Skip to main content

భారతదేశ జాతీయోద్యమం - దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947

10th class study materialముఖ్యాంశాలు:

  1. 1935లో బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది.
  2. ఓటు వేసే అధికారం చాలా కొద్ది మందికే లభించింది. రాష్ట్ర శాసన సభలకు 12%, కేంద్ర సభకు 1% ప్రజలకే ఓటుహక్కు లభించింది.
  3. బిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాలలో 1937లో ఎన్నికలు జరిగాయి.
  4. కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాలలో విజయం సాధించింది.
  5. అనేక మంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినీ, ఫాసిజాన్ని వ్యతిరేకించారు.
  6. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌లో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన విన్‌స్టన్ చర్చిల్ ప్రధాన మంత్రిగా ఉన్నాడు.
  7. కన్వర్వేటివ్‌లు భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి అంత సముముఖంగా లేరు. కాని లేబర్ పార్టీ వారు సుముఖంగా ఉన్నారు.
  8. భారతదేశానికి ‘సంపూర్ణ స్వరాజ్యం’ ఇచ్చి వెంటనే కేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ కోరింది.
  9. కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదని బ్రిటిష్ భావింది.
  10. విసిగి పోయిన కాంగ్రెస్ 1939 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు రాజీనామా చేసి వైదొలగింది.
  11. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక అధికారాల ద్వారా ప్రభుత్వాన్ని వ్వతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకి పంపించే అధికారం పొందింది.
  12. బిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగు ప్రణాళికలకు మద్దతు ఇచ్చి, ప్రోత్సాహించి కాంగ్రెస్‌కు ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించ సాగింది.
  13. ముస్లింలీగు 1906లో ఏర్పడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాల కోసం ఏర్పడింది. 1930 వరకు పెద్దగా ప్రజల మద్దతు లేదు.
  14. ముస్లిం లీగ్‌కి డిమాండ్ పెరగడంతో1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు.
  15. 1937 ఎన్నికల్లో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగుకి వచ్చాయి.
  16. కాని పది సంవత్సరాల తర్వాత పరిస్థితి మారిపోయి 1946 ఎన్నికల్లో ముస్లిం నియోజక వర్గాల్లో ముస్లిం లీగు విజయం సాధించింది.
  17. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లింలతో అధికారాన్ని పంచుకోవడానికి అది సుముఖంగా లేదన్న అభిప్రాయాన్ని ముస్లిం లీగ్ సృష్టించింది.
  18. ఈ పరిస్థితుల్లో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్.ఎస్.ఎస్) ప్రజలను సమీకరించడానికి చురుకుగా పని చేశాయి.
  19. కులం, వర్గాలను అధికమించి హిందువులందరినీ ఏకం చేయడానికి ప్రయత్నించాయి.
  20. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి.
  21. ఈ పరిస్థితుల్లో తమ సభ్యుల్లో లౌకిక భావాల అవగాహనను పెంచడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది.
  22. బిటిష్ ప్రభుత్వం భారతీయుల మధ్య ఈ భేదాలను చూస్తూ ఇంకా వాటిని పెంచటానికి ప్రయత్నం చేసింది. ముస్లింలను రెచ్చగొడుతూ వారికి ప్రత్యేక భద్రతలను కల్పించడానికి సూచనలు చేయసాగింది.
  23. ‘సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా’ అన్న గీతాన్ని రాసిన ఉర్దూకవి మహ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘వాయువ్య ముస్లిం రాష్ట్ర’ ఆవశ్యకత గురించి మాట్లాడాడు.
  24. కేంబ్రిడ్జి లోని పంజాబీ ముస్లిం విద్యార్థి అయిన చౌదరీ రెహ్మత్ అలీ పాకిస్తాన్(PAKISTAN) అన్న పేరును ప్రతిపాదించాడు. (Punjab, Afgan, Kashmir, Sindh, Balochistan) లలోని మొదటి అక్షరాల నుంచి ఏర్పడింది.
  25. అయితే 1930 లలో రెహ్మత్ అలీని ఎవరూ పట్టించుకోలేదు. ముస్లింలీగు పాకిస్తాన్ ఏర్పాటుని ఒక కలగా కొట్టిపారేసింది.
  26. కాని 10 సంవత్సరాలలోనే పరిస్థితి మారిపోయింది. బ్రిటిష్ పాలకుల ‘విభజించు- పాలించు’ సిద్ధాంతం వల్ల ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్‌ను 1940 నుంచి తీవ్రతరం చేసింది.
  27. 1942-45 మధ్య కాలంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు జైళ్లలో ఉన్నారు. ఈ కాలంలో ముస్లింలీగు తన డిమాండ్ అయిన ‘పాకిస్తాన్’ ఏర్పాటుకు ముస్లిం ప్రజల నుంచి మద్దతు సంపాదించింది.
  28. 1942లో సర్ స్టాఫర్ట్ క్రిప్స్‌ను రాయబారిగా పంపింది. కాని ఈ చర్చలు విఫలమయ్యాయి.
  29. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.
  30. కాంగ్రెస్‌లోని జయప్రకాశ్ నారాయణ లాంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు.
  31. ఈ సమయంలో జైల్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ తప్పించుకొని జర్మనీ నుంచి జపాన్‌కి వెళ్లి అక్కడి భారతీయ యుద్ధ ఖైదీలను సమీకరించి ‘భారత జాతీయ సైన్యం’ కి నాయకత్వం వహించాడు.
  32. ఈ విషయంలో గాంధీజీ సుభాష్ చంద్రబోస్‌తో విభేదించాడు.
  33. 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నాసిరకం ఆహారం, తమపై బ్రిటిష్ అధికారుల ప్రవర్తనకి నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు.
  34. ఎం.ఎస్.ఖాన్ నాయకుడిగా నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది.
  35. ఫిబ్రవరి 22న బొంబాయిలోని మూడు లక్షల మిల్లు కార్మికులు పని వదిలేసి పోరాటం చేశారు.
  36. బెంగాల్‌లో రాష్ట్ర కిసాన్ సభ ‘తెభాగ’ ఉద్యమం నడిపింది.
  37. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమం నడిచింది.
  38. టావెన్‌కోర్‌లోని పున్నప్రా-వాయలార్ ప్రాంతంలో సాయుధ పోరాటం జరిగింది.
  39. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి.
  40. 1946 మార్చిలో ముగ్గురు సభ్యుల బృందాన్ని బ్రిటిష్, ఢిల్లీకి పంపింది. దీనినే క్యాబినెట్ మిషన్ అంటారు.
  41. ముస్లిం లీగు ప్రత్యేక పాకిస్తాన్ సాధించుకోవడానికి 1946 ఆగస్టు 16న ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ గా ప్రకటించింది.
  42. 1947 ఫిబ్రవరిలో వావెల్ స్థానంలో మౌంట్ బాటన్ వైస్‌రాయ్‌గా వచ్చాడు.
  43. అన్ని ప్రయత్నాలు విఫలమైన మీద దేశ విభజనను ప్రకటించారు.
  44. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌కు, 1947 ఆగస్టు 15న భారతదేశానికి అధికార బదిలీ చేస్తామని ప్రకటించాడు.
  45. పాకిస్తాన్ ముస్లిం మత రాజ్యంగా ఏర్పడటంతో అక్కడ ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడింది. హత్యలు, దోపిడీలు, దహనాలు యధేచ్ఛగా జరిగాయి. చాలా మందిని చంపేశారు.
  46. గాంధీజీ చొరవతో ‘అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల’ పై కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేసింది.
  47. 1948 జనవరి 28న గాంధీజీపై హత్యాప్రయత్నం విఫలమైంది. ఆ సమయంలో గాంధీజీ ‘ఒక పిచ్చి వాడి చేతితో తుపాకికి నేను బలి కావలిసి వస్తే, నవ్వుతూ అందుకు సిద్ధ మవుతాను. నాలో ఎలాంటి కోపమూ ఉండకూడదు. నాహృదయంలో, పెదాలమీద దేవుడే ఉండాలి’’ అన్నాడు.
  48. 1948 జనవరి 30న సాయంత్రం గాంధీజీని నాధూరాం గాడ్సే కాల్చి చంపాడు.
  49. 1948 ఫిబ్రవరి 14న అఖిల భారత హిందూమహాసభ రాజకీయ కార్యక్రమాలను త్యజించింది.
  50. స్వదేశీ సంస్థానాల విలినీకరణ బాధ్యతను 1947 జూలైలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అప్పగించారు. చాలా విజయవంతంగా ఆయన దానిని పూర్తి చేశాడు.
  51. 1971లో భారత ప్రభుత్వ రాజ భరణాన్ని, రాచరిక బిరుదులను రద్దు చేసింది.

4 మార్కుల ప్రశ్నలు - (విషయావగాహన)
1. భారతదేశంలో వివిధ బృందాలు, వ్యక్తులు రెండో ప్రపంచ యుద్ధంపై స్పందించిన విధానాన్ని తెలపండి. వారు ఎటువంటి సందిగ ్ధతకులోనయ్యారు?
జ:
రెండో ప్రపంచ యుద్ధం పై భారతదేశంలో వివిధ బృందాలు, వ్యక్తులు రకరకాలుగా స్పందించారు.
  1. కాంగ్రెస్: అనేక మంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిలను వారు అనుసరిస్తున్న ఫాసిజాన్ని వ్యతిరేకించారు. అయితే భారతీయుల అభిప్రాయం తెలుసుకోకుండా, రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాల అనుమతి లేకుండా భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామిగా చేయడాన్ని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వారు ఎవరికి మద్దతు ఇవ్వాలనే సందిగ్ధతకులోనయ్యారు.
  2. గాంధీజీ: గాంధీజీ అహింసావాది కావున యుద్ధానికి విముఖుడు. అయితే పరోక్షంగా ఇంగ్లాండ్ వైపే మొగ్గు చూపాడు.
  3. ముస్లింలీగ్ (ఎమ్.ఎ జిన్నా): జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు దేశ ప్రయోజనాల కంటే తమ స్వార్థ ప్రయోజనాలనే చూసుకుంది. బ్రిటిష్‌వారు ముస్లిం లీగును గుర్తుంచి తమ అభిప్రాయాలకు విలువిస్తే తాము యుద్ధంలో ఇంగ్లాండ్‌కు సహకరిస్తామని అన్నారు.
  4. 4. సుభాష్ చంద్రబోస్: సుభాష్ చంద్రబోస్ రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు ఎలాంటి సహాయం చేయరాదని అన్నాడు. ఈ సమయాన్ని భారతీయులు చక్కగా ఉపయోగించుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చాడు. ఈయనను జైల్లో బంధించగా తప్పించుకొని పోయి జర్మనీ, జపాన్‌లలోని భారతీయ యుద్ధ ఖైదీలను సమీకరించి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను నడిపించాడు.

2. యూదులు, ఇతర సమూహాలపై జర్మనీ దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో జర్మనీ, జపాన్‌లకి మద్దతు ఇవ్వడం నైతికంగా సరైనదేనా?
జ:
హిట్లర్ కాలంలో జర్మనీలో యూదులు, ఇతర సమూహాలపై దారుణంగా వ్యవహరించడం జరిగింది.

  1. యూదులను చీకటి గదుల్లో బంధించి, ఆహారము, నీళ్ళు లేకుండా కొన్ని రోజుల పాటు ఉంచి ఆ గదుల్లోకి విషవాయువులను పంపించేవారు.
  2. ‘నాజీ’ జాతి ప్రపంచంలోనే గొప్ప జాతి అనే అహంకారంతో జర్మనీ ఇతర దేశాలను చిన్న చూపు చూసింది.
  3. సామ్రాజ్య కాంక్షతో చిన్న చిన్న దేశాలను ఆక్రమించుకోవడానికి అనేక దాడులు చేసింది.
  4. ఆసియా ఖండంలో జపాన్ కూడా అలాంటి ప్రయత్నాలే చేసింది.
  5. ఇటువంటి పరిస్థితుల్లో జర్మనీ, జపాన్‌లకి మద ్దతు ఇవ్వడం సరియైనది కాదు.
కాని ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా అమెరికా దేశాలు కూడా తక్కువేమీకాదు. ప్రపంచంలో పెట్టుబడి దారీ విధానంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లు అనేక దేశాలను ఆక్రమించుకున్నాయి. రష్యాలోని సామ్యవాదాన్ని నాశనం చేస్తాయని హిట్లర్, ముస్సోలినీలు ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నా ఊరుకున్నాయి. చివరికి వారు వీరి ఉనికికే ప్రమాదం అని తెలుసుకుని దాడికి దిగాయి.
ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్య్రం ఇవ్వడంలో జాప్యం చేస్తున్న మన శత్రువైన ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ జర్మనీ, జపాన్‌లతో చేతులు కలపడం కూడా ఒక సరియైన పద్ధతే. అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రయోగం విఫలమైంది.
3. భారతదేశ విభజనకు దారితీసిన వివిధ కారణాల జాబితా తయారు చేయండి.
జ:
భారత దేశ విభజనకు దారితీసిన వివిధ కారణాలు:-
  1. ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనే భావనకు ఆద్యుడు ప్రముఖ ఉర్దూ కవి ‘మహ్మద్ ఇక్బాల్’
  2. 1930 లో ముస్లిం లీగ్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘‘వాయువ్య ముస్లిం రాష్ట్ర’’ ఆవశ్యకత గురించి మాట్లాడాడు.
  3. తరువాత కేంబ్రిడ్జిలో చదువుతున్న పంజాబ్ ముస్లిం విద్యార్థి ‘చౌదరి రెహ్మత్ అలీ’ పాకిస్తాన్ అనే పేరు సూచిస్తూ 1933, 1935లలో కరపత్రాలను రూపొందించాడు.
  4. అయితే అప్పుడు ఎవరూ ఇతనిని పట్టించుకోలేదు. పాకిస్తాన్ ఏర్పాటును ఒక కలగా కొట్టి పారేశారు.
  5. బ్రిటిష్ వారు అవలంబించిన ‘విభజించు-పాలించు’ అనే విధానంతో కాంగ్రెస్ వారిని అణచి వేయడానికి ముస్లింలీగును రెచ్చగొట్టి ప్రత్యేక హక్కులను ప్రోత్సాహించింది.
  6. 1940 మార్చి 23న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతి పత్తిని కోరుతూ ముస్లింలీగు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
  7. 1940-46 మధ్య ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజలను ముస్లింలీగు ఒప్పించ గలిగింది.
  8. 1942-45 మధ్య చాలా మంది కాంగ్రెస్ నాయకులు జైలల్లో ఉన్న సమయంలో ముస్లింలీగు ముస్లిం ప్రజల మధ్య తన ఆదరణను పెంచుకుంది.
  9. 1946లో జరిగిన ఎన్నికల్లో 569 రాష్ట్ర స్థానాలలో ముస్లిం ప్రత్యేక స్థానాల్లో 442 స్థానాలను ముస్లింలీగ్ గెలుచుకొని ‘ముస్లింల ఏకైక ప్రతినిధి’ అని రుజువు చేసుకుంది.
  10. 1946 ఆగస్టు 16ను దేశ విభజన కోసం ‘ప్రత్యక్ష కార్యాచరణ’కు ముస్లింలీగ్ పిలుపునిచ్చింది.
  11. దీని మూలంగా కలకత్తా, ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగి వేలాది మంది చనిపోయారు.
  12. భారత జాతీయోధ్యమ నాయకులు అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో పర్యటించి ఇక విభజన తప్పదనే సంకేతాలు ఇచ్చారు.
  13. 1947 లో మౌంట్‌బాటన్ వైస్‌రాయ్‌గా వచ్చిన తర్వాత మరొక సారి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు.
  14. కాని ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో దేశ విభజన తప్పలేదు.
  15. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేశారు.

4. దేశ విభజనకు ముందు వివిధ సమూహాల మధ్య అధికారాన్ని పంచుకోవడానికి ఏఏ విధానాలను అవలంబించారు?
జ:
దేశ విభజనకు ముందు వివిధ సమూహాల మధ్య అధికారాన్ని పంచుకోవడానికి ఈ కింది విధానాలను అవలంబించారు.

  1. 1945లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం వైస్రాయ్, సైనికదళాల కమాండర్-ఇన్ చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతోనే ఏర్పరచడానికి బ్రిటన్ సిద్ధం అయింది.
  2. అయితే ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లింలీగుకు సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబడ్డాడు.
  3. కాంగ్రెస్, పంజాబ్‌లోని యూనియనిస్టు పార్టీ ఇంకా ఇతరులు ముస్లింలీగు ప్రతిపాదన ను వ్యతిరేకించారు.
  4. 1946లో రాష్ట్ర శాసన సభ్యులకు ఎన్నికలు జరిగాయి.
  5. ఈ ఎన్నికల్లో ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లిం లీగ్ బలమైన పార్టీగా అవతరించింది.
  6. కేంద్రంలోని 30 రిజర్వు చేసిన స్థానాలను, రాష్ట్రాలలోని 569 స్థానాలలో 442 స్థానాలను ముస్లింలీగ్ గెలుచుకుంది.
  7. ముస్లిం ఓట్లలో 86% పైగా ఆ పార్టీకీ వచ్చాయి.
  8. 1946లో సాధారణ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 91% ఓట్లలో అఖండ విజయం సాధించింది.

5. బ్రిటిష్ వలసపాలకులు తమ విభజించి, పాలించు విధానాన్ని ఏ విధంగా అమలు చేశారు? నైజీరియాలో అవలంబించిన విధానానికీ, దీనికీ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జ:
భారత దేశంలో బ్రిటిష్ వారి విభజించు - పాలించు విధానం:
బ్రిటిష్ వారు వారి పరిపాలనను ఎక్కువ కాలం సుస్థిరంగా ఉంచుకోవడానికి భారతదేశంతో పాటు అనేక దేశాల్లో విభజించు పాలించు విధానాన్ని అనుసరించారు. మన దేశంలో...

  1. హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యాలు పెంచారు.
  2. కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మణులే ఎక్కువగా ఉన్నారని, అది హిందూ అభిమాన పార్టీ అని ముస్లింలను రెచ్చగొడుతూ ముస్లింలీగు పార్టీ ఎదగడానికి దోహదపడ్డారు.
  3. 1905లో బెంగాల్ రాష్ట్రాన్ని మతం ఆధారంగానే విభజించారు.
  4. ప్రత్యేక పాకిస్తాన్ దేశం కోసం ముస్లింలు డిమాండ్ చేసే విధంగా ప్రోత్సహించింది కూడా బ్రిటిషే.
  5. ‘కమ్యూనల్ అవార్డు’ ప్రకటించడం ద్వారా హిందువులలోని కులాల మధ్య చిచ్చు పెట్టారు. దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం ద్వారా భారత ప్రజల మధ్య శతృత్వం పెరిగింది.
  6. హిందీ, ఉర్దూ భాషలు, గో సంరక్షణ ఉద్యమ విషయాలలో భారత ప్రజలను విభజించారు.
  7. మితవాదులు, అతివాదులలో బ్రిటిష్‌వారు మితవాదులను ప్రోత్సహిస్తూ అతివాదులను అణచివేశారు.
  8. ప్రాంతాల మధ్య కూడా విభజన చిచ్చు పెట్టి ఉత్తర, దక్షిణ భారత దేశ మధ్య అంతరాలు పెంచారు.

నైజీరియాలో అనుసరించిన విధానంతో పోలికలు, తేడాలు:

  • నైజీరియాలో కూడా బ్రిటిష్ వారు విభజించు పాలించు విధానాన్ని అనుసరించారు. ఉత్తర నైజీరియా, దక్షిణ నైజీరియా ప్రాంతాల మధ్య వైరుధ్యాలను పెంచారు.
  • నైజీరియా ఉత్తర భాగంలో హౌసా-ఫులానీ జాతివారు ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు. ఆగ్నేయభాగంలో ఈబో తెగ, నైరుతి భాగంలో యొరుబా తెగ వారు ఉన్నారు. వీరందరూ క్రైస్తవ మతంలోకి మారారు. ఈ మూడు ప్రాంతాల మధ్య ఘర్షణలు ఉండేవి. బ్రిటిష్ వారు వీటిని ప్రోత్సాహించి విభేదాలను పెంచారు.

6. దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతాన్ని ఏఏ విధంగా ఉపయోగించుకన్నారు?
జ:
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతం:

  1. దేశ విభజనకు ముందు భారతదేశ రాజకీయాలలో మతం కీలక పాత్ర వహించింది. దీని ఆధారంగానే దేశ విభజన జరిగింది.
  2. భారతదేశంలో అనాదిగా ఉన్న ధర్మం హిందూ ధర్మం. ఇది అత్యంత ప్రాచీనమైనది. మధ్యయుగ కాలంలో ముస్లిం మతం భారతదేశంలోకి ప్రవేశించింది. వారు రాజ్యాలు ఏర్పాటు చేసుకొని తమసంఖ్యను విస్తరించుకున్నారు.
  3. దేశ స్వాతంత్రోద్యమంలో భారతీయులు చురుకుగా పాల్గొంటున్న సమయంలో ముస్లింలు తమ స్వంత ప్రయోజనాల కోసం డిమాండ్ చేశారు.
  4. అధిక సంఖ్యాకులైన హిందూ సముదాయంపై అల్ప సంఖ్యాకులైన ముస్లిం సముదాయం పెంచుకున్న భేదభావాలే దేశ విభజనకు దారి తీసాయని చెప్పవచ్చు.
  5. బ్రిటిష్ వారు ‘విభజించు-పాలించు’ విధానాన్ని అనుసరించి హిందూ- ముస్లింలను విడదీయడానికి పరోక్షంగా పథకాలు వేశారు.
  6. భారత జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బ్రహ్మణులతో నిండిపోయిందని, అల్ప సంఖ్యాకులైన ముస్లింల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ముస్లింలు భావించారు.
  7. ఖిలాఫత్ ఉద్యమం, అలీఘర్ ఉద్యమం మొ॥వాటి ద్వారా ముస్లింలను ఐక్యం చేసే ప్రయాత్నాలు జరిగాయి.
  8. ‘ముస్లింలీగ్’ పార్టీ ఏర్పడిన తర్వాత రెండు వర్గాల మధ్య వైషమ్యాలు ఎక్కువయ్యాయి.
  9. హిందువులు కూడా హిందువులందరినీ ఐక్యం చేయడానికి ‘హిందూమహాసభ’, ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ మొ॥సంస్థల ద్వారా ప్రయత్నించారు.
  10. మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలు, శివాజీ జన్మదిన ఉత్సవాలు ప్రారంభించి ప్రజలను ఐక్యం చేయడానికి ప్రయత్నించాడు.
  11. రామకృష్ణ మఠం, ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం మొదలైనవి హిందూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాయి.
  12. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం నిశ్చయమని తెలుసుకొని ముస్లిం లీగ్ వారు ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తూ అనేక ప్రాంతాల్లో అల్లర్లకు దిగారు.
  13. చివరకు మతం ఆధారంగానే 1947 ఆగస్టులో దేశ విభజన జరిగింది.

7. కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చిండండి.
జ:

  1. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించే నాటికి దేశాన్ని రెండుగా విభజించారు. దీనికి తోడు బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్రంగా కొనసాగిన 550కి పైగా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి.
  2. 1947లో చేసిన భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఈ స్వదేశీ సంస్థానాలు వారి ఇష్టప్రకారం పాకిస్తాన్‌లో గాని, భారతదేశంలో గాని చేరవ చ్చు. ఎటూ చేరడం ఇష్టం లేకపోతే స్వతంత్రంగా నైనా ఉండవచ్చు.
  3. దీని ప్రకారం చాలా సంస్థానాలు స్వతంత్రంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాయి.
  4. వాటిని అదే విధంగా వదిలి పెడితే భారతదేశ మనుగడకే ముప్పు వస్తుందని భావించి వాటిని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను భారత మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్‌కు అప్పగించారు.
  5. ఆయన సంస్థానాల రాచరిక కుటుంబాలతో చర్చలు జరిపి భారతదేశంలో విలీనం కావలసిన ఆవశ్యకత గురించి తెలిపాడు.
  6. వారు తమంత తాముగా విలీనం కాకపోతే సైనిక చర్యతో నైనా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి వస్తుందని తెలిపాడు.
  7. 1947 ఆగస్టు 15 నాటికి జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్‌లు తప్ప మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం అయ్యాయి.
  8. జునాగఢ్‌లో రాజు ముస్లిం, అధిక మంది ప్రజలు హిందువులు. పాకిస్తాన్‌లో కలపడానికి చేసిన ప్రయత్నాలను ప్రజలు ఎదిరించారు. సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి జునాగఢ్‌ను భారత్‌లో కలిపాడు.
  9. కాశ్మీర్‌లో రాజు హిందువు. ప్రజలు అధికులు ముస్లింలు. దీనిని పాకిస్తాన్‌లో కలుపుకోవాలని పాకిస్తాన్ సైనిక దాడి చేసింది. కాని రాజుకు, ప్రజలకు కూడా ఇది ఇష్టంలేదు. దీంతో అప్పటి కాశ్మీర్ రాజు కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ సంతకాలు చేశాడు. భారత సైన్యాలు వెళ్లి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టాయి.
  10. హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న పోలీసు చర్య ద్వారా భారత్‌లో విలీనం చేయడం జరిగింది.

ఈ విధంగా స్వదేశీ సంస్థానాలన్నిటినీ భారత్‌లో విలీనం చేయించిన ఘనత సర్దార్ వల్లభాయి పటేల్‌కు దక్కుతుంది. అందుకే ఆయన ఉక్కుమనిషి.
8. స్వాతంత్య్ర పోరాట చివరి సంవత్సరాలలో కార్మికులను, రైతాంగాన్ని ఏ విధంగా సమీకరించారు ?
జ:
స్వాతంత్య్ర పోరాట చివరి సంవత్సరాలలో కార్మికుల, రైతాంగ సమీకరణ:-
కార్మిక ఉద్యమం:

  1. 1946 ఫిబ్రవరి 16న బొంబాయి రేవులోని రాయల్ నౌకా దళంలోని భారత సైనికులు బిటిష్ అధికారుల ప్రవర్తనకు నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు. త్వరలోనే ఇది దేశమంతా విస్తరించింది.
  2. దీనికి మద్దతుగా వందలాది మంది ప్రజలు బొంబాయి వీధుల్లోకి వచ్చి సైనికులు, పోలీసులతో ఘర్షణలకు దిగారు.
  3. 1946 ఫిబ్రవరి 22 న బొంబాయిలోని మూడు లక్షల మిల్లు కార్మికులు తమ పనిముట్లు వదిలిపెట్టి రెండు రోజులపాటు సమ్మె చేశారు.
  4. దీనికి మద్దతుగా దేశంలోని పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేసి సమ్మెలు చేశారు.
  5. భారతీయ కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొని కార్మికులను సమీకరించాయి.

రైతాంగ ఉద్యమం:

  1. బెంగాల్‌లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేశారు.
  2. కౌలు కింద తమకు ఇస్తున్న వాటా మూడింట రెండు వంతులు పెంచాలని కోరారు.
  3. దీనినే ‘తెభాగ’ ఉద్యమం అంటారు. దీనికి నేతృత్వం వహించింది ‘రాష్ట్ర కిసాన్ సభ’.
  4. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వెట్టి చాకిరి నిర్మూలించాలని, దున్నే వాడికే భూమి ఇవ్వాలని కోరారు.
  5. ఇక్కడి రైతులు పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు.

9.సాధారణ ప్రజల జీవితాలను దేశ విభజన ఏ విధంగా ప్రభావితం చేసింది? విభజన తర్వాత జరిగిన వలసలకు రాజకీయ ప్రతి స్పందన ఏమిటి?
జ:
సాధారణ ప్రజల జీవితాలపై దేశ విభజన ప్రభావం:-

  1. 1947 ఆగస్టు 14 న పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయడంతో దేశ విభజన జరిగింది. పాకిస్తాన్ రెండు భాగలుగా ఏర్పడింది పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి పాకిస్తాన్), తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్).
  2. విభజన జరిగిన వెంటనే పాకిస్తాన్ ముస్లిం మత రాజ్యంగా ప్రకటించుకుంది. దీని వల్ల అక్కడ హిందువులు అభద్రతా భావానికి గురయ్యారు.
  3. పాకిస్తాన్‌లోని హిందువులు వారి ఆస్తులు (ఇళ్లు, భూములు) అన్నీ వదిలేసి కట్టు బట్టలతో లక్షల సంఖ్యలో భారతదేశానికి వలసరావలసి వచ్చింది. వీరిని కాంది శీకులు అన్నారు.
  4. వీరికి ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాలలో పునరావాసం కల్పించడం భారతదేశానికి చాలా కష్టమైంది.
  5. అనేక ప్రాంతాలలో ఘర్షణలు చెలరేగాయి. హత్యలు, దోపిడీలు, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి.
  6. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించడం వల్ల ఈ దేశం నుంచి ఎక్కువగా ముస్లింలు పాకిస్తాన్‌కు పోవలసిన అవసరం ఏర్పడలేదు.

రాజకీయ ప్రతిస్పందనలు:

  1. అల్లర్లకు గురైన ప్రాంతాలను గాంధీజీ సందర్శించి తను ఇంతగా కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం కాదని బాధపడ్డాడు.
  2. గాంధీజీ చొరవతో ‘అల్పసంఖ్యాక వర్గాల హక్కుల’ పై కాంగ్రెస్ తీర్మానం చేసింది.
  3. భారతదేశం అనేక మతాల, జాతుల దేశమనీ, అలాగే కొనసాగాలను విశ్వసించింది.
  4. పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికి భారతదేశం ‘ప్రజాస్వామిక లౌకిక రాజ్యం’ గా ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుంచి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి.

4 మార్కుల ప్రశ్నలు - (ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం):-
10. కింది విషయాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలియజేయుము.

కిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ తన మూడో ముఖ్యమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1942 ఆగస్టులో మొదలైన ఈ ఉద్యమం ‘క్విట్ ఇండియా’ (భారతదేశం వదిలిపోండి). గాంధీజీని వెంటనే ఖైదు చేసినా యువ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. దాడులలో ఆస్తినష్టం గావించారు. యువత పెద్ద సంఖ్యలో కళాశాల చదువులు వదిలిపెట్టి జైళ్లకు వెళ్లారు. ప్రత్యేకించి రహస్య ఉద్యమంలో కాంగ్రెస్‌లోని జయప్రకాశ్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. పశ్చిమంలో సతారా, తూర్పులో మేధినిపూర్ వంటి జిల్లాల్లో ‘స్వతంత్ర’ ప్రభుత్వాలను ప్రకటించారు. బ్రిటిష్ పాలకులు మరింత బల ప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణచివేశారు. అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని నిలువరించడానికి సంవత్సరానికి పైగా పట్టింది.
జ:
  1. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలో భారతీయుల సహకారం అవసరమై బ్రిటిష్ వారు సర్‌స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారిగా పంపారు.
  2. ఆయన భారతదేశం వచ్చి గాంధీజీ, ఇతర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. కాని చర్చలు విఫలమయ్యాయి.
  3. క్రిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత బ్రిటిష్ వారిపై నమ్మకం సన్నగిల్లి తిరిగి జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావించారు.
  4. 1942 ఆగస్టులో గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపు నిచ్చాడు. ఆయన నాయకత్వంలో ఇది మూడో ముఖ్యమైన ఉద్యమం. అంతకు ముందు 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం (శాసనొల్లంఘన) జరిగాయి.
  5. 1942 ఆగస్టు 8న బొంబాయిలో కాంగ్రెస్ పార్టీ సమావేశమై ‘క్విట్ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించి ఆగస్టు 9 నుంచి ఉద్యమం మొదలు పెట్టాలని తీర్మానించారు.
  6. ఆగస్టు 8 అర్థరాత్రి గాంధీజీతో సహా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరిని అరెస్టు చేసి జై ల్లో పెట్టారు.
  7. కాని యువ కార్యకర్తలు, సామన్య ప్రజలు దేశ వ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం గావించారు.
  8. యువకులు పెద్ద సంఖ్యలో కళాశాలలు వదిలి ఉద్యమంలోకి వచ్చి అరెస్టై జైలుకు వెళ్లారు.
  9. జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు.
  10. సతారా, మేధినిపూర్ జిల్లాలో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించుకున్నారు.
  11. అయితే ఇంత ఉధృతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ పాలకులు సైనిక బలంతో అణచివేశారు.
  12. ఈ శక్తి వంతమైన ఉద్యమాన్ని అణచి వేయడానికి బ్రిటిష్ వారికి సంవత్సరానికి పైగాపట్టింది.
11. కింది విషయాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము.
బిటిష్ ఎదుర్కొంటున్న కష్ట సమయాన్ని సుభాష్ చంద్రబోస్ మంచి అవకాశంగా భావించాడు. భారతదేశ స్వాతంత్య్రం అత్యంత ప్రాధాన్యత గల అంశమని, బ్రిటిష్ పాలకులను తరిమెయ్యడానికి జపాను వాళ్ల సహాయం తీసుకోవాలని అతడు భావించాడు. అతడు రహస్యంగా జర్మనీ నుంచి జపాన్‌కు వెళ్లి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఈ సైనకులు ఎవరు? బర్మా, మలయా దేశాలలలో బ్రిటన్‌ని జపాన్ ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్లే వీళ్లు. ‘భారత జాతీయ సైన్యం’ అని పేరు పెట్టి తన సైన్యంలోకి బోస్ వీళ్లని తీసుకున్నాడు. తరువాత ఎంతో మంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. అయితే బోస్‌తో గాంధీజీ ఏకీభవించలేదు. జపనీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని అతడు భావించాడు. కాన సుభాష్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాను సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు.

4 మార్కుల ప్రశ్నలు - (సమాచార నైపుణ్యాలు):-
12.కింది కాల పట్టికని గమనించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
1935 భారత ప్రభుత్వ చట్టం
1937 11 రాష్ట్రాలలో ఎన్నికలు
1939 కాంగ్రెస్ ప్రభుత్వాల రాజీనామా
1909 ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు
1906 ముస్లిం లీగ్ స్థాపన
1940 ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ తీర్మానం
1942 క్విట్ ఇండియా ఉద్యమం
1942 {Mిప్స్ రాయబారం
1942 భారత జాతీయసైన్యం ఏర్పాటు
1946 రాయల్ నౌకాదళ సైనికుల సమ్మె
1946 దేశ వ్యాప్త కార్మికుల సమ్మె
1946 రాష్ర్ట ప్రభుత్వాలకు ఎన్నికలు
1947 దేశ విభజన స్వాతంత్య్రం
  1. 1937లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది?
  2. 1942లో జరిగిన ముఖ్య ఘటనలు ఏవి?
  3. 1937, 1946లో జరిగిన ఎన్నికలకు ఆధారమైన చట్టం ఏది?
  4. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఎప్పుడు ఏర్పడ్డాయి?
1.జ: కాంగ్రెస్ పార్టీ
2.జ: క్విట్ ఇండియా ఉద్యమం, క్రిప్స్ రాయబారం, భారత జాతీయ సైన్యం ఏర్పాటు
3.జ: 1935, భారత ప్రభుత్వ చట్టం
4.జ: 1909వ సం॥

2 మార్కుల ప్రశ్నలు
1. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి మద ్దతు ఇవ్వడంలో భారతీయుల మధ్య ఉన్న విభిన్న అభిప్రాయాలు ఏవి?
జ:
  1. రెండో ప్రపంచ యుద్ధంలో ఒక వైపు బ్రిటిష్, మిత్రరాజ్యాలు, మరోవైపు జర్మనీ కూటమి ఉన్నాయి.
  2. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోవాలంటే జర్మనీ కూటమికి మద ్దతు ఇవ్వాల్సి వస్తుంది. కాని హిట్లర్, ముస్సోలిని లాంటి ఫాసిస్టు నియంతలకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించలేదు.
  3. మరోవైపు సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి వారి సహకారంతో బ్రిటిష్ పరిపాలిస్తున్న భారతపై యుద్ధానికి దిగారు.
  4. తమతో సంప్రదించకుండా భారత్‌ను యుద్ధంలో భాగస్వామిగా చేసినందుకు వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.

2. స్వాతంత్య్రోద్యమంలో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం (ఆర్‌ఎస్‌ఎస్) పాత్రను తెలుపుము.
జ:

  1. భారత స్వాతంత్య్రోద్యమంలో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం (ఆర్‌ఎస్‌ఎస్) కీలకపాత్ర వహించాయి.
  2. కులం, వర్ణాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించాయి.
  3. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలిగించారు.
  4. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు.
  5. బాల గంగాధర్ తిలక్ మహారాష్ర్టలో ప్రారంభించిన గణపతి ఉత్సవాలు, శివాజీ జన్మదిన ఉత్సవాలు ప్రజలలో గొప్ప చైతన్యాన్ని నింపాయి.
  6. ఈ ప్రయత్నాల వల్ల సామాన్య ప్రజలు సైతం జాతీయోద్యమంపై ఆకర్షితులయ్యారు.

3. స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలీగు కార్యకలాపాలను వివరించండి.
జ:

  1. ముస్లింలీగు పార్టీ 1906లో ఏర్పడింది. భారతదేశంలో ముస్లింల ప్రయోజనాలు కాపాడం దీని ముఖ్యలక్ష్యం.
  2. మహ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింలీగ్ 1940 నుంచి ప్రత్యేక పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు.
  3. ప్రారంభంలో ప్రత్యేక దేశం డిమాండ్ చేయకపోయినా..బ్రిటిష్ వారి ‘విభజించు-పాలించు’ విధానం వల్ల కాంగ్రెస్ నాయకులను అణచివేయడానికి ముస్లిం లీగ్ వారిని ప్రోత్సాహించారు.
  4. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కూడా ఏర్పాటు చేశారు.
  5. ముస్లిం వర్గ ప్రయోజనాలు తప్ప దేశ స్వాతంత్య్రద్యోమానికి, జాతీ ప్రయోజనాల కోసం ముస్లిం లీగ్ చేసిందేమీ లేదు.

4. ‘క్విట్ ఇండియా ఉద్యమం’ గురించి తెలపండి.
జ:
క్విట్ ఇండియా ఉద్యమం:

  1. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించిన మూడో అతి ముఖ్యమైన ఉద్యమం ‘క్విట్ ఇండియా’.
  2. ఇది 1942 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా గాంధీజీ ‘డూ ఆర్ డై’ (సాధించండి లేదా చావండి) అనే నినాదాన్ని ఇచ్చాడు.
  3. గాంధీజీతో సహా పెద్ద నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లో పెట్టారు.
  4. యువకార్యకర్తలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు లక్షలాదిగా ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
  5. ప్రభుత్వ ఆస్తులకు పెద్ద సంఖ్యలో నష్టం కలిగించారు.
  6. చివరికి బల ప్రయోగం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని అణచివేసింది.

5. దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్ల విషయంలో గాంధీజీ స్పందన ఏమిటి?
జ:

  1. 1947 ఆగస్టులో దేశ విభజన జరిగిన వెంటనే అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.
  2. 1947 ఆగస్టు 15న బెంగాల్‌లో అల్లర్లతో అతలాకుతలమైన నోవఖాలిలో శాంతిని నెలకొల్పడానికి గాంధీజీ ప్రయత్నించాడు.
  3. గాంధీజీ మొదటి స్వాతంత్య్ర ఉత్సవాల్లో కూడా పాల్గొనకుండా అక్కడే ఉండి 1947 సెప్టెంబర్‌లో ఢిల్లీకి తిరిగి వచ్చాడు.
  4. ప్రజల భయాలు దూరం చేయడానికి ప్రయత్నించాడు. సర్వమత ప్రార్థనలతో ప్రజలను ఐక్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు.
  5. అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణలు, హక్కు కల్పించాలని సూచించాడు.
  6. ఈ ప్రయత్నాల వల్ల ఇతర వర్గాల ఆగ్రహానికి గురై చివరికి 1948 జనవరి 30న హతమయ్యారు.

 

6. కింది కాల పట్టికను గమనించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.

 

1946 ఫిబ్రవరి 16 రాయల్ నౌకాదళంలోని భారత సైనికుల నిరసన
1946 ఆగస్టు 16 ముస్లింలీగు ‘ప్రత్యక్ష కార్యాచరణా దినం’
1947 ఫిబ్రవరి వైస్‌రాయ్ గా మౌంట్ బాటన్
1947 ఆగస్టు 14 పాకిస్తాన్‌కు అధికార బదిలీ
1947 ఆగస్టు 15 భారత్‌కు అధికార బదిలీ
1948 జనవరి 28 గాంధీజీపై హత్యా ప్రయత్నం
1948 ఫిబ్రవరి 14 హిందూమహాసభ ‘రాజకీయ కార్యక్రమం త్యజించడం’

1. రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నిరసన చేపట్టిన రోజు ఏది?
2. 1948 జనవరి 28న జరిగిన ఘటన ఏది?

1.జ: 1946 ఫిబ్రవరి 16
2.జ: జాతిపిత గాంధీజీపై హత్యాప్రయత్నం జరిగి విఫలమైంది.

1 మార్కు ప్రశ్నలు
1. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం అనగా నేమి?
జ: క్విట్ ఇండియా: క్రిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత 1942 ఆగస్టులో గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా బ్రిటిష్ వారిని భారతదేశం వదిలి పోండి అని డిమాండ్ చేశారు.

2. ‘భారత జాతీయ సైన్యం’ అంటే ఏమిటి?
జ: భారత జాతీయ సైన్యం:
1. 1942లో జర్మనీ, జపాన్‌ల వద్ద బందీలుగా ఉన్న భారతీయ సైనికులతో మోహన్ సింగ్ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
2. తర్వాత సుభాష్ చంద్రబోస్ దీనికి నాయకత్వం వహించి దాన్ని బలోపేతం చేశారు. ఇదే భారత జాతీయ సైన్యం (లేక) ఆజాద్ హింద్ ఫౌజ్.

3. ఆర్‌ఎస్‌ఎస్ ను విస్తరించండి.
జ: ఆర్‌ఎస్‌ఎస్:- రాష్ట్రీయ స్వయం సేవక సంఘం.

4. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు రాజీనామా చేశాయి?
జ: 1. బ్రిటిష్ వారి మొండి పట్టుతో భారతీయులకు అధికార బదిలీ జరగదని భావించిన కాంగ్రెస్ పార్టీ 1937లో రాష్ట్రాలలో తాము ఏర్పరచిన ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది.
2. దీనికి అనుగుణంగా 1939 అక్టోబర్‌లో రాజీనామా చేశాయి.

5. ‘విభజించు-పాలించు’ అనగా నేమి?
జ: 1. భారతదేశంలో స్వాతంత్య్రోద్యమాన్ని నీరు గార్చడానికి బ్రిటిష్ వారు అనుసరించిన విధానమే ‘విభజించు-పాలించు’.
2. దీని ప్రకారం కాంగ్రెస్‌లోని మితాదులు, అతివాదులు అలాగే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం జరిగింది.

6. 1942లో జరిగిన రెండు ముఖ్య సంఘటనలు తెలపండి.
జ: 1. సర్‌స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి రాయబారిగా వచ్చి చర్చలు జరిపాడు. దీనినే ‘క్రిప్స్ రాయబారం’ అంటారు.
2. గాంధీనాయకత్వంలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మొదలైంది.
3. సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ‘భారతజాతీయ సైన్యం’ రూపొందింది.

7. పాకిస్తాన్ లేదా పాక్‌స్తాన్ అనే పదం ఎలా ఏర్పడింది?
జ: పంజాబ్, అప్ఘన్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్‌ల ఇంగ్లిషు అక్షరాల నుంచి ఏర్పడింది.

8. ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ ఏది? ఆ రోజున ఏమి జరిగింది?
జ: 1. ముస్లింలీగ్ పార్టీ ప్రత్యేక పాకిస్తాన్‌ను కోరుతూ 1946 ఆగస్టు 16న ‘ప్రత్యక్ష కార్యాచరణ’ కు దిగింది.
2. ఆ రోజు కలకత్తాలో అల్లర్లు చెలరేగి చాలా రోజులు కొనసాగాయి. వీటిలో వేలాది మంది చనిపోయారు.

9. సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనమైన సంస్థానాలు ఏవి?
జ: సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనమైన సంస్థానాలు
1. జునాగఢ్ 2. కాశ్మీర్ 3.హైదరాబాద్

10. ‘రాచరిక భరణం’ అనగానేమి?
జ: రాచరిక భరణం: స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాక ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చుల కోసం భారత ప్రభుత్వం కొంత మొత్తాన్ని చెల్లించేది. దీనినే ‘రాచరిక భరణం’ అన్నారు. అయితే ఇది 1971 నుంచి రద్దయింది.
బహుళైచ్ఛిక ప్రశ్నలు (1/2 మార్కు)

1. బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం ( )
(ఎ) 1940
(బి) 1939
(సి) 1937
(డి) 1935
2. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? ( )
(ఎ) విన్‌స్టన్ చర్చిల్
(బి) క్లెమెంట్ అట్లి
(సి) విక్టోరియా
(డి) ఎలిజబెత్
3. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ( )
(ఎ) 1906
(బి) 1909
(సి) 1919
(డి) 1935
4. ‘సారే జహాసే అచ్ఛా...హిందుస్తాన్ హమారా’ గీత రచయిత ఎవరు? ( )
(ఎ) మహ్మద్ అలీ జిన్నా
(బి) మౌలానా అబ్దూల్ కలాం ఆజాద్
(సి) మొహమ్మద్ ఇక్బాల్
(డి) సయ్యద్ అలీఖాన్
5. 1942 లో భారతదేశానికి రాయబారిగా వచ్చిన వ్యక్తి... ( )
(ఎ) సర్‌స్టాఫర్డ్ క్రిప్స్
(బి) అలెగ్జాండర్
(సి) మౌంట్ బాటన్
(డి) వేవెల్
6. 1942లో ప్రారంభమైన ఉద్యమం.... ( )
(ఎ) సహాయ నిరాకరణ
(బి) ఉప్పు సత్యాగ్రహం
(సి) స్వదేశీ ఉద్యమం
(డి) క్విట్ ఇండియా
7. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఈ జిల్లాలో ‘స్వతంత్ర’ ప్రభుత్వాలను ప్రకటించారు.
(ఎ) సతారా, నాగ్‌పూర్
(బి) సతారా, మేధినిపూర్ ( )
(సి) నాగ్‌పూర్, చంబల్‌పూర్
(డి) మేధినిపూర్, చంబల్‌పూర్
8. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ....( )
(ఎ) కాంగ్రెస్
(బి) ముస్లింలీగ్
(సి) స్వరాజ్‌పార్టీ
(డి) భారత కమ్యూనిస్టు పార్టీ
9. బ్రిటిష్ వారిని తరిమి వేయడానికి జపాన్ వారి సహాయం తీసుకోవాలని భావించిన వ్యక్తి ఎవరు? ( )
(ఎ) గాంధీజీ
(బి) నెహ్రూ
(సి) సుభాష్ చంద్రబోస్
(డి) సర్దార్ పటేల్
10. సుభాష్ చంద్రబోస్ నడిపిన సైన్యం ఏది? ( )
(ఎ) భారత జాతీయ సైన్యం
(బి) భారత రాజకీయ సైన్యం
(సి) భారత స్వతంత్ర సైన్యం
(డి) భారత ప్రజాతంత్ర సైన్యం
11. 1946లో రాయల్ నౌకాదళంలోని భారతీయ సైనికులు నిరసన చేపట్టిన ప్రాంతం ఏది?( )
(ఎ) మద్రాస్
(బి) బొంబాయి
(సి) కొచ్చిన్
(డి) కలకత్తా
12. ‘తెభాగ’ ఉద్యమానికి నేతృత్వం వహించింది ఎవరు? ( )
(ఎ) రాష్ట్ర ప్రాంతీయ సభ
(బి) బెంగాల్ ప్రాంత సభ
(సి) రాష్ట్ర కిసాన్ సభ
(డి) బెంగాల్ మహాసభ
13. ‘క్యాబినెట్ మిషన్’ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? ( )
(ఎ) 1946 ఫిబ్రవరి
(బి) 1946 మార్చి
(సి) 1946 జూన్
(డి) 1946 ఆగస్టు
14. ‘భారత ఉక్కు మనిషి’ ఎవరు? ( )
(ఎ) జవహర్ లాల్ నెహ్రూ
(బి) మహాత్మాగాంధీ
(సి) సర్దార్ వల్లభాయి పటేల్
(డి) డా॥బి.ఆర్ అంబేద్కర్
15. రాచరిక భరణాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది? ( )
(ఎ) 1969
(బి) 1970
(సి) 1971
(డి) 1975
జవాబులు:
1) డి 2)ఎ 3)బి 4) సి 5) ఎ 6) డి 7) బి 8) డి 9)సి 10)ఎ
11)బి 12) సి 13)బి 14)సి 15) సి
Published date : 28 Dec 2023 12:23PM

Photo Stories