Skip to main content

UPSC Civils Ranker Success Story : విధికే సవాలు విసిరా.. 22 ఏళ్లకే సివిల్స్ కొట్టానిలా..

ఐఏఎస్...సమాజానికి సేవ చేయడానికే కాదు పేరు ప్రతిష్టలకూ కొదవలేని ఉద్యోగం ఇది! దీని కోసం కల కనడమే కాదు.. దాన్ని సాకారం చేసుకోవడానికి చదువునే తారకమంత్రం చేసుకున్నారు నేహా వీరవల్లి! చిన్న వయసులోనే బ్రెయిన్ ఫీవర్ దాడి చేసి వినికిడి శక్తిని లాగేసుకున్నా ఆమె అధైర్యపడలేదు. పుస్తకాలు, పత్రికలతో కుస్తీ పట్టి విధికే సవాలు విసిరారు. 22 ఏళ్ల వయసుకే సివిల్స్‌లో 1221 ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఒకవైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రోజుల్లో ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నారు.

చిన్నప్పటి నుంచి..

Veeravalli Neha Inspiring Story

‘కేవలం పుస్తకాలను బట్టీ పట్టేస్తేనే ఫలితం సాధించలేం. సమాజాన్ని అవగాహన చేసుకుంటూ విద్యను దానికి అన్వయం చేసినప్పుడే సివిల్స్ గోల్ సాధన సులువవుతుంది. చిన్నప్పటి నుంచి పేపర్ రీడింగ్, పత్రికలకు వ్యాసాల రచన, మనోవికాస పుస్తకాల పఠనం నాకెంతో ఉపయోగపడ్డాయి’ అని చెప్పారు నేహా. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆమెను పలుకరించింది. ఆమె తల్లి శిరీష సహాయంతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘సివిల్స్... అందులోనూ ఐఏఎస్ అధికారి కావడమంటే నాకు చిన్నప్పటి నుంచి క్రేజ్.

వినికిడి సమస్య ఉన్న మీ అమ్మాయికి..

veeravalli Neha Success Story telugu

ఏళ్ల తరబడి హైదరాబాద్, ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడుతున్నవారికే సాధ్యం కావట్లేదు... వినికిడి సమస్య ఉన్న మీ అమ్మాయికి సాధ్యమా? అని చాలామంది మా అమ్మానాన్నలతో అనేవారు. వారెప్పుడు ఆ మాటలను పట్టించుకోలేదు. నాన్న శశికుమార్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. అమ్మ శిరీష ఇంటర్ వరకే చదువుకున్నారు. లక్ష్య సాధనలో అమ్మ సహకారం ఎంతో ఉంది. నా లక్ష్యం ఏమిటో అర్థం చేసుకొని ఆ దిశగానే ప్రోత్సహించారు. తమ్ముడు అనూజ్ మాత్రం ఇంజనీరింగ్ లక్ష్యంతో ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. ప్లస్2 వరకూ స్టీల్‌ప్లాంట్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లోనే చదివా.

ఐఏఎస్ వచ్చేవరకూ..

veeravalli Neha Inspiring Telugu Story

గాజువాకలోని ఎంవీఆర్ కాలేజీలో బీఎస్సీలో చేరా. ఒకవైపు పాఠాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూనే సివిల్స్ సాధనకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ పట్టు సాధించా. డిగ్రీ సెకండియర్‌లో ఉండగానే ఎస్‌బీఐలో క్లరికల్ ఎగ్జామ్‌కు హాజరయ్యా. బ్యాంకు ఉద్యోగాలు వరుస కట్టాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని నింపింది. డిగ్రీ పూర్తి కాగానే ఎస్‌బీఐ స్టీల్‌ప్లాంట్ శాఖలో ఉద్యోగంలో చేరా. అలాగని సివిల్స్‌ను మరచిపోలేదు. 2013లో తొలి ప్రయత్నం చేశా. ఇంటర్వ్యూ వరకూ వెళ్లగలిగినా 16 మార్కులు తేడాతో సర్వీసు రాలేదు. అయినా పట్టు వదలకుండా రెండో ప్రయత్నంలో ప్రయత్నించా. 1221 ర్యాంకు వచ్చింది. పీహెచ్ కోటాలో ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఒకవేళ మరేదైనా సర్వీసు వచ్చినా ఐఏఎస్ వచ్చేవరకూ విశ్రమించను.

అది తీరని లోటే అయినా..:
నేను సెకెండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ (మెనిజైటిస్) వచ్చింది. మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపించడం వల్ల వినికిడి శక్తి పోయింది. అది తీరని లోటే అయినా సమస్యగా ఏనాడూ నేను భావించలేదు. తోటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించేందుకు ప్రతి నిమిషం తపించా. పాఠాలు చదువుకుంటూ నోట్స్ రాసుకునేదాన్ని. దినపత్రికల్లో వచ్చే వ్యాసాలను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యేదాన్ని. ఆర్టికల్స్ రాసేదాన్ని. అలా రైటింగ్ స్కిల్స్ పెంచుకున్నా. సివిల్స్ మెయిన్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా ఆప్షన్స్. ఇంటర్వ్యూ కూడా బాగా చేశా. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం ఉపయోగపడింది.

Photo Stories