Skip to main content

మాది ప్రాక్టీస్ స్కూల్

-ప్రతి విద్యార్థీ ఏడున్నర నెలలు ఇంటర్న్‌షిప్ చేయాల్సిందే : బిట్స్-హైదరాబాద్ డైరెక్టర్ వీఎస్ రావు
-ఇండస్ట్రీ కొరత తీర్చడం దీని వల్లే సాధ్యం
-బీఎస్సీ పట్టభద్రులకూ ఇక పీజీ ఇంజనీరింగ్
-‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ

సాక్షి, హైదరాబాద్: ఐఐటీలతో పోటీపడుతూ, కొత్త ఐఐటీల కంటే ఎక్కువగా ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు దక్కించుకుంటూ ఇంజనీరింగ్ ఆశావహుల్లో ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బిట్స్ ప్రత్యేకత ఏమిటి? ‘మాది ప్రాక్టీస్ స్కూల్’ కావడమే అంటారు బిట్స్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి.ఎస్.రావు. క్యాంపస్ ఇక్కడ ఏర్పాటవడం, విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన రాష్ట్రానికి చెందినవారే. ఇప్పుడు హైదరాబాద్ క్యాంపస్ విస్తరణ దశలో కీలకపాత్ర పోషిస్తున్న ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..

ఐఐటీలు, ఎన్‌ఐటీలతో సమానంగా పేరు సాధించడం వెనుక ప్రత్యేకత ఏమిటి?

మెడిసిన్‌లాగే ఇంజనీరింగ్‌లో కూడా కేవలం చదవడంతో సరి పోదు. ప్రాక్టీస్ చేయాల్సిందే. బిట్స్ విద్యార్థులంతా ఏడున్నర నెలలు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి ఉన్న కంపెనీల్లో! ఇలాంటి విధానం ఐఐ టీల్లో కూడా లేదు. ఇది కేవలం బిట్స్‌కు మాత్రమే సాధ్యం.

ఇంటర్న్‌షిప్ ఇవ్వడం, ఖర్చులు ఎవరు భరిస్తారు?

ఇంటర్న్‌షిప్ అందివ్వడాన్ని బిట్స్ చూసుకుంటుంది. దాదాపు రూ.12 వేల నుంచి రూ.35 వేల దాకా స్టైపెండ్ వస్తుంది. ప్రయాణ ఖర్చులను కంపెనీలు భరిస్తాయి.

దీనివల్ల సాధించిన విజయాలు?

చదువుకు, పరిశ్రమకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడమెలాగో బిట్స్ దాదాపు 40 ఏళ్లుగా చేసి చూపుతోంది. ఏ ఏడాది చూసుకున్నా బిట్స్ నుంచి 4,000 మంది దాదాపు 415 పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేస్తూనే ఉంటారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో లేనిదీ, మీ దగ్గర ఉన్నదీ ఏమిటి?

మాది ప్రాక్టీస్ స్కూల్. 1972 నుంచీ అమలు చేస్తున్నాం.

ఇంతలా పరిశ్రమల్లో భాగస్వాములవుతున్న విద్యార్థులు కూడా అందరి మాదిరిగానే ఉద్యోగ వేటలో పడుతున్నారు తప్ప ఉద్యోగ సృష్టికర్తలుగా మారడం లేదేం?

బిట్స్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్న్‌షిప్‌లు అందిస్తోంది. మరిన్ని విద్యా సంస్కరణలు కూడా తీసుకొస్తుంది. దేశంలో ప్రతి విద్యా సంస్కరణలోనూ ముందు శ్రేణిలో నిలుస్తుంది. అయితే విద్యార్థుల ఆలోచనా ధోరణి కూడా మారాలి. అందుకు వారికి ఆర్థిక తోడ్పాటు ముఖ్యం. ఈ దిశగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను బిట్స్ హైదరాబాద్ ప్రారంభించింది. దీనికి శాస్త్ర, సాంకేతిక శాఖ రూ.5 కోట్ల గ్రాంటు, బిట్స్ రూ.2.5 కోట్లు ఇచ్చాయి. విద్యార్థులు తమ ఆలోచనలను వాణిజ్య ఉత్పత్తిగా మలచేందుకు ఇది దోహదపడుతుంది. సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్‌షిప్‌ను కూడా ఏర్పాటు చేశాం.

ప్లేస్‌మెంట్స్ పరంగా సాధించిన ప్రగతి..

గతేడాది పలువురు విద్యార్థులు గరిష్టంగా రూ.58 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఈ ఏడాది రూ.85 లక్షల దాకా ఉండొచ్చు.

బిట్స్ చదువు విద్యార్థికి ఆర్థికంగా భారమన్న ప్రచారముంది?

యూజీకి ఫీజు రూ. 1.4 లక్షలు. దాదాపు 22 శాతం మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ దొరుకుతుంది. అలాగే పీజీకి 50 శాతం విద్యార్థులకు ఫీ వేవర్ ప్రోగ్రాం ఉంది. స్టైపెండ్ కూడా ఉంది. ఇక పీహెచ్‌డీ విద్యార్థుల్లో 90 శాతం మందికి పూర్తి ఫీజు మినహాయింపుంది.

బిట్స్ పూర్వ విద్యార్థుల ప్రగతిని ఎప్పుడైనా పరిశీలించారా?

బిట్స్ పూర్వ విద్యార్థులు పలు దేశాల్లో సంస్థలు నెలకొల్పారు. వారు బిట్స్‌తో అనుసంధానమై ఉంటారు. ఇటీవల బిట్స్‌లో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సింగ్‌కు అధునాతన వెర్షన్ మల్టి క్యాంపస్ ఆడియో విజువల్ ప్రోగ్రామ్ అయిన కనెక్ట్ 2.0ను పూర్వ విద్యార్థులే అందించారు.

కొత్తగా రానున్న కోర్సుల వివరాలు?

బీఎస్సీ పట్టభద్రులకూ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సు చదివే అవకాశం కల్పించనున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ఎంఈ(కంప్యూటర్ సైన్స్, స్పెషలైజేషన్ విత్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ) కోర్సు అందించనున్నాం. మార్చిలో ప్రకటన వస్తుంది. దీని కాల వ్యవధి మూడు నుంచి నాలుగేళ్లు. 40 సీట్లుంటాయి. తర్వాతి ఏడాది ఎంఈ ఇన్ బిజినెస్ అనలైటిక్స్, ఎంఈ ఇన్ బయోప్రాసెసింగ్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు రానున్నాయి.

Published date : 04 Feb 2013 03:36PM

Photo Stories