Skip to main content

జూన్ 2017 జాతీయం

కర్ణాటకలో రైతు రుణమాఫీ
Current Affairs
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.50 వేల లోపు ఉండి సహకార బ్యాంకులు, సంఘాల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జాతీయ, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లో అప్పులు పొందిన రైతులకు రుణమాఫీ వర్తించదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. రుణాలను రద్దు చేయడం వల్ల ఖజానాపై రూ.8,165 కోట్ల భారం పడనుంది. ఈ నెల 20 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న 22,27,506 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతు రుణాలను మాఫీ చేసిన మరో రాష్ట్రం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు: కర్ణాటక ప్రభుత్వం
ఎందుకు : రూ. 50 వేల లోపు రుణాలకే వర్తింపు

స్మార్ట్ సిటీల మూడో జాబితాలో 30 నగరాలు
స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధి చేసే నగరాల 3వ జాబితాను కేంద్రం జూన్ 23న విడుదల చేసింది. పట్టణ పరివర్తన అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మొత్తం 30 నగరాలతో కూడిన జాబితాను వెల్లడించింది. దీంతో ఇప్పటి దాకా ప్రకటించిన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరింది. తదుపరి దఫాలో 20 పట్టణాల నుంచి 10 స్మార్ట్ సిటీలను ఎంపికచేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు.
ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో, ఆ తరువాత వరుసగా ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కరీంనగర్ (తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలకు చోటు దక్కింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన నగరాలకు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు అందుతాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 500 కోట్లు కాగా రాష్ట్రం వాటా రూ.500 కోట్లు.
తాజా జాబితాలోని ఇతర పట్టణాలు
పట్నా, ముజఫర్‌పూర్, పుదుచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నల్, సాత్నా, బెంగళూరు, షిమ్లా, డెహ్రాడూన్, తిరుప్తూపర్, పింప్రిచించ్వాడ్, బిలాస్‌పూర్, పాసీఘా ట్, జమ్మూ, దాహోద్, తిరునల్వేలి, తూతుక్కుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, ఐజ్వాల్, అలహాబాద్, అలీగఢ్, గ్యాంగ్‌టక్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ సిటీల 3వ జాబితా విడుదల
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 

మహారాష్ట్రలో 34 వేల కోట్ల రుణమాఫీ
కరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జూన్ 24న ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది. దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్రలో రూ.34 వేల కోట్ల రుణమాఫీ
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
ఎందుకు : రైతులను ఆదుకునేందుకు

మన్‌కీబాత్‌లో విజయనగరం జిల్లాకు ప్రధాని ప్రశంసలు
మన్‌కీబాత్ కార్యక్రమంలో జూన్ 24న రేడియోలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంలా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాను ఉదహరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అధికారులు జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటలు నిర్విరామంగా శ్రమించి 10 వేల మరుగు దొడ్లను నిర్మించారని ప్రశంసించారు. వీటి నిర్మాణం వల్ల 71 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయన్నారు. అలాగే.. ముస్లింల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్ బిజనౌర్ జిల్లాలో 3,500 కుటుంబాలున్న ముబారక్‌పూర్ గ్రామ ప్రజలంతా కలసి రంజాన్ సందర్భంగా మరుగుదొడ్డి నిర్మించారని మోదీ కొనియాడారు.
మదురై మహిళ సాధికారత..
‘గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వస్తువులు అమ్ముతున్నానంటూ తమిళనాడు మదురైకి చెందిన ఓ మహిళ రాసిన ఉత్తరాన్ని ప్రధాని ప్రస్తావించారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, ఆమె నుంచి ప్రధాని కార్యాలయం కూడా రెండు వస్తువులు కొనుగోలు చేసిందని మోదీ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మన్‌కీబాత్
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : స్వచ్ఛభారత్ అమలులో విజయనగరం జిల్లాకు ప్రశంస

జాతీయ విద్యా విధానంపై కమిటీ
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారత విద్యా విధానానికి కొత్తరూపు తీసుకొచ్చే నిర్ణయంలో భాగంగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ జూన్ 26న ప్రకటించింది.
జాతీయ విద్యా విధానంపై కొన్నేళ్ల కిందట టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2016లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణస్వామి కస్తూరిరంగన్ నేతృత్వంలో జాతీయ విద్యా విధానంపై కమిటీ
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
ఎందుకు : విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం

దేశీయ తేలియాడే డాక్ ప్రారంభం
నౌకా దళం కోసం తొలిసారిగా దేశీయంగా నిర్మించిన తేలియాడే డాక్ (ఎఫ్‌డీఎన్-2)ను జూన్ 20న చెన్నైలో ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థనిర్మించిన ఈ డాక్ పొడవు 185 మీటర్లు కాగా, వెడల్పు 40 మీటర్లు. ఇది అన్ని రకాల నౌకల మరమ్మతులకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని అండమాన్ నికోబార్‌లో ఉంచనున్నారు. ఇప్పటికే ఇలాంటిదొకటి చెన్నైలో ఉంది.

ఉదయ్ ర్యాంకింగ్స్‌లో గుజరాత్ టాప్
ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం సంస్కరణల అమల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వజ్ర విధానం ప్రారంభం
అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 22న వజ్ర(విజిటింగ్ అడ్వాన్స్‌డ్ జాయింట్ రీసెర్చ్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ దీనికి సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు.

కాండ్లాలో తొలి స్మార్ట్ పోర్ట్ సిటీ
Current Affairs
దేశంలోని తొలి స్మార్ట్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ (ఎస్‌ఐపీసీ) గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో ఏర్పాటు కానుంది. కాండ్లా పోర్ట్ ట్రస్ట్ (కేపీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ పారిశ్రామిక కారిడార్ రూ. 10 వేల కోట్లపైగా పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇందులో వంట నూనెలు, ఫర్నిచర్, ఉప్పు ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
1,425 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐపీసీలో 580 ఎకరాల్లో స్మార్ట్ అర్బన్ టౌన్‌షిప్, 845 ఎకరాల్లో ఆధునిక పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత తొలి స్మార్ట్ పోర్ట్‌సిటీ
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : కాండ్లా పోర్ట్‌ట్రస్ట్
ఎక్కడ : గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో

యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 15న నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో ఎస్పీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
ఎందుకు : బోర్డులపై అవినీతి ఆరోపణలతో

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 60వ స్థానంలో భారత్
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2017లో భారత్ 6 స్థానాలు మెరుగుపరచుకుని 60వ స్థానంలో నిలిచింది. దీంతో మధ్య, దక్షిణాసియా ప్రాంతంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడంతో ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది.
కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 130 దేశాలతో ఈ జాబితాను రూపొందించాయి. ఇందులో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్‌‌స, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో ఉన్నాయి. చైనా 22వ స్థానంలో ఉండగా శ్రీలంక 90, నేపాల్ 109, పాకిస్తాన్ 113, బంగ్లాదేశ్ 114వ స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్
ఎక్కడ : 60వ స్థానంలో భారత్

పోలీసుల కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి
గడిచిన ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2009 నుంచి 2015 మధ్య దేశంలో 4,747 పోలీసుల కాల్పుల ఘనటలు నమోదు కాగా ఈ కాల్పుల్లో 796 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదు కాగా మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోలీస్ కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి
ఎప్పుడు : 2009 - 2015 మధ్య
ఎవరు : ఎన్‌సీఆర్‌బీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా

జవాన్ల శాశ్వత వైకల్యానికి రూ.20 లక్షలు
విధి నిర్వహణలో 100 శాతం అంగవైకల్యం పొందిన జవాన్లకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర హోంశాఖ జూన్ 17న నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1 తర్వాత వైకల్యం పొందినవారికే ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వీరితో పాటు విధి నిర్వహణలో గాయపడ్డ జవాన్లకు వైకల్య స్థాయిని బట్టి నష్టపరిహారాన్ని అందిస్తామని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విధి నిర్వహణలో వైకల్యం పొందిన జవాన్లకు పరిహారం 20 లక్షలకు పెంపు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కేసులో అబూసలేంను దోషిగా తేల్చిన టాడాకోర్టు
1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారి ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం సహా ఆరుగురిని టాడా ప్రత్యేక కోర్టు జూన్ 16న దోషులుగా నిర్ధారించింది. అబ్దుల్ ఖయ్యూం అనే మరో నిందితుడిని సరైన ఆధారాల్లేనందున నిర్దోషిగా ప్రకటించింది.
అబూసలేం, ముస్తఫా , కరీముల్లా ఖాన్, ఫిరోజ్, అబ్దుల్ రషీద్ ఖాన్, తాహిర్ మర్చంట్‌లను నేరపూరిత కుట్ర, భారత శిక్షాస్మృతి, టాడా కింద హత్యానేరం, విధ్వంసక సామాగ్రి, ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజల ఆస్తుల విధ్వంసం వంటి కేసుల్లో దోషులుగా తేల్చగా, సిద్దిఖీని అబూసలేం, ఇతరులకు ఆయుధాలు సరఫరా చేయటంలో సహకరించిన నేరంలో టాడా చట్టాల కింద దోషిగా తేల్చారు.
24 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి రెండో విడత విచారణలో భాగంగా టాడా కోర్టు తాజా తీర్పునిచ్చింది. 2007 నాటి తొలి విడత విచారణలో కోర్టు 100 మందిని దోషులుగా, 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసాతో సహా పలువురు ఈ దాడులకు కుట్ర పన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముంబై పేలుళ్ల కేసులో దోషుల నిర్ధారణ
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : టాడా కోర్టు
ఎందుకు : 1993 ముంబయిలో బాంబు పేలుళ్లకు పాల్పడినందుకు

బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి
కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ జూన్ 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000 అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి.
ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బ్యాంకు లావాదేవీలపై పూర్తి సమాచారం కోసం 

పంజాబ్‌లో రైతు రుణమాఫీ
ఎన్నికల హామీ మేరకు పంజాబ్ రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు(5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు) రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వమే చెల్లించడంతో పాటు.. వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ మేరకు జూన్ 19న అసెంబ్లీలో అమరీందర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 10.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందులో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులు 8.75 లక్షలు ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రకటించిన రుణమాఫీ కంటే రెండింతలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త టీ హక్యూ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పంజాబ్‌లో రైతు రుణమాఫీ
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : సీఎం అమిరీందర్ సింగ్
ఎందుకు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు

జూలై 1 నుంచి డిపార్చర్ కార్డ్స్ విధానం రద్దు
విదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్ కార్డ్స్’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్ కార్డ్‌లో పూరించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిపార్చర్ విధానం రద్దు
ఎప్పుడు : జూలై 1 నుంచి
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : విమానాశ్రయాల్లో
ఎందుకు : ప్రయాణ అవాంతరాలు లేకుండా చేసేందుకు

జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక
భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం(ఈసీ) జూన్ 7న షెడ్యూలు జారీ చేసింది. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నామని ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ జారీచేసి ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీం జైదీ వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిశాకే జరుపుతామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 2017, జులై 24తో ముగియనుంది. కాగా, సీఈసీ జైదీ వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాన్ని నోటిఫై చేసేనాటికి ఆయన పదవిలో ఉండరు.
ఎన్నికల షెడ్యూలు
నోటిఫికేషన్ 14.06.2017
నామినేషన్లకు గడువు 28.06.2017
నామినేషన్ల పరిశీలన 29.06.2017
అభ్యర్థిత్వాల
ఉపసంహరణ గడువు 01.07.2017
పోలింగ్ 17.07.2017
ఓట్ల లెక్కింపు 20.07.2017
ఎన్నికల్లో ఎవరి బలమెంత?
ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి.
ఎన్డీయే పక్షాల బలం

పార్టీ

మొత్తం ఓట్ల విలువ

ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం

బీజేపీ 4,42,117 40.03
టీడీపీ 31,116 2.82
శివసేన 25,893 2.34
- మిగిలిన ఎన్డీయే పార్టీల బలాన్ని కలుపుకుంటే ఎన్డీయే బలం ( ఓట్ల విలువ- 5,37,683, ఓట్ల శాతం - 48.64)
యూపీఏ పక్షాల ఓట్ల శాతం

పార్టీ

మొత్తం ఓట్ల విలువ

ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం

కాంగ్రెస్ 1,61,478 14.62
తృణమూల్ 63,847 5.78
సమాజ్‌వాదీ 26,060 2.36
సీపీఎం 27,069 2.45
- మిగిలిన యూపీఏ పార్టీల బలాన్ని కలుపుకుంటే మొత్తం ( ఓట్ల విలువ - 3,91,739, ఓట్ల శాతం -35.47)
తటస్థ పార్టీలు
పార్టీ మొత్తం ఓట్ల విలువ ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
అన్నాడీఎంకే 59,224 5.36
బీజేడీ 32,892 2.98
టీఆర్‌ఎస్ 22,048 1.99
వైఎస్సార్‌సీపీ 16,848 1.53
మొత్తం 1,44,302 13.06
ఎవరు ఎన్ను కుంటారు?
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికై న లోక్‌సభ సభ్యులు(543), ఎన్నికై న రాజ్యసభ సభ్యులు(233), ఎన్నికై న రాష్ట్ర శాసనసభల సభ్యులు(ఢిల్లీ, పుదుచ్చేరి సహా) ఉంటారు. మొత్తం 4,896 మంది ఓటేయడానికి అర్హులు. వీరిలో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు. నామినేటెడ్ సభ్యులకు, రాష్ట్రాల శాసన మండళ్ల సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
పోలింగ్ ఎలా..?
ఓటింగ్‌ను దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. కనుక పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఓటర్లు.. అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు. అభ్యర్థుల పేర్ల ఎదురుగా 1, 2, 3... ఇలా అంకెలు రాస్తారు. ఓటు చెల్లాలంటే మొదటి ప్రాధాన్యత నమోదు తప్పనిసరి. ఇతర ప్రాధాన్యతల నమోదు ఐచ్ఛికం.
ఓట్ల లెక్కింపు ఎలా?
రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ను 50 మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ద్వితీయ ప్రతిపాదకులుగా ఉండాలి. అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు
వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే
చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.
ఓట్లకు విలువ ఇలా:
ఎంపీల ఓట్లకు ఒక విలువ, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువలు ఉంటాయి. దేశాధినేత.. దేశ ప్రజలందరికీ దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం వహించేలా, కేంద్ర, రాష్ట్రాలకు సమాన ఓటు హక్కు ఉండేలా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ఓట్ల విలువను ఇలా లెక్కిస్తారు..
ఒక ఎమ్మెల్యే ఓటు విలువ: 1971 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్ర మొత్తం జనాభా / ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై న మొత్తం సభ్యుల సంఖ్య × 1000
రాష్ట్ర శాసనసభ సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ: ఒక ఎమ్మెల్యే ఓటు విలువ × మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య
మొత్తం 31 రాష్ట్రాల్లోని (ఢిల్లీ పుదుచ్చేరి సహా) శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ: మొత్తం 31 రాష్ట్రాల్లోని అందరు ఎమ్మెల్యేల ఓట్ల విలువ మొత్తం = 5,49,474
ఎంపీ ఓటు విలువ: అందరు ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ (5,49,474) / మొత్తం పార్లమెంటు సభ్యుల సంఖ్య (776) = 708
అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ: ఒక ఎంపీ ఓటు విలువ × మొత్తం ఎంపీల సంఖ్య = 5,49,408
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మొత్తం విలువ: అందరు శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ + అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ = 5,49,474 + 5,49,408 = 10,98,882

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ
రాష్ట్రం అసెంబ్లీ స్థానాలు ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ
ఆంధ్రప్రదేశ్ 175 159 27,825
తెలంగాణ 119 132 15,708
గమనిక: గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా ఈసారి ఏపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159కి పెరిగింది. తెలంగాణలో 132కు తగ్గింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విలువలను ఖరారు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
రాష్ట్రపతి ఎన్నిక విధానం
ఎప్పుడు : జులై 17
ఎవరు : ఎన్నికల సంఘం

పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూ వారి మార్పులు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారనున్నాయి. ఈ మేరకు ధరలను రోజూ సమీక్షించాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజూ మారుతూ... ఒకే రోజులో కూడా మూడు కంపెనీల బంకుల్లో మూడు రకాలుగా ఉండనున్నాయి.
ధరలను ఏరోజుకారోజు దినపత్రికల్లో ముద్రించడంతో పాటు మొబైల్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా తెలియపరుస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూవారీ మార్పులు
ఎప్పుడు : జూన్ 16 నుంచి
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎవరు : ఐవోసీ, బీపీ, హెచ్‌పీ

‘టాప్ 200’లో భారత విద్యాసంస్థలకు చోటు
ప్రపంచ వ్యాప్తంగా 200 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో తొలిసారిగా మూడు భారతీయ ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన క్యూఎస్ వరల్డ్ సంస్థ ‘టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్’ పేరుతో విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీ, బొంబాయి ఐఐటీలు ర్యాంకులు దక్కించుకున్నాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ ర్యాంకు గత ఏడాది 190 కాగా, ఈసారి 152కు చేరింది. ఢిల్లీ ఐఐటీ ర్యాంకు 185 నుంచి 179కి, బొంబాయి ఐఐటీ ర్యాంకు 219 నుంచి 179కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 వేల యూనివర్సిటీల నుంచి 200 అగ్రశ్రేణి విద్యాసంస్థలను క్యూఎస్ వరల్డ్ ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : క్యూఎస్ వరల్డ్

పాన్, ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు పాక్షిక స్టే
పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై (21వ అధికరణ) రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని జూన్ 9న వెలువరించిన తీర్పులో పేర్కొంది. ఇంతవరకు ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది.
పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
పాన్‌తో ఆధార్ అనుసంధానంపై పాక్షిక స్టే
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : సుప్రీం కోర్టు

మహారాష్ట్రలో రైతుకు రుణ మాఫీ
మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేస్తామని జూన్ 11న ప్రకటించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సమస్యల పరిష్కారానికి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో జూన్ 1 నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళనను విరమించారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.07 కోట్ల మంది రైతులకు లాభం కలుగుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు రూ. 30 వేల కోట్ల రుణాలు రద్దవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
రూ. 30 వేల కోట్ల రైతు రుణాల మాఫీ
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : మహారాష్ట్రలో
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో అత్యధిక బాల్యవివాహాలు
దేశంలోని 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసుకంటే ముందే వివాహం జరుగుతుంది. ఇది గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్ 70 జిల్లాల్లో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. రాజస్థాన్‌లో అబ్బాయిలు 8.6 శాతం, అమ్మాయిలు 8.3 శాతం మందికి నిర్ణీత వయసులోగానే వివాహం అవుతుంది. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని(ఉమ్మడి ఏపీతో కలిపి) 70 జిల్లాల్లో 21.1 శాతం బాలికల వివాహాలు జరగగా.. 22.5 శాతం అబ్బాయిల వివాహాలు జరిగాయి.
దేశంలో బాలికల వివాహాల శాతం
సంవత్సరం గ్రామాల్లో పట్టణాల్లో మొత్తం
2001 2.75 % 1.78% 2.51%
2011 2.43% 2.45% 2.44%
క్విక్ రివ్యూ:
ఏమిటి :
దేశంలో బాల్య వివాహాలపై సర్వే
ఎప్పుడు : 2001-2011 మధ్య కాలంలో
ఎవరు : జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో

నేతాజీ 1945లో చనిపోయారు: క్రేంద్ర హోంశాఖ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని కేంద్ర ప్రభుత్వం మే 31న స్పష్టం చేసింది. నేతాజీ మృతిపై కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు సమాచార హక్కు కింద గతంలో దరఖాస్తు చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నేతాజీ చనిపోయారనే నిర్ధారణకు వచ్చామని హోం శాఖ తెలిపింది. నేతాజీ కొన్ని రోజులపాటు గుమ్నమి బాబాగా మారువేషంలో జీవించారనే వాదనననూ అధికారులు కొట్టిపారేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో చనిపోయారని స్పష్టీకరణ
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్ర హోంశాఖ

ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్‌గా లాజ్‌కాక్
స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్‌కాక్(54) ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజి దౌత్యవేత్త పీటర్ థాంప్సన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌లో మొదలయ్యే యూఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్‌కు లాజ్‌కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతేడాది యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ వారిలో లాక్‌జాక్ ఒకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐరాస సాధారణ అసెంబ్లీకి నూతన చీఫ్
ఎప్పుడు : మే 31
ఎవరు : మిరోస్లావ్ లాజ్‌కాక్

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న రాజస్థాన్ హైకోర్టు
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మే 31న సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొంది. జైపూర్‌లోని ప్రభుత్వ గోశాలలో గతేడాది వందకుపైగా ఆవులు మృత్యువాతపడటంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ మహేశ్ చంద్ శర్మ (ఏక సభ్య ధర్మాసనం) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఐఎండీ పోటీతత్వ జాబితాలో 45వ స్థానంలో భారత్
అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జూన్ 3న జాబితాను విడుదల చేసింది. చైనా ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది.
ఈ జాబితాలో హాంగ్‌కాంగ్ మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐఎండీ పోటీతత్వ జాబితా - 2017
ఎప్పుడు : జూన్ 4
ఎక్కడ : 45వ స్థానంలో భారత్
ఎవరు : ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్

యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించనున్న భారత్ ఆర్మీ
భారత సైన్యం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. లింగపరమైన అడ్డంకులను అధిగమిస్తూ యుద్ధరంగంలోకి మహిళ లను అనుమతించనుంది. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాటంలో పురుషులు మాత్రమే కనిపించగా.. ఇక ముందు మహిళలు సైతం పాలుపంచుకోనున్నారు. ఈ మేరకు మహిళలను యుద్ధంలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తామని, దీనికి సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జూన్ 4న వెల్లడించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ హోదాలోకి ఇకపై మహిళలను అనుమతి స్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని, తొలుతగా మహిళలను మిలిటరీ పోలీసులుగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం మిలిటరీ విభాగానికి అనుసంధానంగా ఉండే మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఇప్పటికే మహిళకు అవకాశం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్‌, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు మాత్రమే యుద్ధరంగంలోకి మహిళలను అనుమతిస్తున్నాయి.

యూపీలో గోవధపై జాతీయ భద్రత చట్టం
గోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
గోవధపై జాతీయ భద్రత చట్టం
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లో

పెండింగ్ కేసుల పరిష్కారానికి "న్యాయమిత్ర"
దేశంలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం న్యాయమిత్రలను నియమించనుంది. జూన్ 6న అలహాబాద్ హైకోర్టులో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టెలీ లా సర్వీస్ అందించే విధానాన్ని ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తులను న్యాయమిత్రలుగా నియమిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 7.50 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
న్యాయమిత్రలుగా విశ్రాంత న్యాయమూర్తులు
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎవరు : కేంద్రన్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎందుకు : పెండింగ్ కేసుల పరిష్కారానికి

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో జూన్ 3న సమావేశమయ్యారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, పారిస్ ఒప్పందానికి మించి కృషి చేస్తుందని తెలిపారు. మెక్రాన్ మాట్లాడుతూ భూ తాపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. రక్షణ సహకారం, సముద్ర జలాల భద్రత, ఉగ్రవాదంపై పోరుకు భారత్‌తో కలసి పని చేస్తామని తెలిపారు.
రష్యా పర్యటన: మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జూన్ 1న భేటీ అయ్యారు. ఈ ఏడాదితో భారత్-రష్యా సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5వ, 6వ యూనిట్‌ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఇంద్ర-2017 పేరిట త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
స్పెయిన్ పర్యటన: మోదీ.. స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో మే 31న సమావేశమయ్యారు. భారత్‌లో విస్తరించేందుకు స్పెయిన్ కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఏడు ఒప్పందాలు కుదిరాయి.
జర్మనీ పర్యటన: మోదీ.. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో మే 30న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో.. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సాహం తదితర రంగాలు ఉన్నాయి.
Published date : 13 Jun 2017 01:28PM

Photo Stories