Skip to main content

మార్చి 2021 అంతర్జాతీయం

సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన భారీ సరకు రవాణా నౌక ఏది?
Current Affairs
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్‌ కాలువ మార్గంలో అత్యంత భారీ సరకురవాణా నౌక ‘‘ఎవర్‌ గివెన్‌’’ అడ్డంగా ఇరుక్కుంది. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళుతున్న ఈ భారీ నౌక మార్చి 23న ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం నెలకొని ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నౌక ఇసుక మేటల్లో కూరుకుపోయింది.
గంటకు మూడు వేల కోట్లు నష్టం...
ఎవర్‌ గివెన్‌ చిక్కుకుపోవడంతో సూయజ్‌ కాలువ ద్వారా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 180కిపైగా చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో గంటకు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నట్టుగా అంచనా వేశారు.
ఎంత భారీ నౌక ?
ఆసియా, యూరప్‌ దేశాల మధ్య సరుకు రవాణా చేసే ఎవెర్‌గివెన్‌ నౌక ఓనర్‌ జపనీస్‌ కంపెనీ కాగా, దాన్ని నిర్వహిస్తున్నది తైవాన్‌ కంపెనీ. ఈ నౌక ఈఫిల్‌ టవర్‌ కంటే పొడవైనది. మూడు ఫుట్‌బాల్‌ గ్రౌండ్ల కంటే పెద్దది. ప్రసుతం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. ఈ నౌకలో ప్రసుతం 20 వేల కంటెయినర్లు ఉన్నాయి. నౌకలోని మొత్తం 25 మంది సిబ్బంది(భారతీయులు) క్షేమంగా ఉన్నారు.
సూయజ్‌ కాలువ...
ప్రపంచంలో అతి పొడవైన కాలువ అయిన సూయజ్‌ కాలువను 1869లో నిర్మించారు. 120.1 మైళ్లున్న(193.3 కి.మీ) ఈ కాలువ ఉత్తరాన మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఆసియా, యూరప్‌ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్‌ దేశాల నుంచి చమురు యూరప్‌ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 12 శాతం ఈ కాలువ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30 శాతం ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన భారీ సరకు రవాణా నౌక
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : ఎవర్‌ గివెన్‌
ఎక్కడ : సూయజ్‌ కాలువ, ఈజిప్టు
ఎందుకు : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల

కోవిడ్‌ సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం: ఐరాస
Current Affairs
కోవిడ్‌–19 ఇకపై సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్‌ సీజనల్‌ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది. ఈ అధ్యయన బృందానికి జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్‌ జెయిట్‌చిక్‌ నేతృత్వం వహించారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశం
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశంగా చైనా నిలిచింది. చైనా తర్వాత రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో రష్యా, నాలుగో స్థానంలో భారత్‌ నిలిచాయి. మిలటరీ డైరెక్ట్‌ అనే డిఫెన్స్‌ వెబ్‌సైట్‌ మార్చి 21న విడుదల చేసిన ‘అల్టిమేట్‌ మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌’ ద్వారా ఈ విషయం వెల్లడైంది. మిలటరీ బడ్జెట్, యాక్టివ్, ఇన్‌ యాక్టివ్‌ సైనికుల సంఖ్య, త్రివిధ దళాలు, అణు సామర్థ్యం, సరాసరి వేతనాలు, ఆయుధ సామగ్రి వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇండెక్స్‌ను రూపొందించారు.
82 పాయింట్లతో...
మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా మిలటరీ బడ్జెట్‌ భారీగా ఉన్నప్పటికీ.. 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో, 61 పాయింట్లతో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లో యూకే 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.
బడ్జెట్‌లో అమెరికాకు అగ్రస్థానం...
ప్రపంచంలోనే భారీ మిలటరీ బడ్జెట్‌ను కలిగిన అమెరికా ఏడాదికి 732 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తుండగా చైనా 261 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 71 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశం చైనా
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : అల్టిమేట్‌ మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌(మిలటరీ డైరెక్ట్‌)
ఎక్కడ : ప్రపంచంలోనే

క్వాడ్‌ కూటమి దేశాధినేతల తొలి సమావేశం
Current Affairs
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్‌ కోయెలిషన్‌) దేశాల అధినేతల తొలి సమావేశం 2021, మార్చి 12న వర్చువల్ విధానంలో జరిగింది. సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, జపాన్‌ పీఎం యోషిహిదె సుగా పాల్గొన్నారు. వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్‌ 19 టీకా, నూతన సాంకేతికలు అనే ప్రపంచానికంతటికీ మంచి జరిగేందుకు ఉద్దేశించిన అంశాలను ఈ భేటీకి అజెండాగా తీసుకున్నారు. సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా శాంతి, అభివృద్ధిలను సాధించే శక్తిగా క్వాడ్‌ నిలుస్తుందన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : క్వాడ్‌ కూటమి దేశాధినేతల వర్చువల్‌ సమావేశం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, జపాన్‌ పీఎం యోషిహిదె సుగా
ఎందుకు : వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్‌ 19 టీకా, నూతన సాంకేతికలు అనే అంశాలపై చర్చించేందుకు

ఖతర్‌లో కొత్త చట్టం..ఎప్పుడు నుంచి అమలు అంటే..?
విదేశీ వలస కార్మికుల‌ కష్టాలను గుర్తించిన ఖతర్‌ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచుతూ కొత్త చట్టం రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రతి కంపెనీ వలస కార్మికుల‌కు నెలకు వెయ్యి రియాళ్ల కనీస వేతనం (మన కరెన్సీలో రూ.20 వేలు) చెల్లించడంతో పాటు భోజనం, వసతి కోసం మరో ఎనిమిది వందల రియాళ్లు ఇవ్వాలని ఖతర్‌ ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కార్మిక‌ శాఖ జారీ చేసింది. ప్రస్తుతం ఖతర్‌లో ఉపాధి పొందుతున్న విదేశీ వలస కార్మికుల‌కు నెలకు 500 రియాళ్ల నుంచి 700 రియాళ్ల వరకు వేతనం చెలిస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ క్యాంపులలో కార్మికుల‌కు వసతి క‌ల్పిస్తుండ‌గా మరి కొన్ని కంపెనీలు మాత్రం కార్మికుల‌ వసతి, ఇతర సదుపాయాల గురించి పట్టించుకోవడంలేదు. కాగా, వలస కార్మికుల‌కు తక్కువ వేతనం చెల్లించడం వల్ల వారి శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని భావించిన ఖతర్‌ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచింది. 2020 ఆగస్టులోనే కనీస వేతన పరిమితి పెంచిన ఖతర్‌ ప్రభుత్వం, ఇందుకు సంబంధించిన చట్టాన్ని మార్చి 20 నుంచి అమలులోకి తీసుకురానుంది. ఈ చట్టం ప్రకారం వలస కార్మికుల‌కు ఆయా కంపెనీలు వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తే ప్రతి నెలా వెయ్యి రియాళ్ల కనీస వేతనం చెల్లించాలి. ఒక వేళ వసతి, భోజన సదుపాయాలను క‌ల్పించ‌కపోతే అదనంగా 800 రియాళ్లను చెల్లించాలని ఖతర్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఖతర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కొన్ని కంపెనీలు అమలులోకి తీసుకువచ్చాయి. కాగా ఇప్పటి వరకు కనీస వేతన పరిమితిని అమలు చేయని కంపెనీలు మార్చి 20 నుంచి క‌చ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఖతర్‌లో కొత్త చట్టం
ఎప్పుడు : మార్చి 20 నుంచి..
ఎవరు : ఖతర్‌ ప్రభుత్వం
ఎక్కడ : ఖతర్‌లో
ఎందుకు : విదేశీ వలస కార్మికుల‌కు కనీస వేతన పరిమితి పెంపు

జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌లో అస్ట్రాజెనెకా టీకాపై నిషేధం..ఎందుకంటే?
కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణకు అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ సంస్థ అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు నిషేధం విధించాయి. అస్ట్రాజెనెకా కరోనా టీకా తీసుకున్న కొందరిలో ప్రమాదకరమైన రీతిలో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని అధ్యయన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగానే తాము ఈ వ్యాక్సిన్‌పై నిషేధం విధించినట్లు ఇటలీ ఔషధ నియంత్రణ సంస్థ మార్చి 15వ తేదీన ప్రకటించింది. ఫ్రాన్స్, జర్మనీ కూడా అదే దారిలో నడుస్తున్నట్లు స్పష్టం చేశాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌లో అస్ట్రాజెనెకా టీకాపై నిషేధం
ఎప్పుడు : మార్చి 14న
ఎక్కడ : జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌
ఎందుకు : కొందరిలో ప్రమాదకరమైన రీతిలో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని అధ్యయన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో...

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ ఏడాదిని ప్రకటించారు?
Current Affairs
2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్‌ మిల్లెట్స్‌ ఇయర్‌ (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడం, మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా చిరు ధాన్యాల సాగుని ప్రోత్సహించడం వంటివి 2023 ఏడాది చేపడతారు.
భారత్‌ తీర్మానం మేరకు...
భారతదేశ తీర్మానం మేరకు 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించింది. బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్‌ దేశాలతో కలిపి భారత్‌ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 73కి పైగా దేశాలు మద్దతు తెలిపాయి.
ఐక్యరాజ్యసమితి...

  • ప్రధాన కార్యాలయం: న్యూయార్క్‌(అమెరికా)
  • అధికార భాషలు: అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్‌
  • ప్రస్తుత సెక్రటరీ జనరల్‌: అంటోనియో గుటెర్రెస్‌
  • ఏర్పాటు: 1945, అక్టోబర్‌ 24
  • ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య: 193
ఐరాసాలో చివరిగా చేరిన దేశాలు:
189 – తువాలు (సెప్టెంబరు, 2000)
190 – స్విట్జర్లాండ్‌ (సెప్టెంబరు, 2002)
191 – తూర్పు తిమోర్‌ (2006)
192 – మాంటెనెగో (2006)
193 – దక్షిణ సూడాన్‌ (జూలై, 2011)
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం(ఇంటర్నేషనల్‌ మిల్లెట్స్‌ ఇయర్‌)గా 2023
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎందుకు : చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించేందుకు

రక్షణ కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం?
కరోనా సంక్షోభంతో అమెరికాతో ఏర్పడిన రాజకీయ విభేదాలు, తూర్పు లద్దాఖ్‌లో భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ చైనా రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెంచేసింది. మొదటి సారిగా చైనా రక్షణ బడ్జెట్‌ దాదాపు 20 వేల కోట్ల అమెరికా డాలర్లు దాటేసింది. ఈ మొత్తం భారత్‌ తన రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్‌ కంటే మూడు రెట్లు ఎక్కువ.
1.35 లక్షల యువాన్లు...
చైనా పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ తొలి రోజు సమావేశాన్ని పురస్కరించుకొని మార్చి 5న చైనా ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్‌ రక్షణ రంగానికి 1.35 లక్షల యువాన్లు(దాదాపు రూ. 15 లక్షల కోట్లు పైనే) కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది.
ప్రపంచంలో అత్యధికం...
ప్రపంచంలో రక్షణ కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం అమెరికా. అమెరికా తర్వాత స్థానంలో వరుసగా చైనా, భారత్‌ ఉన్నాయి.

యూఎన్‌ఈపీ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌గా ఎవరు ఉన్నారు?
2019లో ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్‌ టన్నుల ఆహారం వృథా అయ్యింది. ఇందులో భారతదేశం వాటా 68.7 మిలియన్‌ టన్నులు ఉంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌ఈపీ) ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2021లో వెల్లడించింది.
ఫుడ్‌ వేస్ట్‌ రిపోర్ట్‌–ముఖ్యాంశాలు

  • 2019లో వృథా అయిన ఆహారంలో 61 శాతం గృహాల నుంచి, 26 శాతం ఫుడ్‌ సర్వీసు సెంటర్లు, 13 శాతం రిటైల్‌ మార్కెట్‌ నుంచి వచ్చింది.
  • ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో 17 శాతం వృథా అయింది.
  • వృథా అయిన ఆహారాన్ని 23 మిలియన్ల ట్రక్కుల్లో(40 టన్నుల సామర్థ్యం కలిగినవి) నింపొచ్చు. ఈ ట్రక్కులను వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఆనుకునేలా నిలిపితే భూగోళాన్ని ఏడుసార్లు చుట్టేయవచ్చు.
భారత్‌లో...

  • భారత్‌లో ప్రతి ఇంట్లో ఏటా 50 కిలోల ఆహారం వృథాగా మారిపోతున్నట్లు అంచనా. అంటే దేశవ్యాప్తంగా ప్రతిఏటా 6,87,60,163 టన్నుల తిండి వృథా అవుతోంది. అమెరికాలో ఇది 1,93,59,951 టన్నులు కాగా, చైనాలో 9,16,46,213 టన్నులు.
  • గృహాల్లో అందుబాటులో ఉన్న ఆహారంలో 11 శాతం పనికిరాకుండా పోతోంది. ఫుడ్‌ సర్వీసు సెంటర్లలో 5 శాతం, రిటైల్‌ ఔట్‌లెట్లలో 2 శాతం ఆహారం వృథా అవుతోంది.
యూఎన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP)...
ప్రధాన కార్యాలయం: నైరోబీ (కెన్యా)
స్థాపన: 1972, జూన్‌ 5
ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌: ఇంగర్‌ ఆండర్సన్‌(డెన్మార్క్‌)
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2019లో 931 మిలియన్‌ టన్నుల ఆహారం వృథా
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌ఈపీ) ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2021
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పోప్‌ ఫ్రాన్సిస్‌ పర్యటన
కేథలిక్‌ మత పెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(84) అరబ్‌ దేశం ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పర్యటించారు. మార్చి 6న ఆయన ఇరాక్‌లోని పవిత్ర నగరం నజాఫ్‌లో షియాల గ్రాండ్‌ అయతొల్లా అలీ అల్‌– సిస్తానీ(90)తో భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో ఇరువురు మతపెద్దలు శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరారు. ఇరాక్‌లోని క్రైస్తవులను కాపాడుకోవడంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని అల్‌– సిస్తానీ ఆకాంక్షించారు. ఇరాక్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవించే మత పెద్దల్లో అల్‌ సిస్తానీ ఒకరు.
పురాతన ఉర్‌(ఇరాక్‌) నగరంలో సర్వమత సమ్మేళనంలోనూ పోప్‌ పాల్గొన్నారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా భావించే అబ్రహాం జన్మించింది ఉర్‌లోనే కావడం విశేషం.

ఒక్క డోసు టీకాకు అమెరికా అనుమతి
Current Affairs
కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారు చేసిన టీకా వినియోగానికి ఫిబ్రవరి 27న అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. ఈ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని జాన్సన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే అమెరికా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లకు అనుమతిచ్చింది.
చైనాలోనూ..
చైనా తయారు చేసిన సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ వినియోగానికి ఆ దేశం కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేసింది. చైనా యాడ్‌5–ఎన్‌కావ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు ఫిబ్రవరి 26న అనుమతులు ఇచ్చినట్టుగా గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది.

ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు...
అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 26న నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది.

ఇరాక్‌లో మిత్రపక్షాల ఎయిర్‌బేస్‌పై రాకెట్ల దాడి
దక్షిణ ఇరాక్‌లోని అన్బార్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఐన్‌ అల్‌–అసాద్‌ ఎయిర్‌బేస్‌పై మార్చి 3న రాకెట్ల దాడి జరిగింది. దాదాపు 10 రాకెట్లు ఎయిర్‌బేస్‌ను ఢీకొట్టాయి. అమెరికా నేతృత్వంలోని మిత్రపక్షాల సేనలు దీన్ని వైమానిక అవసరాలకు వాడుకుంటున్నాయి. రాకెట్ల దాడి వల్ల వాటిల్లిన నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఈ దాడికి తామే కారణమంటే ఉగ్రవాద సంస్థలేవీ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.
ఇరాక్‌ రాజధాని: బాగ్దాద్‌; కరెన్సీ: ఇరాకీ దినార్‌
ఇరాక్‌ ప్రస్తుత అధ్యక్షుడు: బర్హం సలీహ్‌
ఇరాక్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: ముస్తఫా అల్‌–ఖాదిమి

అఫ్గాన్‌లో ఉగ్రవాదుల దాడి
అఫ్గానిస్తాన్‌ టెలివిజన్, రేడియో స్టేషన్లలో పనిచేసే ముగ్గురు మహిళా జర్నలిస్టులను ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ జలాలా బాద్‌... ఈస్ట్రన్‌ సిటీలో కాల్చి చంపినట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు. టర్కీ, భారత్‌లో జనాదరణ పొందిన నాటకాలకు ఈ ముగ్గురు పాత్రికేయులు డబ్బింగ్‌ చెప్తున్నారని పేర్కొన్నారు. వీరంతా ఇటీవలే స్కూల్‌ చదువు పూర్తి చేసుకున్న 18 నుంచి 20 ఏళ్ళ మధ్య వయస్సు వారే.
అఫ్గానిస్తాన్‌ రాజధాని: కాబూల్‌; కరెన్సీ: అఫ్గనీ
అఫ్గానిస్తాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు: అష్రఫ్‌ ఘని
అఫ్గానిస్తాన్‌ ప్రస్తుత మొదటి అధ్యక్షుడు: అమృల్లా సలేహ్‌
అఫ్గానిస్తాన్‌ ప్రస్తుత రెండవ అధ్యక్షుడు: సర్వార్‌ డానిష్‌
Published date : 27 Mar 2021 05:21PM

Photo Stories