Skip to main content

విజ్ఞానానికి, చదివే మాధ్యమానికి సంబంధం లేదు: అశోక్ సేన్

భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని మించినది ‘ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు’.శాస్త్ర పరిశోధన రంగంలో విశిష్ట గుర్తింపు కలిగిన ఈ అవార్డును రష్యన్ నోబెల్‌గా పరిగణిస్తారు.
ఈ అవార్డు కింద ఇచ్చే నగదు బహుమతి నోబెల్ బహుమతికి రెట్టింపు ఉంటుంది. ఈ అవార్డు సాధించిన భారతీయుడు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అశోక్‌సేన్. ఆయన ప్రతిపాదించిన తీగ సిద్ధాంతానికి (స్ట్రింగ్ థియరీకి) ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు దక్కింది. సేన్‌ను ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ స్వయంగా ‘రాయల్ సొసైటీ ఫెలోషిప్’కు నామినేట్ చేశారు. సేన్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. దేశ విదేశాల్లో పరిశోధనలు చేసిన ఆయన కాన్పూర్ ఐఐటీలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని ‘స్టోనీ బ్రూక్’ వర్సీటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. పలు దేశాల్లో పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం అలహాబాద్‌లోని హరీష్-చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు సాగిస్తున్నారు.

ఓ విద్యార్థి విజ్ఞానానికి, చదివే మాధ్యమానికి (మీడియం) సంబంధం లేదని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అశోక్‌సేన్ పేర్కొన్నారు. కాలేజీలో చేరే వరకూ తాను బెంగాలీ మాధ్యమంలో చదువుకున్నానని చెప్పారు. ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకు తగినట్లుగా బడ్జెట్ కేటాయింపులు పెరగాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సాధించాలనే లక్ష్యంతో పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచడం తగదని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కువ జీతం లభించే ఉద్యోగం వైపు కాకుండా ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుందని తెలిపారు. ‘చుక్కపల్లి పిచ్చయ్య 6వ స్మారక ఉపన్యాసం’ కోసం విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ..

సాక్షి: ప్రతిష్టాత్మక ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అవార్డులో భాగంగా వచ్చిన నగదు తీసుకోవడానికి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిందా?
సేన్:
లేదు. అవార్డు కింద 3 మిలియన్ డాలర్ల నగదు బహుమతి వచ్చింది. ట్రస్టు ఏర్పాటు చేశా. విద్యారంగంలో ఈ ట్రస్టు పనిచేస్తోంది.

సాక్షి: మీ బాల్యం గురించి చెప్పండి. మీరు భౌతికశాస్త్రం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు?
సేన్:
మా నాన్న ఫిజిక్స్ టీచర్. అందువల్ల ఫిజిక్స్ మీద ఆసక్తి కలిగింది. నేను +2 పూర్తి చేసినప్పడు బెంగాల్‌లో ఫిజిక్స్ మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్. బోర్డు పరీక్షల్లో నేను టాప్ 10లో లేను. టాప్ టెన్‌లో ఐదుగురు ఫిజిక్స్ తీసుకున్నారు. అప్పట్లో ఫిజిక్స్‌కు బాగా క్రేజ్ ఉండేది.

సాక్షి: పరిశోధన రంగం పట్ల ఆకర్షితులు కావడానికి కారకులెవరు?
సేన్:
ఒకరని చెప్పలేను. నేను డిగ్రీ చదివిన కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో అమల్ రాయ్‌చౌధురి, కాన్పూర్ ఐఐటీలో చాలా మంది ప్రొఫెసర్లు చాలా మంది నా జీవితంలో ఉన్నారు.

సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలని ఉబలాటపడుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని రెండు మూడు కార్పొరేట్ కాలేజీలు పెద్ద వ్యాపారం చేస్తూ రూ. కోట్లు సంపాదించుకుంటున్నాయి. పాఠశాల స్థాయిలోనే ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై మీ సలహా ఏమిటి?
సేన్:
పిల్లలు ఎలా ఎదగాలి? ఏం కావాలి? అనే విషయాలను వారికే విడిచిపెట్టాలి. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తమ ఆసక్తి ఏమిటనే విషయం పూర్తిగా తెలియకపోవచ్చు. అయితే పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తగదు. ఐఐటీలో సీటు రాకపోతే జీవితం లేదనే భావన మంచిది కాదు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సులంటే పిచ్చి అనుకోవాలి.

సాక్షి: పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వైపు వెళ్తున్నారు. ఏటా లక్షల సంఖ్యలో ఇంజనీర్లు తయారవుతున్నారు. మెరికల్లాంటి వారంతా ఇంజనీరింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. కోర్ సైన్స్ వైపు రావడం లేదు. పరిశోధన రంగం మీద దీని ప్రభావం ఉండదా?
సేన్:
అందరూ ఇంజనీర్లు కావాలనే ఆలోచన మంచిది కాదు. కోర్ సైన్స్ లోనూ మంచి భవిష్యత్ ఉంది. సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అటు వైపు రావాలని నేను విద్యార్థులకు సూచిస్తా. ఎక్కువ జీతం లభించే ఉద్యోగం వస్తుందని ఫలానా కోర్సు చదవాలనే యోచన మంచిది కాదు. ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుంది.

సాక్షి: విదేశాలకు, ఇక్కడకు ఉన్న తేడా ఏమిటి?
సేన్:
థియరిటికల్ రీసెర్చ్‌లో పెద్దగా ఉండదు. నేను అందులోనే పరిశోధనలు చేస్తున్నా. సైద్ధాంతిక పరిశోధనకు ల్యాబ్ కూడా అక్కర్లేదు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కార్యకలాపాలు బాగా ఎక్కువ. ప్రయోగాత్మక పరిశోధనకు విదేశాల్లో మంచి అవకాశాలున్నాయి. మనకు బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. నిధుల సమస్య లేదు. ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి కానీ వ్యయం చేయడంలోనే సమస్యలున్నాయి. శాస్త్ర పరిశోధన రంగంలో ఉన్న వారికే వ్యయం చేసే అధికారం పూర్తిగా ఇవ్వాలి.

సాక్షి: మీకు విదేశాల నుంచి చాలా ఆఫర్లు వచ్చి ఉంటాయి. కానీ మీరు దేశంలోనే పరిశోధనలు చేయాలని ఎందుకు అనుకున్నారు?
సేన్:
నేను దేశంలో ఉండటాన్ని ఇష్టపడతాను. సైద్ధాంతిక పరిశోధన ఎక్కుడ చేసినా పెద్ద తేడా ఉండదు. కేవలం ఆకర్షణీయమైన ఆఫర్ల కోసం విదేశాలు వెళ్లాల్సిన అవసరం లేదు.

సాక్షి: శాస్త్రవేత్తగా విజయపథంలో పయనిస్తున్నారు. మీరు బాల్యంలో ఏ మాధ్యమం(మీడియం)లో చదువుకున్నారు?
సేన్:
నేను బెంగాలీని. బెంగాలీ మీడియంలోనే చదువుకున్నా. డిగ్రీకి వచ్చిన తర్వాత పరీక్షలు ఇంగ్లీష్‌లో రాయాల్సి వచ్చింది. పీజీ కోసం కాన్పూర్ ఐఐటీలో చేరినప్పటి నుంచి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోయా.

సాక్షి: ఏపీలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతోంది?
సేన్:
కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదవడం అనేది ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఇంగ్లీష్ అవసరమే. కానీ విజ్ఞానానికి, మాధ్యమానికి ఏమీ సంబంధం ఉండదనే విషయాన్ని గుర్తించాలి.

సాక్షి: విద్యలో నాణ్యత పెరగడానికి మీరిచ్చే సూచనలు..
సేన్:
ప్రాథమిక విద్య చాలా ముఖ్యం. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మాత్రం టీచర్ల మీద ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంత గెడైన్స్ ఉంటే సరిపోతుంది. కానీ ప్రాథమిక స్థాయిలో అలా కాదు. టీచర్ గెడైన్స్ మీద పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ప్రొఫెసర్లకు ఇస్తున్న స్థాయిలో ప్రైమరీ టీచర్లకు జీతాలు ఇవ్వడం వల్ల ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు పెరగాలి. పిల్లల్లో ఆసక్తిని గమనించి అందుకు అనుగుణంగా ఎదగనివ్వాలి.
Published date : 08 Aug 2018 02:45PM

Photo Stories