డిసెంబర్ 2020 రాష్ట్రీయం
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో అపాచీ ఇంటెలిజెంట్ సెజ్ లెదర్ పరిశ్రమ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడారు.
సీఎం ప్రసంగం...
- పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఏపీలో సంస్కరణల అమలు పట్ల పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామిక వేత్తలు వంద శాతం సంతృప్తిగా ఉన్నారు. భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
- తైవాన్‌కు చెందిన అపాచీ అదిదాస్ సంస్థ చైనా, వియత్నాంతోపాటు దేశంలోని ఏపీలో పెట్టుబడులు పెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అపాచీ ఇంటెలిజెంట్ సెజ్ లెదర్ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
30.75 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఉద్దేశించిన ‘‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌లో డిసెంబర్ 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించి, పేదలకు నిర్మించి ఇచ్చే ఇంటి మోడల్‌ను సందర్శించారు. అనంతరం పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
పథకం-ముఖ్యాంశాలు
- 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కోటి 24 లక్షల మందికి మేలు చేకూరుతుంది.
- పథకం కింద రూ.50,940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తారు.
- పథకం తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి డిసెంబర్ 25నే శ్రీకారం చుట్టారు. వీటి విలువ రూ.28 వేల కోట్లు.
- రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం 2021 ఏడాది మొదలవుతుంది.
- దారిద్య్రరేఖకు దిగువనున్న ఇల్లులేని పేద కుటుంబాలన్నింటికీ నివాస స్థల పట్టాలు పంపిణీ చేస్తారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌లోని ఒక్కో ప్లాటు మార్కెట్ విలువ ఇప్పుడు రూ.4 లక్షలు.
- రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి.
- జగనన్న కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు కల్పించబోతున్నాం. వాటికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.
- మొత్తం 68,361 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. వాటి మార్కెట్ విలువ అక్షరాలా రూ.25,530 కోట్లు.
- పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర వరకు, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా 1.5 సెంట్ల భూమి ఇస్తున్నాం.
- కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటిస్తాం.
- 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు (ఫ్లాట్లు) కూడా సేల్ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కొమరగిరి, యు.కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా
ఎందుకు : 30.75 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు
ఆంధ్రప్రదేశ్ కార్ల్‌లో ఇర్మా సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఇర్మా) సంస్థను ఏపీ కార్ల్ (ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక, ఆధునిక పరిశోధన సంస్థ - ఏపీ సీఏఆర్‌ఎల్) వద్ద ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పట్టణ సమీపంలోని ఏపీ కార్ల్ వద్ద ఇర్మా సంస్థ ఏర్పాటుకు... ఏపీ ప్రభుత్వం, ఇర్మా సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.
ఒప్పదం ప్రకారం... గుజరాత్‌కి చెందిన విద్యా సంస్థ ఇర్మా గ్రామీణ మహిళా సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇస్తుంది. ఇర్మాలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి సర్టిఫికెట్ కోర్సులు, రెండవ సంవత్సరం నుంచి డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఇర్మా) సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏపీ కార్ల్, పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా
ఎందుకు : గ్రామీణ మహిళా సాధికారత, గ్రామీణ యువతకు ఉపాధి సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు
రూ. 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో రూ.5,090 కోట్ల విలువైన 28 అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా... దాదాపు రూ.4,300 కోట్లతో కొత్తగా గండికోట, చిత్రావతి, పైడిపాలెం లిఫ్ట్‌తోపాటు పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
- గండికోట నుండి 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం జలాశయాలను నింపేందుకు నూతనంగా లిఫ్ట్ స్కీంల ఏర్పాటుకు రూ.3015 వేల కోట్ల వ్యయం చేయనున్నారు.
- పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ కుడికాలువ, జీకేఎల్‌ఐకి సంబంధించి 1.38 లక్షల ఎకరాల భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రూ.1256 కోట్లు ఖర్చు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా
దేశంలో ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలోని కోటపల్లి పంచాయతీ పరిధిలో ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఏర్పాటు అవుతోంది. 3.4 కిలోమీటర్లతో 219 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2017లో బెంగళూరుకు చెందిన ‘నిధి మార్క్ వన్ మోటార్స్’ సంస్థతో కోటపల్లి వద్ద ఫార్ములా-3 ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అయితే నిర్మాణ పనులు ఇటీవలే మొదలయ్యాయి.
దేశంలో మూడోది...
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వద్దనున్న ‘బుద్ద ఇంటర్నేషనల్ సర్క్యూట్’ ఫార్ములా-1కు సంబంధించిన ట్రాక్.
- తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని ఇడుంగట్టు కొటై్ట వద్ద 3.74 కిలోమీటర్ల ఫార్ములా-2 కార్ రేస్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.
- కోటపల్లి వద్ద నిర్మిస్తున్నది ఫార్ములా-3 (ఎఫ్-3). ఇది దేశంలో మూడోది కాగా, ఏపీలో మొదటిది.
ఫార్ములా 1 (ఎఫ్-1) గురించి...
- 1,000 హెచ్‌పీ (హార్స్ పవర్) ఇంజిన్ ఉంటుంది. రేస్‌లో వ్యత్యాసాలుంటాయి.
- ప్రపంచ ఛాంపియన్లను దృష్టిలో పెట్టుకొని ఈ కార్లను, ట్రాక్‌లను రూపొందిస్తారు. రేస్‌లో పాల్గొనే కార్లు వివిధ రకాల డిజైన్లతో ఉంటాయి.
- వారాంతంలో ఒకరోజు చొప్పున మూడు వారాలపాటు ఈ పోటీలు నిర్వహిస్తారు. గంటకు 1,000 కిలోమీటర్ల వేగం పరిమితి ఉంటుంది.
ఫార్ములా 2 (ఎఫ్-2) గురించి...
- ఫార్ములా 2 రేస్‌లో పాల్గొనే కార్లకు 500 హెచ్‌పీ ఇంజిన్ ఉంటుంది.
- కార్లు ఒకే డిజైన్ కలిగి ఉంటాయి. కార్ల రేస్ కూడా ఒకే రోజు మూడు గ్రూపులు విభజించి నిర్వహిస్తారు.
- గంటకు 500 కిలోమీటర్ల వేగం అనుమతి ఉంటుంది.
ఫార్ములా 3 (ఎఫ్-3) గురించి...
- ఫార్ములా 3 కార్లకు 250 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. ఇది బేసిక్ రేస్.
- కార్లు ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకే రోజు మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసి కార్ రేస్‌లు నిర్వహిస్తారు.
- ఇందులో కార్ల వేగం గంటకు 250కిలోమీటర్లకు పరిమితం.
- కార్ రేసింగ్‌తో పాటు కొత్త కార్ల పరీక్షా ప్రయోజనం కోసం ఇది ఉపయోగపడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : కోటపల్లి పంచాయతీ, తనకల్లు మండలం, కదిరి నియోజకవర్గం, అనంతపురం జిల్లా
హెక్సాగాన్ ఏఐ కేంద్రం ఏ భారతీయ నగరంలో ఏర్పాటైంది?
హెక్సాగాన్ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా (హెచ్‌సీసీఐ) దేశంలోనే తొలి హెక్సాఆర్ట్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కమ్యూనిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీఅండ్‌ఈసీ సెక్రటరీ జయేశ్ రంజన్ డిసెంబర్ 28న ప్రారంభించారు. ఏఐ, టెక్నాలజీ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఉంటుంది. రూ.64 లక్షల పెట్టుబడులతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెక్సాఆర్ట్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : హెక్సాగాన్ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా (హెచ్‌సీసీఐ)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : టెక్నాలజీ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు
స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ ప్రాజెక్ట్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్(ఎస్‌పీసీ) ప్రాజెక్ట్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది. రాష్ట్రంలోని 558 పాఠశాలల్లో 1,10,661 మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టులో ఉన్నారు. పోలీన్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - బీపీఆర్‌డీ) రూపొందించిన ‘డేటా ఆన్ పోలీన్ ఆర్గనైజేషన్స్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2020 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ సంస్థలకు సంబంధించిన వివరాలతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం... ఎస్‌పీసీ ప్రాజెక్ట్‌లో ఏపీ, ఉత్తరప్రదేశ్, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సీసీ కెమెరాల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్(ఎస్‌పీసీ) ప్రాజెక్ట్‌లో మొదటి స్థానలో ఉన్న రాష్ట్రం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
ఇటీవల ఆయుష్మాన్ భారత్‌లో పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం?
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఈ విషయం తెలిపారు. సమావేశంలో ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని ప్రధాని సమీక్షించారు.
ఆయుష్మాన్ భారత్...
దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018, సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద 1393 రకాలైన వ్యాధులకు చికిత్స అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని నిర్ణయం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు :తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడానికి
రైతులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో పురోగతి
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య డిసెంబర్ 30న జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. రెండు డిమాండ్ల అమలుకు ప్రభుత్వం అంగీకరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోం ప్రకాశ్... సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులైన 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు. తదుపరి 2021, జనవరి 4న జరగనున్నాయి.
రైతుల డిమాండ్లు - ప్రభుత్వ స్పందన
అంగీకారం కుదిరిన అంశాలు
1) కొత్త విద్యుత్ చట్టం: రాష్ట్రాలు రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ కొనసాగాలన్న రైతుల డిమాండ్‌కు అంగీకారం. సంబంధిత విద్యుత్ సవరణ బిల్లుపై వెనక్కు.
2) వాయు కాలుష్యం: దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ లో పంట వ్యర్థాలను దహనం చేస్తే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదన తొలగింపునకు ప్రభుత్వం అంగీకారం.
అంగీకారం కుదరని అంశాలు
1) నూతన వ్యవసాయ చట్టాల రద్దు: కుదరని ఏకాభిప్రాయం. చట్టాల రద్దుకు ప్రభుత్వం ససేమిరా. రైతుల అభ్యంతరాలపై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదన. తోసిపుచ్చిన రైతు నేతలు. జనవరి 4న మళ్లీ చర్చ.
2) ఎమ్మెస్పీకి చట్టబద్ధత: ఎమ్మెస్పీని సమర్ధవంతంగా అమలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం. ఎమ్మెస్పీపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వెల్లడి. తోసిపుచ్చిన రైతులు. ఎమ్మెస్పీ చట్టబద్ధత కోసం పట్టు. జనవరి 4న చర్చ.
తెలంగాణలో నిర్మించిన ఆరు జాతీయ రహదారులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఆరు జాతీయ రహదారులను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ డిసెంబర్ 21న ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే మరో 8 హైవేల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమంలో మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... భారత్‌మాలా పరియోజనలో భాగంగా తెలంగాణలో 1,730 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. గత ఆరేళ్లలో రూ. 17,617 కోట్లతో 1,918 కి.మీ. కొత్త జాతీయ రహదారులను తెలంగాణకు మంజూరు చేసినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆరు జాతీయ రహదారులు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : తెలంగాణ
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం ప్రారంభం
పొలం గట్ల తగాదాలు, భూ వివాదాల పరిష్కారం, ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశంలోనే అతి పెద్ద భూముల రీ సర్వే ప్రాజెక్టు ‘‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం’’ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు ముఖ్యమంత్రి హక్కు పత్రాలను అందజేశారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. పథకం ప్రారంభం సందర్భంగా జగ్గయ్య పేటలో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.
భూ రక్ష పథకం గురించి...
- దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.
- పథకంలో డిసెంబర్ 22న ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయి.
- తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది.
- తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది.
- రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు (ఇళ్లు, స్థలాలు) ప్రతి అంగుళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు.
- 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/ స్థలం కొలిచి సరిహద్దులు నిర్ణయిస్తారు. మ్యాపులు తయారు చేస్తారు.
- భూసర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
- ప్రజలపై పైసా కూడా భారం మోపకుండా మొత్తం సర్వే ఖర్చు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- మీ ఆస్తులకు మనందరి ప్రభుత్వం హామీగా ఉంటుందని భూ రక్ష పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందుకోసమే అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం - 2020ను ఆమోదించాం.
- 1920లో బ్రిటీష్ హయాం తరువాత ఇప్పటి వరకూ భూముల రీసర్వే జరగలేదు.
- 4,500 సర్వే బృందాలతో సర్వే చేసి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం యజమానులకు ఇస్తాం. మిల్లీమీటర్లతో సహా కొలిచి మ్యాపు కూడా ఇస్తాం.
- ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో విలేజ్ మ్యాప్ ఉంటుంది.
- ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా యూనిక్ ఐడీ నెంబర్ కేటాయిస్తాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తక్కెళ్లపాడు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా
ఎందుకు : పొలం గట్ల తగాదాలు, భూ వివాదాల పరిష్కారం, ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో
గ్రామీణ ప్రజల కోసం టీ కన్సల్ట్ యాప్‌ను రూపొందంచిన సంస్థ?
కరోనా సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన ‘టీ కన్సల్ట్’ యాప్‌నకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. ‘ఎక్సలెన్స్ ఇన్ రెస్పాన్స్ టు కోవిడ్ కేటగిరీ’ కింద ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో డిసెంబర్ 22న జరిగిన 69వ స్కోచ్ సదస్సులో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ఈ అవార్డును స్వీకరించారు. లాక్‌డౌన్ సమయంలో వైద్య సేవల కోసం గ్రామీణులు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవలు అందేలా ఈ యాప్‌ను రూపొందించారు.
ఆదర్శ్ విద్యా సరస్వతి రాష్ట్రీయ పురస్కార్ విజేత?
జగిత్యాల జిల్లా కోరుట్లలోని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లాకావత్ రాంసింగ్‌కు ప్రతిష్టాత్మక ‘ఆదర్శ్ విద్యా సరస్వతి రాష్ట్రీయ పురస్కార్ అవార్డు-2020’ లభించింది. ఈ అవార్డును గ్లోబల్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్, గ్లేసియర్ జర్నల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు ప్రధానం చేశారు.
బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డెరైక్టర్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, 672 మంది డెరైక్టర్లు డిసెంబర్ 17న ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇండో అమెరికన్‌కు కీలక పదవి...
వైట్‌హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఇండో అమెరికన్ వేదాంత్ పటేల్ను ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబెడైన్ ఎంపిక చేశారు. ప్రస్తుతం బెడైన్ ప్రమాణస్వీకారోత్సవ కమిటీ సీనియర్ ప్రతినిధిగా పటేల్ వ్యవహరిస్తున్నారు. గతంలో ఇండో అమెరికన్ నేత ప్రమీలా జైపాల్‌కు పటేల్ కమ్యూనికేషన్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.
జగనన్న జీవ క్రాంతి పథకం ఉద్దేశం?
వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా ఎంపికైన మహిళలకు గొర్రెలు, మేకలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. డిసెంబర్ 10న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాల్లోని లబ్ధిదారులనుద్ధేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- జీవ క్రాంతి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయంతో మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు మూడు దశల్లో పంపిణీ చేస్తున్నాం.
- ఒక్కో యూనిట్‌లో ఐదారు నెలల వయసున్న 14 మేకలు లేదా గొర్రెలు.. ఒక మేకపోతు లేదా పొట్టేలు ఉంటుంది.
- 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీకి షెడ్యూల్ ఇచ్చాం.
- తొలి దశలో 2021, మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు, రెండో విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు, మూడో విడతలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తాం.
- ఇందుకోసం దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలను సేకరించాల్సి వస్తోంది.
- కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం.
పలు సంస్థలతో ఒప్పందం
- చేయూత సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు ఈ విధంగా జీవనోపాధి కల్పించి, వారికి లాభాలు వచ్చేలా చూసేందుకు ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్ జీ, హెచ్‌ఎల్‌ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
- రాష్ట్రంలో మాంసం కొనడానికి అల్లానా గ్రూప్ ఉంది. అల్లానా గ్రూప్ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణలోని ఏ జిల్లాలో నూతన ఐటీ టవర్‌కు శంకుస్థాపన జరిగింది?
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డిసెంబర్ 10 సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు శంకుస్థాపనలు, 5 ప్రారంభోత్సవాలతో పాటు ఒక పరిశీలన చేపట్టారు.
- కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో రూ.45 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఐదంతస్తుల ఐటీ టవర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
- తొలిరోజే నాలుగు ఐటీ కంపెనీలు (జోలాన్ టెక్నాలజీ, విసాన్‌టెక్, ఎంబ్రోడ్‌స టెక్నాలజీ, సెట్విన్) రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.
- జిల్లాలో రూ.22 లక్షల వ్యయంతో సిద్దిపేట రూరల్ మండలంలోని మిట్టపల్లి క్లస్టర్‌లో నిర్మించిన తొలి రైతువేదికను సీఎం ప్రారంభించారు.
- సిద్దిపేట పట్టణ పరిధిలో రూ.715 కోట్ల వ్యయంతో 2,99,852 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభించారు.
- రూ.225 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వెయి్య పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
- నర్సాపూర్‌లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 45 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 2 పద్ధతిన మొత్తం 2,460 ఇళ్లు నిర్మించారు. సీఎం సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు చేశారు.
- పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు రూ.278.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను సీఎం ప్రారంభించారు.
- 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్య పల్లగుట్ట ద్వీపంలో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు.
- సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో జరిగిన సుందరీకరణ పనులను సీఎం పరిశీలించారు.
నూతన గణాంకాల ప్రకారం తెలంగాణలో లింగనిష్పత్తి?
తెలంగాణ రాష్ట్ర జనాభాలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డిసెంబర్ 12న విడుదల చేసిన ‘‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20’’లో ఈ విషయం వెల్లడైంది. 2015-16 సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో వెయి్య మంది పురుషులకు 1,007 మంది మహిళలు(లింగనిష్పత్తి) ఉండగా... తాజా సర్వే ప్రకారం ఆ సంఖ్య 1,049కి పెరిగింది. అందులో పట్టణాల్లో మహిళలు 1,015 మంది ఉండగా, గ్రామాల్లో 1,070 మంది ఉన్నారు.
లింగ నిష్పత్తి: జనాభాలో ప్రతి వెయి్యమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియ చేసేది లింగనిష్పత్తి.
2019-20 కుటుంబ ఆరోగ్య సర్వేలోని అంశాలు...
- ఐదేళ్ల క్రితం తెలంగాణలో సిజేరియన్ ప్రసవాలు 57.7 శాతం ఉండగా, ఇప్పుడు 60.7 శాతానికి పెరిగాయి.
- ఆసుపత్రుల్లో పుడుతున్నవారి శాతం ఐదేళ్ల క్రితం 91.5 ఉండగా, ఇప్పుడది 97 శాతానికి పెరిగింది.
- 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో తల్లులైనవారు, గర్భిణులుగా ఉన్నవారు 5.8 శాతం.. ఇది ఐదేళ్ల క్రితం 10.6 శాతంగా ఉండేది.
- 15 నుంచి 49 ఏళ్ల మహిళల అక్షరాస్యత 66.6 శాతం. అందులో పట్టణాల్లో అక్షరాస్యత 81 శాతం, గ్రామాల్లో 58.1 శాతం.. ఇక పురుషుల అక్షరాస్యత శాతం 84.8 శాతం.
- శిశు మరణాల రేటు ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 27.7 ఉండగా, ఇప్పుడు 26.4కు తగ్గింది. ఐదేళ్ల క్రితం ప్రతీ వెయ్యికి 20 మంది మరణించగా, ఇప్పుడు 16.8కు తగ్గింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన గణాంకాల ప్రకారం తెలంగాణలో లింగనిష్పత్తి 1049
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20
ఎక్కడ : తెలంగాణ
పంచారామాల పోస్టుకార్డులు ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం, సోమారామం, క్షీరారామం, భీమారామం, కుమారారామం చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను భారతీయ తపాల శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పోస్టుకార్డులను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిసెంబర్ 9న విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తపాల శాఖ సేవలు వినియోగించుకుంటామని మంత్రి వెల్లడించారు.
పంచారామ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. అవి:
ఆరామం | శివుని పేరు | పట్టణం | జిల్లా |
అమరారామం | అమరేశ్వరుడు | అమరావతి | గుంటూరు |
సోమారామం | సోమేశ్వరుడు | భీమవరం | పశ్చిమ గోదావరి |
క్షీరారామం | రామలింగేశ్వరుడు | పాలకొల్లు | పశ్చిమ గోదావరి |
ద్రాక్షారామం | భీమేశ్వరుడు | ద్రాక్షారామం | తూర్పు గోదావరి |
కుమారారామం | కుమార భీమేశ్వరుడు | సామర్లకోట | తూర్పు గోదావరి |
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం
అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించేందుకు ఉద్దేశించిన ‘‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం’’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. డిసెంబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగించారు. ప్రస్తుతం ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్‌గా ఎంవీఎస్ నాగిరెడ్డి ఉన్నారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు
- పంటల బీమా పట్ల రైతుల్లో విశ్వసనీయత కల్పించాం. పంట నష్టపోతే ఇప్పుడు పంటల బీమా పరిహారం వస్తుందనే నమ్మకం వారిలో కలింగింది.
- రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా రూ.468 కోట్లతో పాటు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు.. రెండూ కలిపి రూ.971 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది.
- ఇప్పుడు మన ప్రభుత్వం అక్షరాలా 49.80 లక్షల మంది రైతుల తరపున ప్రీమియం కడుతోంది. 1.14 కోట్ల ఎకరాలను ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం.
- ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకు లాభం ఉంటుంది. రైతుల బీమా కూడా కట్టి, ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నాం. ఈ-క్రాప్ ద్వారా చాలా వేగంగా పరిహారం ఇచ్చే వీలుంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించేందుకు
హైదరాబాద్‌లో గ్లోబల్ హబ్ ఏర్పాటు చేసిన లండన్ సంస్థ?
వాహన రంగంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సీఏ) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేసింది. ఐసీటీ ఇండియా పేరుతో ఏర్పాటైన ఈ సెంటర్ కోసం రూ.1,100 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద డిజిటల్ కేంద్రం. సంస్థ డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు సాంకేతిక వెన్నుదన్నుగా ఈ కేంద్రం పనిచేయనుంది.
ఇప్పటికే దేశంలో ఎఫ్‌సీఏకు పుణే, చెన్నైలో ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ వద్ద తయారీ ప్లాంటు ఉంది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే జీప్ కంపాస్ ఎస్‌యూవీని 13 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీటీ ఇండియా పేరుతో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సీఏ)
ఎక్కడ : గచ్చిబౌలి, హైదరాబాద్
ఎందుకు : డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు
దిశ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ దిశ(మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు) సవరణ బిల్లు-2020తోపాటు పలు కీలక బిల్లులకు డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. గతంలో ఆమోదించిన దిశ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లినప్పుడు కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో తాజా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాల నియంత్రణ, నిరోధానికి దిశ చట్టం తెచ్చారు. శాసనసభలో ఆమోదం పొందిన మరికొన్ని బిల్లులు...
- ఏపీ భూమి హక్కుల యాజమాన్య సవరణ బిల్లు(ఏపీ ల్యాండ్ టైట్లింగ్ బిల్-2020)
- ఏపీ పురపాలక శాసనముల సవరణ బిల్లు(ఏపీ మున్సిపల్ లాస్ సవరణ)
- ఏపీ విద్యుత్ సుంకం సవరణ(ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్‌మెంట్) బిల్లు
డిసెంబర్ 2న శాసనసభ ఆమోదించిన బిల్లులు...
- రాష్ట్రంలో 10 వేల మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్న సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం ఏపీ అసైన్‌డ భూముల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (రెండో సవరణ) బిల్లు.
- వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను విధింపు సవరణ బిల్లు.
- విలువ ఆధారిత పన్ను (మూడో సవరణ) బిల్లు.
- రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లు.
- పశువుల మేత (తయారీ, నాణ్యత, అమ్మకం, పంపిణీ క్రమబద్ధీకరణ) బిల్లు.
ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉద్దేశించిన ‘ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు’ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. కార్యక్రమంలో కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- అమూల్ ప్రాజెక్టు ద్వారా భాగంగా తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభమైంది.
- 2020, జూలై 21న మన ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రైతులకు లీటర్ పాలకు దాదాపు రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా దక్కుతుంది.
- పాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత లాభాలను కూడా బోనస్‌గా సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఇస్తారు.
- అమూల్ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్ ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు.
9,899 గ్రామాల్లో బీఎంసీలు
- రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో రూ.3 వేల కోట్లతో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. బీఎంసీలు రెండు వేల లీటర్ల పాలను స్టోర్ చేయగలిగిన సామర్థ్యంతో ఉంటాయి.
- తొలివిడతగా 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలు పెడుతున్నాం. త్వరలోనే ఇది ప్రతి నియోజకవర్గం.. 9,899 గ్రామాలకు విస్తరిస్తుంది.
4.69 లక్షల మందికి ఆవులు, గేదెలు
- మహిళలు మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడంలో భాగంగా ఐటీసీ, అలానా గ్రూప్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం.
- ఇందులో భాగంగానే 4.69 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెలు ఇవ్వండని అడిగారు. ఒకేసారి అన్ని యూనిట్లు దొరకవు కాబట్టి (ఒక యూనిట్ అంటే ఒక గేదె లేదా ఆవు) దశల వారీగా ఇస్తాం. ఇవాళ 7 వేల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం.
అమూల్‌తో ఒప్పందం వల్ల....
- పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
- ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు తొలి విడత ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాలు
ఎందుకు : రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమం?
మహిళల రక్షణ, సంక్షేమంపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల కార్యక్రమం ‘‘మహిళా మార్చ్ 100 డేస్’’ ప్రారంభమైంది. కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 4న ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 4న ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం మరో మూడు బిల్లులు కూడా సభలో పాస్ అయ్యాయి. విలువ ఆధారిత పన్ను (2వ సవరణ) బిల్లు, విలువ ఆధారిత పన్ను (3వ సవరణ) బిల్లు, ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగులపై పన్ను విధింపు (సవరణ) బిల్లులను సభ ఆమోదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
ఎక్కడ : ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు : మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు
తెలంగాణలోని ఏ నగరంలో నూతన ఐటీ హబ్ ప్రారంభమైంది?
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ప్రారంభమైంది. డిసెంబర్ 7న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ ఐటీ హబ్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విసృ్తతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగానే ఖమ్మం ఐటీ హబ్‌ను నిర్మించామని తెలిపారు. ఐటీ హబ్ రెండో దశ తక్షణ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)
ఎక్కడ : ఖమ్మం, ఖమ్మం జిల్లా
ఎందుకు : ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విసృ్తతం చేసే కార్యక్రమంలో భాగంగా
గుడికో గోమాత కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
టీటీడీ, తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గో సంరక్షణశాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిసెంబర్ 7న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి ఒక గోవును అందజేశారు.
గుడికో గోమాత కార్యక్రమం-వివరాలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 దేవాలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు నిర్ణయించింది.
- హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
- ఏపీలోని 13 జిల్లాలు, తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో... జిల్లాకు ఒక ఆలయం చొప్పున, కర్ణాటకలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఎక్కడ : ఇంద్రకీలాద్రి, విజయవాడు, కృష్ణా జిల్లా
ఎందుకు : దేవాలయాలకు గోవులను అందజేసేందుకు
అనంతపురం జిల్లాలో మూడు జలాశయాలకు శంకుస్థాపన
హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మూడు జలాశయాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి వద్ద వర్చువల్ విధానంలో డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
మూడు ప్రాజెక్టులు ఇవే...
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నీటి ఆధారంగా ఎగువ పెన్నా జలాశయానికి(అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు) సంబంధించిన ప్రధాన కాలువ(53.45 కి.మీ.)తోపాటు... ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి నాలుగు జలాశయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ జలాశయాల నిర్మాణ పనులకు తాజాగా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. రూ.592 కోట్ల వ్యయంతో వీటి నిర్మాణ పనులను చేపట్టారు.
డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం...
ప్రస్తుతం ఉన్న 1.81 టీఎంసీల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు అదనంగా 2.024 టీఎంసీలతో ముట్టాల, 0.992 టీఎంసీలతో తోపుదుర్తి, 0.89 టీఎంసీలతో దేవరకొండ, 1.50 టీఎంసీలతో సోమరవాండ్లపల్లి జలాశయాల్ని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఈ పథకం వల్ల రాప్తాడు నియోజకవర్గంలోని వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
భూసర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఏ రాష్ట్రం ఎంఓయూ చేసుకుంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష’ పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్ ఇండియా సంపూర్ణ సహాయ సహకారాలు అందించనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సర్వే కార్యక్రమానికి 2020, డిసెంబర్ 21న శ్రీకారం చుట్టనున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష’ పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే కార్యక్రమంలో సహాయ సహకారాల కోసం
నివర్ తుపానుకు పేరు పెట్టిన దేశం?
తీవ్ర తుపాను ‘నివర్’ పుదుచ్చేరికి సమీపంలో నవంబర్ 26న తీరం దాటింది. తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో గరిష్టంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి. తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్రాల విపత్తు సహాయ దళాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
నివర్ పేరును పెట్టిన దేశం...
- బంగాళాఖాతంలో 2020 ఏడాది ఏర్పడిన రెండో అతిపెద్ద తుపాను నివర్. 2020, మే నెలలో అంఫన్ తుపాను దక్షిణాదిలో బీభత్సం సృష్టించింది.
- ఇరాన్ సూచన మేరకు తాజా తుపాను పేరును ‘నివర్’గా నిర్ణయించారు. నివర్ అనే మాటను నివారణ అనే అర్థంలో వాడతారు.
- 2020లో ఉత్తర హిందూ మహా సముద్ర ప్రాంతంలో తుపాన్లకు పెట్టే పేర్ల జాబితాలో నివర్ మూడోది.
- 2020, నవంబర్ 22న సోమాలియాలో ఒక తుపాను తీరం దాటింది. దీనికి భారతదేశం సూచన మేరకు ‘గతి’ అని పేరు పెట్టారు. గతి అంటే కదలిక లేదా వేగం అని అర్థం.
ఏపీ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27న రాష్ట్ర మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా మొత్తం 22 అంశాలపై చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్‌లో 5 ప్రత్యేక పథకాలు/ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
కేబినెట్ ముఖ్య నిర్ణయాలు...
- నివర్ తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం చెల్లించాలి. 2020, డిసెంబర్ 15నాటికి పంటనష్టం అంచనాలు పూర్తి చేసి 31నాటికి రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ.
- మహిళల ఆర్థిక స్వావలంబనకు అమూల్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ‘ఏపీ అమూల్’ ప్రాజెకు్ట కార్యక్రమానికి ఆమోదం. డిసెంబరు 2న ‘ఏపీ అమూల్’ ప్రాజెక్టు ప్రారంభం.
- 2019-20 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని డిసెంబరు 15న పంపిణీ చేయాలి. 2019-20 ఖరీఫ్ బీమా పరిహారం కింద రూ.1227.77 కోట్లను చెల్లించాలి.
- - ‘వైఎస్సార్ - జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ’ పథకం కింద రూ.927 కోట్లతో సమగ్ర భూసర్వే ప్రాజెక్టు డిసెంబరు 21న ప్రారంభం.
- ‘పేదలు అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా డిసెంబరు 25న రాష్ట్రంలో 30.60 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ.
- ఆన్‌లైన్ జూదంపై ఉక్కుపాదం మోపేందుకు ‘ఏపీ గేమింగ్ యాక్ట్ - 1974’ చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం శాసనసభలో బిల్లు.
- రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళల ఆర్థిక స్వావలంబనకు
ఏపీ గేమింగ్-2020 బిల్లుకు శాసనసభ ఆమోదం
సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ)-2020 బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 1న ఆమోదం తెలిపింది. గేమింగ్ యాక్ట్-1974కు సవరణ తెస్తూ ఈ బిల్లును రూపొందించారు.
గేమింగ్ యాక్ట్-1974 ప్రకారం...
గేమింగ్ యాక్ట్-1974 ప్రకారం పేకాట లాంటి జూదాలను మాత్రమే నియంత్రించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్‌లను వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా నిర్వహిస్తుండటం వల్ల నియంత్రణలో సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ గేమింగ్ యాక్ట్-1974కు సవరణ తెస్తూ బిల్లు రూపొందించారు.
రెండేళ్లు జైలు శిక్ష...
ఏపీ గేమింగ్ (సవరణ)-2020 బిల్లు ప్రకారం... నిషేధం విధించిన రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ)-2020 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లపై నిషేధం విధించేందుకు