ఏకే 203 @ అమేథి
అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ నవంబర్ 23వ తేదీన పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే డిసెంబర్ 6 తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి నవంబర్ 23వ తేదీన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం.
ఐఏఎఫ్‌కు జీశాట్–7సీ శాటిలైట్..
భారత వాయుసేనకు జీశాట్– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నవంబర్ 23వ తేదీన జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.