Skip to main content

CTET 2024 Notification: టీచింగ్‌ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్‌

కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో.. టీచర్‌ కొలువులకు పోటీపడాలంటే.. సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)లో అర్హత తప్పనిసరి! సీటెట్‌.. బీఈడీ, డీఈడీ విద్యార్థులకు సుపరిచితమైన పరీక్షే!! ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే..ఆ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు లభిస్తుంది. ఈ ఏడాది జూలై సెషన్‌కు సంబంధించి సీటెట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. సీటెట్‌కు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
CTET 2024 Notification, Central Teacher Eligibility Test (CET). Teacher posts in central government schools
  • ఈ స్కోర్‌తోనే ఉపాధ్యాయ నియామకాలకు అర్హత
  • స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచింగ్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం-ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే అభ్యర్థులకు బీఈడీ, డీఈడీ, బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)తోపాటు.. సీటెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. దీంతో.. సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ వంటి వాటిలో టీచర్‌ కొలువు సొంతం చేసుకోవాలంటే.. సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

రెండు పేపర్లుగా సీటెట్‌

  • బోధించే తరగతులను అనుసరించి సీటెట్‌ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 
  • ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధనకు పేపర్‌-1లో అర్హత సాధించాలి.
  • ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్‌కు పేపర్‌-2లో ఉత్తీర్ణత పొందాలి.
  • రెండు స్థాయిల్లోనూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరుకావచ్చు.

చ‌ద‌వండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

అర్హతలు

  • పేపర్‌-1కు అర్హత: ఇంటర్మీడియెట్‌/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ/బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పాస్‌ అవ్వాలి. 
  • ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం-బీఈడీ అభ్యర్థులను కూడా ఎస్‌జీటీ పోస్ట్‌లకు అర్హులుగా పేర్కొన్నారు. దీంతో..సీటెట్‌ టెట్‌-పేపర్‌-1కు బీఈడీ ఉత్తీర్ణులు కూడా పోటీ పడొచ్చు. 

పేపర్‌-2కు అర్హత

  • బీఏ/బీఎస్సీ/బీకామ్‌ల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్‌/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో పాస్‌ అవ్వాలి(లేదా) బీఈ/బీటెక్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా అర్హులే(లేదా) 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ-ఎంఈడీ ఉత్తీర్ణత ఉండాలి.

చ‌ద‌వండి: CTET Previous Papers

150 మార్కులకు పేపర్‌ 1

  • పేపర్‌-1 అయిదు విభాగాల్లో మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
  • చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌-1, 30 ప్రశ్నలు-30 మార్కులకు;లాంగ్వేజ్‌-2, 30ప్రశ్నలు-30 మా ర్కులకు;మ్యాథమెటిక్స్‌ 30ప్రశ్నలు-30 మా ర్కులకు; ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 ప్రశ్నలు-30 మార్కులకు నిర్వహిస్తారు.పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది.
  • లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2 తప్పనిసరి పేపర్లు. లాంగ్వేజ్‌-1 విభాగంలో అభ్యర్థులు ఎంచుకున్న బోధన మాధ్యమానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
  • లాంగ్వేజ్‌-2 విభాగంలో.. 20 లాంగ్వేజ్‌లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. ఈ విభాగంలో ఎంచుకునే లాంగ్వేజ్‌ను లాంగ్వేజ్‌-1 విభాగంలో ఎంచుకోకూడదు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు లాంగ్వేజ్‌-2లో తెలుగు, ఉర్దూ భాషల్లో హాజరయ్యే అవకాశముంది. 

పేపర్‌-2 కూడా 150 మార్కులకే

  • పేపర్‌-2ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం అయిదు విభాగాల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
  • చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌1, 30 ప్రశ్నలు-30 మార్కులకు; లాంగ్వేజ్‌ 2, 30 ప్రశ్నలు-30 మార్కులకు; మ్యాథమెటిక్స్, సైన్స్‌ 60 ప్రశ్నలు-60 మార్కులకు; సోషల్‌ స్టడీస్‌/సోషల్‌ సైన్స్‌ 60 ప్రశ్నలు-60 మార్కులకు నిర్వహిస్తారు. 
  • లాంగ్వేజ్‌-1 విభాగంలో.. అభ్యర్థులు తాము బోధించాలనుకుంటున్న మాధ్యమంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. 
  • లాంగ్వేజ్‌-2 విభాగంలో.. లాంగ్వేజ్‌-1లో హాజరైన భాష కాకుండా.. ఇతర లాంగ్వేజ్‌ను ఎంచకోవాలి. మొత్తం 20 భాషలు అందుబాటులో ఉన్నాయి. 
  • మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచింగ్‌ అభ్యర్థులు పేపర్‌-2లో నాలుగో విభాగాన్ని, సోషల్‌ టీచర్లు అయిదో విభాగాన్ని ఎంచుకుని పరీక్షకు హాజరు కావాలి.
  • ప్రతి పేపర్‌కు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

చ‌ద‌వండి: CTET Previous Papers

కనీస అర్హత మార్కులు

సీటెట్‌ పేపర్‌-1, పేపర్‌-2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు..జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో(60 మార్కులు) ఉత్తీర్ణత పొందాలి. 

చ‌ద‌వండి: టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

ప్రిపరేషన్‌ పక్కాగా
చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి

ఈ విభాగంలో ఎడ్యుకేషనల్‌ సైకాలజీ నుంచి ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక,ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అ­భ్యాసం,అభ్యసన బదలాయింపు అంశాలను చదవా­లి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు,సిద్ధాంతాలు-సూత్రా­లు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయా­లి. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్‌-కౌన్సెలింగ్‌ గురించి అవగాహన పెంచుకోవాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాల గురించి తెలుసుకోవాలి. పె­డగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే.. ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

లాంగ్వేజ్‌ పేపర్లకు ఇలా

లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2 పేపర్‌లలో రాణించేందుకు సంబంధిత భాషా విభాగాలపై స్కూల్‌ స్థాయి పాఠ్య పుస్తకాలను పూర్తిగా చదవాలి. లాంగ్వేజ్‌-2కు సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ఎంచుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్‌ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ నేపథ్యంపై ప్రశ్నలు వస్తాయి.

మ్యాథమెటిక్స్‌

ఇందులో రాణించేందుకు పేపర్‌-1లో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు పుస్తకాలను చదవాలి. ఈ సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. పేపర్‌-2లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్‌ స్థాయిలో ఉంటుంది.

ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌

ఈ విభాగంలో రాణించేందుకు బోటనీ బేసిక్స్‌తోపాటు, పర్యావరణ అంశాలు, సైన్స్‌ ఇన్‌ డైలీ లైఫ్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

సైన్స్‌

ఈ సబ్జెక్ట్‌లో మంచి మార్కులు పొందాలంటే.. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఔపోసన పట్టాలి. పేపర్‌-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో అడిగిన ప్రశ్నలు కొంత క్లిష్టంగానే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ వంటి వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.

సోషల్‌ స్టడీస్‌

ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్‌ అంశాలను సమకాలీన అంశాలతో అప్‌డేట్‌ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2023 
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://ctet.nic.in/

Published date : 29 Nov 2023 05:58PM

Photo Stories