PM Modi: గతి శక్తి–నేషనల్ మాస్టర్ ప్లాన్ లక్ష్యం?
దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ‘‘పీఎం గతిశక్తి – నేషనల్ మాస్టర్‌ప్లాన్’’ కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 13న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని చెప్పారు. ఇది 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని వివరించారు. ప్రగతి మైదాన్‌లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌ను కూడా మోదీ ప్రారంభించారు.
ఏమిటీ ‘గతిశక్తి’?
5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు.
ఆరు స్తంభాల పునాదితో..
ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది.
గరిష్టీకరణ: వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది.
కాల సమన్వయం: ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో వివిధ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ‘పీఎం గతిశక్తి’ వీటికి స్వస్తి పలుకుతుంది.
విశ్లేషణాత్మకత: 200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలన్నిటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది.
గతిశీలత: ‘జీఐఎస్’ సాయంతో అన్ని శాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను సమీక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ప్రగతి వివరాలను(ఉపగ్రహ చిత్రాలు కూడా) క్రమబద్ధంగా పోర్టల్‌లో నమోదు చేస్తారు.
సమగ్రత: పలు శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత, ప్రణాళికల రూపంలో గల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్‌తో అనుసంధానిస్తారు. దీంతో అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది.
ముఖ్యాంశాలు...
- 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే గతిశక్తి కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుంది.
- పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది.
- ఇన్‌ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి.
పీఎం గతిశక్తి లక్ష్యాల్లో కొన్ని (2024–25 కల్లా సాధించేందుకు..)
- రైల్వే కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 1,210 మిలియన్ టన్నుల నుంచి 1,600 మిలియన్ టన్నులకు పెంచడం.
- ఓడరేవుల్లో కార్గో సామర్థ్యం 1,282 మిలియన్ టన్నుల నుంచి 1,759 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చడం.
- జాతీయ జల రవాణా మార్గం నుంచి సరకు రవాణాను 74 మిలియన్ టన్నుల నుంచి 95 మిలియన్ టన్నులకు పెంచడం.
- 2027 కల్లా అన్ని రాష్ట్రాలను ట్రంక్ న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం.
- 202 ఫిషింగ్ క్లస్టర్లు/హార్బర్లు/ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి.
- 220 విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు, వాటర్ ఏరోడ్రోమ్స్ అందుబాటులోకి తీసుకురావడం.
- 197 మెగా ఫుడ్‌పార్కులు, ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటు. ఆహారశుద్ధి సామర్థ్యం 222 లక్షల టన్నుల నుంచి 847 లక్షల టన్నులకు పెంపు.
- 90 మెగా టెక్స్‌టైల్ పార్కుల నిర్మాణం.
- 38 ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేసి, అక్కడి ఉత్పత్తి సామర్థ్యాన్ని రూ.15 లక్షల కోట్లకు చేర్చడం.
- ప్లగ్ అండ్ ప్లే విధానంలో 23 క్లస్టర్ల ఏర్పాటు.
- 109 ఫార్మా, మెడికల్ డివైజ్ క్లస్టర్ల ఏర్పాటు.
చదవండి: దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని సైనిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం గతిశక్తి – నేషనల్ మాస్టర్‌ప్లాన్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ
ఎందుకు : దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్