Skip to main content

Republic Day 2024: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీశక్తి విశ్వరూపం..

భారత దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో చేపట్టిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జ‌రిగాయి.
Captain Sandhya leading the 75th Republic Day parade in Delhi   Nari Shakti takes centre stage in 75th Republic Day parade  Tri-forces parade showcasing India's military strength

ఈ వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. జ‌న‌వ‌రి 26వ తేదీ జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్‌ విభాగానికి చెందిన కెప్టెన్‌ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. 

నేవీ, డీఆర్‌డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్‌ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్‌ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్‌ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు.

బీఎస్‌ఎఫ్, సీఆర్పీ ఎఫ్‌ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్‌సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కనిపించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్‌ త్రివిధ దళాల వందనం స్వీకరించారు.

Republic Day 2024: గణతంత్ర దినోత్సవం రోజు ప్రధాని హాజరైనా జెండా ఎందుకు ఎగరేయరంటే.. కారణం ఇదే..

90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెల్ఫీలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది.

మోదీ రాక సందర్భంగా భారత్‌ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్‌ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్‌ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్‌ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్‌ ఏ330 మల్టీ ట్యాంకర్‌ రావాణా విమానం, రెండు రాఫెల్‌ ఫైటర్‌ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం.

అలరించిన నాగ్‌ మిసైల్‌ వ్యవస్థ
వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్‌ మిసైల్‌ వ్యవస్థ, తేజస్‌ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్‌ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్‌ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థ, క్యూఆర్‌ఎస్‌ఏఎం తదితర క్షిపణులు అలరించాయి.

వేడుక‌ల్లో పాల్గొన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు..
గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి. ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. ‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. 

Emmanuel Macron: భారత విద్యార్థులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌..

Published date : 29 Jan 2024 10:18AM

Photo Stories