Skip to main content

ఫిబ్రవరి 2018 అంతర్జాతీయం

జిన్‌పింగ్ కోసం రాజ్యాంగ సవరణ Current Affairs
చైనాలో శక్తిమంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది. సీపీసీకి చెందిన సెంట్రల్ కమిటీ ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. గతేడాది జరిగిన సీపీసీ కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్ సిద్ధాంతాల్ని, ఆలోచనా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది.

డ్రైవర్‌లెస్ కార్లకు కాలిఫోర్నియా అనుమతి
అమెరికాలోని కాలిఫోర్నియా నగరం డ్రైవర్ రహిత కార్లను నగర రోడ్లపై పరీక్షించేందుకు అనుమతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించి వాహన నియమావళిని కూడా సవరించింది. ప్రస్తుతం డ్రైవర్ రహిత కార్లను రోడ్లపైకి తెచ్చేందుకు టెల్సా, వైమో సంస్థలు పోటీ పడుతున్నాయి. కాగా ఇప్పటిదాకా వీటిని పరీక్షించేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా డ్రైవర్‌ను అందుబాటులో ఉంచి, పరీక్షించారు. తొలిసారి పూర్తిగా వాహనంలో ఎవరూ లేకుండానే పరీక్షించేందుకు కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రైవర్‌లెస్ కార్లకు అనుమతి
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : కాలిఫోర్నియా ప్రభుత్వం

సౌదీ సైన్యంలోకి మహిళలు
సౌదీఅరేబియా మహిళలను సైన్యంలోకి అనుమతిస్తూ ఫిబ్రవరి 26న చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్
Current Affairs దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 9 ఏళ్ల జుమా పాలనకు తెరపడింది. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ), జుమాకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. ఆయన రాజీనామా చేయకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జుమాను గద్దె దించాలని అధికార పార్టీ భావించింది. జాకబ్ జుమా రాజీనామా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 15న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 65 ఏళ్ల రామాఫోసా రెండు నెలల కిందటే ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా రామాఫోసా
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎందుకు : జాకబ్ జుమా పదవికి రాజీనామా చేసినందున

నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణ స్వీకారం
హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఫిబ్రవరి 15న ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ.. ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్-యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేపాల్ ప్రధాని ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ

యూనిసెఫ్ ఎవ్రీ చైల్డ్ అలైవ్’ నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టినవెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. నెల రోజుల్లోపు వయసున్న చిన్నారులు ప్రతి ఏటా 26 లక్షల మంది కన్నుమూస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అనుబంధంగా 184 దేశాల్లో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ నివేదికను ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలన్నీ మెరుగైన వైద్యంతో నివారించదగ్గవేనని యూనిసెఫ్ తెలిపింది.
నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచిందనీ, అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాలకు సంబంధించి 52 దిగువ మధ్యతరగతి దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాలు జపాన్‌లో(ప్రతి 1,111 మందిలో ఒకరు) అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొంది.

 

భారత్‌లో ఏటా 6 లక్షల మంది మృతి
భారత్‌లో పుట్టే చిన్నారుల్లో 6 లక్షల మందికిపైగా నెలరోజుల్లోపే కన్నుమూస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది. ఇలా చనిపోతున్నవారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి 1000 మంది చిన్నారుల్లో 10 మంది నెల రోజుల్లోపే చనిపోతుండగా, ఉత్తరాఖండ్, బిహార్‌లో ఇది 44గా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం జననాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల వాటా 46 శాతంగా ఉందంది. అలాగే దేశవ్యాప్తంగా నెలరోజుల్లోపు చనిపోతున్న శిశువుల్లో ఈ రాష్ట్రాల్లోనే 57 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. 2030 నాటికి నెల రోజుల్లోపు శిశు మరణాల రేటును ప్రతి వెయి్యమందికి 12కు తగ్గించాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని భారత్ అందుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను ప్రతి వెయి్యమందికి 25కు తగ్గించడంలో భాగంగా భారత్ మంచి పురోగతి సాధించిందని పేర్కొంది. ఈ జాబితాలో భారత్(31వ ర్యాంక్)తో పోల్చుకుంటే నేపాల్(50), బంగ్లాదేశ్(54 ), భూటాన్(60), శ్రీలంక(127) మెరుగైన ర్యాంకులు సాధించాయని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ నివేదిక
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : యూనిసెఫ్
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలపై

ఇజ్రాయెల్ ప్రధానిపై విచారణకు సిఫారసు
అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై రెండు కేసుల్లో నేరాభియోగాలు నమోదుకు ఆ దేశ పోలీసులు ిసిఫారసు చేశారు. 14 నెలల దర్యాప్తు అనంతరం నెతన్యాహుకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయని ప్రకటించిన పోలీసులు.. ప్రభుత్వ విచారణకు సిఫారసు చేశారు. అనుకూలంగా పనులు చేసి పెట్టేందుకు కానుకలు స్వీకరించడం; మీడియా కవరేజ్ కోసం ఒక ప్రముఖ వార్తా ప్రతిక ప్రచురణకర్తతో తెరవెనుక లావాదేవీలు జరపడం వంటివి పోలీసుల ప్రధాన ఆరోపణలు. నెతన్యాహు గత పదేళ్ల కాలంలో దాదాపు 3 లక్షల డాలర్లు స్వీకరించారని పోలీసులు ఆరోపించారు.

న్యూజిలాండ్‌లో ఒంటరి పక్షి నెగైల్ మృతి
Current Affairs ప్రపంచంలోనే ఒంటరి పక్షిగా పేరుగాంచిన సముద్ర పక్షి(గనెట్ జాతి పక్షి) నెగైల్ మృతి చెందింది. గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ తీరంలోని ‘మనా’ ద్వీపంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన కాలనీలో ఈ నెగైల్ ఒంటరిగా జీవిస్తుండేది. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒంటరి పక్షిగా గుర్తింపు పొందింది. ఇది గమనించిన జంతు పరిరక్షకులు దానికి కావాల్సిన ఏర్పాట్లను చేయడంతో అది అక్కడే జీవించేది. సాధారణంగా గనెట్ పక్షులు సమూహాలుగా నివసిస్తాయి. కానీ నెగైల్ ఏనాడూ ద్వీపాన్ని వదిలిపెట్టలేదు. ఇన్నేళ్లు ఒంటరిగా నివసించిన నెగైల్ వయసు మీదపడి చనిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒంటరి పక్షి నెగైల్ మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎక్కడ : న్యూజిలాండ్

క్రిప్టో సంపన్నుడు క్రిస్ లారెన్స్
ఫోర్బ్స్ తాజాగా తొలి క్రిప్టో కరెన్సీ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిపిల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన క్రిప్టో నికర విలువ 7.5-8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 2017లో బిట్‌కాయిన్, ఇథీరియమ్, ఎక్స్‌ఆర్‌పీ అనే మూడు ప్రముఖ క్రిప్టోకరెన్సీల సగటు విలువలో మార్పు 14,409 శాతంగా ఉంది. దాదాపు 1,500 క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటి సమష్టి విలువ 550 బిలియన్ డాలర్లు. 2017 ప్రారంభం నుంచి చూస్తే ఈ కరెన్సీల విలువ 31 శాతం మేర ఎగసింది. జోసెఫ్ లుబిన్ (క్రిప్టో నికర విలువ: 1-5 బిలియన్ డాలర్లు), చాంగ్‌పెంగ్ ఝావో (1-1.2 బిలియన్ డాలర్లు), కామెరాన్ అండ్ టైలెర్ వింక్‌లెవోస్ (900 మిలియన్- 1.1 బిలియన్ డాలర్లు), మాథ్యూ మెలాన్ (900 మిలియన్-1.1 బిలియన్ డాలర్లు) తదితరులు ఈ జాబితాలో స్థానం పొందారు.
2018 జనవరి 19 నాటి క్రిప్టో కరెన్సీల విలువ ఆధారంగా ఈ సంపన్నుల జాబితాలను రూపొందించారు. ఇందులో స్థానం దక్కించుకోవాలంటే కనీసం 350 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండాలి. భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ క్రిప్టో సంపన్నుల జాబితా
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తొలిస్థానంలో క్రిస్ లారెన్స్

రష్యా విమాన ప్రమాదంలో 71 మంది మృతి
రష్యాలో ఫిబ్రవరి 11న జరిగిన విమాన ప్రమాదంలో 71 మంది దుర్మరణం చెందారు. మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఉరల్ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్ పట్టణానికి బయలుదేరిన సరతోవ్ ఎయిర్‌లైన్‌‌సకు చెందిన ఆంటొనోవ్ ఏఎన్-148 జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూప్పకూలిపోయింది. దీంతో అందులోని ఆరుగురు సిబ్బందితో సహా 65 మంది ప్రయాణికులు మృతి చెందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా విమాన ప్రమాదంలో 71 మంది మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : మాస్కో

దక్షిణ కొరియాపై కిమ్ ప్రశంసల వర్షం
దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్ దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకోవడంతో పాటు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం ఫిబ్రవరి 12న రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కిమ్‌ను కలుసుకుంది. వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది.

జాకబ్ జుమా రీకాల్‌కు ఏఎన్‌సీ నిర్ణయం
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో ఫిబ్రవరి 12న ఏఎన్‌సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు. ఈ మేరకు జుమాకు ఏఎన్‌సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్‌సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా రీకాల్‌కు నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ)

పాక్ నిషేధిత జాబితాలో సయీద్ సంస్థలు
అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల్లో సవరణలు చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఐ-ఇన్సానియత్ ఫౌండేషన్‌తో పాటు పలు సంస్థల్ని ఉగ్రవాద జాబితాలో చేర్చుతూ పాక్ అధ్యక్షుడు ఆర్డినెన్‌‌స జారీ చేశారు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర సంస్థలూ ఇందులో ఉన్నాయి.
ఉగ్రవాదానికి పాక్ అనుకూలమన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా పారిస్‌లో ఫిబ్రవరి 18 నుంచి జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని ఎఫ్‌ఏటీఎఫ్ నియంత్రిస్తోంది. ఉగ్రవాదులకు అండగా ఉన్న పాక్‌ను ‘ఎఫ్‌ఏటీఎఫ్’ గ్రే జాబితాలో చేర్చేందుకు అమెరికా, భారత్‌ల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆర్డినెన్‌‌స జారీచేశారు. గతంలో 2012 నుంచి మూడేళ్ల పాటు పాక్ ‘ఎఫ్‌ఏటీఎఫ్’ గ్రే జాబితాలో కొనసాగింది.

అఫ్గానిస్తాన్‌లో చైనా మిలటరీ బేస్ ఏర్పాటు
Current Affairs
అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ నిర్మించేందుకు చైనా ఆ దేశంతో చర్చలు జరుపుతోందని అఫ్గానిస్తాన్ అధికారులు తెలిపారు. పర్వతాలతో కూడిన వాఖన్ కారిడార్ నుంచి తమ సరిహద్దు ప్రాంతం జిన్‌జియాంగ్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన చెందుతున్న చైనా..అక్కడ మిలటరీ బేస్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ ఏర్పాటు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : చైనా
ఎందుకు : ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కోవడానికి

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం
జైళ్లలో ఉన్న ప్రతిపక్ష నేతల శిక్షల్ని రద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాల్దీవుల్లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది. జైలు శిక్ష ఎదుర్కొంటోన్న మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రవాసంలో ఉండగా.. జైళ్లలో ఉన్న మిగిలిన రాజకీయ నేతల్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. వివాదాస్పదమైన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నషీద్‌పై విజయం సాధించాక యమీన్ అధికారంలోకి వచ్చారు. అనంతరం స్వపక్షంలోని అసంతృప్త నేతలు, ప్రతిపక్ష నేతలను యమీన్ జైల్లో పెట్టించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల్లో రాజకీయ అనిశ్చితి
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : యమీన్
ఎందుకు : జైళ్లల్లో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేయమని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో

అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం
అణ్వస్త్రాలను ఆధునీకరించేందుకు, చిన్నస్థాయి అణ్వాయుధాల తయారీకి వీలుగా అమెరికా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 పేజీలతో న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 పేరిట తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై జరిగే అణు దాడుల్ని నిరోధించవచ్చని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ విధానంపై పెంటగాన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో అమెరికాకు ఎదురవుతున్న అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విధానం చాలా అనువైనదని పేర్కొన్నారు. అణ్వాయుధ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ విభాగాలతో పాటు సంప్రదాయ, అణ్వాయుధాలు ప్రయోగించే విమానాలు, భూ,సముద్ర, వాయు మార్గాల నుంచి దాడిచేసే సామర్థ్యం ఆధునీకరణకు ఈ విధానం దోహదం చేస్తుందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం అణువ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ), అణ్వాయుధాల నియంత్రణతో పాటు అణు పరీక్షల నిషేధంపై అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘అణు’ ఆధునీకరణకు న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 విధానం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : అమెరికా

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం-కారణాలు
దక్షిణ ఆసియాలోని మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 5న పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ కూడా నిర్బంధంలో ఉన్నారు.
సంక్షోభానికి కారణం..
వివిధ కేసుల్లో మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్ సహా పలువురు రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణ చెల్లదని సుప్రీంకోర్టు 2018 జనవరిలో ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న 9 మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. మొహమద్ నషీద్‌పై 2015లో చేపట్టిన విచారణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాల్ద్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడుగా గుర్తింపు పొందిన నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు.
అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విడుదల చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు.
భారత్ సహాయాన్ని కోరిన నషీద్..
తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదేనని.. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. కాగా, మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మాల్దీవుల్లో సంక్షోభంతో భారత్, చైనాపై ప్రభావం
హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఇండియాను కలవరపెడుతోంది. ఇటీవలే మాల్దీవులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న మరో ఆసియా దిగ్గజం చైనా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్ సర్కారు రద్దు చేసింది.
మాల్దీవుల్లో 22 వేల మంది భారతీయులు
లక్ష దీవులకు 700 కి.మీ. దూరంలోని ఈ చిన్న దేశం జనాభా నాలుగున్నర లక్షలు. ప్రస్తుతం 22 వేల మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం 400 మంది వైద్యుల్లో 125 మందికి పైగా భారతీయులే. ఉపాధ్యాయుల్లో నాలుగో వంతు మంది కూడా ఇండియా నుంచి వెళ్లినవారే. దాదాపు అందరూ ముస్లింలే ఉన్న మాల్దీవుల్లో సంక్షోభం ముదిరితే అక్కడ మత ఛాందస వాదం, వాణిజ్య నౌకల దోపిడీ, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా పెరిగి తన భద్రతకు ముప్పువాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భారత సరుకు రవాణా 97 శాతం ఈ ప్రాంతం మీదుగానే జరుగుతోంది. 1988లో మాల్దీవులను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి శ్రీలంక తీవ్రవాదుల ముఠా యత్నించినా భారత సైన్యం అండతో నాటి అధ్యక్షుడు గయూమ్ ఆ చర్యను తిప్పికొట్టారు.
2011లో చైనా పాదం
మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయాన్ని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ద్వీపదేశంతో చైనా వాణిజ్య సంబంధాలు వేగంగా వృద్ధి చెందాయి. సార్క్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత చైనాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకున్న రెండో దేశం మాల్దీవులు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్టులో మాల్దీవులు కూడా భాగస్వామి. మాలే-హుల్‌హూల్ ద్వీపాల మధ్య వంతెన సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా సహాయంతో ఇక్కడ నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర సిల్క్ రూట్ ప్రాజెక్టు నిర్మాణంలో మాల్దీవులది కీలకపాత్రగా చైనా భావిస్తోంది. శ్రీలంకలో హంబన్‌టోటా రేవు ప్రాజెక్టుతోపాటు జిబూటీలోనూ సైనిక స్థావరం నిర్మాణానికి స్థలం సంపాదించిన చైనా చెప్పుచేతల్లో నడిచే రాజ్యంగా మాల్దీవులు మారడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే.

శరణార్థులపై నిషేధం ఎత్తేసిన యూఎస్
11 దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అమెరికా జనవరి 30న ప్రకటించింది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇరాన్, లిబియా, ఈజిప్ట్, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా ఉన్నాయి.
Published date : 21 Feb 2018 03:08PM

Photo Stories