Skip to main content

C. P. Radhakrishnan: విద్యార్థుల ప్రతిభకు సానబట్టాలి

సాక్షి, హైదరాబాద్‌/శామీర్‌పేట్‌: విద్యార్థుల ప్రతిభకు సానబట్టి, వారిని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు.
students talents  talent of the students should be appreciated  Governor CP Radhakrishnan  University responsibility

పోటీ ప్రపంచంలో వారిని విజయ సోపానం వైపు నడిపించాల్సిన బాధ్యత చేపట్టాలని యూనివర్సిటీల వీసీలకు ఉద్బోధించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీ (ఏఐయూ) సంస్థ 98వ వార్షిక సమావేశంలో భాగంగా మూడు రోజుల సదస్సును ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నేతృత్వంలో ‘ఉన్నత విద్య–2047’సదస్సు ఏప్రిల్ 15న‌ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్‌ మాట్లాడుతూ, ఉన్నత విద్యలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని ముందుకెళ్లాలని విశ్వవిద్యాలయాలకు సూచించారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న విద్యారంగానికి వీసీలు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ దిశగా ఏఐయూ చేస్తున్న కృషిని గవర్నర్‌ అభినందించారు.

చదవండి: Bio Medical Course: కొత్తగా బయో మెడికల్‌ కోర్సు.. ఇన్ని సీట్లు మాత్రమే..

వికసిత్‌ భారత్‌ ప్రణాళికను సాకారం చేసే దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేస్తే అది భారత పురోగతికి దోహదపడుతుందని చెప్పారు. సరికొత్త ఆలోచనలను పంచుకునేందుకు ఈ సమావేశం వేదిక అవుతుందని ఆకాంక్షించారు.

వైజ్ఞానిక పురోగతి గల భారత్‌ను నేటి తరం కోరుకుంటోందన్నారు. భారతీయ సంస్కృతిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లే ఉన్నత విద్య నేటి సమాజానికి అవసరమని పేర్కొన్నారు. నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, అవకాశాల వైపు దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సరికొత్త ఆలోచనలతో పారిశ్రామికాభివృద్ధి సాధించే యువత దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళ్తుందన్న ఆకాంక్ష వెలిబుచ్చారు.

చదవండి: Govt Colleges Score Top In Inter Results: కార్పోరేట్‌ కాలేజీలకు ధీటుగా.. టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

నైపుణ్యాభివృద్ధికి భారతీయ విద్యా విధానం ప్రాధాన్యతనివ్వాలన్నారు. పరిశోధన, డిజిటల్‌ విద్య ప్రపంచ అవకాశాలను దగ్గర చేసిందని రాధాకృష్ణన్‌ చెప్పారు. ఆశాజనక భవిష్యత్‌ అందించే కోర్సులకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.

డ్రగ్స్, అవినీతిరహితంగా భారత వర్సిటీలు ఆదర్శంగా నిలవాలని, దేశానికి మంచి నాయకత్వాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐయూ అధ్యక్షుడు జీడీ శర్మ, ప్రధాన కార్యదర్శిపంకజ్‌ మిట్టల్, ఇక్ఫాయ్‌ వీసీ గణేష్, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు పాల్గొన్నారు. 

Published date : 16 Apr 2024 11:25AM

Photo Stories