Skip to main content

Supreme Court: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కులం పేరిట వేధిస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు

ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court lays down when an insult is an offence under SC-ST Act

న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగ‌స్టు 23వ తేదీ ఈ మేరకు పేర్కొంది. 'ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు' అని స్పష్టం చేసింది. 

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్‌ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్‌ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్‌ కేసు పెట్టారు. మరుణదాన్‌ మలయాళీ అనే యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్న షాజన్‌ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Supreme Court : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

ఈ కేసును విచారించిన ధర్మాసనం.. 'బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్‌ 3(1)(ఆర్‌) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం' అని స్పష్టం చేసింది.

'షాజన్‌ కేసులో అదేమీ కనిపించడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారుస‌ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది.

Supreme Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చరిత్రాత్మకమైన తీర్పు.. కేసు ఏమిటంటే..

Published date : 24 Aug 2024 04:33PM

Photo Stories