Skip to main content

పరిశోధనలకు తొలి అడుగు.. యూజీసీ నెట్

సాహిత్యం నుంచి స్పేస్ సైన్స్ వరకు రోజురోజుకీ పెరుగుతున్న రీసెర్చ్ ఆవశ్యకత..
మేక్ ఇన్ ఇండియా.. స్కిల్ ఇండియా తదితర పథకాలతో భవిష్యత్‌లో ఆర్ అండ్ డీ విభాగాల్లో విసృ్తత అవకాశాలు.. పరిశోధన దిశగా ఔత్సాహికుల సంఖ్యను పెంచేందుకు భారీగా పెరిగిన ఆర్థిక ప్రోత్సాహకాలు.. దేశంలో పరిశోధనల ప్రాధాన్యాన్ని తెలిపే నిదర్శనాలివి.. ఈ పరిశోధనల అవకాశాలను.. ఆపై ఉన్నత కెరీర్‌ను అందుకునేందుకు తొలి అడుగే.. యూజీసీ నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్). బోధన రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి కూడా యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఏటా రెండు సార్లు నిర్వహించే యూజీసీ నెట్.. నోటిఫికేషన్ (యూజీసీ నెట్- జూన్ 2015) వెలువడిన నేపథ్యంలో నెట్‌లో విజయానికి మార్గాలు..

అవకాశాలపై విశ్లేషణ...
  • నెట్ అభ్యర్థులందరికీ మొదటి పేపర్ ఒకే విధంగా ఉంటుంది. ఈ పేపర్‌లో అభ్యర్థిలోని రీసెర్చ్ ఆప్టిట్యూడ్; టీచింగ్ ఆప్టిట్యూడ్; జనరల్ అవేర్‌నెస్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 ప్రశ్నలు ఉండే ఈ పేపర్‌లో.. తప్పనిసరిగా 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  • పేపర్-2, 3లు అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ సంబంధిత పేపర్లు.
  • పేపర్-2లో 50 ప్రశ్నలు అడుగుతారు. అన్నిటికీ సమాధానం ఇవ్వడం తప్పనిసరి.
  • పేపర్-3లో 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్‌లోనూ అన్నిటికీ సమాధానం ఇవ్వాలి.


పరీక్ష విధానం:
యూజీసీ తరఫున సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష మొత్తం మూడు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

 

పేపర్

ప్రశ్నలు

మార్కులు

సమయం

పేపర్-1

60

100

75 నిమిషాలు

పేపర్-2

50

100

75 నిమిషాలు

పేపర్-3

75

150

రెండున్నర గంటలు

 


ప్రతి పేపర్‌కు వేర్వేరుగా కనిష్ట ఉత్తీర్ణత
యూజీసీ నెట్‌లో మూడు పేపర్లలో ఉత్తీర్ణత శాతం వేర్వేరుగా ఉంటుంది. పేపర్-1, పేపర్-2లకు కనీసం 40 శాతం; పేపర్-3లో కనీసం 50 శాతం మార్కులు పొందితేనే మెరిట్ లిస్ట్ ప్రకారం తదుపరి దశకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూడు పేపర్లలో సగటు మార్కులను గణించి అందులో మొదటి 15 శాతం అభ్యర్థులతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు నెట్ అర్హుల జాబితా రూపొందిస్తారు. ఈ జాబితా నుంచే జేఆర్‌ఎఫ్ కోసం ప్రత్యేకంగా మెరిట్ లిస్ట్‌ను తయారుచేస్తారు.

70 శాతం మార్కులు లక్ష్యంగా
నెట్ ఔత్సాహిక అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులు లక్ష్యంగా సాధన చేస్తే జేఆర్‌ఎఫ్ అవకాశాలు మెండుగా ఉంటాయి. యూజీసీ నెట్ జూన్ - 2014లో ఆయా సబ్జెక్ట్‌లలో పేర్కొన్న కటాఫ్‌లే ఇందుకు నిదర్శనం. యూజీసీ నిర్వహించే నెట్ ద్వారా 3200 జేఆర్‌ఎఫ్‌లు అందిస్తుంది. ఈ క్రమంలో యూజీసీ నెట్ 2014ను 95 సబ్జెక్ట్‌లలో నిర్వహించగా.. జనరల్ కేటగిరీల్లో అన్ని విభాగాల్లో జేఆర్‌ఎఫ్ కటాఫ్ పర్సంటేజీ 60 శాతం నుంచి 70 శాతం మధ్యలో నమోదైంది.

ఆబ్జెక్టివ్ పరీక్షకు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో

 

 

  • మొత్తం మూడు పేపర్లుగా పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే నెట్‌లో ఉత్తీర్ణతకు అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించడం మంచిది.
  • అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి పీజీ స్థాయి సిలబస్‌ను ఔపోసన పట్టడం ఎంతో అవసరం.
  • అందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్-1లో ఎక్కువగా టీచింగ్ ఆప్టిట్యూట్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, దేశంలో ఉన్నత విద్య-ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ఆయా రంగాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
  • వీటితోపాటు పేపర్-1లో డేటా ఇంటర్‌ప్రిటేషన్; లాజికల్ రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థుల పరిశీలన నైపుణ్యం, నిర్దిష్ట అంశంలోని ‘క్లూ’ పాయింట్లను గుర్తించడం, నిర్దిష్ట డేటా నుంచి ముఖ్యాంశాలను గుర్తించే విశ్లేషణ వంటి నైపుణ్యాలను ప్రాక్టీస్ ద్వారా సొంతం చేసుకోవాలి.
  • పేపర్-2, 3లలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఎలక్టివ్స్ నుంచి పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ వాటికి నేపథ్యం తెలిస్తేనే సమాధానం ఇవ్వగలిగేలా ఉంటాయి. కాబట్టి సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో చదవాలి.
  • ప్రతి అంశాన్ని బేసిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
  • సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్ట్‌ల అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వారానికో చాప్టర్ పూర్తి చేసుకునే విధంగా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి.
  • గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం చాలా అవసరం.
  • మాక్ టెస్ట్‌లు రాయడం కూడా లాభిస్తుంది. ఈ మాక్ టెస్ట్‌లను కూడా పరీక్షలో లభించే నిడివిలోనే పూర్తిచేయాలి.
  • పేపర్-2, 3లలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అయితే ఈ విషయంలో ఆందోళన చెందడం కంటే శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి.
  • నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ముందుగా సమాధానాలు బాగా తెలిసిన ప్రశ్నలన్నిటినీ పూర్తిచేసి; సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్ టెక్నిక్ ఆధారంగా గుర్తించాలి.


యూజీసీ నెట్ - జూన్ 2015 అర్హతలు

  • అభ్యర్థులు హ్యుమానిటీస్; సోషల్ సైన్స్, మేనేజ్‌మెంట్, సైన్స్ విభాగాల్లో మొత్తం 85 సబ్జెక్ట్‌లలో నిర్వహించే నెట్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి పీజీ స్థాయిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది.
  • ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
    వయో పరిమితి: జూన్ 1, 2015 నాటికి 28 సంవత్సరాలు. ఓబీసీ (నాన్ - క్రీమీలేయర్), ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యుడీ తదితర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ ఔత్సాహిక అభ్యర్థులకు వయో పరిమితి లేదు.


దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం www.cbsenet.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేసి కేటాయించిన అప్లికేషన్ నెంబర్ ఆధారంగా లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫోటో అప్‌లోడ్ చేయాలి. నిర్దేశిత ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించొచ్చు. మూడు బ్యాంకుల్లో (సిండికేట్ బ్యాంక్/ ఐసీఐసీఐ బ్యాంకు/ కెనరా బ్యాంకుల) నెట్ ఈ-చలాన్ పేమెంట్ సదుపాయం కల్పించారు. ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలనుకునే అభ్యర్థులు దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత బ్యాంకులో ఫీజును చెల్లించి వివరాలను మళ్లీ పొందుపర్చాలి.


యూజీసీ వెబ్‌సైట్‌లో సిలబస్
నెట్ నిర్వహించే సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సిలబస్ యూజీసీ వెబ్‌సైట్ www.ugc.ac.in లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు కచ్చితంగా ఈ సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ మేరకు ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించాలి.

యూజీసీ నెట్ జూన్ 2015 ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2015, ఏప్రిల్ 16.
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2015, మే 15.
  • ఈ-చలాన్/డెబిట్ కార్డ్/క్రెడిట్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 2015, మే 16.
  • పరీక్ష తేదీ: 2015, జూన్ 28.
  • అడ్మిషన్ కార్డ్ డౌన్‌లోడ్: జూన్ మొదటి వారం
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్.
    వెబ్‌సైట్: www.cbsenet.nic.in


యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు

  • నెట్ ఉత్తీర్ణతతో ప్రతిష్టాత్మక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందేందుకు అర్హత లభిస్తుంది.
  • నెలకు రూ. 25 వేల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకోవచ్చు.
  • ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణులకు రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ప్రాధాన్యం.


పీఎస్‌యూలకూ ప్రామాణికంగా నెట్ స్కోర్
యూజీసీ నెట్‌కు సంబంధించి తాజా మార్పు.. యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా పబ్లిక్ సెక్టార్ సంస్థలు నియామకాలు చేపట్టొచ్చనే నిర్ణయం. ఆయా పీఎస్‌యూల్లో ఆర్ అండ్ డీ, మేనేజ్‌మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో నియామకాలకు నెట్ ఉత్తీర్ణులను తీసుకునే అవకాశం కల్పిస్తూ యూజీసీ గత నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యూజీసీ నెట్ డిసెంబర్ 2014 మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులతో మేనేజ్‌మెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇదే బాటలో మరికొన్ని పీఎస్‌యూలు కూడా పయనించనున్నాయి.

విశ్లేషణ, పరిశీలన నైపుణ్యాలు అవసరం
యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణతకు ప్రధాన సాధనాలు.. విశ్లేషణ, పరిశీలన నైపుణ్యాలు. ముఖ్యంగా కంపల్సరీ పేపర్స్‌గా అభ్యర్థుల ఎలక్టివ్ సబ్జెక్ట్స్‌లో ఈ నైపుణ్యాలు ఎంతో ఉపకరిస్తాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్ సమయంలో తులనాత్మక అధ్యయనం అవసరం. అప్పుడే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. యూజీసీ నెట్‌కు సంబంధించి ఇటీవల కాలంలో లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల(ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర)కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ స్థాయిలో అకడమిక్‌గా మంచి పట్టున్న అభ్యర్థులు ప్రస్తుత సమయంలో సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే మెరిట్ జాబితాలో చోటుసంపాదించొచ్చు. కేవలం రీడింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. తద్వారా తమ సామర్థ్యం తెలుసుకుని నైపుణ్యం పెంచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.

- ప్రొఫెసర్ ఎం.ఎ.అజీమ్, కో ఆర్డినేటర్, యూజీసీ నెట్ కోచింగ్ సెంటర్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ

Published date : 28 Aug 2021 12:30PM

Photo Stories