Skip to main content

Sweden New Prime Minister : స్వీడన్‌కు తొలి మహిళా ప్రధానిగా....

స్వీడన్‌ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికై చరిత్ర సృష్టించిన 54 ఏళ్ల మాగ్డలినా అండర్సన్‌ గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు.
మాగ్డలినా అండర్సన్‌
మాగ్డలినా అండర్సన్‌

నవంబర్‌ 24వ తేదీన పార్లమెంట్‌లో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విఫలం కావడంతోపాటు రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్‌ పార్టీ బయటకు వెళ్లిపోవడమే ఇందుకు కారణం. అంతకుముందు నూతన ప్రధానిగా మాగ్డలినా ఎంపికకు స్వీడన్‌ పార్లమెంట్‌ ‘రిక్స్‌డాగ్‌’ ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న మాగ్డలినా ఇటీవలే సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. స్వీడన్‌ ప్రధానిగా, పార్టీ అధినేతగా వ్యవహరించిన స్టెఫాన్‌ లవ్‌ఫెన్‌ కొన్ని రోజుల క్రితం రెండు పదవుల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి మాగ్డలినా వచ్చేందుకు రంగం సిద్ధం కాగా, ఆర్థిక మంత్రిగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంట్‌ ఆమోదం లభించలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు గ్రీన్స్‌ పార్టీ తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాగ్డలినా ప్రకటించారు. రాజీనామా లేఖను పార్లమెంట్‌ స్పీకర్‌కు పంపించారు. స్వీడన్‌ పార్లమెంట్‌లో 349 మంది సభ్యులున్నారు. వీరిలో 117 మంది మాగ్డలినాకు అనుకూలంగా, 174 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 57 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకరు గైర్హాజరయ్యారు. స్వీడన్‌ రాజ్యాంగం ప్రకా రం పార్లమెంట్‌లో సగం మంది.. అంటే 175 మంది వ్యతిరేకించనంత కాలం ప్రధానమంత్రి తన పదవిలో కొనసాగవచ్చు. స్వీడన్‌లో తదుపరి సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్నాయి.

Published date : 25 Nov 2021 03:49PM

Photo Stories