Skip to main content

జూన్ 2019 రాష్ట్రీయం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం
Current Affairs తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ‘కాళేళ్వరం బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం’ ఫ్రారంభమైంది. తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జూన్ 21న లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యఅతిథిలుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు.
తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. తదనంతరం సీఎం కేసీఆర్ రిబ్బన్ కత్తిరించి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేసీఆర్ స్విచాన్ చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని ఆరో నంబర్ మోటార్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అమల్లోకి వచ్చినట్లయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్రారంభం-అంశాలు
  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద శృంగేరీ పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం జరిగింది
  • మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితులు పూజలు నిర్వహించారు
  • ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను మంత్రి మహమూద్ అలీ, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌లను మంత్రి కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.
  • మేడిగడ్డ బ్యారేజికి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ-మహారాష్ట్రల మధ్య నిర్మించిన వంతెనను కూడా కేసీఆర్ ప్రారంభించారు.
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఎల్ అండ్ టీ సంస్థలు పాలుపంచుకున్నాయి.
ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేళ్వరం బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : మేడిగడ్డ బ్యారేజీ-కన్నెపల్లి పంప్‌హౌస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ

ఏపీలో విద్యారంగ సంస్కరణలకు కమిటీ
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సంస్కరణలకు 12మందితో కూడిన నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ 4 నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో వసూలు చేస్తున్న ఫీజులను పరిశీలించి వాటి నియంత్రణకు ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ప్రైవేట్ సంస్థల్లోని విద్యా ప్రమాణాలు, పరిస్థితులను కమిటీ పరిశీలించి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు వీలైన సూచనలు చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీ
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సంస్కరణలకు

ఏపీలో జూలై 8వ తేదీన రైతు దినోత్సవం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జూలై 8ని ఏటా రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమరావతిలోని ప్రజావేదికలో జూన్ 24న నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా జూలై 8 న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

విహారి బుక్-2019 ఆవిష్కరణ
భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాల గురించి లోతైన సమాచారం అందించే విహారి బుక్-2019ను తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో జూన్ 24న జరిగిన ఈ కార్యక్రమంలో వెంక టేశం మాట్లాడుతూ... పర్యాటకులు ఎక్కడికి, ఎలా వెళ్లాలనే ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఇందులోని సమాచారం ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో వాతావరణం, చూడదగిన ప్రదేశాల వివరాలన్నీ ఇందులో ఉంటాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విహారి బుక్-2019 ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం
ఎక్కడ : హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2 లక్షల 49వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,49,435 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో జూన్ 25న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2015 మార్చి నాటికి రూ.1,48,743 కోట్లున్న అప్పు 67 శాతం పెరుగుదలతో 2018-19 బడ్జెట్ అంచనాల నాటికి రూ.2,49,435 కోట్లకు చేరిందని నిర్మలా పేర్కొన్నారు. ఇందులో రెండు రాష్ట్రాల మధ్య విభజించని అప్పు రూ.23,438 కోట్లు కూడా కలిసి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు ద్రవ్య బాధ్యత, విత్త నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిని మించి 2016-17లో ఉదయ్ స్కీమ్ ద్వారా రూ.8,256 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు కేంద్రమంత్రి నిర్మలా తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 కింద మూడేళ్లలో ఏపీకి రూ.7,891 కోట్ల నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పు రూ.2,49,435 కోట్లు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

తెలంగాణ ప్రభుత్వ అప్పు లక్షా 80వేల కోట్లు
2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.1,80,239 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో జూన్ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ అప్పు గత ఐదేళ్లలో 159 శాతం పెరిగిందని నిర్మలా చెప్పారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ అప్పు రూ. 69,517 కోట్లుగా ఉంది.
తెలంగాణ అప్పులు, వడ్డీల వివరాలు(రూ. కోట్లలో)

ఆర్థిక సంవత్సరం

2014-15

2015-16

2016-17

2017-18

2018-19

మొత్తం రుణభారం

79,880

97,992

1,34,738

1,51,133

1,80,239

వడ్డీల చెల్లింపు

5,593

7,942

8,609

11,139

11,691

క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాన ప్రభుత్వం అప్పు రూ.1,80,239 కోట్లు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కోస్టల్ సర్క్యూట్‌లో 75 శాతం పనులు పూర్తి
నెల్లూరు జిల్లాలో కోస్టల్ సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో 75 శాతం అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద 2015-16లో రూ.59.70 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కింద నెల్లూరు, పులికాట్ సరస్సు, ఉబ్లమడుగు జలపాతం, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, కొత్త కోడూరు బీచ్, మైపాడు బీచ్, రామతీర్థం, ఇస్కపల్లిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోస్టల్ సర్క్యూట్‌లో 75 శాతం పనులు పూర్తి
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
ఎక్కడ : నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదే శ్

హైదరాబాద్‌లో హోగర్ కంట్రోల్స్ తయారీ
అమెరికాకు చెందిన స్మార్ట్‌హోమ్, బిల్డింగ్ ఆటోమేషన్ కంపెనీ హోగర్ కంట్రోల్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తయారీ యూనిట్, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని కోసం దేశీయ అనుబంధ సంస్థ అయిన హోగర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జూన్ 26న వెల్లడించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. హోమ్ ఆటోమేషన్‌కు అవసరమైన 11 రకాల ఉత్పత్తులను ఈ కేంద్రంలో, ఏటా 6 లక్షల యూనిట్ల మేర తయారు చేయవచ్చని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హోగర్ కంట్రోల్స్ తయారీ యూనిట్, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 26
ఎక్కడ : ఉప్పల్, హైదరాబాద్

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
Current Affairs ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరుతో 30 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, ఒక్కరే నామినేషన్ వేసినందున సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు జూన్ 13న ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా ఎన్నియ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : తమ్మినేని సీతారాం

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు కేసీఆర్ ఆహ్వానం
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూన్ 14న ముంబై వెళ్లిన కేసీఆర్ వారిని ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వద జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు కేసీఆర్ ఆహ్వానం
ఎప్పుడు : జూన్ 14
ఎందుకు : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని

ఏపీ చట్టసభల సమావేశంలో గవర్నర్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జూన్ 14న ప్రసంగించారు. పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడం.. నవరత్నాల సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుని ఇంటికి చేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఈ సందర్భంగా గవర్నర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం, వెలిగొండతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న అంశాలు, ఇతర హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం-అంశాలు
  • రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
  • రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు ఉచితంగా బోర్లు వేయిస్తుంది.
  • వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించనుంది.
  • రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు.
  • సహకార డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తుంది.
  • ఏదేని కారణంవల్ల రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్ బీమా పథకం కింద రూ.7 లక్షలు అందిస్తుంది.
  • ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబానికి రూ. వెయి్యకి మించిన వైద్యం అవసరమైతే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం. ఈ పథకం కింద ప్రస్తుతమున్న 1095 వ్యాధులకు మరో 936 చేరుస్తాం.
  • దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే రోగలకు ప్రత్యేక సాయంగా నెలకు రూ.10 వేల పింఛను.
  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీని సమర్థంగా అమలుపర్చడంతోపాటు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక.
  • గ్రామ ఆరోగ్య కార్యకర్తల నెలసరి గౌరవ వేతనాన్ని రూ.3,000 నుంచి రూ. 10,000కు పెంపు.
  • దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మొదటి దశలో బెల్ట్‌షాపులను మూసివేతకు నిర్ణయం.
  • పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ.15,000లు చెల్లింపు.
  • సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడంతోపాటు ప్రతి విద్యార్థికి వసతి కోసం ఏటా రూ. 20,000 మంజూరు
  • ‘వైఎస్సార్ చేయూత’ కింద రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో మహిళల ఆర్థిక ప్రగతి కోసం 45-60 ఏళ్ల మధ్య వయసుగల వారికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 చెల్లింపు.
  • ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బలహీన వర్గాల నూతన వధువులకు వివాహ సమయంలో రూ. లక్ష ప్రోత్సాహకంగా అందిస్తాం.
  • ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాజకీయపరంగా నియమించే డెరైక్టర్లు, చైర్మన్లు, పాలక మండళ్లు తదితర నియామకాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం.
  • కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రణాళిక రూపొందించాం. అలాగే, ఆర్య వైశ్యులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిపట్ల తగు శ్రద్ధ చూపుతాం.
  • సామాజిక పింఛన్‌ను దశల వారీగా రూ.3,000కు పెంచుతామన్న హామీ మేరకు వైఎస్సార్ భరోసా పింఛను రూ.2,250కి పెంచాం. నాలుగేళ్లలో దీనిని రూ.3,000కు తీసుకెళ్తాం. అలాగే, పింఛనుకు అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. దీనివల్ల 5 లక్షల మందికి అదనంగా ప్రయోజనం కలిగింది.
  • 2020 ఉగాది నుంచి 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అలాగే, వచ్చే నాలుగేళ్లపాటు ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీ ఏర్పాటు చేశాం.
  • పురపాలక పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.12,000 నుంచి రూ. 18,000కు పెంచాం.
  • ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం జూలై నుంచి చెల్లిస్తాం.
  • గిరిజన సంక్షేమ శాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.400 నుంచి రూ.4,000కు పెంచాం. అంగన్‌వాడీలు, హోంగార్డులకు వేతనాలు పెంచాం.
  • అక్రమ మైనింగ్, అవినీతి నిరోధానికి కొత్త ఇసుక విధానం తెస్తాం.

రాజన్న బడిబాటలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జూన్ 14న నిర్వహించిన ‘రాజన్న బడిబాట’లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యాశాఖ చేపట్టిన సామూహిక అక్షరాభ్యాసం సందర్భంగా చిన్నారుల చేత సీఎం అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో చదువుల విప్లవం తెస్తామన్నారు. పిల్లలను బడికి పంపించే తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించారు. విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌ను జగన్ విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘రాజన్న బడిబాట’లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎప్పుడు : జూన్ 14
ఎక్కడ : జడ్పీ ఉన్నత పాఠశాల, పెనుమాక, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 031 వ్యాధులు
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి 2,031 వ్యాధులకు చికిత్స అందించనున్నారు. జూన్ 14న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్న వ్యాధుల జాబితాలోకి మరో 936 జబ్బులను చేర్చుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో 1,095 వ్యాధులు మాత్రమే ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 031 వ్యాధులు
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులు విజయవాడలో జూన్ 17న చర్చలు జరిపారు. విభజన నేపథ్యంలో ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 9, 10వ షెడ్యూళ్లలోని 142 సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం దగ్గర నుంచి గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవటం వరకూ పలు అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ఈ భేటీ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను, కేసీఆర్ ఆహ్వానించారు.
ముఖ్యమంత్రుల చర్చలోని అంశాలు..
  • ఏపీ, తెలంగాణల మధ్య రవాణా సదుపాయాలు పెంచేందుకు చర్యలు తీసుకోవడం
  • జాతీయ రహదారుల సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరడం
  • కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను గవర్నర్ నేతృత్వంలో పరిష్కరించుకోవాలని నిర్ణయం
  • గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడం
  • విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య స్పీడ్ రైలు వేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా అమలు చేయలేదు. దాంతో పాటు మరిన్ని రైళ్లు వేయాలి. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
  • విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజన ప్రక్రియను నెలలోగా పూర్తి చేయడం
  • ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థల మధ్య సమస్యలపై సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకోవడం
  • విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ బకాయిల పరిష్కారం త్వరితగతిన చేసేందుకు నిర్ణయం
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్

ఏపీ శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం జూన్ 18న అధికారికంగా ప్రకటించారు. కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీశాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కోన రఘుపతి

ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 18న శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతోపాటు ఉపాధి అవకాశాలు లేక నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే కొంతైనా ఊరట లభిస్తుందని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా
రైతులకు పెట్టుబడిసాయం అందించేందకు ఉద్దేశించిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని 2019, అక్టోబర్ 15 నుంచి అమలుచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా జూన్ 18న ఆయన శాసనసభలో ఈ మేరకు మాట్లాడారు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున రైతులకు ఇస్తామని తెలిపారు. వచ్చే ఉగాది నాటికి 25,00,000 ఇళ్ల పట్టాలు జారీ చేస్తామన్నారు. అలాగే పలు పథకాల అమలు తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.

పథకం

అమలు తేదీ

27 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి

జూలై 1

గ్రామ వలంటీర్ల వ్యవస్థ

ఆగస్టు 15

ప్రభుత్వ పథకాల డోర్ డెలివరీ

సెప్టెంబర్ 1

గ్రామ సచివాలయ వ్యవస్థ

అక్టోబర్ 2

అమ్మఒడి(రూ.15000)

జనవరి 26

క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు

ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లకు సీఎం ఆమోదముద్ర
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర
ఎవరు: ముఖ్యమంత్రి కేసీఆర్
ఎందుకు: మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు.

కాళేశ్వరం నిర్మాణంలో ఎంఈఐఎల్’ రికార్డు!
ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనతి కాలంలో పూర్తి చేయడంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్ణీత గడువుకు ముందే పంప్‌హౌజ్‌లు, విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి జూన్ 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో గోదావరి నీటి ఎత్తిపోతలకు మార్గం సుగమం చేసింది. ముఖ్యంగా లింక్-1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్- 2లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8లను రెండేళ్లలోనే సిద్ధం చేసి మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు నీటి తరలింపు ప్రక్రియకు రాచమార్గం పరిచింది.
ప్రపంచంలోనే తొలిసారి...
కాళేశ్వరం ద్వారా రోజూ గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో 17 కేంద్రాల నిర్మాణాలను మేఘా చేపట్టింది. ఇందులో మొత్తం 120 మెషీన్‌లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు ఉంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్‌లను మేఘానే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లను, ప్యాకేజీ-8 పనులను పూర్తి చేసి పాక్షికంగా నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కాళేశ్వరం నిర్మాణంలో ‘ఎంఈఐఎల్’ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఎప్పుడు: జూన్ 21న
ఎవరు: మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)

అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
Current Affairs ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఉద్దేశించిన ‘వెఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని 2019, అక్టోబర్ 15 నుంచి అమలుచేయన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జూన్ 6న నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది.
ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలు...
  • కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా సాయం, 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డు
  • ప్రభుత్వమే రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏర్పాటు
  • రూ. 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • విపత్తులు ఎదుర్కోవడానికి రూ. 4 వేల కోట్లతో నిధి
  • రేషన్ బియ్యంతో పాటుమరో 6 రకాల వస్తువులు పంపిణీ
  • వ్యవసాయం దశ, దిశ నిర్దేశానికి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగి, ఒక వేర్ హౌస్, అవసరం మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
  • రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లోనే సమగ్ర బిల్లు తీసుకువచ్చి విత్తన చట్టం రూపకల్పన
  • రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందేలా చర్యలు
  • వ్యవసాయ సంక్షోభంలో చిక్కి ఎవరైనా రైతు కన్నుమూస్తే రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లింపు
  • సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయల బోనస్చెల్లింపు.
  • అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయరంగ అవసరాలకు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి.
  • చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకంరద్దు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు

ఏపీలో సీబీఐకి సమ్మతి పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ(ఏసీబీ) పునరాగమనానికి సాధారణ సమ్మతిని(జనరల్ కన్సెంట్) పునరుద్ధరిస్తూ జూన్ 7న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ 2018 నవంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 176ను జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.176ను రద్దు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నం.81ని జారీ చేసింది.
ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీబీఐకి సమ్మతి పునరుద్ధరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనానికి ఆమోదం
తెలంగాణలో కాంగ్రెస్ శాసన సభాపక్షాన్ని అధికార టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల వినతికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని ధ్రువీకరిస్తూ శాసనసభ కార్యదర్శి జూన్ 6న బులెటిన్ విడుదల చేశారు. దీంతో శాసనసభలో కాంగ్రెస్ విపక్ష హోదా కోల్పోయింది. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చే యడంతో తెరాస బలం 103కు (నామినేటెడ్ సభ్యునితో కలిపి)పెరిగింది. కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యులు మిగిలారు. దీంతో 7గురు సభ్యులు కలిగిన మజ్లిస్ పార్టీ తెరాస తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మరోవైపు హూజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి జూన్ 6న రాజీనామా చే శారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఎంపీగా ఆయన గెలుపొందారు. నిబంధనల మేరకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనానికి ఆమోదం
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధం :సీఎస్ జోషి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గిగా స్కేల్ లి-అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. తెలంగాణలో ఈ పరిశ్రమ స్థాపనకు అన్నివిధాలా అనుకూలంగా, అవసరమైన 200 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఐదు గిగావాట్ల బ్యాటరీ తయారీ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. 2023 నాటికి త్రిచక్ర, 2025నాటికి ద్విచక్ర వాహనాలను ఎలక్టిక్‌గ్రా మార్చడానికిగాను బ్యాటరీ పరిశ్రమలను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. వీటి ఎంపిక కోసం నీతిఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్‌కాంత్ అధ్యక్షతన వివిధ శాఖలతో కూడిన అంతర మంత్రిత్వ శాఖల నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల ఎంపిక అంశంపై జూన్ 7న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి
ఎక్కడ : తెలంగాణ

ఏపీ ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాతప్రొటెం స్పీకర్ పదవీకాలం ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడిలోని రాష్ట్రసచివాలయ ప్రాంగణంలో జూన్ 8న జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మొత్తం 25 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. అనంతరం వీరందరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. మంత్రులు ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది.
మంత్రులకు కేటాయించిన శాఖలు
  1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాలు
  2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
  3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
  4. అవంతి శ్రీనివాస్- టూరిజం
  5. కురసాల కన్నబాబు- వ్యవసాయం
  6. పిల్లి సుభాష్‌చంద్రబోస్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
  7. పినిపే విశ్వపరూప్- సాంఘిక సంక్షేమం
  8. ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
  9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
  10. తానేటి వనిత- మహిళా సంక్షేమం
  11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
  12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ
  13. వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ
  14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ
  15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్
  16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
  17. ఆదిమూలపు సురేశ్- విద్యా శాఖ
  18. అనిల్‌కుమార్ యాదవ్- ఇరిగేషన్
  19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
  20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
  21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
  22. బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
  23. గుమ్మునూరు జయరామ్- కార్మిక, ఉపాధి శిక్షణ
  24. షేక్ అంజాద్ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
  25. మాలగుండ్ల శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం
తెలంగాణలో ఆపద్బంధు పొడిగింపు
తెలంగాణలో బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ‘ఆపద్బంధు’పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం 2018, నవంబర్ ఒకటో తేదీతో ముగిసింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని 2019, నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బంధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆపద్బంధు పథకం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంటు
ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు తయారీ సంస్థ అల్ట్రాటెక్ భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి జూన్ 10న ఆమోదం లభించింది. కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద ఏర్పాటుచేయనున్న ఈ ప్లాంటు కోసం అల్ట్రాటెక్ సుమారు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయి. అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అల్ట్రాటెక్ భారీ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : అల్ట్రాటెక్ సిమెంట్
ఎక్కడ : పెట్నికోట, కర్నూలు, ఆంధ్రప్రదేశ్

ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తన మంత్రివర్గ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 10న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు...
  • కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దు
  • ఉద్యోగులందరికీ 27శాతం మధ్యంతర భృతికి ఆమోదం
  • అంగన్‌వాడీలు, ఆయాలు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు
  • బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికోసారి రూ.15వేలు అందించే ‘అమ్మ ఒడి’ని జనవరి 26నుంచి అమలుకు నిర్ణయం
  • రెతు యూనిట్‌గా ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే ప్రతిపాదన కు ఆమోదం
  • 2014 నుంచి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ రూ.2వేల కోట్లు తక్షణమే విడుదల
  • ముఖ్యమంత్రి నేతృత్వంలో రైతు కమిషన్ ఏర్పాటు
  • రైతులకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందజేత
  • అగ్రిగోల్డు బాధితులకు చెల్లించేందుకు రూ.1150 కోట్లను న్యాయస్థానంలో జమకు నిర్ణయం
  • ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
  • వైఎస్‌ఆర్ పేరిట నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం
  • ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానాన్ని నిలిపివే త
  • విద్యుత్ ఒప్పందాల పున:సమీక్షించకు ఆమోదం
  • రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి
  • ఒక్కో రైతుకు 5 జీవాలు, 5 పశువులకు ఉచిత బీమా
  • పంటరుణాలకు వైఎస్‌ఆర్ వడ్డీలేని రుణాల పథకం
  • రైతులకు ఉచిత బోర్ల తవ్వకం కోసం 200 రిగ్‌ల కొనుగోలు
  • రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం
  • గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో రిసోర్సుపర్సను, యానిమేటర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం
  • అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.11,500కు, అంగన్‌వాడీ ఆయాల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు
  • హోంగార్డులకు తెలంగాణలో చెల్లిస్తున్న వేతనం కంటే రూ.వెయి్య ఎక్కువ ఇవ్వాలని నిర్ణయం
  • అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇచ్చే అంశంపై ఆయా శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు
  • ఆశావర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
  • ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద, మధ్య తరగతి వారికి తప్పనిసరి
  • దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి మంత్రివర్గ ఉపసంఘం
  • వైఎస్‌ఆర్ పేరిట నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం
  • ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ
  • సరిగ్గా లేని 108, 104 వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాలని నిర్ణయం
  • గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్నిరకాల నామినేటెడ్ కమిటీలను రద్దు.

ఏపీ సీఎం కార్యాలయ అధికారుల శాఖలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు శాఖలు కేటాయించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారులు అందరికీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ఈ కేటాయింపులు చేశారు.
అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు:
సాధారణ పరిపాలన, హోంశాఖ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ, శాంతిభద్రతల అంశాలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యకలాపాలు.
పీవీ రమేష్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ:
వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యాశాఖ(పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు,వాణిజ్యం, మౌళిక వసతులు, పెట్టుబడులు,ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, ఇన్‌ఫ్రా, ఇంధన శాఖ.
సొల్మన్ ఆరోక్య రాజ్, సీఎం కార్యదర్శి:
ట్రాన్స్ పోర్ట్ రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార,పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, అన్ని సంక్షేమ శాఖలు, యువజన వ్యవహారాలు, క్రీడలు.
కె.ధనుంజయరెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి: నీటి వనరులు, పర్యావరణం, అటవీ,సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ, వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం.
జె.మురళి, సీఎం అదనపు కార్యదర్శి: పశుసంవర్థక, పాడి పరిశ్రమ,మత్స్యశాఖ, సహకారం, సంస్కృతి.
డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్య శ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్), విజ్ఞాపనలు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తులు).
పి.కృష్ణమోహన్‌రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ): ముఖ్యమంత్రికి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అపాయింట్‌మెంట్స్, విజిటర్స్ అపాయింట్‌మెంట్స్.

ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. అలాగే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా జూన్ 12న ఉత్తర్వులు జారీచేశారు. రాయచోటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికయ్యారు.
అలాగే అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా మాడుగుల ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ నియామకం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : గడికోట శ్రీకాంత్‌రెడ్డి

ఏపీలో కొలువుదీరిన 15వ శాసనసభ
ఆంధ్రప్రదేశ్‌లో 15వ శాసనసభ కొలువుదీరింది. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంతో 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. తాజాగా ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌తో కలిపి 174 మంది సభకు హాజరయ్యారు. వీరిలో 173 మంది ఎమ్మేల్యేలుగా ప్రమాణం చేశారు. శంబంగి చిన్న వెంకట అప్పల నాయుడు జూన్ 8వ తేదీన గవర్నరు ఎదుట ఎమ్మెల్యేగా, ప్రొటెం స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.

జూన్ 21న కాళేశ్వరం పథకం ప్రారంభం
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 2019, జూన్ 21న ప్రారంభంకానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలకనుంది. తెలంగాణ భూ భాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. గోదావరిలో వరద ఉండే దినాలను బట్టి కనిష్టంగా 150 టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.50 వేల కోట్ల మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది.
కాళేశ్వరం పథకానికి 2016, మే 2న కన్నెపల్లి వద్ద ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు ఇప్పటికే పూర్తవగా, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు గానూ 8 మోటార్లు సిద్ధమయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యాంశాలు..
  • ప్రాజెక్టు మొత్తం అంచ‌నా వ్యయం: రూ.80,499 కోట్లు.
  • నీటిని సరఫరా చేసే మార్గం పొడవు: 1832 కి.మీ.
  • వాలు కాలువ పొడవు: 1531 కి.మీ.
  • వాలు టన్నెల్ పొడవు: 203 కి.మీ.
  • ప్రెషర్ పైపు లైన్ పొడవు: 98 కి.మీ.
  • లిఫ్టులు: 20
  • పంపు హౌస్‌లు: 19
  • అవసరమయ్యే విద్యుత్: 4,992.47 మెగావాట్లు
  • జలాశయాలు: 19
  • జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీ
ప్రాజెక్టులో నీటి లభ్యత (టీఎంసీల్లో)
  • గోదావరి నీరు: 180
  • ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు: 20
  • ఎల్లంపల్లి వద్ద మొత్తం నీటి లభ్యత: 200
  • చెరువుల పరివాహక ప్రాంత నీటి లభ్యత: 10
  • ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల రీచార్జ్: 25
  • ఆవిరి నష్టాలు: 10
  • ప్రాజెక్టు వినియోగానికి నికరంగా నీటి లభ్యత: 225
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపాదిత జలాశయాలు

బ్యారేజీ/రిజర్వాయర్

సామర్ధ్యం (టీఎంసీల్లో)

మేడిగడ్డ

16.17

అన్నారం

10.87

సుందిళ్ల

8.83

మేడారం

0.78

అనంతగిరి

3.50

రంగనాయక సాగార్

3.00

మల్లన్న సాగర్

50.00

మలక్‌పేట

3.00

కొండ పోచమ్మ సాగర్

15.00

గంధమల్ల

9.87

బస్వాపురం

11.39

భూంపల్లి

0.09

కొండెం చెరువు

3.50

తిమ్మక్కపల్లి

1.50

దంతెపల్లి

1.00

ధర్మారావు పేట

0.50

ముద్దిజివాడి

0.50

కాటేవాడి

0.50

మోతె

1.00

మొత్తం

141.00


ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం
Current Affairs ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు యెడుగూరి సందింటి జగన్‌మోహన్‌రెడ్డి (వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి) మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్‌తో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక పత్రాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చదివి వినిపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే అధ్యక్షుడ స్టాలిన్ పాల్గొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ వృద్ధ్యాప్య పెన్షన్‌ను నెలకు రూ.2,250లకు పెంచే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలను వెఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అలాగే 25 లోక్‌సభ స్థానాలకు 22 స్థానాల్లో విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మే 30
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

గోదావరి-కృష్ణా-పెన్నా పనులు నిలుపుదల
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మే 31న ఆదేశాలిచ్చింది. నదుల అనుసంధాన పనులకు పర్యావరణ అనుమతులు లేవని, ఆ అనుమతులు వచ్చేవరకూ ఎటువంటి పనులూ చేపట్టకూడదంటూ పేర్కొంది. ఈ నదుల అనుసంధానానికి గత ఏపీ ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పనులు నిలుపుదల
ఎప్పుడు : మే 31
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
ఎందుకు : పర్యావరణ అనుమతులు లేని కారణంగా

ఏపీలో మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి ై‘వెఎస్‌ఆర్ అక్షయపాత్ర’గా నామకరణం చేస్తున్నట్లు మే 31 రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.1000 గౌరవవేతనాన్ని రూ.3వేలకు పెంచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 44వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో 30లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మధ్యాహ్న భోజన పథకం పేరు ‘వెఎస్‌ఆర్ అక్షయపాత్ర’గా మార్పు
ఎప్పుడు : మే 31
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా నవీన్
తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా కె.నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, మే 31 నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి వి.నర్సింహాచార్యులు ప్రకటించారు. నవీన్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఎన్నిక
ఎప్పుడు : మే 31
ఎవరు : కె.నవీన్‌రావు

తెలంగాణలో రైతుబంధు సాయం పెంపు
రైతుబంధు పథకం కింద చేసే పెట్టుబడి సాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జూన్ 1న విడుదల చేశారు. రైతుబంధు పథకం ద్వారాగత ఖరీఫ్, రబీల్లో రైతులకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆర్‌బీఐకి చెందిన ఈ-కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టాదారు భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో రైతుబంధు సాయం పెంపు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 2న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జూలై నెలాఖరు నాటికి నిత్యం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ గత ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించిందని పేర్కొన్నారు.
మరోవైపు పేద వర్గాలకు చేయూతగా ఉన్న పింఛన్లను రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.. అలాగే వికలాంగుల పింఛన్‌ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నామని, వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నామని చెప్పారు. కొత్త పింఛన్లు జూలై 1 నుంచి అందుతాయని వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏటా సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదిక అవుతుండగా ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో ఈసారి వేదికను పబ్లిక్ గార్డెన్స్ కు మార్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు రద్దు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ విప్ హోదాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో సీఎం పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేసిన విషయం విదితమే. సీఎం రాజీనామా చేస్తే మంత్రి మండలితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలు కూడా రద్దవుతాయి. ఇదే ప్రకారం శాసనసభలో చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ విప్‌లు చింతమనేని, కూన రవికుమార్, యామినీ బాల, పీజీవీఆర్ నాయుడు, అత్తర్ చాంద్ బాషా, మండలిలో చీఫ్ విప్ పయ్యావుల, విప్‌లు డొక్కా, బుద్దా పదవులు కోల్పోయారు. ఈమేరకు జీవో జారీ కావాల్సి ఉన్నందున ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరి హోదాలు మే25 నుంచి రద్దయినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం జూన్ 3న ఉత్తర్వులిచ్చారు.

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మారుస్తున్నట్లు జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మార్పు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో ఇండియన్ ఓషన్ సదస్సు
హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో జూన్ 9 నుంచి 21 వరకు ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ 23వ సదస్సుని నిర్వహించనుంది. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సులో ట్యూనా జాతి చేపల సంతతి పెంపొందించడం, వాటి సంరక్షణ, ట్యూన్ మాంసం ఉత్పత్తిని విస్తృతం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. 33 దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సు తొలిసారిగా భారత్‌లో జరుగుతుందని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ 23వ సదస్సు
ఎప్పుడు : జూన్ 9 నుంచి 21 వరకు
ఎవరు : జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 18 Jun 2019 04:02PM

Photo Stories