Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం
- 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల భర్తీకి ఏఏఐ నోటిఫికేషన్
- రాత పరీక్ష, సైకలాజికల్ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక
- ఎంపికైతే రూ.13 లక్షల వరకు వార్షిక వేతనం
- బీఎస్సీ, బీటెక్ అర్హతతో పోటీ పడే అవకాశం
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. సంక్షిప్తంగా ఏఏఐ. కేటగిరి-1 ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన ఏఏఐ.. పౌర విమానయాన రంగంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. గ్రౌండ్, ఎయిర్ ట్రాఫిక్‌లకు సంబంధించి మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణలో కీలకంగా నిలుస్తోంది. నిపుణులైన మానవ వనరుల నియామకాలను చేపడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.
మొత్తం 496 పోస్ట్‌లు
ఏఏఐ.. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. ఇందులో ఎస్‌సీలకు 75, ఎస్‌టీలకు 33, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) వర్గాలకు 140, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 49 పోస్ట్‌లను రిజర్వ్ చేసింది. ఓపెన్ కేటగిరీలో 139 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: AAICLAS Recruitment 2023: 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
విద్యార్హతలు
నవంబర్ 30, 2023 నాటికి బీఎస్సీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో) లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు ఇంగ్లిష్‌లో రిటెన్, స్పోకెన్ నైపుణ్యం తప్పనిసరి. 10వ తరగతి లేదా 12 తరగతిలో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి.
వయసు
నవంబర్ 30, 2023 నాటికి గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు ఉండాలి (ఎస్‌సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాల వారికి మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది).
ఎంపిక ఇలా
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల భర్తీకి రాత పరీక్ష, మానసిక ద్రుఢత్వ పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.
150 మార్కులకు రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 35 ప్రశ్నలు-35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షను ఆన్‌లైన్‌లో విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
తదుపరి దశలో పలు టెస్టులు
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దేశిత కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సంపాదించిన వారికి తదుపరి దశలో అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వీటిలో సైకో యాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్ అభ్యర్థుల ఆరోగ్య పరమైన అంశాలకు సంబంధించింది. కాగా.. వాయిస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్‌లు అభ్యర్థుల నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి.
వాయిస్ టెస్ట్
వాయిస్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థుల ఇంగ్లిష్ భాష నైపుణ్యాలను పరిశీలిస్తారు. నాలుగు లేదా అయిదుగురు అభ్యర్థులను ఒక్కో బృందంగా ఏర్పాటు చేస్తారు. వారికి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి చదవమని అడుగుతారు. ప్యాసేజ్‌లోని వాక్యాలు.. విమాన పైలట్లు,ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాల మధ్య జరిగే సంభాషణలతో కూడినవిగా ఉంటాయి. ఆయా పదాలు,వాక్యాల ఉచ్ఛారణ సరిగా ఉందా? లేదా? అనే అంశాన్ని ప్రధానంగా పరీక్షిస్తారు.
సైకలాజికల్ అసెస్‌మెంట్
ఎంపిక ప్రక్రియలో వాయిస్ టెస్ట్ తర్వాత దశలో నిర్వహించే పరీక్ష.. సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్. ఎయిర్ పోర్ట్స్ విభాగంలో విధులు నిర్వర్తించడానికి అవసరమైన మానసిక ద్రుఢత్వాన్ని పరిశీలించేలా అభ్యర్థులకు సిట్యుయేషన్ టెస్ట్, పర్సెప్షన్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
రూ.13 లక్షలు వేతనం
అన్ని దశల్లోనూ ప్రతిభ చూపి తుది విజేతల జాబితాలో నిలిచిన వారికి.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్-బి హోదాలో కొలువు ఖరారు చేస్తారు. ఈ హోదాలో ఈ-1 లెవల్‌లో రూ.40,000-రూ.1,40,000 మధ్యలో వేతన శ్రేణి ఉంటుంది. స్థూలంగా ఏడాదికి దాదాపు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకునే అవకాశముంది.
ట్రైనింగ్, సర్వీస్ బాండ్
ఏఏఐ జేఈగా ఎంపికైన వారికి నిర్దిష్ట వ్యవధిలో శిక్షణ ఇస్తారు. సర్వీస్ బాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైనింగ్ వ్యవధి తర్వాత మూడేళ్ల పాటు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోనే విధులు నిర్వర్తిస్తామని హామీ ఇస్తూ.. రూ.ఏడు లక్షల సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వడం తప్పనిసరి.
జీఎం స్థాయికి చేరుకోవచ్చు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో ఎయిర్ ట్రాఫిక్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులైన వారు భవిష్యత్తులో జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు నిబంధనలను అనుసరించి.. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ హోదాలు లభిస్తాయి. పనితీరుతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి కూడా చేరే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 30, 2023
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2024 జనవరిలో నిర్వహించే అవకాశం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aai.aero/
చదవండి: UPSC Preparation Without Coaching: కోచింగ్ లేకున్నా.. సక్సెస్ ఇలా!
రాత పరీక్షలో రాణించేలా
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్
అభ్యర్థులు బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్‌పై పట్టు సాధించాలి. అదేవిధంగా స్పెల్లింగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్స్, సెంటెన్స్ రీ-అరేంజ్‌మెంట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ప్రెసిస్ రైటింగ్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందాలి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే ఈ సబ్జెక్ట్‌లో రాణించాలంటే..కోడింగ్, డీ-కోడింగ్, అనలిటికల్ పజిల్స్, క్రిటికల్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. అదే విధంగా అనలిటికల్ రీజనింగ్, సిలాజిజమ్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్ అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీ విభాగాలపై పట్టు సాధించాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
హైçస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్‌లోని అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజ్, యావరేజేస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్ షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్/జనరల్ స్టడీస్‌లో స్కోర్ కోసం హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించాలి.
Qualification | GRADUATE |
Last Date | November 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- AAI Recruitment 2023
- Junior Executive jobs
- Junior Executive Jobs in AAI
- Airports Authority of India
- Engineering Jobs
- Govt Jobs
- latest jobs notifications
- Selection process: written test
- psychological test
- Junior Executive positions
- Public sector opportunity
- latest jobs in 2023
- sakshi education latest jobs notifications