APలో Aarogyasri ఖైదీలకూ వర్తింపు
ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. 2019 డిసెంబర్‌లో జరిగిన ప్రిజన్ డెవలప్‌మెంట్ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం 2022 జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్‌వర్క్ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్/రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP