Manipur Attack: మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం
సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారు. నవంబర్ 13న జరిగిన ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. చురాచాంద్‌పూర్ జిల్లాలోని సెఖాన్ గ్రామం వద్ద విప్లవ్ కుటుంబంతో కాన్వాయ్‌లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు.
డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం...
తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి(41) గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్‌కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్.
ఏమిటీ పీఎల్‌ఏ?
- పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ను 1978 సెప్టెంబర్ 25న ఎన్.బిశ్వేశ్వర్ సింగ్ ప్రారంభించారు. మణిపూర్‌కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్‌ఏ పనిచేస్తోంది. పీఎల్‌ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి.
- ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్‌ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్‌ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్‌పీఎఫ్) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌లో పీఎల్‌ఏ భాగస్వామిగా చేరింది.
చదవండి: భారత్ భద్రతకు ఏ దేశం నుంచి ముప్పు ఉందని సీడీఎస్ చెప్పారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్