Skip to main content

Swachh Bharat, AMRUT: అర్బన్‌ 2.0, అమృత్‌ 2.0 పథకాలు ప్రారంభం

PM Modi

స్వచ్ఛభారత్‌ మిషన్‌–అర్బన్, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్సఫర్మేషన్‌ (అమృత్‌) పథకాల రెండో దశకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబర్‌ 1న ఢిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌–అర్బన్‌ 2.0, అమృత్‌ 2.0ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగించారు. దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్రం ఈ రెండు పథకాలకు రూపకల్పన చేసింది. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావవంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది.

అర్బన్‌ 2.0..

అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్‌ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌–అర్బన్‌ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా.

 

అమృత్‌ 2.0..

దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్‌ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్‌ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్రం ప్రకటించింది.

 

ప్రధాని ప్రసంగం – ముఖ్యాంశాలు

  • 2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టి, 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించాం. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యం.
  • దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోంది. పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యం.
  • 2014లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రారంభమైనప్పుడు చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేది. ఇప్పుడు 70 శాతం చెత్తను శుద్ధి చేస్తున్నాం. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతాం. 
  • పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. అర్బన్‌ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. ఆ మిషన్‌ని మూడు ఆర్‌లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌) ద్వారా ముందుకు తీసుకువెళతాం.
  • అమృత్‌లో భాగంగా మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలం. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

చ‌ద‌వండి: జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : స్వచ్ఛభారత్‌ మిషన్‌–అర్బన్, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్సఫర్మేషన్‌ (అమృత్‌) పథకాల రెండో దశ ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్, ఢిల్లీ
ఎందుకు  : దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం...

Published date : 02 Oct 2021 12:18PM

Photo Stories