డిసెంబరు 2018 జాతీయం
వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లుకు డిసెంబర్ 20న లోక్‌సభ ఆమోదం తెలిపింది. అలాగే నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్‌స విత్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజెబిలిటీస్ (సవరణ) బిల్లులను కూడా ఆమోదించింది. మల్టిపుల్ డిజెబిలిటీస్ (సవరణ) బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : లోక్‌సభ
అంకుర సంస్థలకు అనువైనదిగా గుజరాత్
దేశంలో అంకుర సంస్థల(స్టార్టప్స్)ను స్థాపించేందుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఈ మేరకు అంకుర సంస్థలకు సంబంధించిన ర్యాంకులను డిసెంబర్ 20న డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) విడుదల చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు డీఐపీపీ ఈ ర్యాంకులను ఇచ్చింది. విధానపరమైన మద్దతు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, సీడ్ ఫండింగ్, ఏంజిల్, వెంచర్ ఫండింగ్, సరళమైన నియంత్రణ వంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించారు.
డీఐపీపీ ర్యాంకుల్లో రాష్ట్రాలను బిగినర్స్(ప్రారంభకర్తలు), ఎమర్జింగ్ స్టేట్స్, యాస్పరింగ్ లీడర్స్, లీడర్స్, అత్యుత్తమ ప్రదర్శకులు(టాప్ పెర్ఫామర్స్), ఉత్తమ ప్రదర్శకులు(బెస్ట్ పెర్ఫామర్స్) కింద వేరు చేశారు. అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ బెస్ట్ పెర్ఫామర్‌గా నిలిచింది.
సంఖ్య | కేటగిరీ | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం |
1 | బెస్ట్ పెర్‌ఫార్మర్ | గుజరాత్ |
2 | టాప్ పెర్‌ఫార్మర్స్ | కర్ణాటక, కేరళా, ఒడిశా, రాజస్థాన్ |
3 | లీడర్స్ | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ |
4 | యాస్పైరింగ్ లీడర్స్ | హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ |
5 | ఎమర్జింగ్ స్టేట్స్ | అసోం, ఢిల్లీ, గోవా, జమ్మూ అండ్ కశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ |
6 | బిగినర్స్ | చండీగఢ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కీం, త్రిపుర |
ఏమిటి : అంకుర సంస్థలకు అనువైనదిగా గుజరాత్
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ)
ఒడిశాలో కలియా పథకం
ఒడిశాలో కలియా (కృషక్ అసిస్టెన్‌స ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డిసెంబర్ 21న ప్రకటించారు. ఈ పథకం ద్వారా మొత్తం 30 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఖర్చు చేయనున్నారు.
కలియా పథకం- అంశాలు
- భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్‌లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే.
- గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు.
- వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు వంటి కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం.
- భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా
- 50 వేల వరకు వడ్డీ లేని రుణాల మంజూరు.
ఏమిటి : ఒడిశాలో కలియా పథకం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
కంప్యూటర్లపై పది ప్రభుత్వ సంస్థలకు అధికారం
దేశంలోని కంప్యూటర్లపై పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలు కల్పిస్తూ డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పది ప్రభుత్వ సంస్థలు దేశంలోని ఏ కంప్యూటర్‌లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించడంతోపాటు డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయవచ్చు. అయితే కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతిని ఆ సంస్థలు తీసుకోవాలి. దేశ భద్రత, ఇతర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పది సంస్థలకు అధికారాలు కల్పించినట్లు కేంద్రం పేర్కొంది.
కేంద్రం అధికారాలిచ్చిన పది సంస్థలు
- ఇంటెలిజెన్‌స బ్యూరో(ఐబీ)
- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
- ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)
- ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ)
- డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్‌స(డీఆర్‌ఐ)
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
- నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)
- రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)
- డెరైక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్‌స(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం)
- ఢిల్లీ పోలిస్ కమిషనర్.
ఏమిటి : దేశంలోని కంప్యూటర్లపై పది ప్రభుత్వ సంస్థలకు అధికారం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : కేంద్రప్రభుత్వం
‘పద్మ’ తరహాలో జాతీయ ఏకతా పురస్కారాలు
పద్మ అవార్డుల తరహాలో కొత్తగా జాతీయ ఏకతా పురస్కారాలు అందించనున్నుట్లు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 23న ప్రకటించారు. జాతీయ ఏకతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేసిన కృషి నుంచి స్ఫూర్తి పొందేలా ఏడాదికోసారి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. జాతీయ ఏకతకు విశేషంగా కృషి చేసిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఏకతా పురస్కారాలు
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : జాతీయ ఏకతకు విశేషంగా కృషిచేసిన వారికి
తెలంగాణ మండలిలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా రద్దు
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ఈ మేరకు కాంగ్రెస్ శాసనమండలి విపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ హోదాను రద్దు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు డిసెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ శాసనమండలిపక్షం తెలగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీలో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : కాంగ్రెస్ శాసనమండలిపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమవ్వడంతో
పారాదీప్-హైదరాబాద్ పైప్‌లైన్‌కు శంకుస్థాపన
ఒడిశాలోని పారాదీప్-తెలంగాణలోని హైదరాబాద్‌ల మధ్య రూ.3,800 కోట్లతో నిర్మిస్తున్న గ్యాస్ పైప్‌లైన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న ఒడిశాలో శంకుస్థాపన చేశారు. అలాగే జార్ఖండ్‌లోని అంగుల్-బొకారో ప్రాంతాల మధ్య రూ.3,437 కోట్ల వ్యయంతో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. పారాదీప్-హైదరాబాద్‌ల మధ్య 1,200 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ పైప్‌లైన్ కారణంగా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బరంపురం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో డెలివరీ కమ్ పంపింగ్ స్టేషన్లు నిర్మిస్తారు.
మరోవైపు ఒడిశాలో ఐఐటీ-భువనేశ్వర్ నూతన క్యాంపస్‌ను మోదీ ఆవిష్కరించారు. మొత్తంగా దాదాపు రూ.14,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పారాదీప్-హైదరాబాద్ గ్యాస్ పైప్‌లైన్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఒడిశా
వాజ్‌పేయి ముఖచిత్రంతో రూ.100 నాణెం
దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణార్థం కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణెంను రూపొందించింది. వాజ్‌పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో డిసెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ఈ నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
35 గ్రాముల బరువు ఉండే వాజ్‌పేయి స్మారాక నాణేనికి ఒకవైపు వాజపేయీ చిత్రంతోపాటు ఆయన పేరు ఉంటుంది. చిత్రం కింద ఆయన పుట్టిన సంవత్సరం, మరణించిన సంవత్సరం ఉంటాయి. నాణేనికి రెండోవైపు అశోకచక్రం, దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. చక్రం కింద రూ.100 అని ఉంటుంది. 1924లో డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వాజ్‌పేయి ముఖచిత్రంతో రూ.100 నాణెం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
3643 కోట్లతో శివాజీ విగ్రహం
అరేబియా సముద్రంలో ముంబై తీరంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి(శివ్ స్మారక్) మహారాష్ట్ర ప్రభుత్వం రూ.3,643.78 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో సర్వే, స్థలాన్వేషణ మొదలు భద్రత వరకు అన్ని రకాల వ్యయాలు కలిపి ఉన్నాయి. మొత్తంగా 2022-23 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని డిసెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.3,643.78 కోట్లతో శివాజీ విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : అరేబియా సముద్రం, ముంబై తీరం
‘సదైవ్ అటల్’ను ప్రారంభించిన రాష్ట్రపతి
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన ‘సదైవ్ అటల్ మెమోరియల్’ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెమోరియల్‌ను వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రారంభించారు. ఈ నిర్మాణానికి రూ. 10.51 కోట్ల వ్యయం కాగా ఈ మొత్తాన్ని అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అందించింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బిహార్ గవర్నర్ లాల్‌జీ తాండన్, గుజరాత్ గవర్నర్ ఓపీ కొహ్లీ, కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సహా పలువురు వ్యక్తులు ఈ సొసైటీకి వ్యవస్థాపకులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సదైవ్ అటల్ మెమోరియల్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రీయ స్మృతి స్థల్, ఢిల్లీ
జార్ఖండ్‌లో వేదాంత స్టీల్ ప్లాంట్
జార్ఖండ్‌లో వేదాంత సంస్థ కొత్త స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనుంది. రూ26,600 కోట్ల నుంచి రూ.28,800 కోట్ల (300 నుంచి 400 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు వేదాంత రీసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ డిసెంబర్ 25న తెలిపారు. ఇటీవల వేదాంత సంస్థ కొనుగోలు చేసిన ఎలక్టోస్ట్రీల్ స్టీల్స్ లిమిటెడ్ (ఈఎస్‌ఎల్) సమీపంలో దీనిని నిర్మించనున్నారు. ఏటా 45 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించే ఈ స్టీల్ ప్లాంటు ద్వారా సూమారు 1,20,000 ఉద్యోగాలు రానున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వేదాంత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : జార్ఖండ్
బోగీబీల్ వంతెన ప్రారంభం
దేశంలో అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన అయిన బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న అస్సాంలో డిబ్రూగఢ్ సమీపంలోని బోగీబీల్ వద్ద ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలో మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన వల్ల అస్సాంలోని డిబ్రూగఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ల మధ్య ప్రయాణ దూరం రోడ్డు మార్గంలో 150 కి.మీ, రైల్వే మార్గంలో 705 కి.మీ తగ్గనుంది.
బోగీబీల్ వంతెన గుండా ప్రయాణించే తొలి రైలు టిన్సుకియా-నహర్లాగున్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. అస్సాంలోని టిన్సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్లాగున్ స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని ఈ రైలు ప్రస్తుతం కంటే 10 గంటలు తగ్గిస్తుంది. వంతెన ప్రారంభ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖి, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లతోపాటు అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ పాల్గొన్నారు.
1997లోనే ఆమోదం...
అస్సాం ఒప్పందంలో భాగంగా 1997లో బోగీబీల్ వంతెనను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. 1997, జనవరి 22న నాటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది.
దేశ భద్రతకూ ఉపయోగం...
బోగీబీల్ వంతెన అస్సాం, అరుణాచల్ మధ్య రాకపోకలకే కాకుండా దేశ భద్రతకు కూడా తోడ్పడనుంది. అరుణాచల్‌లోని చైనా సరిహద్దు వరకు వేగంగా బలగాలను, సైనిక సామగ్రిని వేగంగా తరలించేందుకు ఇది ఉపయోగపడనుంది. అత్యవసర సందర్భాల్లో యుద్ధ విమానాలు దిగేందుకు కూడా అనుకూలంగా వంతెనను నిర్మించారు.
బోగీబీల్ వంతెన - అంశాలు
- యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లో నిర్మితమైన తొలి వంతెన ఇదే. పూర్తిగా వెల్డింగ్ ఉన్న వంతెన కూడా ఇదొక్కటే.
- బ్రిడ్జి నిర్మాణానికి 21 ఏళ్లు పట్టింది. ఈ కాలంలో దేశంలో నలుగురు ప్రధానులు మారారు.
- 120 ఏళ్లపాటు సేవలందించేలా వంతెనను నిర్మించారు. దీనికోసం 80 వేల టన్నుల ఉక్కును వాడారు.
- హెచ్‌సీసీ కంపెనీ దీనిని నిర్మించింది. గతంలోనూ బ్రహ్మపుత్రపై రెండు వంతెనలను హెచ్‌సీసీ నిర్మించింది.
- డిబ్రూగఢ్, ధెమాజీ జిల్లాలను కలుపుతూ కట్టిన ఈ వంతెన కిందిభాగంలో రెండు లైన్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. పై భాగంలో మూడు లైన్ల రోడ్డు ఉంది.
- అత్యంత బరువైన యుద్ధట్యాంకులు సైతం ప్రయాణించేలా, యుద్ధవిమానాలు ల్యాండ్ అయ్యేలా దృఢంగా నిర్మించారు.
- ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,900 కోట్లు.
ఏమిటి : బోగీబీల్ వంతెన ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బోగీబీల్, డిబ్రూగఢ్, అస్సాం
రామేశ్వరం-ధనుష్కోడి రైల్వే లైనుకు ఆమోదం
రామేశ్వరం-ధనుష్కోడి మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణానికికేంద్రప్రభుత్వం డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది. రామేశ్వరం నుంచి దాదాపు 17 కిలోమీటర్ల నిర్మించే ఈ రైల్వేలైనుకు సుమారు రూ.208 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రామేశ్వరం-ధనుష్కోడి రైల్వే లైనుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్రప్రభుత్వం
క్రాస్‌బౌ-18 క్షిపణి విన్యాసాలు ముగింపు
క్రాసబౌ-2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు డిసెంబర్ 13న ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో డిసెంబర్ 3 నుంచి జరిగిన ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. ఈ విన్యాసాల్లో ఎస్.యూ-30 ఫైటర్ జెట్‌తోపాటు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా-ఎక్-ఎం, ఐజీఎల్‌ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా పరీక్షించారు.
సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్‌బౌ విన్యాసాల్లో భారత వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా, సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షన్ బి.సురేష్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రాస్‌బౌ-18 క్షిపణి ప్రయోగ విన్యాసాలు ముగింపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత వైమానిక దళం
ఎక్కడ : ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, సూర్యలంక, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ఎన్‌ఐఎన్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య
జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14న నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల లేమి, ఊబకాయం వంటి అధిక పోషణ సమస్యలను అధిగమించాలంటే వ్యవసాయ, పోషకాహార శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు కలిసి పనిచేయాలన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ పోషకాహార సంస్థ శతజయంతి ఉత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర మాతగా గోవు
గోవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును డిసెంబర్ 14న ఆమోదించి, కేంద్రానికి పంపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేందర్ కన్వర్ మాట్లాడుతూ... సిర్మావూరు జిల్లాలో రూ.1.52 కోట్లతో ఆవుల కోసం ప్రత్యేకంగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. ఆవు ఓ కులానికి, మతానికి చెందినది కాదని, అది జాతి సంపదని పేర్కొన్నారు.
దేశంలో మొట్టమొదటిసారిగా ఆవును రాష్ట్రమాతగా ప్రకటిస్తూ ఉత్తరాఖండ్ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఆవుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర మాతగా గోవు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ
ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్ సర్వీసులు
ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్-ఫ్లయిట్, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విమాన, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ సర్వీసులు
ఎప్పుడు : డిసెంబర్ 14
దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన
ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 17న తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించేందుకు ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు. తర్వాతి కాలంలో ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి దీనిని విస్తరించారు.
మరోవైపు 50 శాతానికి పైగా(కనీసం 20 వేలు) గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.2,242 కోట్లు వెచ్చించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అమలు
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కేంద్రప్రభుత్వం
లింగ అసమానతలో భారత్‌కు 108వ స్థానం
స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు సంబంధించి భారత్‌కు 108వ స్థానం దక్కింది. ఈ మేరకు ‘గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్-2018’ రూపొందించిన జాబితాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) డిసెంబర్ 18న విడుదల చేసింది. ఈ జాబితాలో ఐస్‌లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌లో సీనియర్, ప్రొఫెషనల్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సి ఉందని డబ్ల్యూఈఎఫ్ సూచించింది. ఆర్థికపరమైన అవకాశాలు, రాజకీయ సాధికారికత, విద్య, ఆరోగ్యం, మనుగడలను ప్రధాన అంశాలుగా తీసుకుని జండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాను రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లింగ అసమానతలో భారత్‌కు 108వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన
రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. ఈ మేరకు డిసెంబర్ 20 నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సరోగసీ (రెగ్యులేషన్) బిల్లుకు డిసెంబర్ 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం 23-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు, 26-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మాత్రమే సరోగసీ(అద్దె గర్భం) కోసం దరఖాస్తు చేసుకోవాలి.
సరోగసీ బిల్లు-ముఖ్యాంశాలు
- వాణిజ్య అవసరాల కోసం సరోగసీ చేపట్టడాన్ని నిషేధించారు.
- ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులు, పీఐవోలు, హోమో సెక్సువల్స్, సింగిల్ పేరెంట్స్, సహ జీవనం చేసే జంటలు సరోగసీకి అనర్హులు.
- ఒకే సంతానం ఉన్న జంటలు సైతం సరోగసికి అర్హులు కారు. కానీ వీరు ఇతర చట్టాల ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవచ్చు.
- సమీప బంధువులు అంటే సోదరి లేదా మరదలు వంటివారినే సరోగసీ కోసం అనుమతిస్తారు.
- ఓ మహిళను సరోగసీ కోసం జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు.
- సరోగసికి ముందుకొచ్చే మహిళకు అప్పటికే వివాహమై, ఓ కుమారుడు/కుమార్తె ఉండాలి.
- ఈ చట్టం జమ్మూకశ్మీర్ తప్ప దేశమంతటా వర్తిస్తుంది.
- 3 నెలల్లోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరోగసీ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : లోక్‌సభ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) డిసెంబర్ 11న విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా ఎన్నికల ఫలితాలు...
ఛత్తీస్‌గఢ్
మొత్తం స్థానాలు : 90
రెండు దశల్లో ఎన్నికలు
తొలి దశ (18 స్థానాలు) : నవంబర్ 12
రెండో దశ (72 స్థానాలు) : నవంబర్ 20
ఎన్నికలు జరిగిన స్థానాలు : 90
పార్టీ | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతం |
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) | 2 | 3.9 |
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) | 15 | 33 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) | 68 | 43 |
జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) | 5 | 7.6 |
ఇతరత్రా | - | 12.5 |
మొత్తం స్థానాలు : 230
ఒకే దశలో ఎన్నికలు : నవంబర్ 28
ఎన్నికలు జరిగిన స్థానాలు : 200
పార్టీ | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతం |
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) | 2 | 5 |
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) | 109 | 41 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) | 114 | 40.09 |
సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) | 1 | 1.3 |
స్వతంత్రులు | 4 | 5.8 |
ఇతరత్రా | - | 6.81 |
మొత్తం స్థానాలు : 40
ఒకే దశలో ఎన్నికలు : నవంబర్ 28
ఎన్నికలు జరిగిన స్థానాలు : 40
పార్టీ | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతం |
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) | 1 | 8 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) | 5 | 30.2 |
మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్‌ఎన్ ఎఫ్) | 26 | 37.6 |
స్వతంత్రులు | 8 | 22.9 |
ఇతరత్రా | - | 1.3 |
మొత్తం స్థానాలు : 200
ఒకే దశలో ఎన్నికలు : డిసెంబర్ 7
ఎన్నికలు జరిగిన స్థానాలు : 199
పార్టీ | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతం |
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) | 6 | 4 |
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) | 73 | 38.8 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) | 2 | 1.2 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) | 99 | 39.3 |
భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) | 2 | 0.7 |
రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) | 1 | 0.3 |
రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌టీపీ) | 3 | 2.4 |
స్వతంత్రులు | 13 | 9.5 |
ఇతరులు | - | 3.8 |
మొత్తం స్థానాలు : 119
ఒకే దశలో ఎన్నికలు : డిసెంబర్ 7
ఎన్నికలు జరిగిన స్థానాలు : 119
పార్టీ | గెలిచిన స్థానాలు | ఓట్ల శాతం |
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) | 1 | 7 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) | 19 | 28.4 |
ఆల్‌ఇండియా మజ్లిస్-ఈ-ఇతేహదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) | 7 | 2.7 |
తెలంగాణ రాష్ట్ర సమితి | 88 | 46.9 |
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) | 2 | 3.5 |
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఎఐఎఫ్‌బీ) | 1 | 0.8 |
స్వతంత్రులు | 1 | 3.3 |
ఇతరులు | - | 7.4 |
ఏమిటి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎక్కడ : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ
నావికాదళంలో చేరిన డీఎస్‌ఆర్వీ
సముద్రలోతుల్లో జలాంతర్గాములు అపాయంలో చిక్కుకున్నప్పుడు అందులోని సిబ్బందిని సురక్షితంగా కాపాడే డీఎస్‌ఆర్వీ (డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్) భారత నావికాదళంలో చేరింది. ఐఎన్‌ఎస్ నిస్తార్ గా పిలిచే ఈ వాహనాన్ని ముంబై డాక్‌యార్డులో డిసెంబర్ 13న నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా నేవీలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్‌ఎస్ నిస్తార్ పాడైపోయిన జలాంతర్గామి, అందులోని సిబ్బందిని రక్షించడంతోపాటు రహస్య మిషన్లను కూడా సమర్థవంతంగా నిర్వహించగలదు.
ఐఎన్‌ఎస్ సబర్మతి నౌకపై మోహరించిన నిస్తార్ ముంబై కేంద్రంగా పనిచేయనుంది. దీనిని స్కాట్‌లాండ్‌లోని జేఎఫ్‌డీ సంస్థ తయారు చేసింది. అదేవిధంగా ఐఎన్‌ఎస్ నిరీక్షక్ పేరుతో మరో డీఎస్‌ఆర్‌వీని కూడా నేవీ సమకూర్చుకోనుంది. దీనిని విశాఖపట్నంలో ఉంచనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నావికాదళంలో చేరిన డీఎస్‌ఆర్వీ ఐఎన్‌ఎస్ నిస్తార్
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
పార్ట్‌నర్స్ ఫోరమ్ సదస్సు ప్రారంభం
రెండ్రోజులపాటు జరిగే ‘పార్ట్‌నర్స్ ఫోరమ్ - 2018’ సదస్సును న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 12న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రజారోగ్యంపై భారత్ చేస్తున్న ఖర్చును 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతానికి పెంచుతామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం రెండు భాగాలుగా అమలవుతుందని పేర్కొన్నారు. అందులో ఒకటైన ‘ప్రధానమంత్రి ప్రజారోగ్య కార్యక్రమం’ కింద 50 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. రెండో భాగంలో ప్రజలకు చేరువలో సమగ్ర ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కోసం 2022 నాటికి దేశంలో ఒకటిన్నర లక్షల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తామని వివరించారు. ప్రస్తుతం భారత్ జీడీపీలో 1.15 శాతాన్ని ప్రజారోగ్యంపై ఖర్చు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పార్ట్‌నర్స్ ఫోరమ్ - 2018 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూడిల్లీ
ఆటిజం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్‌ఫేర్ ఆఫ్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ (సవరణ)-2018 బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 11న పార్లమెంటు శీతాకాల సమావేశా ప్రారంభం కాగా డిసెంబర్ 12న సభలో ఆటిజం బిల్లును ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటిజం (సవరణ)-2018 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎక్కడ : రాజ్యసభ
మరాఠాల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును నవంబర్ 29న మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 68కి చేరుకుంది. రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2017లో మరాఠాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్(ఎస్‌బీసీసీ)ను నియమించింది.
ఎస్‌బీసీసీ కమిషన్ సమర్పించిన నివేదికతోపాటు, రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలోని మరాఠాల్లో 37.28 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ(బీపీఎల్)న జీవిస్తుండగా 93 శాతం కుటుంబాల వార్షిక ఆదాయం రూ.లక్షలోపేనని ఎస్‌బీసీసీ గుర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మరాఠాల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : మహారాష్ట్ర అసెంబ్లీ
భారత్‌లో అత్యధిక హెచ్‌ఐవీ యువత
దక్షిణాసియాలో హెచ్‌ఐవీతో బాధపడే యువతీయువకులు అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. ఈ మేరకు ‘చిల్డ్రన్-హెచ్‌ఐవీ అండ్ ఎయిడ్‌స- ది వరల్డ్ ఇన్ 2030’ పేరుతో యూనిసెఫ్ నవంబర్ 30న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2017 సంవత్సరానికి గానూ భారత్‌లో 19 ఏళ్లలోపు వయస్సున్న వారిలో 1,20,000 మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 80 మంది యువతీయువకులు చనిపోతారని యూనిసెఫ్ హెచ్చరించింది.
మరోవైపు చిన్నారులు, యువత, గర్భిణుల్లో హెచ్‌ఐవీ కేసుల్ని నియంత్రించడంలో దక్షిణాసియా గణనీయమైన పురోగతి సాధించిందని యూనిసెఫ్ తెలిపింది. ఈ విషయంలో భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్(5,800 మంది), నేపాల్(1,600), బంగ్లాదేశ్(వెయి్య కంటే తక్కువ)మరింత మెరుగైన ఫలితాలు సాధించాయంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో అత్యధిక హెచ్‌ఐవీ యువత
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : యూనిసెఫ్
ఎక్కడ : దక్షిణాసియాలో
హిమాలయ ప్రాంతానికి భూకంపం ముప్పు
హిమాలయ ప్రాంతానికి మరో భారీ భూకంపం ముప్పు పొంచి ఉందని శాస్తవేత్తలు తెలిపారు. ఈ విషయమై బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో భూకంప శాస్త్రవేత్తగా ఉన్న సిపీ రాజేంద్రన్ బృందం నవంబర్ 30న ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మధ్య హిమాలయాల ప్రాంతంలో ఎప్పుడైనా 8.5 తీవ్రతతో భూకంపం రావచ్చు. భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి పెరిగింది.
భూకంప విషయమై రాజేంద్రన్ మాట్లాడుతూ... క్రీ.శ.1315-1440 మధ్యకాలంలో మధ్య హిమాలయాల ప్రాంతంలో 8.5 తీవ్రతతో భీకరమైన భూకంపం సంభవించిందని తమ పరిశోధనలో తేలినట్లు తెలిపారు. 2004లో సునామీ రాకను కచ్చితంగా అంచనా వేసిన పుణెకు చెందిన భూకంప శాస్త్రవేత్త అరుణ్ బాపట్ స్పందిస్తూ.. ఈ ఏడాది చివర్లో లేదా 2019 ఆరంభంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
పశ్చిమ నేపాల్‌లోని మోహనఖోలా, ఉత్తరాఖండ్‌లోని ఛోర్‌గలియా ప్రాంతంలో భూప్రకంపనలతో పాటు ఇతర డేటాబేస్‌లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, ఇస్రో పంపిన కార్టోశాట్-1 చిత్రాలు, గూగుల్ ఎర్త్ ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నివేదికను రూపొందించారు. ఇదే అంశంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త రోజర్ బిల్హమ్ పరిశోధనలు జరుపుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాలయ ప్రాంతానికి భూకంపం ముప్పు
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : భూకంప శాస్త్రవేత్తలు
నేవీలోకి త్వరలో 56 యుద్ధనౌకలు
భారత నావికాదళంలోకి త్వరలోనే 56 కొత్త యుద్ధనౌకలు, ఆరు జలాంతర్గాములు చేరనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. డిసెంబర్ 4న నావికాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు చెప్పారు. 2050 నాటికి 200 యుద్ధనౌకలు, 500 సొంత యుద్ధ విమానాలతో భారత నేవీ ప్రపంచస్థాయి నౌకాదళంగా తయారవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు షిప్‌యార్డుల్లో 32 నౌకలు, జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
మరోవైపు భారత త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్)ని నియమించాలన్న ప్రతిపాదనకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అంగీకారం కుదిరిందనీ, త్వరలోనే ఈ విషయాన్ని రక్షణ శాఖకు నివేదిస్తామని లాంబా అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేవీలోకి త్వరలో 56 యుద్ధనౌకలు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా
సాక్షుల భద్రత ముసాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం
వివిధ కేసుల్లో సాక్ష్యం చెప్పే వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీం’ ముసాయిదాకు సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు అన్ని రాష్ట్రాలు ఈ ముసాయిదాను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.
రేప్ కేసులో అరెస్టయిన వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుస దాడులకు గురవడంతోపాటు అదృశ్యమవుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ)లను సంప్రదించిన అనంతరం ఈ ముసాయిదాకు కేంద్రం తుదిరూపం దాల్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీం ముసాయిదాకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : సుప్రీంకోర్టు
ఢిల్లీలో వృద్ధుల తీర్థయాత్ర యోజన ప్రారంభం
వృద్ధుల కోసం ఉచిత తీర్థయాత్రల పథకం ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 5న ప్రారంభించారు. ఢిల్లీలో నివసించే, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఈ యాత్రకు వెళ్లొచ్చు. ఢిల్లీలోని 70 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కొక్క స్థానం నుంచి మొత్తం 1,100 మంది వృద్ధులు.. మొత్తంగా 77 వేల మంది ఈ పథకం ప్రయోజనాలను పొందొచ్చు. మథుర, హరిద్వార్, రుషికేశ్, నీల్‌కంఠ్, పుష్కర్, బృందావన్, అమృత్‌సర్, వైష్ణోదేవి ఆలయం తదితరాలకు వృద్ధులను యాత్రకు పంపుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : న్యూఢిల్లీ