Skip to main content

అక్టోబర్ 2019 రాష్ట్రీయం

వైఎస్సార్ నేతన్న నేస్తం అమలుకు ఉత్తర్వులు
Current Affairs ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 23న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు.
రాష్ట్రంలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలు 75,243 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిచింది. ఈ కుటుంబాలకు డిసెంబర్ నెలలో రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.180.58 కోట్లు అవసరమని అంచనా వేసింది. బడ్జెట్‌లో చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలుకు ఉత్తర్వులు
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఏపీలో సీపెట్-సీఎస్‌టీఎస్ భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన సీపెట్-సీఎస్‌టీఎస్ నూతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ అక్టోబర్ 24న ప్రారంభించారు. అనంతరం సీపెట్ పారిశ్రామిక ఆవిష్కరణల ప్రదర్శనను తిలకించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సురంపల్లిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీపెట్-సీఎస్‌టీఎస్(సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంటర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్) నూతన భవనాన్ని నిర్మించాయి.
సీపెట్ భవనం ప్రారంభం సందర్భంగా మంత్రి డీవీ మాట్లాడుతూ... ప్లాస్టిక్ రంగంలో పరిశోధనలు, ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించేందుకు దేశంలో త్వరలో కొత్తగా మరో అయిదు సీపెట్ కేంద్రాలను ప్రారంభించనున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో సీపెట్‌ను నెలకొల్పుతామని ప్రకటించారు. 9.30 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశ ప్లాస్టిక్ పరిశ్రమ విలువ 2025 నాటికి 340 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా పరిశోధనలను విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పుతామని చెప్పారు. దేశంలో మన రాష్ట్రం మాత్రమే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీపెట్-సీఎస్‌టీఎస్(సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంటర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్) నూతన భవనం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ
ఎక్కడ : సురంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా

ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న 25 కళాశాలలు ఈ యూనివర్సిటీకి అనుబంధంగా పని చేస్తాయని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై అక్టోబర్ 25న సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సమీక్షా సమావేశం - సీఎం కీలక నిర్ణయాలు
  • ప్రభుత్వం తరఫున చేపట్టే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. ప్రతి ప్రభుత్వ శాఖ ఇందులో భాగస్వామిగా మారుతుంది.
  • ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో అదనంగా ఏడాది పాటు అప్రెంటీస్ చేయించాలి. అప్రెంటీస్ చేశాక అవసరం అనుకుంటే మళ్లీ ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వాలి.
  • ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలకు డిజిటల్ ఎక్స్‌టెన్షన్ ఉండాలి. ఇందుకోసం ఓలా, ఉబర్ తరహాలో యాప్ రూపొందించాలి.
  • చదువులు ముగించుకొని విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయం ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా

నాస్కామ్ అధ్యక్షురాలితో కేటీఆర్ భేటీ
నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో అక్టోబర్ 25న జరిగిన ఈ సమావేశంలో నూతన సాంకేతికతలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను దేవయాని ఘోష్‌కు కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 2020ను ‘కృత్రిమ మేథస్సు సంవత్సరం’గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య రక్షణ రంగాల్లో కృత్రిమ మేథస్సు వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే ఏడాది పొడవునా కృత్రిమ మేథస్సు అంశంపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నైపుణ్య శిక్షణలోనూ నాస్కామ్ భాగస్వామిగా ఉంటుందని దేవయాని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ప్రగతిభవన్, ప్రగతిభవన్

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణ
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తరించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అక్టోబర్ 26న నాలుగు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019, నవంబరు 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లోని ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో 17 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పొందవచ్చు. ఈ 17 సూపర్ స్పెషాలిటీ సేవల్లో భాగంగా 716 జబ్బులకు చికిత్స పొందవచ్చు.
17 సూపర్ స్పెషాలిటీ సేవలు-జబ్బులు

Current Affairs


ఆర్థికంగా చేయూత
ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న తర్వాత రోగులు విశ్రాంతి పొందే సమయంలో ఉపాధి కోల్పోయే వారికి 2019, డిసెంబరు 1 నుంచి ఆర్థికంగా చేయూత అందించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు కోలుకునే వరకు రోజుకు రూ.225 చెల్లిస్తారు. ఈ సొమ్ము గరిష్టంగా రూ.5 వేల వరకు ఇస్తారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు పెన్షన్
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కల్పిస్తున్న పింఛను సౌకర్యం పరిధిని ప్రభ్తుత్వం విస్తరించింది. 2020 జనవరి 1 నుంచి నిర్దేశించిన వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పింఛను ఇస్తారు. రక్తశుద్ధి చేయించుకునే వారికి ప్రస్తుతం నెలకు రూ.10వేల వంతున పింఛను ఇస్తున్నారు. తాజా ఉత్తర్వులతో మరికొందరికి ఈ పింఛను సౌకర్యం లభించింది.

Current Affairs


పారిశుధ్య కార్మికులకు వేతనం పెంపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులందరికీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకూ నెలకు రూ.6,500 మాత్రమే పారిశుధ్య కార్మికులకు వేతనం ఇస్తుండగా..వారి వేతనం నెలకు రూ.16 వేలకు పెంచింది. పెంచిన వేతనాలు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Current Affairs


డిసెంబర్ 3న వైఎస్సార్ లా నేస్తం ప్రారంభం
వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం 2019, డిసెంబర్ 3న ప్రారంభం కానుంది. ఈ మేరకు అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్‌లో నమోదైన న్యాయవాదులు 61వేల మంది ఉన్నారు. ఏటా కొత్తగా 1,500 మంది ఎన్‌రోల్ అవుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, డిసెంబర్ 3న వైఎస్సార్ లా నేస్తం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లించేందుకు

రెవెన్యూ డివిజన్‌గా హుజూర్‌నగర్
సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 29న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. ఇటీవల హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన అనంతరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
2019, అక్టోబర్ 21న జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెవెన్యూ డివిజన్‌గా హుజూర్‌నగర్
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్‌కు కేబినెట్ ఆమోదం
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రూపొందించిన ‘మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 30న సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌తో (ఎన్‌బీసీసీ) కుదుర్చుకోనున్న ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించి, ఆ డబ్బును ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలైన నవరత్నాలు, నాడు-నేడు మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. మరోవైపు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మరిన్ని కార్యక్రమాల కోసం ‘కనెక్ట్ టు ఆంధ్రా’ పేరిట లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చైర్మన్‌గా ‘కనెక్ట్ టు ఆంధ్రా’ సంస్థ పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్‌కు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎందుకు : మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా

తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటు
తెలంగాణలో శానిటేషన్ హబ్ నెలకొల్పనున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి నివేదించారు. ఈ మేరకు అక్టోబర్ 30న కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలసి ఈ అంశమై చర్చించారు. ఈ శానిటేషన్ హబ్ దేశవ్యాప్తంగా, దక్షిణాసియాలోనూ పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే ‘అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో ఇది ఒక భాగంగా ఉంటుందన్నారు. ఈ హబ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) అత్యున్నత స్థాయి బ్లూప్రింట్ రూపొందించిందని పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఈ శానిటేషన్ ఇన్నోవేషన్ హబ్‌పై అధికారిక ప్రకటన ఉంటుందని మంత్రి వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు

ఈసీఎంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
Current Affairs జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్‌తో (ఈసీఎం)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. రోబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఒప్పందం ప్రకారం మొదటి విడతలో భాగంగా 11 ఇంజరినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ రోబోటిక్స్ ల్యాబ్స్ కేంద్రాల్లో 788 మంది విద్యార్థులు ఏఆర్సీ 1.0లో శిక్షణ పూర్తి చేసుకున్నారని చెప్పారు. విజయవాడలో అక్టోబర్ 17న జరిగిన కార్యక్రమంలో రెండో విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్‌లను ఆన్‌లైన్ ద్వారా చల్లా ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈసీఎంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి
ఎందుకు : రోబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం కోసం

ఏపీలో వైఎస్సార్ కిశోర పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ, స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘వైఎస్సార్ కిశోర పథకం’ ప్రారంభమైంది. ఈ పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గుంటూరులో అక్టోబర్ 18న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వ్యక్తి జీవితంలో ’కీలకమైన బాల్యంలో తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవాలని, అదేవిధంగా యవ్వనంలో తల్లిదండ్రులను మోసం చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి’ అని చెప్పారు. హోంమంత్రి మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్‌లు అనర్ధాలకు కారణం అవుతున్నాయనీ.. ఒత్తిడితో సహా అనేక సమస్యలను యువత కొని తెచ్చుకుంటున్నారని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ కిశోర పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
ఎక్కడ : గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళలకు రక్షణ కల్పించేందుకు

కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్
హైదరాబాద్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్ లభించింది. దీంతో దేశంలోనే మొదటిసారి ఐఎస్‌వో సర్టిఫికెట్ పొందిన పార్కుగా బొటానికల్ గార్డెన్ గుర్తింపు పొందింది. ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఈ గార్డెన్‌కు ఐఎస్‌వో గుర్తింపు దక్కింది. బొటానికల్ గార్డెన్‌లో అక్టోబర్ 19న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ఐఎస్‌వో సర్టిఫికెట్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కొత్తగూడ బొటానికల్ గార్డెన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ అగ్రిల్యాబ్స్
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రాష్ట్రస్థాయి పరీక్షా కేంద్రం, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు, 13 జిల్లాస్థాయి పరీక్షా కేంద్రాలతో పాటు 147 గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 19న వెల్లడించింది. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ అగ్రిల్యాబ్స్‌కు ‘నాబార్డు’ ఆర్థిక సాయం చేయనుంది. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు)ను ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు

అమరులు వారు పుస్తకావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా అక్టోబర్ 21న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారైనా మినహాయింపు వుండకూడదని చెప్పారు. పోలీసులు, హోంగార్డులు ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే రూ.30 లక్షలు, ఉగ్రవాద హింసలో మరణిస్తే రూ.40 లక్షల బీమా అందించేలా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చామని సీఎం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరులు వారు పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్ ఆదర్శం అమలుకు కమిటీలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ‘వైఎస్‌ఆర్ ఆదర్శం’ పథకం అమలు, పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద బ్యాంకులు, ఆయా కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు 6 వేల వాహనాలను (ట్రక్కులు) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక, పౌర సరఫరాల సంస్థ, బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన సరకులు తరలించేందుకు ఈ వాహనాలను ఉపయోగించనున్నారు. ఐదేళ్లలోపు నెలనెలా వాయిదాలు చెల్లించడం ద్వారా ఆ వాహనానికి లబ్ధిదారుడిని యజమానినే చేయడం.. అతనికి నెలనెలా కనీసం రూ.20వేలు ఆదాయం ఉండేలా చేయడం ఈ పథకం లక్ష్యం.

కేంద్ర హోం మంత్రితో ఏపీ సీఎం జగన్ భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 22న జరిగిన ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలను తరలించి కృష్ణా డెల్టాలో తాగు, సాగు నీటి కొరత తీర్చే ప్రాజెక్టును చేపట్టాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా హెడ్ వర్క్స్, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరలో ఇచ్చేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ

ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం
Current Affairs ఆంధ్రప్రదేశ్‌లో ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం’ ప్రారంభమైంది. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10న అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంతకుముందు ప్రభుత్వ బాలికల గురుకల పాఠశాల సముదాయం, జేఎన్‌టీయూఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, జేఎన్‌టీయూఏ హంపీ హస్టల్‌లకు శంకుస్థాపన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.
సీఎం జగన్ ప్రసంగం-ముఖ్యాంశాలు
  • కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు కూడా చేయిస్తాం. ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
  • రూ.560 కోట్లతో మూడేళ్ల పాటు చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతాం, ప్రతి కంటిలో వెలుగు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  • ఒకటి.. రెండవ దశల్లో పిల్లలకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తాం. అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని 62,489 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తాం.
  • రెండవ దశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన వారికి మరిన్ని పరీక్షలు చేయడంతో పాటు కంటి చికిత్సలు చేయడం, కళ్ల జోళ్లను అందిస్తాం. ఆ తర్వాత ఒక్కో దశ కార్యక్రమాన్ని 6 నెలల పాటు చేపట్టి.. మొత్తం కార్యక్రమాన్ని 31 జనవరి 2022 నాటికి పూర్తి చేస్తాం.
  • తలసేమియా రోగులకు జనవరి నుంచి రూ.10 వేల పింఛన్ పథకాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా పెరాలసిస్‌తో పాటు మరో 4 రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వనున్నాం.
  • ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల ఆపరేషన్ల అనంతరం రోగులు కోలుకునే వరకు ఖర్చుల కింద రోజుకు రూ.225 చొప్పున లేదా ఎక్కువ రోజులైతే నెలకు రూ.5 వేలు సాయం డిసెంబర్ నుంచి అందించనున్నాం.
  • రూ.1,000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. జనవరి 1వ తేదీ నుంచి పెలైట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులకు అమలు చేయనున్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు ఈ పథకం అమలును విస్తరిస్తాం.
  • హంద్రీ-నీవా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో సమాంతర కాలువ నిర్మిస్తాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు చేసేందుకు

తెలంగాణలో ప్లాస్టిక్ నిషేధం
తెలంగాణలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తి, విక్రయాలను నిషేధిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్టోబర్ 10న ప్రకటించారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంపు లక్ష్యంగా నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) అమలు తీరుపై కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్లాస్టిక్‌పై నిషేధం వంటి పలు నిర్ణయాలను కేసీఆర్ ప్రకటించారు.
పల్లె ప్రగతి సమావేశం-సీఎం నిర్ణయాలు
  • గ్రామ పంచాయతీల సిబ్బందికి రూ. 2 లక్షల జీవిత బీమా కల్పిస్తాం.
  • ఏటా మూడుసార్లు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
  • ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది, ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుంది.
  • పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చింది. మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చింది.
  • ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నాం. ఈ నిధులను కలెక్టర్లు వారి విచక్షణ మేరకు వినియోగించాలి.
  • పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి.
  • పచ్చదనం–పరిశుభ్రత పెంచే కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకొనే వారి ఇళ్లకు ఉత్తమ గృహం అవార్డు ఇవ్వనున్నాం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తి, విక్రయాలపై నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : తెలంగాణ

వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో తెలంగాణ ఐటీ మంత్రి
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 12న జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ వార్షిక సమావేశంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డిజైనింగ్ రంగానికి పెరుగుతున్న ప్రాముఖ్యత దృష్ట్యా కేంద్ర పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డిప్) సహకారంతో హైదరాబాద్‌లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వివిధ సంస్థలకు డిజైన్ కన్సల్టెన్సీ సేవలు, సామర్థ్యం పెంపుదల, డిజైన్ ఎడ్యుకేషన్‌లో పెంపు లక్ష్యంగా ఈ కేంద్రం సేవలందిస్తుందన్నారు. అలాగే వివిధ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు, సేవలకు ‘బ్రాండింగ్’ ఇచ్చేందుకు ఈ సంస్థ దోహదం చేస్తుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ వార్షిక సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్

సిద్దిపేటలో కావేరి సీడ్స్ ఆర్‌అండ్‌డీ సెంటర్
విత్తన తయారీ సంస్థ కావేరి సీడ్స్ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో బయోటెక్నాలజీ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ కేంద్రాన్ని అక్టోబర్ 14న ప్రారంభించారు. విత్తన పరిశోధన, అభివృద్ధి రంగంలో సంస్థ సామర్థ్యం మరింత పెరిగేందుకు ఈ ల్యాబ్ తోడ్పడుతుందని కావేరి సీడ్‌‌స సీఎండీ జి.వి.భాస్కర్ రావు తెలిపారు. దీనికోసం రూ.20 కోట్ల వ్యయం చేశామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కావేరి సీడ్స్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
ఎక్కడ : సిద్దిపేట జిల్లా, తెలంగాణ

వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అక్టోబర్ 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులు,కౌలు రైతులకు పంట పెట్టుబడిసాయం కింద ఏటా రూ.13,500 ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 54 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు.
రైతుకు ఏటా ఇచ్చే మొత్తం: రూ. 13,500
ఐదేళ్లలో రైతుకిచ్చే సాయం: రూ. 67,500
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎప్పుడు: అక్టోబర్ 15, 2019
ఎందుకు:ై రెతులు,కౌలు రైతులకు పంట పెట్టుబడికి ఏటా రూ.13,500 ఆర్థిక సాయం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎంతో అమెరికన్ కాన్సులేట్ జనరల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ భేటీ అయ్యారు. అమరావతిలో అక్టోబర్ 16న జరిగిన ఈ సమావేశంలో గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని సీఎం విజ్ఞప్తిచేశారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తోనూ రిఫ్‌మాన్ సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

బయో ఏసియా వెబ్‌సైట్ ఆవిష్కరణ
2020, ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న‘17వ బయో ఏసియా సదస్సు’ వెబ్‌సైట్, థీమ్‌లను అక్టోబర్ 16న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారాక రామారావు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 17వ బయో ఏసియా సదస్సును ‘టుడే ఫర్ టుమారో’నినాదంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్‌ఐఐసీ, రిచ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వంటి పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పలు కేంద్ర సంస్థలు కూడా ఈ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు తెలిపారు.
బయో ఏషియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉంటుంది. అసోం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ‘రాష్ట్ర భాగస్వాములు’ హోదాలో ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 17వ బయో ఏసియా సదస్సు’ వెబ్‌సైట్, థీమ్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారాక రామారావు
ఎక్కడ : హైదరాబాద్

సీఈజీఐఎస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ
సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (సీఈజీఐఎస్)తో తెలంగాణ ఆర్థిక, ప్రణాళిక శాఖలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో అక్టోబర్ 16న జరిగిన కార్యక్రమంలో త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా శాఖలు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రజాధన వ్యయంలో నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా చతుర్ముఖ వ్యూహం అవలంభించనున్నారు. కీలక శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చేలా రోడ్‌మ్యాప్‌లు తయారు చేసి ఆయా సంస్కరణల ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేయడంలో ఇరు పక్షాలు కలసి పనిచేయనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఈజీఐఎస్‌తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : తెలంగాణ ఆర్థిక, ప్రణాళిక శాఖలు
ఎక్కడ : హైదరాబాద్

వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభమైంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూపొందించిన ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అక్టోబర్ 17న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి.
వైఎస్సార్ నవోదయం పథకం-ముఖ్యాంశాలు
  • బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తీర్చలేక నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారిన ఖాతాలతోపాటు మొండి బాకీలుగా మారేందుకు సిద్ధంగా ఉన్న (స్ట్రెస్డ్ అకౌంట్స్)ను ఆదుకునేలా వైఎస్సార్ నవోదయం పథకాన్ని రూపొందించారు.
  • గరిష్టంగా రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్‌ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • మొండి బకాయిలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఖాతాలకు వన్‌టైమ్ రీస్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించుకునేందుకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అవసరమైన ఆడిట్ నివేదిక తయారీ వ్యయంలో 50 శాతాన్ని, గరిష్టంగా రూ.2,00,000 వరకు సాయం చేయనున్నారు.
  • ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80,000 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు రూ.4,000 కోట్ల వరకు రుణాలను బకాయిపడ్డాయి.
  • రుణాలు తీర్చలేని యూనిట్లను గుర్తించి వైఎస్సార్ నవోదయం పథకంలో చేర్చే బాధ్యతను కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకులకు ప్రభుత్వం అప్పగించింది.
  • ఈ పథకంకింద ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేసింది.
  • పథకంలో చేరేందుకు 2020 మార్చి 31 వరకు అవకాశం కల్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు

యుకె సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
యునెటైడ్ కింగ్ డమ్ (యుకె)కి చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదర్చుకుంది. తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్ 16న బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని పలు నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యుకె సంస్థలు సహకరిస్తాయి.

వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఏపీ మంత్రులు
Current Affairs దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య(వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సదస్సులో అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ... ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే తక్షణ కర్తవ్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం బ్రాండ్‌థాన్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరికొత్త ఆలోచనలు, సలహాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 31 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు 13 జిల్లాలను ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఏపీ మంత్రులు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : న్యూఢిల్లీ

హెచ్‌ఐసీసీలో ఐయాన్‌కాన్-2019 ప్రారంభం
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఐయాన్‌కాన్-2019 సదస్సును భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్టోబర్ 3న ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిర్వహిస్తోంది. సదస్సులో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు చెందిన న్యూరో ఫిజీషియన్లు ఇతర రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. అలాగే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ వీలియం కరోల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ ఖాదీల్కర్, ఐయాన్‌కాన్-2019 నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ మోహన్‌దాస్ హాజరయ్యారు.
సదస్సు సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఆహారపు అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. ఐయాన్‌కాన్ లాంటి సదస్సులు పలు జబ్బులపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐయాన్‌కాన్-2019 ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్

ఐయూఎఫ్‌ఆర్‌వోలో తెలంగాణ ఏపీసీసీఎఫ్
బ్రెజిల్‌లోని క్యూరీటుబాలో జరుగుతున్న 25వ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఐయూఎఫ్‌ఆర్‌వో) సమావేశంలో అక్టోబర్ 4న తెలంగాణ అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(ఏపీసీసీఎఫ్) లోకేశ్ జైస్వాల్ పాల్గొన్నారు. తెలంగాణలో పచ్చదనం పెంచేందుకు, అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి ఈ సమావేశంలో లోకేశ్ వివరించారు. అలాగే సిద్దిపేట జిల్లాలోని ‘గజ్వేల్-ములుగు అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించారు.
2019, సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఐయూఎఫ్‌ఆర్‌వో సమావేశాలు అక్టోబర్ 5న ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో 110 దేశాల్లో విధాన రూపకర్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, సంస్థలతో కూడిన ప్రపంచ నెట్‌వర్క్, భాగస్వామ్యపక్షాలు పాల్గొన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐయూఎఫ్‌ఆర్‌వో సమావేశంలో
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : తెలంగాణ ఏపీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్
ఎక్కడ : క్యూరీటుబా, బ్రెజిల్

హైదరాబాద్‌లో మైక్రాన్ గ్లోబల్ సెంటర్
అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అక్టోబర్ 4న ఈ సెంటర్‌ను ప్రారంభించారు. సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్‌రోత్రా తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ (జీడీసీ) ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
ఎక్కడ : హైదరాబాద్

ఏపీలో వైఎస్సార్ వాహనమిత్ర ప్రారంభం
ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 4న ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘2018 మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని అమలు చేశాం. వారి కష్టాలను స్వయంగా చూసి ఈ పథకాన్ని రూపొందించాం’ అని తెలిపారు. వాహనమిత్ర ద్వారా 1,73,531 మందికి లబ్ధి చేకూరనుంది.
మరోవైపు ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే 2019, అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే వైఎస్సార్ కంటి వెలుగు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ వాహనమిత్ర పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఇండోర్ స్టేడియం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు

ప్రధాని మోదీతో కేసీఆర్ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 4న జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు సహా జోనల్ వ్యవస్థలో మార్పు వంటి పలు కీలక అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో బీడు భూములకు సాగునీరు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి చేపట్టనున్న కృష్ణా- గోదావరి నదుల అనుసంధానానికి ఉదారంగా సాయం అందించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన హర్ ఘర్ జల్ పథకానికి అనుసంధానించాలని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలని విన్నవించారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలని, ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
ఎక్కడ : న్యూఢిల్లీ

ఐటీసీతో ఏపీ ఉద్యాన శాఖ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున పండించే మిర్చిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు ఐటీసీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ అక్టోబర్ 5న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మొదటి ఏడాది కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 41 గ్రామాల్లో నాలుగు వేల మంది రైతులతో 10 వేల ఎకరాల్లో మిర్చిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగు చేయిస్తారు. రైతుల సేవల కోసం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఇ - చౌపల్ 4.0 పేరుతో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీసీతో ఏపీ ఉద్యాన శాఖ ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎందుకు : మిర్చిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు

ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యూఢిల్లీలో అక్టోబర్ 5న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోదావరి-కృష్ణా అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీతోపాటు పలు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు. వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
ప్రధానితో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలు
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి.
  • పోలవరం పనుల్లో 2014-19 మధ్య అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పాత కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాం. పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటికే రూ.838 కోట్లు ఆదా అయ్యాయి.
  • రూ.55,548 కోట్లతో ప్రతిపాదించిన పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలి.
  • విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌లకు తగిన రీతిలో నిధులు విడుదల చేయాలి.
  • ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. కానీ, ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందువల్ల ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
  • ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి మిగతా నిధులు విడుదల చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
  • నిధులు విడుదల చేసి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలి.
  • రెవెన్యూ లోటు కింద ఇంకా రూ.18,969.26 కోట్లను విడుదల చేయాలి. సవరించిన లెక్కల మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలి.
  • వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించేందుకు అక్టోబర్ 15న రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు.

ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ జడ్జి జ్యుడీషియల్ ప్రివ్యూ అధికారిక లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7న తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనితో పాటు ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్‌సైట్ judicialpreview.ap.gov.in ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్జి జ్యుడిషియల్ ప్రివ్యూ డాక్టర్ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం 2019, ఆగస్టు 14 నుంచి అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. రాష్ట్రంలోని 62 వేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : జూనియర్ కాలేజీ గ్రౌండ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించేందుకు
Published date : 30 Oct 2019 06:03PM

Photo Stories