POLITY : రాజ్యాంగ ప్రవేశిక

ప్రవేశిక మూల పాఠం (Text of the preamble)
- “భారత ప్రజలమైన మేము భారతదేశముని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ గా తీర్చిదిద్దడానికి, పౌరులందరికీ సామాజిక , ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచనలో, భావ ప్రకటనలో , విశ్వాసంలో, ధర్మంలో, ఆరాధనలో స్వాతంత్రాన్ని; హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి; వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీ ఐక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రతృత్వాన్ని పెంపొందించడానికి ఈ 1949 నవంబర్ 26 తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము” .
- ప్రవేశికకు నందన్ లాల్ బోస్ అనే వ్యక్తి నగిసి చిక్కిన శిల్పి(art work).
ప్రవేశిక లోని అంశాలు
- రాజ్యాంగ అధికారానికి మూలం – రాజ్యాంగానికి అధికారం భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని ప్రవేశిక పేర్కొంటుంది. భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా భారత రాజ్య స్వభావంను ప్రకటిస్తుంది.
☞POLITY : రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు
- న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌబ్రతత్వం అనే రాజ్యం యొక్క రాజ్యాంగ లక్ష్యాలను ఈ ప్రవేశిక స్పష్ఠికరిస్తుంది. 1946 నవంబర్ 26వ తేదిన రాజ్యాంగాన్ని ఆమోదించినట్టుగా ప్రవేశిక తెలియజేస్తుంది.
ప్రవేశిక సవరణకు అతీతం కాదు
- పార్లమెంటుకు ప్రకరణ 368ను అనుసరించి ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం ఉన్నదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని అర్ధం ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం క్రిందికి వస్తుంది కనుక, దాని సారాంశం మార్చకుండా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది.
- ఈ తీర్పు తర్వాత స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా “సామ్యవాదం”, “లౌకికవాదం” “సమగ్రత” అనే పదజాలాన్ని చేర్చారు. ఇది ప్రవేశికకు చేసిన మొట్టమొదటి సవరణ మరియు ఇదే ప్రవేశికకు చిట్టచివరి సవరణ.
ప్రవేశిక ప్రయోజనం – ప్రాముఖ్యత
- ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం లాంటిది . ప్రవేశిక రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ప్రవేశికలో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి. ప్రవేశిక రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం.
ప్రవేశిక వలన ప్రయోజనాలు
- ప్రవేశిక ద్వారా రాజ్య లేదా ప్రభుత్వ స్వభావం తెలియపరుస్తుంది. ప్రవెశిక రాజ్యాంగ ఆమోద తేదిని తెలియజేస్తుంది. ప్రవేశిక రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది.
- అధికారానికి ప్రజలు మూలమని సూచిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగ ఆశయాలను ఆదర్శాలను తెలియపరుస్తుంది. ప్రవేశిక రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది.
ప్రవేశిక లోపాలు
- ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు (Non-Justiciable). ప్రవేశికలో పేర్కొన్న ఆశయాలు అమలు పరచకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ప్రవేశికలో ప్రజల హక్కుల ప్రస్తావన లేదు.
- ప్రవేశిక ప్రభుత్వ అంగాల అధికారాలకు ఆధారం కాదు మరియు పరిమితి కూడా కాదు. ప్రవేశిక రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడిన అంశాలను పరిమితం చేయలేదు. ఇందులో పేర్కొనబడిన భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు.
- ప్రవేశిక శాసనాధికారాలకు ఆధారం కాదు.
ప్రవేశిక విమర్శనాత్మక పరిశీలన
- భారత రాజ్యాంగ ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. దీనికి అర్ధం ప్రవేశికలో పొందుపరచబడిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమలులోకి రావు. వాటిని అమలుపరచమని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవు.
- ఒకవేళ ఇందులోని ఆదర్శాలను అమలుచేస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు లేదా ఆ విధంగా చేసిన చట్టాలను అమలు చేయనప్పుడు పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయవచ్చు.
ప్రవేశికలోని ముఖ్య పదాలు (Keywords in the preamble)
- రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు సార్వ భౌమ, సామ్యవాదం, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం మరియు గణతంత్రం.
- సామాజిక ఆశయాలు తెలియజేసే పదాలు న్యాయం, రాజకీయ న్యాయం, సామజిక న్యాయం మరియు ఆర్ధిక న్యాయం.
- ఉన్నత ఆదర్షాలు తెలియజేసే పదాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం, ఐక్యత మరియు సమగ్రత.
సార్వభౌమ (Sovereign)
- అనగా సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా (External Independence and Internal Supremacy) విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. భారతదేశము యొక్క అంతరంగిక మరియు బహిర్గత విషయాలలోనూ ఇతర దేశాల జోక్యం లేకుండా తనకు తానుగా స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని కలిగి ఉండటాన్ని సార్వభౌమాధికారంగా పేర్కొనవచ్చు.
- ఉదాహరణకు ఫోక్రాన్ లో భారత్ అను పరీక్షలు నిర్వహించడంలో, రష్యాతో రాకెట్ మరియు రోదసి ఒప్పందం విషయంలో మన దేశం అమెరికా వంటి అగ్రరాజ్యాల నిర్ణయాలను ఖాతరు చేయకుండా తమ సొంత నిర్ణయాలను తీసుకుంది.
- నోట్ : కామన్వెల్త్ కూటమిలో చేరటాన్ని కొందరు మన దేశ సార్వభౌమత్వానికి భంగం అని వాదించారు. భారతదేశం కామన్ వెల్త్ సభ్య దేశం అయినప్పటికి భారత సార్వభౌమత్వానికి పరిమితి లేదు. కామన్ వెల్త్ లోని దేశాలు బ్రిటీష్ రాణి లేదా రాజులు తమ సాంప్రదాయ అధిపతిగా పరిగణిస్తారు (ఉదా: ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్).
- కానీ భారతదేశం బ్రిటీష్ రాణి లేదా రాజును అధిపతిగా స్వీకరించలేరు. అయితే భారత్ కామన్వెల్త్ లో చేరడం అనేది మన దేశం అభివృద్ధిని సాధించడం కోసం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం అని ఏ సందర్భంలోనైనా కామన్వెల్త్ నుండి నిష్క్రమించే అధికారం ఉన్నందున కామన్వెల్త్ లో సభ్యత్వం పొందడం అనేది దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం కాదు అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు.
సామ్యవాదం(Socialist)
- ఈ పదాన్ని 1976 లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన లేదా సమానత్వమును సాధించుట. ప్రజల మధ్య ఆర్థిక, అంతరాలను క్రమేణా తగ్గించడం. భారత రాజ్యాంగం పైన నెహ్రూ యొక్క ప్రభావం అధికంగా ఉన్నది స్వాతంత్ర్య ఫలాలు సామాన్యులకు కూడా చేరాలంటే మన దేశం సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని నెహ్రు యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాజ్యాంగంలో సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించిన అంశాలను చేర్చినారు.
- ఉత్పత్తి శక్తులను (Land, labour and capital) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా, సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకరించబడకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం, తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతో పాటు వాటిని అందిపుచ్చుకోవటానికి అవసరమైన తోడ్పాటును కలిగించడం జరుగుతుంది.
- 1955లో ఆవడి (మద్రాస్)కేంద్రంగా జరిగిన కాంగ్రెస్ సమావేశం సామ్యవాద తరహా సమాజ స్థాపన తమ లక్ష్యంగా ప్రకటించింది. సంపద సహజ వనరులు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా విశాల సమాజ ప్రయోజనాలకు వినియోగించాల్సి ఉంటుంది.
- సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం, మొ|| రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. అయితే భారత దేశంలో ప్రజాసామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీనినే “పరిణాత్మక లేక రాజ్యాంగ సామ్యవాదం” అంటారు. అనగా సామ్యవాదం “గాంధీయిజం + మార్క్సిజం” ల మేలు కలయిక.
డి.ఎస్.నకార వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా :
- ఈ కేసులో జరిగిన రాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామ్యవాదం అనే పదమును రాజ్యాంగం నుండి తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. కార్ల మార్క్స్, మహాత్మా గాంధీ సిద్ధాంతాల కలయిక ద్వారా ఏర్పడిన సిద్ధాంతం ప్రజాస్వామ్య స్వామివాదం మన దేశంలో గల అసమానతులను రూపుమాపేంతవరకు ఈ పదం రాజ్యాంగంలో కొనసాగుతుందని తీర్పును ఇవ్వడం జరిగింది.
లౌకిక తత్వం (Secular)
- ఈ పదాన్ని కూడ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. రాజ్యంలో అధికారమతం ఉండదు, మత వివక్షత ఉండదు. మత విషయంలో రాజ్యంలోని పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కానీ, నష్టం కాని వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మత స్వామ్య రాజ్యము లేదా “Theocratic State” అంటారు. ఉదా : పాకిస్థాన్, బంగ్లాదేశ్. లౌకిక రాజ్యంలో మత ప్రమేయం ఉండదు. రాజ్యం దృష్టిలో అన్ని మతాలు సమానమే. అన్ని మతాలకు సమాన హెూదా, మద్దతు ఉంటుంది.
- నేటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో లౌకిక రాజ్యాంగా రూపొందించారు. భారత ప్రాచీన సుత్తి అయిన “సమధర్మ సద్భావ” ఆధారంగా మన దేశం లౌకికవాదని అనుసరిస్తుంది. ఆధునిక రాజ్యాలన్నీ లౌకిక రాజ్యాలే. ప్రపంచ సామాజిక సాంస్కృతిక జీవన విధానంలో సంభవించిన మార్పుల కారణంగా మతపరమైన రాజ్యాల భావనకు ప్రాధాన్యత తగ్గి లౌకిక రాజ్య భావన విస్తృతంగా ప్రాముఖ్యతను పొందినది.
- ఎస్సార్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా: ఈ కేసులో జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 1994లో తీర్పునిస్తూ లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది.
- వాసుదేవ్ వర్సెస్ రామంజి: ఈ కేసులో జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు లౌకికవాదం పై తీర్పునిస్తూ మన రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదం అనే భావన సకరాత్మకమైనది. అనగా అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటుంది ఏ మతానికి కూడా ప్రత్యేక ఆదరణ కల్పించదు. అదే విధంగా ఏ మతం పట్ల కూడా వివక్షత నిరాధారణ చూపదు అని తీర్పునిచ్చింది.
ప్రజాస్వామ్యం (Democracy)
- డెమోక్రసీ అనే పదం గ్రీకు భాషలోని డెమోస్ మరియు క్రెషియా అనే పదాల కలయికతో ఏర్పడినది. డెమోస్ అనగా ప్రజలు మరియు గ్రేషియా అనగా పరిపాలన లేదా అధికారం అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పరచబడిన ప్రభుత్వం అని, అనగా Govt. by the people, for the people, of the people అని , ప్రజలే బాధితులు మరియు పాలకులు అని అబ్రహమ్ లింకన్ చక్కటి నిర్వచనం చెప్పాడు.
- భారత్లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షత లేకుండా కేవలం నిర్ణీత వయస్సు ఉన్న పౌరులందరికి ఓటు హక్కు ప్రభుత్వ పదవులకు పోటీచేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా జరుగుతుంది. తద్వారా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుచున్నది.
- భారతదేశంలో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉంది. సాధారణ వార్డు సభ్యులు మొదలుకొని దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థానం వరకు కూడా ప్రజల ప్రత్యక్షంగానూ లేక పరీక్షంగాను ఎన్నుకోబడిన ప్రతినిధులే పరిపాలన కొనసాగిస్తారు.
- సమానత్వ ప్రాతిపదికపై ఒక వ్యక్తికి ఒకే హక్కును కల్పిస్తున్నారు. ఈ విధంగా రాజకీయ స్వేచ్ఛ కల్పించబడింది. ప్రజాస్వామ్య విజయానికి మూడు ఆదర్శాలు చాలా ముఖ్యమైనవి. అవి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది. అలాగే స్వేచ్ఛ అనేది సమానత్వాన్ని ద్విగునీకృతం చేస్తుంది. సమానత్వం లేకపోతే స్వేచ్ఛ కొద్ది మందికే ఉపయోగపడుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తి చొరవను హరిస్తుంది.
- ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడమే ప్రజాస్వామ్యం- లార్డ్ బ్రెయిస్.
- రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని కూడా సాధించాలని, లేనిచో ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు - డా|| బి.ఆర్. అంబేద్కర్.
గణతంత్రం (Republic)
- "గణం" అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన అని అర్ధం . దేశాధిపతి వంశపారపర్యంగా పదవిలోకి రాకుండా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎన్నుకోవడం ద్వారా పదవిని చేపట్టడాన్ని గణతంత్ర రాజ్యాంగ పేర్కొంటారు. అనగా ప్రజా పాలన, వారసత్వ లేదా అధికార హెూదాలు ఉండవు. భారత రాష్ట్రపతి మరియు ఇతర ప్రజా పదవులు ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నిక కాబడతారు. కాబట్టి మనది గణతంత్ర రాజ్యం. బ్రిటీష్ రాణి, రాజు వలె వారసత్వ అధికారం ఉండదు. రాజకీయ అధికారం ప్రజల్లో నిక్షిప్తమై ఉంటుంది.
- నోట్: భారతదేశం రిపబ్లిక్ విధానాన్ని ఫ్రాన్స్ నుండి గ్రహించినది.
- గణతంత్రమనేది రాచరికముకు వ్యతిరేకమైనది -స్టీఫెన్ లీకాక్.
న్యాయం (Justice)
- జస్టిస్ అనే పదం రోమన్ పరిభాషక లోని జాస్టేసియా అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం కలపడం లేదా బంధించడం లేదా సమానులను చేయడం అని అర్థం. దీని కోసం చట్టం అందరికి సమానంగా వర్తింపజేసి అమలు చేయడం జరుగుతుంది.
- న్యాయం యొక్క లక్ష్యం అసమానతలు, వివక్షతలులేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యంలో పౌరులకు ప్రత్యేకమైన హక్కులు గానీ, మినహాయింపులు గాని ఉండవు. ప్రవేశికలో మొత్తం మూడు రకాలైన న్యాయాలను ప్రస్తావించారు.
ఇందిరా సహాని వర్సెస్ యూనినార్ ఇండియా 1993 :
- ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ‘చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం ఒక భావన మరియు పరిణామాత్మక అంశం. 14 ప్రకరణ లో మాత్రమే కాకుండా ప్రకరణ 15 నుంచి 18 లోను,ప్రకరణ 38 మరియు 39 మరియు 39 -ఏ మరియు 41 నుంచి 46 ప్రకరణలోను సమానత్వ భావన ఇమిడి ఉన్నది. ఈ ప్రకరణలోని పేర్కొన్న అంశాలన్నింటి లక్ష్యం ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందించడం అని’ పేర్కొన్నది.
ఆర్ధిక న్యాయం (Economic Justice)
- సామాజిక, ఆర్థిక న్యాయ సమన్వయ్యాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. ఆర్ధిక న్యాయం అనగా ప్రజలలో ఆర్ధిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి మరియు పంపిణీ, వృత్తి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుండి విముక్తులను చేయడం.
- ఆర్థిక న్యాయం కోసం ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల సంక్షేమ చర్యలను చేపట్టడంతో పాటు పేదరికం మరియు నిరుద్యోగం నిర్మూలించుటకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు.
రాజకీయ న్యాయం (Political Justice)
- సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యం. రాజకీయ న్యాయం అనగా రాజ్య కార్యకలాపాల్లో పౌరులందరు ఎలాంటి వివక్షతలు లేకుండా పాల్గొనవచ్చు.
- రాజకీయ న్యాయంలో సార్వజనీన ఓటు హక్కు,ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొ|| రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.
సామాజిక న్యాయం (Social Justice)
- సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రధానంగా రెండు చర్యలు చేపట్టారు. సాంఘిక వివక్షను నిర్మూలించడానికి అంటరానితనాన్ని నిషేధించడం మరియు కట్టు బానిసత్వం వెట్టిచాకిరి మనుషుల అక్రమ రవాణా బాల కార్మిక నిషేధం వంటి చట్టాన్ని రూపొందించారు.
- సామాజిక న్యాయం అనగా జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడం. అన్ని రకాల సామాజిక వివక్షతలను రద్దు చేయడం. దీని అర్ధం సమాజంలో పౌరులందరు సమానులే. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగలు అభ్యున్నతికి కృషి చేయడం.
స్వేచ్ఛ (Liberty)
- ప్రజాస్వామ్యంలో మరో ముఖ్యమైన ఆదర్శం స్వేచ్ఛ. బ్రిటిష్ ప్రభుత్వ పాలన కాలంలో భారత ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను భావితరాలకు అందించాలని ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను భారత రాజ్యాంగం సాధించాల్సిన ఆశయంగా రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది.
- స్వేచ్ఛ అనగా నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండి తీరాలి.
- రాజ్యాంగంలోని మూడవ భాగంలోని ప్రాథమిక హక్కుల ద్వారా స్వేచ్ఛ ప్రసాదించబడింది. ప్రాథమిక హక్కుల ద్వారా కల్పించిన స్వాతంత్ర హక్కు మత స్వతంత్రపు హక్కులు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మరియు మత స్వేచ్ఛను కల్పిస్తాయి.
సమానత్వం (Equality)
- భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో గల ప్రాథమిక హక్కుల్లో ప్రకరణ 14 నుండి 18 వరకు సమానత్వ హక్కులు గుర్తించడం జరిగింది. సమానత్వం అనగా అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తన్ను తాను పూర్తిగా వికాస పరుచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.
- జీవనం, సంచార, సంఘం ఏర్పాటు మరియు మాట్లాడే హక్కు పౌరులకు కల్పించడం జరిగింది. రాజకీయ సమానత్వం కోసం రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్రకరణ 325 ప్రకారం పౌరులకు ఓటర్లుగా నమోదు చేసుకోవడంలో వివక్షత చూపరాదు. ఆదేశిక నియమాల్లోని ప్రకరణ 39 ప్రకారం స్త్రీ పురుషుల పట్ల వివక్షత లేకుండా దాలినంత జీవనోపాధి పొందే హక్కు ఉంది.
- ఏ.వి. డైసీ తన ప్రసిద్ధ గ్రంథమైన “ది లాస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్” ద్వారా బ్రిటన్ లో ప్రవేశపెట్టబడిన సమన్యాయ పాలన అను అంశం ఆధారంగా సమానత్వమును భారత రాజ్యాంగంలో చేర్చారు.
సౌబ్రాతృత్వం (Fraternity)
- సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అని అర్ధం. అసమానతలు, వివక్షతలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. మొదట సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలు పొందుపరిచే విషయంలో హెచ్ వి కామత్ విభేదించడం జరిగింది.
- సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డా॥ బి. ఆర్. అంబేద్కర్ సౌభ్రాతృత్వం అనే భావాన్ని ప్రవేశికలో పొందుపరచాలని ప్రతిపాదించారు. జాతి, మతాలకు అతీతంగా ప్రజలు వ్యవహరించాలి. వ్యక్తి గౌరవం అనేది కేవలం వ్యక్తి భౌతికాభివృద్ధికి పాటుపడడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరచడం, వ్యక్తి ఔనత్యాన్ని మరియు గౌరవాన్ని పెంపొందించే అంశంగా పరిగణించారు.
- రాజ్యాంగం వ్యక్తి భౌతికాభివృద్ధితో పాటు వ్యక్తి ఔనత్యాన్ని పవిత్రంగా గుర్తించి వాటిని పెంపొందించేందుకు కృషి చేస్తుందని రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ సభ్యుడైన డా॥ కె. మున్షి పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల్లో, ఆదేశిక నియమాల్లో మరియు ప్రాథమిక విధులలో వ్యక్తి గౌరవాన్ని పెంపొందించే అనేక అంశాలు ఉన్నాయి.
- “ స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అనే మూడు పదాలు ఒక పవిత్రమైన కలయిక. వీటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేస్తే ప్రజాస్వామ్య లక్ష్యాన్ని ఓడించడమే అవుతుంది. దీనివలన స్ఫూర్తికి భంగం కలుగుతుంది పైగా అవి వికలాంగులు అవుతాయి – డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్”
ఐక్యత, సమగ్రత (Unity & integrity)
- భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించుటకు ఉద్దేశింపబడిన పదం ఏకత కాగా, దేశంలోని ప్రాంతాల మధ్యన ఐక్యతను పెంపొందించుటకు ఉద్దేశింపబడిన పదం సమగ్రత. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఐక్యత మరియు సమగ్రత అనే భావాలు ఎంతో అవసరం. ఐక్యతా భావం దేశ ప్రజలు కలిసి ఉండడానికి దోహదపడుతుంది.
- మత, కుల ప్రాంత వంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్ఫథాన్ని పెంపొందిస్తుంది. "సమగ్రత" అనే పదాన్ని 1976లో, 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
- నోట్ : సమగ్రతను చేర్చవలసిన ఆవశ్యకత- 1970 తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి మరియు దేశ సమగ్రతను దెబ్బ తీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో "సమగ్రత" అనే పదాన్ని చేర్చవలసిన పరిస్థితి అనివార్యమైంది.
ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా? – వివాదాలు
సుప్రీంకోర్టు తీర్పులు
- భారత రాజ్యాంగ సారాంశం అంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఇది రాజ్యాంగ అంతర్భాగమా, కాదా అనే అంశంపై భిన్న తీర్పులను వెలువరించింది. ఉదాహరణకు 1960లో బెరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రకరణ 143 ప్రకారం, సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది.
- ఆ తర్వాత 1973లో కేశవానంద భారతి వివాదంలో సుప్రీంకోర్టు పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ, ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని వ్యాఖ్యానించింది. దీని తర్వాత 1995లో L.I.C ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.
- డా॥ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ (రాజ్యాంగ పరిషత్లో ప్రవేశికను ఓటింగ్కు కోసం ప్రవేశపెట్టినపుడు) “ప్రవేశిక రాజ్యాంగలో అంతర్భాగమని” పేర్కొన్నారు.
ప్రవేశికపై సుప్రీంకోర్టు వివిధ తీర్పులు
- ఏకే గోపాలన్ కేసు (1950): ఈ కేసులో ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్ధాన్ని పరిధిని నియంత్రిస్తుంది.
- బెరుబారి యూనియన్ కేసు (1960) : సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు.
- గోలక్ నాథ్ కేసు (1960): ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు ఆశయాలకు సూక్ష్మరూపం.
- కేశవ నంద భారతి కేసు (1973): ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగమే. మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది మరియు ప్రవేశికను పరిమితంగా సవరించవచ్చు.
- ఎక్సెల్ వేర్ కేసు (1979): ఈ కేసులో స్వామివాదం అనే పదంకు నిర్వచనం ఇచ్చింది.
- నకార కేసు (1983): సామ్యవాదం అనేది గాంధీజం మరియు మార్కిజం కలయిక అని తీర్పు ఇచ్చింది.
- ఎస్ ఆర్ బొమ్మైయ్ కేసు (1994): ఈ కేసులో లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది అని తీర్పు ఇచ్చింది.
- ఎల్ఐసి ఆఫ్ ఇండియా :1995): ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.
- అశోక్ కుమార్ గుప్తా కేసు (1997): ఈ కేసులో సామాజిక న్యాయం ప్రాథమిక హక్కుగా తీర్పు ఇచ్చింది.
- అరుణ రాయ్ కేసు (2002): ఈ కేసులో విద్యా సంస్థలలో మత విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు అని తీర్పు ఇచ్చింది.
ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు
- అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ : ప్రవేశిక అనేది మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం.
కె. యం. ముని : preamble is a Political Horoscope.
ఎమ్. వి. పైలీ : రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది.
జస్టిస్ హిదయతుల్లా : భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగపు ఆత్మ మరియు రాజకీయవ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియచేస్తుంది. ప్రవేశికను విప్లవం తప్ప మరొకటి మార్చలేదు.
పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ : ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ మరియు రాజ్యాంగానికి తాళం చెవి వంటిది.
సుప్రీం కోర్ట్ : ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆధారం మాత్రమే. ఇది రాజ్యాంగానికి పరిమితి కాదు. ప్రవేశిక సవరణకు అతీతమూ కాదు.
మహవీర్ త్యాగి : ప్రవేశిక అనేది రాజ్యాంగం లో అంతర్భాగం.
నెహ్రూ : ప్రవేశికను ఒక నిశ్చితమైన తీర్మానం మరియు హామీగా భావించినట్లయితే రాజ్యాంగ అంతర్భాగం కాదు.
ఎర్నెస్ట్ బార్కర్ : ప్రవేశిక భారత రాజ్యాంగ నిర్మాతల మస్తిస్కాలలో దాగి ఉన్న విలువైన ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించే రాజ్యాంగపు తాళపు చెవి వంటిది.
జస్టిస్ ఎస్. ఎమ్. సిక్రి : రాజ్యాంగ ప్రవేశిక మన రాజ్యాంగంలో భాగం. ఏ విధమైన పదాలను పొందుపరచన్నప్పటికీ మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రవేశికలో దాగి ఉన్నది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- indian polity preamble of the constitution
- indian polity preamble of the constitution for upsc
- indian polity preamble of the constitution for upsc in telugu
- indian polity preamble of the constitution for tgpsc in telugu
- indian polity preamble of the constitution for appsc in telugu
- Indian Polity
- Polity Study Material
- polity notes
- upsc polity
- polity notes in telugu
- polity upsc
- appsc polity material
- tgpsc polity material
- polity short notes
- sakshi education study materials
- sakshi education polity material
- sakshi education daily current affairs
- IndianPolityNotes
- HistoryOfIndianConstitution
- IndianPolityStudyMaterial