Skip to main content

IIIT Admissions: ప్రారంభం.. కవలలకు సీట్లు.. ఆగస్టు 10 నుంచి క్లాస్‌వర్క్‌

IIIT Admissions
కౌన్సెలింగ్‌ పరిశీలిస్తున్న కేసీ రెడ్డి

కవలలకు సీట్లు

నందిగాం మండలం సైలాడ గ్రామానికి చెందిన కవలలైన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సంపాదించి ప్రవేశాలు పొందారు. వీరిలో మార్పు సంధ్య కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం గ్రామం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి 576 మార్కులు సాధించింది. మార్పు అలేఖ్య పాతటెక్కలి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి 571 మార్కులు సాధించింది. ఇద్దరూ బంధువుల ఇళ్ల వద్ద ఉంటూ చదువుకున్నారు. వీరి తల్లి పవిత్ర వ్యవసాయ కూలీగా పనిచేస్తారు.

Sandhya Kanchili, Marpu Sandhya
తాత సదానందతో సంధ్య, అలేఖ్య

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ప్రకాశంలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లలో ఆగస్టు పది నుంచి క్లాస్‌వర్క్‌ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చాన్స్‌ లర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ప్రీ యూనివర్సిటీ కోర్సు మొదటి సంవత్సరం ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. మొదటి రోజు జూలై 24న‌ కౌన్సెలింగ్‌కు 540 మంది హాజరు కావాల్సి ఉండగా 453 మంది హాజరయ్యా రు. వీరికి ప్రవేశాలు కల్పించారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో సీటు సంపాదించిన టాపర్‌ పల్లి శరణ్యకు ప్రవేశ ధ్రువీకరణ పత్రాన్ని చాన్స్‌లర్‌ అందజేశారు. జూలై 25న‌ సైతం కౌన్సెలింగ్‌ కొనసాగనుంది. ఇందుకోసం కోసం 30 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు.

చదవండి: RGUKT: ముగిసిన ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌.. రెండు రోజుల్లో ఇన్ని సీట్ల భర్తీ

ఈ సందర్భంగా చాన్స్‌లర్‌ మీడియాతో మాట్లాడు తూ నాలుగు క్యాంపస్‌ల్లో 4400 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. కౌన్సెలింగ్‌కు హాజరు కాని, ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ సిద్ధం కాని స్పోర్ట్సు, ఎన్‌సీసీ వంటి ప్రత్యేక కేటగిరీల జాబితాలు సిద్ధం చేసి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాలు పూర్తిచేస్తామని అన్నారు. ఆగస్టు పది నుంచి క్లాస్‌వర్క్‌ ప్రారంభించి, వారం రోజుల పాటు విద్యార్థులకు ప్రేరణ (ఓరియెంటేషన్‌) తరగతులు నిర్వహిస్తామని అన్నారు. నూతన విద్యా విధానం నేపథ్యంలో పలు సంస్కరణలు విద్యలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.

దీని ప్రకారం పీయూసీ తర్వాత విద్యార్థులు తాము రిలీవ్‌ కావాలంటే కావచ్చునని, ఇంజినీరింగ్‌లో ఏటా రిలీ వ్‌ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌లో మధ్యలో వెళ్లిపోయే విద్యార్థులకు డిప్లమా, సర్టిఫికెట్‌ కోర్సుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని అన్నారు. ప్రస్తుతం వసతి కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు. హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో స్కిల్స్‌ శిక్షణకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పీయూసీ కోర్సులోనే ఐటీ స్కిల్స్‌ విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతేక శిక్షణ

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌.సుధాకర్‌బాబు, ఏవో మునిరామకృష్ణ, కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.ఎస్‌.వి.గోపాలరాజు, డీప్‌ ఆఫ్‌ అకడిమిక్‌ అఫైర్స్‌ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి పాల్గొన్నారు.

Published date : 25 Jul 2023 05:07PM

Photo Stories