Students: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
అన్నపురెడ్డిపల్లి : విద్యార్థులు నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచించి భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ వెంకటేశ్వరాచారి పిలుపునిచ్చారు. మండలంలోని ఎర్రగుంట జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌ను ఆయన ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 100 పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు నాలుగు అంశాలపై ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. వాటిని డీఈఓ పరిశీలించగా, ఎగ్జిబిట్ల గురించి విద్యార్థులు వివరించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. న్యాయనిర్ణేతలు ఎగ్జిబిట్లను తిలకించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేశారు. అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. సైన్స్‌ఫేర్‌లో భాగస్వామ్యమైన తొలిఅడుగు ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీఓ షబ్నా, పాఠశాల హెచ్‌ఎం ఆనంద్ , తొలిఅడుగు ఫౌండేషన్ బాధ్యులు రాము, సుభాని తదితరులు పాల్గొన్నారు.