాటుపడి, కీటకాలు భవిష్యత్తులో ఏ మందులకూ లొంగని విధంగా తయారయ్యే ప్రమాదం ఉంది.

వివాదాస్పద అంశాలు
సాధారణ పంటల్లో వచ్చే విత్తనాలను తరువాతి పంటకు వాడతారు. కానీ జన్యు మార్పిడి పంటల్లో టెర్మినేటర్ జన్యువును వాడతారు. అందువల్ల విత్తనాలు రావు. ఒకవేళ విత్తనాలు వచ్చినా అవి తరవాతి పంటకు పనికిరావు. అందువల్ల రైతు ప్రతి పంటకూ కొత్త విత్తనాలను అధిక ధర చెల్లించి కొనాలి. అంటే మన వ్యవసాయాన్ని విదేశీ విత్తన సంస్థలు నియంత్రిస్తాయి. జన్యుపరివర్తిత పంటల విత్తనాలను ఇప్పటి వరకు మోన్‌శాంటో వంటి విదేశీ సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. మనదేశ రైతుల భవితవ్యం విదేశీ సంస్థల ఆధీనంలో ఉండటం దేశ భద్రతకు హానికరం. అంతేగాక జన్యు పరివర్తన మొక్కల్లోని పుప్పొడి రేణువులు సహజంగా పెరిగే సాధారణ వేరొక జాతి మొక్కలపై పడితే అవికూడా పనికిరాని వంధ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతే కాకుండా వేల సంవత్సరాల నుంచి దేశంలో సాగుచేస్తున్న ప్రాంతీయ రకాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. జన్యు రూపాంతర పంటలు ఎంతవరకు శ్రేయస్కరం అనే విషయాన్ని ఇప్పటివరకూ నిరూపించలేదు.

ముగింపు
జన్యుమార్పిడి పంటల వల్ల ఎన్నో లాభాలున్నాయి. పేద దేశాల్లో ఆహార కొరతను, పోషకాహార లోపాన్ని నియంత్రించవచ్చు. కానీ జన్యుమార్పిడి ప్రకృతి విరుద్ధం. జన్యు మార్పిడిని ప్రకృతి కూడా చేస్తుంది. ప్రకృతి చేసే పనిని మనిషి చేయకూడదు. తాత్కాలికంగా ఈ పంటలు లాభం కలిగించినా భవిష్యత్‌లో కలిగించే నష్టం ఊహకు అందనిది.


మాదిరి ప్రశ్నలు

1. Bt పత్తిలో Bt అంటే ఏమిటి?
ఎ) బాసిల్లస్ తురంజెనిసిస్
బి) బ్యాక్టీరియం టైసస్
సి) బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్
డి) బాసిల్లస్ టెటాని






























#Tags