Skip to main content

Osmania University: ‘ఉస్మానియా’ ఉద్యోగుల జీతాలు స్వాహా

Osmania University

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్‌ మారిఫిల్‌ ఉస్మానియా విభాగంలో జీతాల కుంభకోణం చోటు చేసుకుంది. సిబ్బందికి ఇవ్వాల్సిన రూ.1.12 కోట్ల వేతనాల సొమ్మును ముగ్గురు ఇంటి దొంగలు కాజేశారు. ఆలస్యంగా ఈ విషయం గుర్తించిన రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌కు (సీసీఎస్‌) అప్పగిస్తూ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఈ కేసును రీ–రిజిస్టర్‌ చేసిన సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దైరతుల్‌ మారిఫిల్‌ ఉస్మానియా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లోని సాహిత్యంపై పరిశోధన, తర్జుమా బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈ విభాగంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు తమకు కొన్ని నెలలుగా జీతాలు అందట్లేదంటూ సంబంధిత విభాగం ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మీ నారాయణకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన వర్సిటీ ఫైనాన్స్‌ విభాగంలో ఆరా తీశారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాము పంపిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో రిజిస్ట్రార్‌కు దైరతుల్‌ విభాగం మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ మెహజబీన్‌ అక్తర్‌, సూపరింటెండెంట్‌ సయ్యద్‌ సయీదుద్దీన్‌, అకౌంటెంట్‌ మహ్మద్‌ జహీరుద్దీన్‌ పాత్రలపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీతాలు సహా వివిధ ఖర్చులకు సంబంధించి దైరతుల్‌ ఖాతాలో ప్రభుత్వ నిధుల నుంచి 2021 సెప్టెంబర్‌ 29న రూ.1,12,50,000 జమయ్యాయి. అదే ఏడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు వివిధ దఫాల్లో ఆ మొత్తాన్ని కాజేసిన ఆ ముగ్గురూ సొంతం చేసుకున్నారని తేలింది. దైరతుల్‌ నిధులను డ్రా చేసే అధికారం ఉన్న డైరెక్టర్‌ అప్పటి డైరెక్టర్‌ అక్తర్‌, సూపరింటెండెంట్‌, అకౌంటెంట్‌ కుమ్మకై ్క ఈ మొత్తం స్వాహా చేసినట్లు తేల్చారు. దీనిపై ఓయూ రిజిస్ట్రార్‌ ఈ ఏడాది జనవరిలోనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని 406, 420 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం, స్వాహా చేసిన మొత్తం తదితరాలను పరిగణలోకి తీసుకున్న సీపీ దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. కేసు ఫైల్‌ అందుకున్న సీసీఎస్‌ పోలీసులు గత నెల 30న అవే సెక్షన్ల కింద కేసు రీ–రిజిస్టర్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి: TSPSC Group 1 Prelims Exam: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Published date : 10 Jun 2023 06:09PM

Photo Stories