UAV సాంకేతికతకు టీ వర్క్స్ పట్టం
గాలిలో ఎగిరే మానవరహిత విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తదితరాల (యూఏవీ) సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంప్రదాయ యూఏవీ సాంకేతికత హద్దులను చెరిపివేస్తూ తక్కువ వ్యయమయ్యే సాంకేతికతపై ఇక్కడ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరగనున్నాయి. ఇక్కడ అభివృద్ధి చేసే డిజైన్లు, సాంకేతికతను ఇతరులతో పంచుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో త్వరిత గతిన యూఏవీలను నిర్మించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. రాయదుర్గంలో రెండేళ్ల క్రితం ‘టీ వర్క్స్’ భవనానికి శంకుస్థాపన జరగ్గా సుమారు రూ.100 కోట్ల వ్యయంతో 78వేల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన టీహబ్ రెండో దశ భవనం ఆవరణలోనే టీ వర్క్స్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటుండం విశేషం. టీ హబ్ కొత్త ఆవిష్కరణలకు పురుడు పోయనుండగా, టీ వర్క్స్ కొత్త డిజైన్లు, సాంకేతికతకు బాటలు వేస్తుందని అధికారులు చెప్తున్నారు.
Also read: Most Powerful Missiles: హైపర్ సోనిక్ మిసైల్ కింజల్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
ప్రొటోటైప్ సెంటర్‌లో అత్యాధునిక వసతులు
దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ సెంటర్‌గా పేర్కొంటున్న టీ వర్క్స్‌లో అత్యాధునిక పరికరాలు, వసతులు అందుబాటులోకి రానున్నాయి. యంత్ర తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వర్క్ స్టేషన్లు, ఫినిష్ షాప్‌లు, లేజర్ కటింగ్, పీసీబీ ఫ్యాబ్రికేషన్, మెటల్ షాప్, వెల్డ్ షాప్, వుడ్ వర్కింగ్ వంటి అనేక వసతులు, వాటికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉంటాయి. వివిధ రంగాల్లో కొత్త ప్రయోగాలు చేసే తయారీదారులు, ఆవిష్కర్తలతోపాటు ఇంజనీర్లు, డిజైనర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, వలంటీర్లు, సంబంధిత రంగాలకు చెందిన వారు ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం వహిస్తారు. ప్రోటోటైప్ (నమూనాల) నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన నైపుణ్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. టీ వర్క్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు.
Also read: Climate Change: మన పాపం! ప్రకృతి శాపం!!