జూన్ 2019 జాతీయం
తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్‌క్యూ 4ఏ నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్టు పేర్కొంది. డ్రోన్ కూల్చివేత విషయమై అమెరికా స్పందిస్తూ హార్మోజ్‌గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్‌తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాకి చెందిన ఆర్‌క్యూ 4ఏ నిఘా డ్రోన్ కూల్చివేత
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ఇరాన్
ఎందుకు : తమ దేశ గగనతలంలోకి ప్రవేశించినందున
2022 జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం
2022లో జరిగే ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి జూన్ 20న ప్రసంగించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, విదేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయని, ఈ నేపథ్యంలోనే 2022 జీ20 దేశాల సదస్సును భారత్‌లో నిర్వహిస్తున్నామని కోవింద్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తున్నాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2022 జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
కొల్హాపూర్ చెప్పులకు జీఐ ట్యాగ్
దేశవ్యాప్తంగా మంచి ఆదరణ కల్గిన కొల్హాపురి బ్రాండ్ చెప్పులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సతారాలలో కొల్హాపూర్ చెప్పులు ఎక్కువగా తయారవుతుండడంతో ఈ గుర్తింపునిచ్చారు. ఈ ట్యాగ్‌తో కొల్హాపురి చెప్పులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. నిర్దిష్ట భూగోళ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అయ్యేవాటికి జీఐ ట్యాగ్ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొల్హాపురి బ్రాండ్ చెప్పులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్
ఎప్పుడు : జూన్ 20
ఎందుకు : మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సతారాలలో కొల్హాపూర్ చెప్పులు ఎక్కువగా తయారవుతుండడంతో
45వేల కోట్లతో 6 జలాంతర్గాములు
అధునాతన పరిజ్ఞానంతో దేశంలో ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు భారత నౌకాదళం చర్యలు మొదలుపెట్టింది. పి-75(ఐ) ప్రాజెక్టు కింద రూ.45వేల కోట్లతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యూహాత్మక భాగస్వాములను ఎంపిక చేసేందుకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’ పత్రాలను జారీ చేసింది. కొత్తగా రూపొందించిన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ నమూనా కింద చేపడుతున్న రెండో ప్రాజెక్టు ఇది. దీనివల్ల స్వదేశీ డిజైన్, నిర్మాణ సామర్థ్యం మెరుగుపడుతుందని నౌకాదళం పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 45వేల కోట్లతో 6 జలాంతర్గాముల నిర్మాణం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : భారత నౌకాదళం
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
17వ లోక్‌సభ ప్రారంభమైన సందర్భంగా జూన్ 20న పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని తన ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు
- దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోంది
- ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు ఉంది
- నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది
- వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుంది
- మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది
- అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుంది
- దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘నవ భారతం’ను నిర్మించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది
- లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికై న వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోంది.
లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు
కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జూన్ 21న ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమనీ, దీనిపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ సందర్భంగా బిల్లుకు అనుకూలంగా 186 మంది సభ్యులు మద్దతు తెలపగా, 74 మంది ఎంపీలు వ్యతిరేకించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లును 2018, సెప్టెంబర్‌లో ఓసారి, 2019, ఫిబ్రవరిలో మరోసారి కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభలో ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019(ట్రిపుల్ తలాక్ బిల్లు)
ఎప్పుడు : జూన్ 21
జి-20 భేటీకి ప్రధాని మోదీ
జపాన్‌లోని ఒసాకాలో జూన్ 27 నుంచి 28 వరకు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 21న వెల్లడించింది. మోదీ వెంట మాజీ కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కూడా ఉంటారని ఆ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. సదస్సులో పాల్గొనే పలు దేశాలతో మోదీ ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని తెలిపారు.
జి-20లో ఇండియాతోపాటు అర్జెంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యురోపిన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జూన్ 27 నుంచి 28 వరకు జరిగే జి-20 భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్
ఎక్కడ : ఒసాకా, జపాన్
బాలాకోట్‌పై వైమానిక దాడులకు సంకేతనామం
పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ‘జైష్ ఎ మహ్మద్’ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలపై ఫిబ్రవరి 26న జరిపిన వైమానిక దాడులకు భారత సైనిక దళాలు సంకేతనామాన్ని వినియోగించాయి. 12 మిరాజ్ -2000 యుద్ధవిమానాలతో బాలకోట్‌పై దాడి చేసిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ‘‘ఆపరేషన్ బందర్(కోతి)’’ అని పేరు పెట్టింది. అదే సమయంలో పాకిస్థాన్ దాడులు చేస్తే తిప్పికొట్టడానికిగాను సరిహద్దుల వెంబడి మన సైన్యం భద్రతను బలోపేతం చేసింది. అత్యున్నతమైన కార్యాచరణ అప్రమత్తతను ప్రకటించింది. దీనికి ‘‘ఆపరేషన్ జఫ్రాన్(కుంకుమ పువ్వు)’’ అనే సంకేతనామం పెట్టింది. భారతీయ నావికాదళం మాత్రం ఎలాంటి సంకేతనామం పెట్టలేదు. ‘‘ట్రోపెక్స్ 2019’’ పేరిట యుద్ధనౌకలు, జలాంతర్గాములతో అప్పటికే ఉత్తర అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.
2019, ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఓ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే భారత వాయుసేన బాలాకోట్ ఆపరేషన్ జరిపింది.
ప్రధాని మోదీకి సీజేఐ జస్టిస్ గొగోయ్ లేఖలు
దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ జూన్ 22న మూడు లేఖలు రాశారు. సుప్రీంకోర్టుతో పాటు అన్నిహైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఈ లేఖల్లో గొగోయ్ తెలిపారు.
జస్టిస్ గొగోయ్ రాసిన లేఖల్లోని అంశాలు
- హైకోర్టుల్లో జడ్జీల పదవీవిరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలి.
- గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు పదవీవిరమణ చేసిన జడ్జీలను నిర్ణీతకాలానికి మళ్లీ విధుల్లో తీసుకోవాలి.
- సుప్రీంకోర్టులో ప్రస్తుతం 58,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ కేసులను విచారించలేకపోతున్నాం.
- సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
- సుప్రీం, హైకోర్టుల్లో జడ్జీల పోస్టులకు అర్హులైనవారి సంఖ్య పెరిగినప్పటికీ, అదే స్థాయిలో న్యాయమూర్తుల సంఖ్య మాత్రం పెరగలేదు.
- హైకోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
- ప్రస్తుతం దేశంలోని అన్నిహైకోర్టుల్లో కలిపి 39 శాతం అంటే 399 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
- హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలి. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టండి.
- పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలి. నిర్ణీత కాలానికి వీరిని న్యాయమూర్తులుగా నియమించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 128, 224ఏ అధికరణలకు సవరణ చేయాలి. దీనివల్ల అపార అనుభవం ఉన్న జడ్జీలు మరింత ఎక్కువకాలం సేవలు అందించడం వీలవుతుంది.
- 1988లో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 18 నుంచి 26కు చేరుకుంది. అనంతరం 2009లో సీజేఐతో కలిపి జడ్జీల సంఖ్య 31కి చేరుకుంది.
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్
ఎందుకు : దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై
అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని మోదీకి జూన్ 23న లేఖ రాశారు. మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చే విషయంలో ముడుపులు అందుకున్నారని జస్టిస్ శుక్లాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ పీకే జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. దీంతో శుక్లాను విధుల నుంచి తొలగించండని గొగోయ్ ప్రధానిని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
ఎందుకు : అవినీతికి పాల్పడినందుకు
బిహార్ ఘటనలపై ప్రభుత్వాలకు నోటీసులు
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం జూన్ 24న ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిహార్ ఘటనలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై
మోటార్ వాహనాల బిల్లుకు కేబినెట్ ఆమోదం
మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019తో పాటు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ బిల్లు-2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డీఎన్‌ఏ బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్‌ఏ బ్యాంకు, ప్రాంతీయ ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే డీఎన్‌ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు.
మరోవైపు వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019ను రూపొందించారు.
ఈ బిల్లులోని అంశాలు..
- అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధింపు
- డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా
- డ్రైవింగ్ లెసైన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా
- రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా
- ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి.
- వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లెసైన్స్ రద్దు
- మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు
- ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంపు
- అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా
- ఓవర్ లోడింగ్ వాహనాలపై రూ.20 వేల పెనాల్టీవిధింపు.
ఏమిటి : మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019 ఆమోదం
ఎప్పుడు : 24
ఎవరు : కేంద్ర కేబినెట్
ఆరోగ్య సూచీలో కేరళకు అగ్రస్థానం
నీతి ఆయోగ్ జూన్ 25న విడుదల చేసిన ‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు-అభివృద్ధి భారతం’ అనే సూచీలో కేరళకు అగ్రస్థానం లభించింది. కేరళ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. 2015-16 నుంచి 2017-18కాలంలో ఆరోగ్యపరిరక్షణకు ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ సూచీని రూపొందించింది. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ సూచీలో ఉత్తర ప్రదేశ్, బిహార్‌లు దిగువ స్థానాల్లో ఉన్నాయి. హరియాణా, రాజస్తాన్, జార్ఖండ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి.
నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలోని మొదటి పది రాష్ట్రాలు
ర్యాంకు | రాష్ట్రం | పాయింట్లు |
1 | కేరళ | 76.55 |
2 | ఆంధ్రప్రదేశ్ | 65.13 |
3 | మహారాష్ట్ర | 63.99 |
4 | గుజరాత్ | 63.52 |
5 | పంజాబ్ | 63.01 |
6 | హిమాచల్‌ప్రదేశ్ | 62.41 |
7 | జమ్మూకశ్మీర్ | 62.37 |
8 | కర్ణాటక | 61.14 |
9 | తమిళనాడు | 60.41 |
10 | తెలంగాణ | 59.00 |
హైదరాబాద్‌లో ఇస్టా కాంగ్రెస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జూన్ 26న అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సును కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలో తొలిసారి ఇస్టా సదస్సు భారత్‌లో జరగడం గర్వకారణమన్నారు. ప్రపంచంలోనే భారతదేశంలో విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని చెప్పారు. దేశంలో విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలంగా ఉంద న్నారు. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే, అందులో తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయన్నారు.
ఇస్టా సదస్సుకు 80 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ మెక్‌గ్రిల్, ఇస్టా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రియాస్ వాయస్ సదస్సులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి
ఎక్కడ : నోవాటెల్, హైదరాబాద్
ఎన్‌ఆర్‌సీ నుంచి లక్ష పేర్లు తీసివేత
అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా నుంచి మరో 1,02,462 మందిని పేర్లను జూన్ 26న తొలగించారు. వివిధ కారణాల చేత వారందరూ భారత పౌరసత్వం పొందేందుకు అనర్హులని ఈ మేరకు ఎన్‌ఆర్‌సీ నుంచి వారిని తొలగించినట్లు ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీలో తమ పేర్లను చేర్చాలంటూ అస్సాంలో మొత్తం 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా, గతంలోనే 40 లక్షల మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఎన్‌ఆర్‌సీ ముసాయిదా నుంచి తొలగించారు. తాజాగా మరో లక్ష మంది పేర్లను తొలగించారు. జూలై 21న ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఆర్‌సీ నుంచి లక్ష పేర్లు తీసివేత
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్
ఎక్కడ : అస్సాం
ఉత్తమ ఠాణాల జాబితా విడుదల
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) జూన్ 26న ఉత్తమ ఠాణాలు-2018’ జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 86 పోలీస్‌స్టేషన్‌లతో రూపొందించిన ఈ జాబితాలో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకి చెందిన కలు పోలీస్ స్టేషన్ మొదటిస్థానంలో నిలిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని నికోబార్ జిల్లాలో గల క్యాంప్‌బెల్ బే ఠాణా రెండో స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో గల ఫరక్కా ఠాణా మూడో స్థానం పొందాయి. అలాగే తెలంగాణకి చెందిన నారాయణపురం ఠాణా 14వ స్థానం, చింతపల్లి పోలీసుస్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నారాయణపురం ఠాణా ఉండగా, నల్లగొండ జిల్లాలో చింతపల్లి పోలీసుస్టేషన్ ఉంది.
మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ ఠాణాల జాబితాను 2017 నుంచి రూపొందిస్తున్నారు.
జూలై 1 నుంచి జల్‌శక్తి అభియాన్
దేశవ్యాప్తంగా 2019, జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) ‘జల్‌శక్తి అభియాన్ (జేఎస్‌ఏ)’ అమలు చేయనున్నారు. జల్‌శక్తి అభియాన్‌లో భాగంగా దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ జూన్ 26న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. జల్‌శక్తి అభియాన్ ద్వారా జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో జూన్ 26న జరిగిన చర్చలో ఆయన ఈ మేరకు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, జూలై 1 నుంచి జల్‌శక్తి అభియాన్ అమలు
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : జల సంరక్షణ కోసం
ఏఎన్-32 దుర్ఘటనలో 13మంది మృతి
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏఎన్-32 విమానం కుప్పకూలిన దుర్ఘటనలో విమానంలో ఉన్న 13 మంది మరణించినట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) జూన్ 13న తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. రష్యాలో తయారైన ఏఎన్-32 విమానం అస్సాంలోని జొహ్రాట్ ప్రాంతం నుంచి చైనా సరిహద్దులోని మెంచుకాకు జూన్ 3న బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి గాలించగా 8 రోజుల తర్వాత సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దులో జూన్ 12న ఈ విమాన శకలాలు దొరికాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఎన్32 దుర్ఘటనలో 13మంది మృతి
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : భారత వైమానిక దళం(ఐఏఎఫ్)
ఎక్కడ : సియాంగ్, షియోమి జిల్లాల సరిహద్దు, అరుణాచల్ ప్రదేశ్
పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100
ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజనలో భాగంగా రైతులు ఇకపై ప్రతినెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూన్ 13న దిశానిర్దేశం చేశారు. పీఎం కిసాన్ పెన్షన్‌లో చేరిన రైతులు 60 ఏళ్ల వరకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం అంతేమొత్తం చెల్లిస్తుంది. రైతుకు 60 ఏళ్లు నిండాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్‌గా కేంద్రం చెల్లించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
నోయిడాలో కియా తొలి షోరూం
అనంతపురం జిల్లా పెనుకొండలో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన కియా మోటార్స్.. దేశంలో తొలి షోరూంను ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటుచేసింది. అనంతపురం ప్లాంట్‌లో ఏడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్న కియా వీటిని దేశీయ మార్కెట్‌లో విక్రయించేందుకు వీలుగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంటోంది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన సొంత విక్రయ కేంద్రాన్ని నోయిడాలో ఏర్పాటు చేశారు. ‘రెడ్ క్యూబ్’ పేరిట ప్రత్యేక థీమ్‌తో దేశవ్యాప్తంగా ఈ షోరూమ్‌లు ఏర్పాటు చేయాలని కియా భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో కియా తొలి షోరూం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 13
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
బిహార్‌లో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్
బిహార్‌లో ‘ముఖ్యమంత్రి వృద్ధజన్ పెన్షన్ యోజన’ పేరుతో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. దీంతో ఈ విధమైన పెన్షన్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా బిహార్ నిలిచింది. 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తీ తన ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం, కులాలకు అతీతంగా పెన్షన్‌ను అందుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వృద్ధులు లేదా ఎస్సీ, ఎస్టీ, వితంతువులు, వికలాంగులు మాత్రమే ఈ పథకాన్ని అందుకుంటున్నారు.
వృద్ధజన్ పెన్షన్ యోజన ద్వారా 80 ఏళ్లుపై బడిన వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.500 వేస్తారు. 60 నుంచి 80 మధ్య ఉన్న వారి ఖాతాల్లో రూ.400 వేస్తారు. పదవీ విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగానే పెన్షన్ వస్తుంది. వారికి ఈ పెన్షన్ పథకం వర్తించదు. ఈ పథకం కోసం రూ.18,000 కోట్ల ప్రత్యేక నిధులను బిహార్ ప్రభుత్వం కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముఖ్యమంత్రి వృద్ధజన్ పెన్షన్ యోజన పథకం
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
ఎక్కడ : బిహార్
5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: మోదీ
2024 నాటికి దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల(సుమారు రూ.35 కోట్ల కోట్లు) విలువైన ఆర్థిక వ్యవస్థగా మార్చడం సాధించగల లక్ష్యమేనని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాలు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)ని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. జూన్ 15న ఆయన నీతి ఆయోగ్ ఐదో పాలక మండలి సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తలెత్తిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితర సమస్యలపై సమష్టి పోరాటం సాగించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ రెట్టింపు కావాలి...
‘2019 మార్చి చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.75 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 కల్లా దీనిని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి మార్చడం కష్టమైనప్పటికీ సాధించగలిగిన లక్ష్యమే. జీడీపీని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు రాష్ట్రాలు తమ శక్తియుక్తులను ఉపయోగించాలి. దీంతోపాటు దేశీయ ఎగుమతులు భారీగా పెరగాల్సి ఉంది’అని మోదీ అన్నారు. ‘సాధికారిత, సులభ జీవనం ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తేవాలి. స్వల్ప, దీర్ఘ కాలిక లక్ష్యాలను అధిగమించేందుకు ఉమ్మడిగా ముందుకు సాగాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన స్వచ్ఛ భారత్ అభియాన్, పీఎం ఆవాస్ యోజన ఇందుకు ఉదాహరణ’అని తెలిపారు. ‘మహాత్మాగాంధీ 150వ వర్థంతికి లక్ష్యంగా పెట్టుకున్న వాటిని అక్టోబర్ 2వ తేదీకి సాధించాలి, 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను 2022 కల్లా అధిగమించేందు కృషి జరగాలి’ అని కోరారు.
పర్ డ్రాప్, మోర్ క్రాప్:
‘దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు వంటి పరిస్థితులున్నందున వీటిని ఎదుర్కొనేందుకు ప్రతి నీటి బొట్టుకు మరింత ఫలసాయం (పర్ డ్రాప్, మోర్ క్రాప్) విధానాన్ని అభివృద్ధి చేయాలి. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం చేపలపెంపకం, పశుపోషణ, ఉద్యానపంటలు, పూలు, కూరగాయల సాగు రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలి. పీఎం-కిసాన్ వంటి రైతు పథకాలు సకాలంలో ఉద్దేశించిన రైతులకు అందాలి’అని సూచించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి జరగాలని ప్రధాని అన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి కంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ నినాదం సాధనలో నీతి ఆయోగ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. అభివృద్ధి లక్షిత(అస్పిరేషనల్) 115 జిల్లాల్లో ఇంకా కొన్ని రంగాల్లో వెనుకబాటును అధిగమించేందుకు గుడ్ గవర్నెన్స్ పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులను కోరారు.
హాజరుకాని ముగ్గురు సీఎంలు..
కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, వాన నీటి సంరక్షణ, ఖరీఫ్ పంటల సన్నద్ధత, అభివృద్ధి లక్షిత జిల్లాల పథకం, వ్యవసాయరంగంలో మార్పులు, వామపక్ష తీవ్రవాదం వంటి ఐదు ప్రధానాంశాలపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోనంటూ ఇటీవల ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం పనుల్లో బిజీగా ఉన్నందున తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేదు. ఆరోగ్య సమస్యలతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తి ఆయోగ్ ఐదో పాలక మండలి సమావేశం
ఎప్పుడు: జూన్ 15
ఎవరు: ప్రధాని మోదీ
ఎక్కడ: న్యూఢిల్లీ
ఎందుకు: కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, వాన నీటి సంరక్షణ, ఖరీఫ్ పంటల సన్నద్ధత, అభివృద్ధి లక్షిత జిల్లాల పథకం, వ్యవసాయరంగంలో మార్పులు, వామపక్ష తీవ్రవాదం వంటి ఐదు ప్రధానాంశాలపై చర్చించేందుకు
రైళ్లలో మసాజ్ ప్రతిపాదన ఉపసంహరణ
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ అందించే ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే జూన్ 16న స్పష్టం చేసింది. మహిళలు ప్రయాణించే చోట ఇలాంటివి తగవని, ఇది భారత సంప్రదాయాలకు విరుద్ధమైనదంటూ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వాణీ, రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు జూన్ 10న లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖ రాసిన కొద్ది రోజులకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో తల, పాదాలకు మసాజ్ సౌకర్యాన్ని కల్పిస్తామని పశ్చిమ రైల్వేలోని రత్లమ్ డివిజన్ ప్రకటించింది. దీనిపై బీజేపీ ఎంపీ శంకర్, గత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ అభ్యంతరాలను లేవనెత్తారు. ఇది మహిళలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ మసాజ్ కేవలం తలకు, పాదాలకు మాత్రమే తప్ప శరీరమంతటికీ కాదని రత్లమ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్‌ఎన్ సుంకర్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ అందించే ప్రతిపాదన ఉపసంహ రణ
ఎప్పుడు: జూన్ 16
ఎక్కడ: పశ్చిమ రైల్వే
ఎందుకు: ఇది మహిళలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని..
బిహార్‌లో 103 మంది చిన్నారులు మృతి
బిహార్ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి కారణంగా 103 చిన్నారులు మరణించారు. ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు జూన్ 17న ప్రాణాలు కోల్పోవడంతో మృతి చెందిన వారి సంఖ్య 103కి చేరింది. చిన్నారుల మరణాలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 103 మంది చిన్నారులు మృతి
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : బిహార్
ఎందుకు : మెదడువాపు వ్యాధి కారణంగా
అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా అమెజాన్
భారత ఉద్యోగుల్లో అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిలిచింది. ఈ మేరకు 2019 ఏడాదికి గానూ రూపొందించిన జాబితాను రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) జూన్ 17న విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ ఇండియా 2వ స్థానంలోనూ, సోనీ ఇండియా 3వ స్థానంలో ఉన్నాయి. అలాగే మెర్సిడెస్ బెంజ్ 4వ స్థానం, ఐబీఎం (5), లార్సెన్ అండ్ టూబ్రో (6), నెస్లే ఇండియా (7 ), ఇన్ఫోసిస్ (8), శాంసంగ్ (9), డెల్ (10)వ స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా అమెజాన్ ఇండియా
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్)
ఎక్కడ : భారత్
17వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం
17వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 17న ప్రారంభమయ్యాయి. సమావేశాల మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులు ఎందరున్నారన్నది ముఖ్యం కాదని, వారిచ్చే ప్రతి సూచనా ప్రభుత్వానికి విలువైందేనని అన్నారు. తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో సీనియర్ సభ్యుడు వీరేంద్ర కుమార్ చేత ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఐఓటీసీ 23వ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్‌లో ఇండియన్ ఓషియన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ) 23వ అంతర్జాతీయ సమావేశాలు జూన్ 17న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ట్యూనా చేపల వ్యాపారంపై 31 దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి రజని సిఖ్రీ సిబాల్ మాట్లాడుతూ.. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో 6.3 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. భారత్ నుంచే 20 శాతం ట్యూనా చేపల ఉత్పత్తి జరుగుతున్నట్లు ఐఓటీసీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఓషియన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ) 23వ అంతర్జాతీయ సమావేశాలు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 17
ఎక్కడ : హైదరాబాద్
సంస్కృత భాషలో పత్రికా ప్రకటన
సంస్కృత భాష పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హిందీ, ఇంగ్లీషులతో పాటు సంస్కృత భాషలోనూ పత్రికా ప్రకటనలను విడుదల చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు సీఎం కార్యాలయంలోని సంబంధిత విభాగం దీనిని అమలులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నమూనా పత్రాన్ని విడుదల చేసింది. దీంతో సంస్కృత భాషలో పత్రికా ప్రకటనలు విడుదల చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సంస్కృత తరగతులను ప్రారంభించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంస్కృత భాషలో పత్రికా ప్రకటన
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు : సంస్కృత భాష పరిరక్షణ కోసం
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక
17వ లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మూజువాణి ఓటు ద్వారా జూన్ 19న ఎన్నిక ప్రక్రియ చేపట్టగా.. సభ్యులు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్‌గా ఎన్నికై న ఓం బిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ తదితరులు సభాస్థానం వరకూ తోడ్కొని వెళ్లగా బిర్లా స్పీకర్ స్థానంలో ఆసీనులయ్యారు. రాజస్తాన్‌లోని కోట-బూందీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 57 ఏళ్ల బిర్లా మొత్తం మీద రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో మొట్టమొదటిసారిగా కోట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తొలిసారిగా తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : ఓం బిర్లా
జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 19న ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే జూన్ 19 నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
ఎవరు: ప్రధాన మంత్రి నరరేరంద్ర మోదీ
ఎప్పుడు: జూన్ 19న
క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబే, ఢిల్లీ
క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ జూన్ 19న విడుదలవ్వగా ఐఐటీ-బాంబే(152), ఐఐటీ-ఢిల్లీ(182), ఐఐఎస్‌సీ-బెంగళూరు(184)లకు టాప్- 200లో స్థానం లభించింది. ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-రూర్కీలకు టాప్-400లో చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్‌స 2020ని లండన్‌లో విడుదల చేశారు. భారత్ నుంచి ఓపీ జిందాల్ టాప్-1,000లో చోటు సంపాదించిన అత్యంత కొత్త యూనివర్సిటీగా నిలిచింది. జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ తదితరాలకు కూడా ర్యాంకులు దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్యూఎస్ ర్యాంకింగ్‌సలో ఐఐటీ-బాంబే(152), ఐఐటీ-ఢిల్లీ(182), ఐఐఎస్‌సీ-బెంగళూరు(184) అగ్రస్థానంలో ఉన్నాయి.
ఎవరు: క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020
ఎక్కడ: లండన్
సీఐఐ సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) న్యూఢిల్లీ జూన్ 6న నిర్వహించిన సద స్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా సీఐఐ సదస్సులో జై శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్)తో కొన్ని సమస్యలున్న నేపథ్యంలో బిమ్స్‌టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు మారిన సమీకరణాలతో చైనా ప్రాముఖ్యం పెరిగిందని, అదేవిధంగా భారత్ పలుకుబడి కూడా విస్తరించిందని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఐఐ సదస్సులో విదేశాంగ శాఖ మంత్రి
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : జైశంకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎనిమిది కేబినె ట్ కమిటీలు ఏర్పాటు
కేంద్రప్రభుత్వం ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాలను (కేబినెట్ కమిటీ) ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లో కొన్నిటికి ప్రధాని నరేంద్ర మోదీ, మరికొన్నిటికి హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షులుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కమిటీల్లో అమిత్‌షాకు స్థానం లభించగా... ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరు కమిటీల్లో చోటు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.
ఎనిమిది కేబినెట్ కమిటీలు-సభ్యలు
భద్రత వ్యవహారాలు (సీసీఎస్): ప్రధాని నరేంద్ర మోదీ; రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాక మంత్రి ఎస్. జయశంకర్.
నియామకాల కేబినెట్ కమిటీ (సీసీఏ): ప్రధాని నరేంద్ర మోదీ; హోం శాఖ మంత్రి అమిత్ షా
రాజకీయ వ్యవహారాలు (సీసీపీఏ): మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, నిర్మల, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, హర్షవర్ధన్, పీయూష్ గోయల్, అరవింద్ సావంత్, ప్రహ్లాద్ జోషి
మౌలిక సౌకర్యాలు: అమిత్ షా, గడ్కరీ, నిర్మల, పీయూష్ గోయల్, ప్రత్యేక ఆహ్వానితులుగా జితేంద్ర సింగ్, హర్దీప్ సింగ్ పురి
ఆర్థిక వ్యవహారాలు: మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, సదానంద గౌడ, నిర్మల, నరేంద్ర సింగ్ తోమర్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, రవిశంకర్ ప్రసాద్, ఎస్.జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్
పార్లమెంటరీ వ్యవహారాలు: అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మల, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, తావర్ చంద్ గెహ్లాట్, ప్రకాశ్ జావడేకర్, ప్రహ్లాద్ జోషి, ప్రత్యేక ఆహ్వానితులుగా అర్జున్ రామ్ మేఘ్‌వాల్, మురళీధరన్
ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు: మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, నిర్మల, పీయూష్ గోయల్
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి: మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా, నిర్మల, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ పోఖ్రియాల్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేంద్రనాథ్ పాండే, సంతో్‌షకుమార్ గంగ్వార్, హర్దీప్ సింగ్ పురి. ప్రత్యేక ఆహ్వానితులుగా గడ్కరీ, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, స్మృతి ఇరానీ, ప్రహ్లాద్ సింగ్ పటేల్.
నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ
రాజీవ్‌కుమార్ ఉపాధ్యక్షుడిగా నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 6న ఆమోదం తెలిపారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌లను నీతి ఆయోగ్‌లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా నియమించారు. కాగా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, తవార్‌చంద్ గెహ్లాట్, ఇంద్రజిత్ సింగ్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. నీతి ఆయోగ్‌లో ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా ఉన్న వీకే సారస్వత్, రమేష్ చంద్, వీకే పాల్‌లు కొనసాగనున్నారు. అయితే, 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పుడు శాశ్వత సభ్యుడిగా ఉన్న వివేక్ దెబ్రోయ్‌కు ఉద్వాసన పలికారు.
ఉత్తరప్రదేశ్‌లో ధూళి తుపాను
ఉత్తరప్రదేశ్‌లో ధూళి తుపాను బీభత్సం సృష్టించింది. జూన్ 7న సంభవించిన ఈ తుపాను కారణంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26 మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. తుపాను ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, చెట్లు నేలకొరిగాయి. మైన్‌పురిలో పలు చోట్ల గోడ కూలిన ఘటనలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
జయ్‌శంకర్ తొలి విదేశీ పర్యటన
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయ్‌శంకర్ తన తొలి విదేశీ పర్యటనను భూటాన్‌తో ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు వెళ్లిన ఆయన జూన్ 7న ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌తో చర్చలు జరిపారు. భాగస్వామ్య అభివృద్ధి, జలవిద్యుత్తు రంగంపై సహకారం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. అంతకుముందు జయ్‌శంకర్ భూటాన్ విదేశాంగమంత్రి టాండి డోర్జీతో చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ శాఖ మంత్రి జయ్‌శంకర్ తొలి విదేశీ పర్యటన
ఎప్పుడు : జూన్7 :
ఎక్కడ : భూటాన్
అరుణాచల్ రాష్ట్ర పార్టీగా జేడీయూ
అరుణాచల్‌ప్రదేశ్‌లో జనతా దళ్ (యునెటైడ్)ను రాష్ట్ర పార్టీగా గుర్తిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ జేడీయూ ఏడు స్థానాలు గెలుచుకుంది. అధికార పార్టీ బీజేపీకి 41 స్థానాలతో పూర్తి మెజారిటీ దక్కింది. బీహార్‌తోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లలో జేడీయూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించిందని, ఆ పార్టీ ఇప్పుడు తన ఎన్నికల గుర్తు ‘బాణం’ను అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. జేడీయూకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అరుణాచల్ రాష్ట్ర పార్టీగా జేడీయూ
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఎన్నికల సంఘం
రైతులందరికీ పీఎం-కిసాన్
దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి (పీఎం-కిసాన్) పథకం వర్తింపజేయాలనే నిర్ణయంపై కేంద్రప్రభుత్వం జూన్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం జేస్తారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. దీంతో దీని అంచనా వ్యయం కూడా 2019-20లో రూ.87,217.50 కోట్లకు పెరుగుతుంది.
ప్రస్తుతమున్న భూయాజమాన్య విధానాన్ని ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించే బాధ్యత, వారి డేటా పీఎం-కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతులందరికీ పీఎం-కిసాన్
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : కేంద్రప్రభుత్వం
విద్యా విధానంపై రాష్ట్రాల సమావేశం
జాతీయ విద్యా విధాన ముసాయిదాపై జూన్ 22వ తేదిన వివిధ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులకు కేంద్ర మానవ వనరుల శాఖ నుండి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలు సేకరిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ జూన్ 10న తెలిపారు. ప్రభుత్వం నియమించిన కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం చేసి ఇటీవల 484 పేజీల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ విద్యా విధాన ముసాయిదాపై రాష్ట్రాలతో సమావేశం
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్
కఠువా కేసులో పఠాన్‌కోట్ కోర్టు తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ జూన్ 10న తీర్పు వెలువరించారు. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులగా తేల్చిన కోర్టు.. వారిలో వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్‌ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ కేసులో ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్‌కుమార్‌లను దోషులగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది.
జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో 2018, జనవరిలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. మొదటగా కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు ఈ కేసు విచారణ ప్రారంభం అయింది. అయితే కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోట్ కోర్టుకు ఈ కేసును సుప్రీంకోర్టు బదీలి చేసింది. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుపై విచారణ చేపట్టిన పఠాన్‌కోట్ కోర్టు జూన్ 10 తీర్పు వెలువరించింది. రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద ఆరుగురిని దోషులుగా కోర్టు తేల్చింది.
ఏఎన్ 32 విమానం శకలాల గుర్తింపు
ఇటీవల గల్లంతైన వాయుసేన ఏఎన్-32 విమానం శకలాలను 8 రోజుల తర్వాత జూన్ 11న అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపోకు సమీపంలో గుర్తించారు. లిపోకు ఉత్తరాన, టాటోకు ఈశాన్యంగా 16 కిలోమీటర్ల దూరంలో 12 వేల అడుగుల ఎత్తయిన ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17తో జరిపిన గాలింపులో ఏఎన్-32 శకలాలు కన్పించాయని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న 13 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. జూన్ 3వ తేదీన అస్సాంలోని జోర్‌హట్ నుంచి చైనా సరిహద్దు సమీపంలోని మెచూకా బయలుదేరిన ఈ విమానం తర్వాత రాడార్ నుంచి అదృశ్యమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఎన్ 32 విమానం శకలాల గుర్తింపు
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : భారత వాయుసేన
ఎక్కడ : లిపో, అరుణాచల్ ప్రదేశ్
లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్
లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ వీరేంద్ర కుమార్ నియమిస్తూ జూన్ 11న కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 7 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టికమ్‌గఢ్ నుంచి ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో ఇంతకుముందు కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. ప్రోటెం స్పీకర్‌గా ఆయన ఆధ్వర్యంలోనే కొత్త ఎంపీల ప్రమాణస్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక జరగనున్నాయి. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 17వ తేదీ నుంచి జూలై 26 వరకు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : వీరేంద్ర కుమార్
కోల్‌కతాలో విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ
కోల్‌కతాలోని విద్యాసాగర్ కళాశాల వద్ద పంతొమ్మిదవ శతాబ్దపు ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నూతన ప్రతిమను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 11న ఆవిష్కరించారు. విద్యాసాగర్ పాత ప్రతిమను 2019, మేలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో సందర్భంగా కొందరు ధ్వంసం చేశారు. కాగా అదే కళాశాల భవనం ఎదుట 8.5 అడుగుల ఎత్తు కలిగిన విద్యాసాగర్ తెల్లని ఫైబర్ గ్లాస్ విగ్రహాన్నీ మమత ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఎక్కడ : విద్యాసాగర్ కళాశాల, కోల్‌కతా, పశ్చిమబెంగాల్
డీఎస్‌ఏ ఏర్పాటుకు కేబినెట్ కమిటీ నిర్ణయం
అంతరిక్షంలో యుద్ధాలు సాగించేందుకు అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్‌ఏ)ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జూన్ 11న సమావేశమైన రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) నిర్ణయించింది. డీఎస్‌ఏకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఎస్‌ఆర్‌వో)ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. డీఎస్‌ఏలో ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందంతోపాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. బెంగళూరు కేంద్రంగా ఎయిర్ వైస్ మార్షల్ అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది.
ఇటీవల భారత్ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్‌ఆర్‌వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్‌ఏ) ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్)
ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ఆధార్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదం తెలిపింది. 2019, మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో జూన్ 12న సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్‌ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్‌ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ మే 30న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. మోదీతో సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. మంత్రులందరికీ శాఖలను కేటాయిస్తూ మే 31న రాష్ట్రపతి కార్యలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రమంత్రులు - శాఖల వివరాలు
కేంద్రమంత్రులు | శాఖల వివరాలు |
కేబినెట్ హోదా మంత్రులు | |
1.నరేంద్ర మోదీ | : ప్రధాన మంత్రి, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల శాఖ; అణు ఇంధన శాఖ; అంతరిక్ష విభాగం; అన్ని ముఖ్యమైన విధానపర నిర్ణయాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు |
2. రాజ్‌నాథ్ సింగ్ | : రక్షణ శాఖ |
3. అమిత్ అనిల్ చంద్ర్ షా | : హోం శాఖ |
4. నితిన్ జైరాం గడ్కరీ | : రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు |
5. సదానంద గౌడ | : రసాయన, ఎరువుల శాఖ |
6. నిర్మలా సీతారామన్ | : ఆర్థిక శాఖ |
7. రాంవిలాస్ పాశ్వాన్ | : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు |
8. నరేంద్ర సింగ్ తోమర్ | : వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ |
9. రవిశంకర్ ప్రసాద్ | : న్యాయ, సమాచార, ఐటీ శాఖ |
10. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ | : ఆహార శుద్ధి పరిశ్రమ |
11. థావర్ చంద్ గెహ్లాట్ | : సామాజిక న్యాయం, సాధికారత |
12. డా. సుబ్రమణ్యం జైశంకర్ | : విదేశాంగశాఖ |
13. రమేష్ పొక్రియాల్ | : మానవ వనరుల అభివృద్ధిశాఖ |
14. అర్జున్ ముండా | : గిరిజన సంక్షేమం |
15. స్మృతీ జుబిన్ ఇరానీ | : స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ |
16. డాక్టర్ హర్షవర్ధన్ | : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం |
17. ప్రకాశ్ కేశవ్ జవదేకర్ | : పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ |
18. పీయూష్ గోయల్ | : రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ |
19. ధర్మేంద్ర ప్రధాన్ | : పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ |
20. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ | : మైనార్టీ సంక్షేమశాఖ |
21. ప్రహ్లాద్ జోషి | : పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ |
22. మహేంద్రనాథ్ పాండే | : నైపుణ్యాభివృద్ధి శాఖ |
23. అర్వింద్ గణపత్ సావంత్ | : భారీ పరిశ్రమలు |
24. గిరిరాజ్ సింగ్ | : పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్ |
25. గజేంద్ర సింగ్ షెకావత్ | : జలశక్తి |
కేంద్ర సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) | |
1. సంతోష్ కుమార్ గంగ్వార్ | : శ్రామిక, ఉపాధి కల్పన శాఖ |
2. రావ్ ఇంద్రజిత్ సింగ్ | : ప్రణాళిక, గణాంక శాఖ |
3. శ్రీపాద్ యశో నాయక్ | : ఆయుష్, రక్షణశాఖ |
4. డాక్టర్ జితేంద్ర సింగ్ | : ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి |
5. కిరణ్ రిజిజు | : క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు |
6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ | : సాంస్కృతిక పర్యాటక శాఖ |
7. రాజ్ కుమార్ సింగ్ | : విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి |
8. హర్‌దీప్ సింగ్ పూరి | : గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ |
9. మన్‌సుఖ్ మాండవ్యా | : షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు |
కేంద్ర సహాయ మంత్రులు | |
1. ఫగణ్‌సింగ్ కులస్తే | : ఉక్కు శాఖ |
2. అశ్వనీ కుమార్ చౌబే | : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం |
3. అర్జున్ రామ్ మేఘ్వాల్ | : పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు |
4. వీకే సింగ్ | : రహదారులు, రవాణాశాఖ |
5. కృషన్ పాల్ | : సామాజిక న్యాయం, సాధికారత |
6. దాదారావ్ పాటిల్ దాన్వే | : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ |
7. జి.కిషన్ రెడ్డి | : హోంశాఖ |
8. పర్షోత్తం రుపాలా | : వ్యవసాయం, రైతు సంక్షేమం |
9. రాందాస్ అథవాలే | : సాంఘిక న్యాయం, సాధికారత |
10. సాధ్వి నిరంజన్ జ్యోతి | : గ్రామీణాభివృద్ధి |
11. బాబుల్ సుప్రియో | : అటవీ పర్యావరణ శాఖ |
12. సంజీవ్ కుమార్ బాల్యాన్ | : పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్ |
13. ధోత్రే సంజయ్ శ్యామ్ రావు | : మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీశాఖ |
14. అనురాగ్ సింగ్ ఠాకూర్ | : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు |
16. నిత్యానంద్ రాయ్ | : హోంశాఖ |
17. రతన్ లాల్ కటారియా | : నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత |
18. వి.మురళీధరన్ | : పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు |
19. రేణుకా సింగ్ సరూతా | : గిరిజన వ్యవహరాలు |
20. సోమ్ ప్రకాష్ | : పరిశ్రమలు, వాణిజ్యం |
21. రామేశ్వర్ టేలి | : ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ |
22. ప్రతాప్ చంద్ర సారంగి | : మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ |
23. కై లాష్ చౌదరి | : వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ |
24. దేబశ్రీ చౌదురి | : మహిళా శిశు సంక్షేమ శాఖ |
- ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హామీద్, శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన, నేపాల్ ప్రధాని ఓలీ సహా ఆరుదేశాల(బిమ్స్‌టెక్) అధినేతలు హాజరయ్యారు.
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా దేశవిదేశాలకు చెందిన 8,000 మంది అతిథులు హాజరయ్యారు
- కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, అడ్వాణీ, ఆధ్యాత్మికగురువు జగ్గీవాసుదేవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ హాజరయ్యారు.
- పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు, బెంగాల్ ఘర్షణల్లో అమరులైన బీజేపీ కార్యకర్తల కుటుంబాలు వచ్చాయి.
- రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ఆర్టికల్ 75(4) ప్రకారం ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాలి.
- పూర్తి పేరు: నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.
- జననం: 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని మోహ్‌సానా జిల్లా వాద్‌నగర్‌లో వెనుకబడిన సామాజికవర్గానికి (ఓబీసీ) చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
- తల్లిదండ్రులు: దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోదీ, హీరాబెన్. ఆరుగురి సంతానంలో మూడోవ్యక్తి నరేంద్ర మోదీ
- విద్య: రాజనీతిశాస్త్రంలో పీజీ
- వివాహం: 1968లో జశోదాబెన్‌తో కౌమారదశలో. మోదీ తన సోదరుడితో కలసి ఒక టీస్టాల్ నడిపారు చిన్ననాడే ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా చేరారు. విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో పూర్తిస్థాయి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా మారారు.
- 2001: అక్టోబరులో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
- 2014 మే 26 : తొలిసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం.
పీఎంకేఎస్‌ఎస్ పరిధిలోకి కొత్తగా 2 కోట్ల రైతులు
రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్‌ఎస్) పథకం పరిధిలోకి కొత్తగా 2 కోట్ల మంది రైతులను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మే 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉండే 12.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల కోసం మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. తాజా కేబినెట్ భేటీలో ఈ 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) కేంద్రం ఎత్తివేసింది. దీంతో మొత్తం 14.5 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం ఏటా రూ.75,000 కోట్ల నుంచి రూ.87,217.50 కోట్లకు చేరుకోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎంకేఎస్‌ఎస్ పరిధిలోకి కొత్తగా 2 కోట్ల రైతులు
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) ఎత్తివేయడం ద్వారా
పీఎం కిసాన్ పెన్షన్‌కు ఆమోదం
రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్(పీఎంకేపీవై) పథకానికి కేంద్ర కేబినెట్ మే 31న ఆమోదం తెలిపింది. తొలుత 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను కేంద్రం ఈ పథకం పరిధిలోకి తీసుకురానుంది. 18-40 ఏళ్ల మధ్య వయసుండే రైతులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతన్నలు పీఎంకేపీ పథకం కింద ఎంత జమచేస్తారో, కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. వీరి వయసు 60 సంవత్సరాలు దాటాక ప్రతినెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారు. దీనివల్ల ఖజానాపై ఏటా రూ.10,774.5 కోట్ల భారం పడనుంది. మరోవైపు చిరువ్యాపారులకు సంబంధించిన పెన్షన్ పథకానికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల దాదాపు 3 కోట్ల మంది చిల్లర వర్తకులకు లబ్ధిచేకూరనుంది.
సాయుధ స్కాలర్‌షిప్ పెంపు..
శత్రుమూకలతో పోరాడుతూ అమరులైన, పదవీవిరమణ చేసిన సాయుధ, పారామిలటరీ బలగాలు, రైల్వే పోలీసుల కుటుంబసభ్యులకు లబ్ధిచేకూర్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం(పీఎంఎస్‌ఎస్) కింద ప్రస్తుతం అమర జవాన్ల కుమారులకు నెలకు రూ.2,000 కుమార్తెలకు రూ.2,250 అందజేస్తున్నారు. తాజాగా కుమారులకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.2,500కు, అమ్మాయిలకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.3,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలను కూడా ఈ జాబితాలో చేర్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్(పీఎంకేపీవై) పథకానికి ఆమోదం
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్ర కేబినెట్
పంజాబ్ మెయిల్‌కు 107 ఏళ్లు పూర్తి
మన దేశంలోనే అత్యంత దూరం నడిచే పాత రైలు బండి పంజాబ్ మొయిల్ జూన్ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఆవిరితో నడిచే ఈ రైలును 1912 జూన్ 1న ప్రారంభించారు. బ్రిటిషు ఇండియాలో ముంబై నుంచి పెషావర్ (ప్రస్తుతం పాక్‌లో ఉంది) వరకు ఈ రైలు నడిచింది. బ్రిటీష్ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందిన పంజాబ్ మెయిల్ ప్రస్తుతం విద్యుత్‌తోనే నడుస్తుంది. ప్రస్తుతం ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వరకు నడుస్తోంది.
అదేవిధంగా ముంబై నుంచి పుణెకు నడిచే డెక్కన్ క్వీన్ 89 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1930జనవరి 1న ప్రారంభమైన ఈ రైలు దేశంలో తొలి డీలక్స్ రైలుగా పేరొందింది.
డ్రెస్‌కోడ్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు
ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్‌కోడ్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం జూన్ 1న ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్ కమీజ్, చుడీదార్‌లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. అలాగే పురుషులు ప్యాంటు, షర్టు ధరించి రావాలని, రంగు రంగుల టీ షర్టులు ధరించరాదని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డ్రెస్‌కోడ్‌పై ఆదేశాలు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
జార్ఖండ్ రాజధాని రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 21న జరిగే ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న మొదటి అతి పెద్ద బహిరంగ కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఢిల్లీ, సిమ్లా, మైసూర్, అహ్మదాబాద్, రాంచీ నగరాలను ప్రాథమికంగా ఎంపిక చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) పంపింది. పీఎంఓ ఆ నగరాల నుంచి రాంచీని ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఎప్పుడు : జూన్ 2
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
హిందీ తప్పనిసరి నిబంధన తొలగింపు
హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలంటూ జాతీయ నూతన విద్యా విధానం-2019(డ్రాఫ్టు)లో పొందుపరిచిన నిబంధనను కేంద్రప్రభుత్వం తొలగించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ జూన్ 3న ఈమేరకు ముసాయిదాలో మార్పులు చేసింది. హిందీయేతర రాష్ట్రాల్లోనూ తృతీయ భాషగా హిందీని విద్యార్థులు అభ్యసించాలన్న ప్రతిపాదనపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది.
ఆరు లేదా ఏడో తరగతి(గేడ్)లో విద్యార్థులు తృతీయ భాషను ఎంచుకోవటం/మార్చుకోవటం చేయవచ్చని తాజాగా పేర్కొంది. తొలి ముసాయిదాలో దేశంలో విద్యార్థులు ఏ రాష్ట్రంలో చదువుతున్నా త్రిభాషా విధానంలో హిందీ, ఇంగ్లిష్ తప్పనిసరిగా కొనసాగాలని ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిందీ తప్పనిసరి నిబంధన తొలగింపు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : జాతీయ నూతన విద్యా విధానం-2019(డ్రాఫ్టు)లో
ఎందుకు : దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో
ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణం
దేశ రాజధాని డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 3న ప్రకటించారు. మహిళల ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిని రాబోయే 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బస్సులు, మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : ఢిల్లీ
జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు
2019, జూన్ 20 నుంచి జూలై 26 వరకు రాజ్యసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ జూన్ 3న వెల్లడించారు. అదేవిధంగా లోక్‌సభ సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 20వ తేదీన రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఎన్‌ఏఆర్‌ఎల్ రజతోత్సవాల్లో వెంకయ్య
తిరుపతికి సమీపంలోని గాదంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ (ఎన్‌ఏఆర్‌ఎల్) ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవాల్లో జూన్ 3న భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, రోజు రోజుకు పెరిగిపోతున్న భూతాపంపై మరిన్ని పరిశోధనలు పెరగాలని ఈ సందర్భంగా వెంకయ్య పిలుపునిచ్చారు. వాతావరణం మార్పులపై కచ్చితమైన సమాచారం అందించే మార్గాలను అన్వేషించాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఏఆర్‌ఎల్ రజతోత్సవాల్లో ఉపరాష్ట్రపతి
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు
ఎక్కడ : గాదంకి, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఐఏఎఫ్ ఏఎన్32 విమానం గల్లంతు
భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాం లోని జొర్హాత్ నుంచి జూన్ 3న 13 మందితో బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. విమానం గల్లంతైన ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ బహదూరియాతో తాను మాట్లాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
2009 జూన్ నెలలో కూడా ఇటువంటి ఘటనే అరుణాచల్‌లో జరిగింది. ఏఎన్-32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఏఎఫ్ ఏఎన్32 విమానం గల్లంతు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు :
ఎక్కడ : అస్సాంలోని జొర్హాత్- అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకా మధ్యలో
సియాచిన్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌ను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జూన్ 3న సందర్శించారు. మంత్రితోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్‌రావత్, ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రణ్‌బీర్‌సింగ్ ఉన్నారు. దేశ సేవకు తమ పుత్రులను అనుమతించిన సైనికుల తల్లిదండ్రులకు స్వయంగా తానే కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు రాస్తానని చెప్పారు. సియాచిన్‌లో భద్రతాదళాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి కమాండర్లతో సమీక్షించారు. సియాచిన్ గ్లేసియర్‌ను రక్షించే క్రమంలో 1100 మందికిపైగా సైనికులు అమరులయ్యారు. సముద్ర మట్టం నుంచి 12వేల అడుగులకుపైగా ఎత్తులో సియాచిన్ యుద్ధక్షేత్రం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించిన రక్షణమంత్రి
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రాజ్‌నాథ్‌సింగ్
ఆగస్టు తర్వాత కశ్మీర్ శాసనసభ ఎన్నికలు
2019, ఆగస్టు 15న అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) జూన్ 4న తెలిపింది. అమర్‌నాథ్ యాత్ర జూలై నెలలో ప్రారంభం కానుంది. 2018 జూన్‌లో పీడీపీ-బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం కశ్మీర్‌లో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వ పాలన లేదు. ఆ రాష్ట్రంలో 2018 జూన్ 19 నుంచి డిసెంబర్ 19 వరకు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన నడుస్తోంది. జూన్ 19న రాష్ట్రపతి పాలన గడువు ముగుస్తుండగా, దాన్ని పొడిగించేందుకు అంతా సిద్ధం చేశారు.
విద్యావ్యవస్థను సంస్కరించండి : సుప్రీంకోర్టు
వివిధ కోర్సుల అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు అధిక ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి లేకుండా చూడటం కోసం మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు జూన్ 4న ఆదేశించింది. మహారాష్ట్రలో 2019-20 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విద్యార్థులు పడుతున్న దురవస్థ గురించి కోర్టు ప్రస్తావిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. మెడికల్ లేదా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల మెదళ్లలో అనిశ్చితి నెలకొంటోందని జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాల వేసవికాల సెలవుల ధర్మాసనం పేర్కొంది.
మహారాష్ట్రలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 14లోపు తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యావ్యవస్థను సంస్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : వివిధ కోర్సుల అడ్మిషన్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా
15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ తెలిపారు. ఖాదీ, ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. ఈ మేరకు జూన్ 5న జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు గడ్కరీ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు చేపడతాం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ
పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై కేబినెట్ కమిటీలు
విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశచరిత్రలోనే తొలిసారిగా రెండు కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు కమిటీలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వహించనున్నారు. పెటుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీ కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్‌గోయల్‌లను సభ్యులుగా ఉన్నారు. భారత్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆర్థికవ్యవస్థ వృద్ధిపై కమిటీ దృష్టి సారించనుంది.
అదే విధంగా ఉద్యోగకల్పన-నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్దీప్ పురీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు యువత ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై కేబినెట్ కమిటీలు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు
స్వచ్ఛమైన భూమిని అందిద్దాం : కోవింద్
పచ్చని.. స్వచ్ఛమైన భూమిని భావితరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి ప్రకృతితోనే ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5న దేశ ప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి సందేశాన్నిచ్చారు. మరోవైపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ #SelfieWithSapling campaign ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి, దాంతోపాటు ఓ సెల్ఫీ దిగి పంపాలని మంత్రి పిలుపునిచ్చారు.
- ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం-2019 థీమ్: బీట్ ఎయిర్ పోల్యూషన్.
భద్రతా వ్యవహారాల కమిటీ ఏర్పాటు
దేశభద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్‌శంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను పర్యవేక్షించేందుకు
భారత్‌లోని పది నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 15 నగరాల్లో 11 నగరాలు భారత్‌లోనే ఉన్నాయని ఈఐ డొరాడో వెదర్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ మేరకు జూన్ 3న ఒక జాబితాను విడుదల చేసింది. 2019, జూన్ 2న వివిధ నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా వెదర్ వెబ్‌సైట్ ఈ జాబితాను రూపొందించింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన భారత్‌లోని 11 నగరాలు
సంఖ్య | నగరం | ఉష్ణోగ్రత(డిగ్రీ సెల్షియస్‌లో) | రాష్ట్రం |
1 | చురు | 50.3 | రాజస్థాన్ |
2 | శ్రీ గంగానగర్ | 48.7 | రాజస్థాన్ |
3 | బికనీర్ | 48.4 | రాజస్థాన్ |
4 | ఫలోడి | 48.2 | రాజస్థాన్ |
5 | జైసల్మేర్ | 47.8 | రాజస్థాన్ |
6 | నౌగాంగ్ | 47.7 | మధ్యప్రదేశ్ |
7 | నార్నౌల్ | 47.6 | హరియాణ |
8 | ఫిలాని | 47.5 | రాజస్థాన్ |
9 | కోట ఎయిరోడ్రోమ్ | 47.5 | రాజస్థాన్ |
10 | సవాల్ మాదోపూర్ | 47.2 | రాజస్థాన్ |
11 | బార్మెర్ | 47.2 | రాజస్థాన్ |