Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 29 కరెంట్‌ అఫైర్స్‌

Facebook, Meta

Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ కంపెనీ నూతన పేరు ఏమిటీ?

ఫేస్‌బుక్‌ కంపెనీ పేరు మారింంది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అక్టోబర్‌ 28న కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొత్త లోగో ఆవిష్కరణ జరిగింది. ఇంతకుముందు ఫేస్‌బుక్‌ కంపెనీ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు– ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరు మాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు.

అందుకే పేరు మార్పు...
భవిష్యత్తులో వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్‌)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌ పేరును మార్చినట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు. ‘మెటా’ అనేది గ్రీకు పదమని చెప్పారు. ‘యాప్స్‌’ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన ‘మెటావర్స్‌’దిశగా మెటా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. వర్చువల్‌–రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవల వినియోగం, తత్సబంధ అంశాలు ‘మెటావర్స్‌’ పరిధిలోకి వస్తాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మెటాగా ఫేస్‌బుక్‌ కంపెనీ పేరు మార్పు
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ 
ఎందుకు : భవిష్యత్తులో వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్‌)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని...


ASEAN-India Summit: భారత్‌ – ఆసియాన్‌ ఫ్రెండ్‌షిప్‌ ఇయర్‌ను ఎప్పడు పాటించనున్నారు?

Modi at asian summit

18వ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్‌) – భారత్‌ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి అక్టోబర్‌ 28న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఇండోఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్‌ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్‌ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. భారత్‌– ఆసియాన్‌ భాగస్వామ్యానికి వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండుతాయని, అలాగే స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తవుతాయన్నారు. ఈ ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకొని 2022ను ‘భారత్‌– ఆసియాన్‌ ఫ్రెండ్‌షిప్‌ ఇయర్‌’గా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటామని అన్నారు. 2021 ఆసియాన్‌ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న బ్రూనై దేశ సుల్తాన్‌ హసనల్‌ బోల్కియాకు మోదీ  అభినందనలు తెలిపారు. కరోనా కారణంగా వరుసగా రెండో ఏడాది సదస్సును వర్చువల్‌గా నిర్వహించారు.

ఆసియాన్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్‌) 1967లో ఆగస్ట్‌ 8న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జకార్తాలో ఉంది. ఆగ్నేయాసియాలోని పది దేశాలు ఈ కూటమిలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అవి.. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి.


EdelGive Hurun India: 2021 ఫిలాంత్రోపీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంపన్నుడు?

Azim Premji, Shiv nadar,Mukesh

దాతృత్వానికి సంబంధించి హరూన్‌ ఇండియా–ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ సంయుక్తంగా రూపొందించిన ‘ఎడెల్‌గివ్‌ హరూన్‌ ఇండియా ఫిలాంత్రోపీ జాబితా 2021’లో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. నివేదిక ప్రకారం అజీమ్‌ ప్రేమ్‌జీ... గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) రూ.9,713 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంటే ప్రతీ రోజూ 27 కోట్ల చొప్పున సమాజం కోసం దానం చేశారు. అజీమ్‌ ప్రేమ్‌జీ తర్వాత హెచ్‌సీఎల్‌ సంస్థ అధినేత శివ్‌నాడార్‌ రెండో స్థానంలో ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నాడార్‌ రూ.1,263 కోట్లను విరాళంగా ఇచ్చారు.

ఎడెల్‌గివ్‌ హరూన్‌ ఇండియా ఫిలాంత్రోపీ జాబితా 2021
ర్యాంకు     పేరు  విరాళంగా ఇచ్చిన మొత్తం
1 అజీమ్‌ప్రేమ్‌జీ(విప్రో) రూ.9,713 కోట్లు 
2 శివ్‌నాడార్‌(హెచ్‌సీఎల్‌)     రూ.1,263 కోట్లు
3 ముకేశ్‌ అంబానీ(రిలయన్స్‌) రూ.577 కోట్లు
4 కుమారమంగళం బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్‌)  రూ.377 కోట్లు 
5 నందన్‌ నీలేకని(ఇన్ఫోసిస్‌) రూ.183 కోట్లు

 

EWS welfare Ministry: ఈడబ్ల్యూఎస్‌ పేరుతో ప్రత్యేక శాఖకు ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?

AP Cabinet

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 28న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు ఇలా...

  • బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయం.
  • జైన్‌లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్‌ కార్పొరేషన్, సిక్కు  కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ తీర్మానం.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం...


Andhra Pradesh: వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఎక్కడ నిర్మిస్తున్నారు?

Steel

ఎటువంటి కాలుష్యం లేకుండా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా పర్యావరణహితంగా వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను నిర్మించేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్లాంట్‌ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఈ స్టీల్‌ ప్లాంట్‌కు 2019 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 3,591 ఎకరాల్లో రూ.16,986 కోట్లతో అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పర్యావరణహితంగా వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను నిర్మించేలా చర్యలు
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ    : జమ్మలమడుగు సమీపం, వైఎస్సార్‌ కడప జిల్లా
ఎందుకు : కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా...


Andhra Pradesh: సినిమాల రెగ్యులేషన్‌ చట్టం సవరణ ఉద్దేశం?

Cinima Tickets

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ సినిమాల రెగ్యులేషన్‌ చట్టం–1955 సవరణకు రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్‌ 28న ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం... ఇండియన్‌ రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు  ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్‌ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ సినిమాల రెగ్యులేషన్‌ చట్టం–1955 సవరణకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం 
ఎందుకు : సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు...


Child: రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఎంత?

Infant

2019లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) సర్వే నిర్వహించి తాజాగా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అక్టోబర్‌ 28న వెల్లడించాయి. నివేదిక ప్రకారం... ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 30 మంది మరణిస్తుండగా, తెలంగాణలో 23 మంది శిశువులు మరణిస్తున్నారు. 2014లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి శిశు జననాల్లో 35 మంది చనిపోయేవారు. రాష్ట్రంలో మగ శిశు మరణాల రేటు 24, ఆడ శిశువుల మరణాల రేటు 22గా ఉంది. ³ట్టణాల్లో శిశు మరణాల రేటు 18 ఉండగా, పల్లెల్లో 26 మంది మరణిస్తున్నారు.

నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు...

  • 1971లో దేశంలో శిశు మరణాల రేటు 129 ఉండేది. 21 పెద్ద రాష్ట్రాల్లో లెక్క చూస్తే శిశు మరణాల రేటు అత్యంత తక్కువగా కేరళలో ప్రతి వెయ్యికి ఆరుగురు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 46 మంది మరణిస్తున్నారు.
  • 9 చిన్న రాష్ట్రాల్లో చూస్తే అత్యంత తక్కువగా మిజోరాం, నాగాలాండ్‌లో ప్రతి మందికి ముగ్గురు చొప్పున శిశువులు మరణిస్తున్నారు. అత్యంత ఎక్కువగా మేఘాలయలో 33 మంది మరణిస్తున్నారు. 
  • కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత తక్కువగా అండమాన్‌ అండ్‌ నికోబార్‌లో ఏడుగురు మరణిస్తుండగా, అత్యంత ఎక్కువగా డామన్, డయ్యూలో 17 మంది శిశువులు మరణిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రతి వెయ్యికి 23 మంది శిశువులు మరణిస్తున్నారు
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
ఎక్కడ    : తెలంగాణ రాష్ట్రం


CEC Sushil Chandra: ఏ దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత సీఈసీ పరిశీలకునిగా వ్యవహరించారు?

CEC Sushil Chandra

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అంతర్జాతీయ పరిశీలకునిగా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ఆ దేశంలో పర్యటించిందని అక్టోబర్‌ 28న భారత ఎన్నికల కమిషన్‌ తెలిపింది. కొత్త ఎన్నికల కోడ్‌ను అనుసరించి అక్టోబర్‌ 24న ఉజ్బెకిస్తాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుశీల్‌ చంద్ర సీఈసీగా 2021, ఏప్రిల్‌ 13న బాధ్యతలు చేపట్టారు. 2022, మే 14వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు?
ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. అక్టోబర్‌ 28న వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్‌ సింగ్‌ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అంతర్జాతీయ పరిశీలకునిగా వ్యవహరించిన వ్యక్తి?
ఎప్పుడు : అక్టోబర్‌ 28
ఎవరు    : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర
ఎక్కడ    : ఉజ్బెకిస్తాన్‌

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 28 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Oct 2021 07:32PM

Photo Stories