Anganwadis posts: అంగన్‌వాడీలకు మరో గుడ్‌న్యూస్
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణ వైద్య సేవలు అందించేలా మరో ముందడుగు వేసింది. చిన్నారులకు స్వల్ప అనారోగ్యం, చిన్న చిన్న గాయాలకు తక్షణ వైద్య సేవలు అందించేలా ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను అందించింది.
ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అంగన్‌వాడీలకు చేరువ చేసి వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక వైద్య సేవలు అందించేలా ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించింది.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి మరో మారు ఒక్కొక్కటి చొప్పున ఫస్ట్ ఎయిడ్ కిట్(ప్రాథమిక చికిత్స మందులు)ను సరఫరా చేసింది. గతంలో పంపిణీ చేసిన కిట్‌లలో కంటే ఎక్కువ మందులను ఈ కిట్‌లలో పొందుపర్చి అందించడం విశేషం.
ఆటలాడేటప్పుడు తగిలే చిన్న చిన్న గాయాలు, కొద్దిపాటి జలుబు, ఇతర చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్స అందించేందుకు ఈ కిట్లలోని పది రకాలకుపైగా ఔషధాలు దోహదపడతాయి.
కిట్‌లో పొందుపర్చిన మందుల్లో కొన్ని..
అంగన్‌వాడీ మెడికల్ కిట్‌లో పారాసిటమాల్ సిరప్, ఐరన్ ట్యాబ్లెట్లు, అయోడిన్, సిల్వర్ సల్ఫాడైజీన్, క్లోరో ఫినరామిన్ మాలియాట్, ఫురాజోలిడిన్, హ్యాండ్ శానిటైజర్, రోలర్ బ్యాండేజ్, నియోమైసిన్ ఆయింట్మెంట్, కాటన్, సిప్రోఫ్లాక్సిన్ చుక్కల మందు, బెంజయిల్ బెంజోయేట్‌తోపాటు మరికొన్ని సిరప్‌లు ఉన్నాయి. వీటిలో ఏయే మందులను ఎలా ఉపయోగించాలి అనేది సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం పేరుతో సమాచారాన్ని కూడా పంపించారు.
వీటి వినియోగంపై అవగాహన కల్పించారు. సద్వినియోగం అయ్యేలా అంగన్‌వాడీ సిబ్బందికి సూచనలు చేశారు. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని సచివాలయ ఆరోగ్య కార్యదర్శి, స్థానిక ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంగన్‌వాడీల్లోని చిన్నారుల పెరుగుదల(ఎత్తు), బరువుపై పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు అందించాలి.
మందుల వినియోగం ఇలా..
జ్వరం: పారాసిటమాల్ సిరప్‌ను రెండు
నెలలలోపు పిల్లలకు 1 మిల్లీలీటర్ చొప్పున రోజుకు రెండు సార్లు, ఏడాది లోపు పిల్లలకు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున ఇవ్వాలి.
తెగిన, కాలిన, గీరుకొనే గాయాలు : ప్రమిసెటిన్ స్కిన్ క్రీమ్ ఆయింట్మెంట్‌ను గాయమైన చోట నీటితో శుభ్రంగా కడిగి రాయాలి. అవసరమైతే దూది(కాటన్) పెట్టి కట్టు కట్టాలి.
కళ్లు ఎర్రబడుట, చెవిపోటు: సిప్రోప్లాక్సాసిస్ చుక్కల మందును రెండు చుక్కలు చొప్పున రోజుకు రెండు నుంచి మూడు సార్లు వాడాలి.
డీహైడ్రేషన్ అవ్వకుండా: ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ రెండు సంవత్సరాలలోపు పిల్లలకు 50 నుంచి 100 మిల్లీ లీటర్లు, రెండు నుంచి పదేళ్లలోపు పిల్లలకు 100 నుంచి 200 మిల్లీ లీటర్లు చొప్పున ఇవ్వాలి.
గతం కంటే ఎక్కువ మందులు
రాష్ట్రంలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి రూ.485.37 విలువైన ఒక్కో కిట్‌ను తాజాగా ప్రభుత్వం అందించింది. గత ఏడాది కంటే ఎక్కువ మందులతో ఇచి్చన ఈ కిట్‌లు ప్రాథమిక చికిత్సకు బాగా ఉపయోగపడతాయి. రాష్ట్రంలో 55,607
అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.2,69,89,770లతో ప్రభుత్వం అందించింది. పిల్లల్లో వచ్చే సాధారణ వ్యాధులు, ప్రమాద గాయాలకు తక్షణ చికిత్సకు ఉపయోగపడేలా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంలో వీటిని అందించారు.
–ఎం.జానకి, కమిషనర్, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ
అంగన్‌వాడీల అభివృద్ధికి సీఎం జగన్ కృషి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టింది. వాటికి సొంత భవనాలతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఆట పాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమానికి ఇతోధికంగా నిధులు ఇవ్వడం ద్వారా కొత్త విధానాలతో అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మేలు కలిగేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
–కేవీ ఉషశ్రీ చరణ్, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి