Indian Federal system : కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు గురించి పూర్తి వివరణ... TGPSC, APPSC, POLICE పరీక్షల కోసం..!

కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు (భాగం XI, ప్రకరణ 245-255)...
- రాజ్యాంగంలోని 11వ భాగంలో, ప్రకరణ 245 నుండి 255 వరకు, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను గురించి వివరిస్తుంది. ఈ ప్రకరణలు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు ఏయే అంశాలపై చట్టాలు చేయగలవో స్పష్టంగా తెలియజేస్తాయి.
- ప్రకరణ-245: ఇది కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల చట్టాల భౌగోళిక పరిమితులను వివరిస్తుంది. పార్లమెంటు రూపొందించే చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి, కొన్ని సందర్భాలలో దేశం వెలుపల నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి. దీనినే "సీమాంతేతర చట్టాలు (Extra-Territorial Legislation)" అని అంటారు. రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు ఆ రాష్ట్ర భూభాగాలకు మాత్రమే వర్తిస్తాయి. పార్లమెంటు చట్టాలు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించకపోవచ్చు.
- ప్రకరణ 246 - అధికార విభజన: భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను మూడు జాబితాలుగా విభజించింది, వీటి వివరాలు ఏడవ షెడ్యూల్‌లో ఉన్నాయి.
కేంద్ర జాబితా (Union List): ప్రారంభంలో 97 అంశాలు ఉన్నాయి, ప్రస్తుతం కూడా 97 అంశాలే ఉన్నాయి. దేశ రక్షణ, బ్యాంకింగ్, రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు, కరెన్సీ వంటి జాతీయ ప్రాముఖ్యత గల విషయాలు ఇందులో ఉన్నాయి. దీనిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది.
రాష్ట్ర జాబితా (State List): ప్రారంభంలో 66 అంశాలు ఉండగా, ప్రస్తుతం 59 అంశాలు మాత్రమే ఉన్నాయి. శాంతి భద్రతలు, పోలీసు, వ్యవసాయం, స్థానిక సంస్థలు, ప్రజారోగ్యం వంటి స్థానిక ప్రాముఖ్యత గల అంశాలు ఇందులో ఉన్నాయి. దీనిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంది.
ఉమ్మడి జాబితా (Concurrent List): ప్రారంభంలో 47 అంశాలు ఉండగా, ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. విద్య, అడవులు, వన్యప్రాణి సంరక్షణ, క్రిమినల్ మరియు సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ అంశాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు. అయితే, కేంద్రం చేసిన చట్టం మరియు రాష్ట్రం చేసిన చట్టం మధ్య వైరుధ్యం ఉంటే, కేంద్రం చేసిన చట్టానికే ఆధిక్యత ఉంటుంది (ప్రకరణ 254).
అవశిష్ట జాబితా (Residual List): ఈ జాబితాలో ఏ ఇతర జాబితాలోనూ పేర్కొనబడని అంశాలు ఉంటాయి. ఈ అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది (ప్రకరణ 248).
కేంద్రం రాష్ట్ర జాబితాపై చట్టాలు చేయడం...
- ప్రకరణ 249: జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యసభ 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం చేస్తే, పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై ఒక సంవత్సరం పాటు చట్టాలు చేయవచ్చు.
- ప్రకరణ 250: జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352) సమయంలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించవచ్చు.
- ప్రకరణ 252: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే, పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయవచ్చు.
- ప్రకరణ 253: అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో చట్టాలు చేయవచ్చు.
- ప్రకరణ 255: కొన్ని చట్టాలను రూపొందించేటప్పుడు రాష్ట్రపతి లేదా గవర్నర్ పూర్వానుమతి అవసరం.
కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు (భాగం XI, ప్రకరణ 256-263)...
- రాజ్యాంగంలోని 11వ భాగంలో, ప్రకరణ 256 నుండి 263 వరకు, కేంద్ర, రాష్ట్రాల మధ్య సాధారణ పరిస్థితుల్లో గల పరిపాలనా సంబంధాల గురించి వివరిస్తుంది. ఈ సంబంధాలనే మున్సిపల్ సంబంధాలు అని కూడా అంటారు.
- ప్రకరణ 256: ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడి వినియోగించాలి. ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలకు కొన్ని పరిపాలనా ఆదేశాలు జారీ చేయవచ్చు.
- ప్రకరణ 262: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం పార్లమెంట్ ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయవచ్చు. సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాల పరిధిని దీని నుండి మినహాయించవచ్చు.
- ప్రకరణ 263: భారత రాష్ట్రపతి ఒక అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. అంతర్రాష్ట్ర వివాదాలపై విచారణ చేసి, సలహాలు ఇస్తుంది. మొట్టమొదటిసారిగా 1990లో ఈ మండలిని ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు (భాగం XII, ప్రకరణ 264-300)...
- రాజ్యాంగంలోని 12వ భాగంలో, ప్రకరణ 264 నుండి 300 వరకు, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక, ఆస్తి సంబంధాల గురించి ప్రస్తావించాయి.
- పన్నుల విభజన: కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల విధింపుకు సంబంధించి స్పష్టమైన విభజన ఉంది.
- కేంద్రం విధించే పన్నులు: కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, ఆదాయపు పన్ను (వ్యవసాయేతర) వంటివి.
- రాష్ట్రం విధించే పన్నులు: భూమి శిస్తు, వ్యవసాయ ఆదాయంపై పన్ను, వృత్తి పన్ను (₹2500 మించకుండా) వంటివి.
- అవశిష్ట పన్నులు: ఏ జాబితాలో లేని అంశాలపై పన్నులు విధించే అధికారం కేంద్రానికే ఉంది.
- ప్రకరణ 266: కేంద్ర సంఘటిత నిధి మరియు రాష్ట్ర సంఘటిత నిధులు ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే అన్ని ఆదాయాలు ఇందులో జమ అవుతాయి.
- ప్రకరణ 267: ఊహించని ఖర్చుల కోసం కేంద్రం మరియు రాష్ట్రాలకు ఆగంతక నిధులు ఉంటాయి.
- ప్రకరణ 280: రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల విభజనపై సిఫార్సులు చేస్తుంది.
- ప్రకరణ 285: కేంద్ర ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించరాదు.
- ప్రకరణ 289: రాష్ట్ర ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం నుండి మినహాయింపు ఉంటుంది.
అంతర్రాష్ట్ర వాణిజ్య సంబంధాలు (భాగం XIII, ప్రకరణ 301-307)...
- ప్రకరణ 301: రాజ్యాంగ నిబంధనలకు లోబడి, భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా వ్యాపారం లేదా వాణిజ్యం నిర్వహించుకునే హక్కు పౌరులకు ఉంటుంది.
- ప్రకరణ 302: పార్లమెంటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాపార వాణిజ్యాలపై ఆంక్షలు విధించవచ్చు.
కేంద్ర రాష్ట్ర సంబంధాల సమీక్ష కమిషన్లు...
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో తలెత్తిన వివాదాలను పరిష్కరించడానికి అనేక కమిటీలు నియమించబడ్డాయి.
పరిపాలనా సంస్కరణల సంఘం (1966):
- మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని, రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
రాజమన్నార్ కమిటీ (1969):
- తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్, ప్రకరణ 356ను రద్దు చేయాలని, అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని, అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్రం ఆమోదించలేదు.
సర్కారియా కమిషన్ (1983):
- ఆర్.ఎస్. సర్కారియా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్ 247 సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించింది. ఇందులో ముఖ్యంగా:
- ప్రకరణ 263 ప్రకారం అంతర్ ప్రభుత్వాల మండలిని ఏర్పాటు చేయాలి.
- ప్రకరణ 356ను చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగించాలి.
- గవర్నర్‌ను నియమించేటప్పుడు ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
- అఖిల భారత సర్వీసులను బలోపేతం చేయాలి.
- ఈ కమిషన్ సిఫార్సులలో చాలా వరకు కేంద్రం అమలు చేసింది, ముఖ్యంగా 1990లో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం వంటివి.
మదన్ మోహన్ పూంచి కమిషన్ (2007):
- 2007లో, ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక సరళీకరణ మరియు ఉదారవాదం వంటి మార్పులకు అనుగుణంగా, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను సమగ్రంగా సమీక్షించడానికి భారత ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్‌లో వినోద్ కుమార్ దుగ్గల్, ధీరేంద్ర సింగ్, అమరేష్ బాగ్చి, మరియు డా. ఎన్.ఆర్. మాధవ మీనన్ సభ్యులుగా ఉన్నారు.
- ఈ కమిషన్ తన 1456 పేజీల నివేదికను 2010 ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో మొత్తం 310 సిఫార్సులు ఉన్నాయి.
ముఖ్య సిఫార్సులు:
- అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య మండలి: ప్రకరణ 307 ప్రకారం దీనిని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధత కల్పించాలి.
- ప్రణాళికా సంఘం: ప్రణాళిక మరియు ప్రణాళికేతర మధ్య గల తేడాలను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.
- వృత్తి పన్ను: రాజ్యాంగపరంగా ఉన్న వృత్తి పన్నుపై పరిమితిని ఎత్తివేయాలి.
- రాజ్యసభ: రాష్ట్రాల జనాభాతో సంబంధం లేకుండా రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి.
- అఖిల భారత సర్వీసులు: ఆరోగ్యం, విద్య, ఇంజనీరింగ్, మరియు న్యాయ శాఖలలో కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.
- గవర్నర్‌కు సంబంధించిన సిఫార్సులు:
- రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి.
- గవర్నర్ల నియామకంలో సర్కారియా కమిషన్ సిఫార్సులను యథార్థ స్ఫూర్తితో పాటించాలి.
- రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా ఉండే సంప్రదాయాన్ని రద్దు చేసి, అతని పాత్రను రాజ్యాంగ అంశాలకే పరిమితం చేయాలి.
- గవర్నర్‌ను రాజకీయ ఫుట్‌బాల్‌గా వ్యవహరించకూడదని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను మాత్రమే నియమించాలని సూచించింది.
- ప్రకరణ 355 మరియు 356: ఈ ప్రకరణల కింద 'అత్యవసర నిబంధనల స్థానికీకరణ' చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. అంటే, రాష్ట్రం మొత్తం కాకుండా సమస్యాత్మకమైన జిల్లా లేదా దానిలోని కొన్ని భాగాలను మాత్రమే గవర్నర్ పాలన కిందకు తీసుకురావాలి.
- మతకల్లోలాలు: మతకల్లోలాలు చెలరేగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే కేంద్రం బలగాలను పంపడానికి వీలు కల్పించాలి.
- జాతీయ సమగ్రతా మండలి: ఈ మండలి కనీసం ఏడాదికి ఒకసారి సమావేశం కావాలని సూచించింది.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు – ప్రముఖుల వ్యాఖ్యానాలు...
భారత సమాఖ్య వ్యవస్థపై పలువురు ప్రముఖులు ఇచ్చిన కొన్ని వ్యాఖ్యానాలు.
- కె.సి. వేర్: భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య (Quasi-Federal) వ్యవస్థను కలిగి ఉంది.
- ప్రొ. కె. సంతానం: భారతదేశం వాస్తవికంగా ఏక కేంద్రంగా పనిచేస్తుంది, కానీ సిద్ధాంతపరంగా సమాఖ్య సంబంధాలు ఉన్నాయి.
- పాల్ ఆపెల్బి: భారత వ్యవస్థ తీవ్రమైన సమాఖ్య వ్యవస్థ (Extremely Federal).
- మారిస్ జోన్స్: భారత వ్యవస్థ బేరసారాల సమాఖ్య వ్యవస్థ (Bargaining Federation).
- ఐవర్ జెన్నింగ్స్: భారత సమాఖ్య ఒక కేంద్రీకృతమైన మరియు బలమైన సమాఖ్య.
- అలెగ్జాండర్: భారత వ్యవస్థ స్వయం ప్రేరిత మరియు విశిష్ట సమాఖ్య వ్యవస్థ.
- గ్రాన్విలే ఆస్టిన్: భారత సమాఖ్య సహకార సమాఖ్య.
- డా. బి.ఆర్. అంబేద్కర్: భారత సమాఖ్య అనేది పరిస్థితులకు అనుగుణంగా ఏక కేంద్రంగాను, సమాఖ్యగాను మార్చుకోగల స్థితిస్థాపకత ఉన్న ఒక విశిష్ట సమాఖ్య.
- సి.హెచ్. బేగ్: భారత సమాఖ్య అనేది ఉభయచరం లాంటిది.
- జస్టిస్ అహమ్మదీ: భారత సమాఖ్య అనేది ఆచరణాత్మకమైనది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- indian polity study material federal system in telugu
- indian polity upsc
- polity upsc
- polity short notes upsc
- polity study materials upsc
- polity tgpsc
- polity short notes tgpsc
- polity study materials appsc
- polity study materials in telugu
- polity telugu
- sakshi education
- sakshi education study materials
- AdministrativeRelations
- FinancialRelations
- IndianFederalSystem
- CentreStateRelations