Daily Current Affairs in Telugu: 2022, మార్చి 07 కరెంట్ అఫైర్స్
2022 Financial Year: చైనా రక్షణ బడ్జెట్‌ను ఎంత శాతం పెంచారు?
చైనా తన సాయుధబలగాల కోసం ఈసారి బడ్జెట్ కేటాయింపులు పెంచింది. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం ఎక్కువగా 230 బిలియన్ డాలర్లకు డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచుకుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్ యువాన్ల రక్షణ బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలను చైనా ప్రధాని లీ కెకియాంగ్ మార్చి 5న ఆ దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాభల్యాన్ని కొనసాగించేందుకు చైనా ఇలా తన రక్షణ బడ్జెట్‌ను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ను మరింత పటిష్టచేసేందుకు, చైనా సమగ్రత, సార్వభౌమత్వం, దేశ ప్రయోజనాలు, రక్షణలను దృష్టిలో ఉంచుకుని రక్షణ బడ్జెట్ పెంచామని ముసాయిదా పత్రాల్లో కెకియాంగ్ పేర్కొన్నారు. భారత్ తన రక్షణ అవసరాలకు కేటాయిస్తున్న బడ్జెట్ మొత్తంతో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్ ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్ యువాన్లను రక్షణ శాఖకు కేటాయింపు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : చైనా
ఎందుకు : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ను మరింత పటిష్టచేసేందుకు..
Russia-Ukraine War: ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై నిషేధం విధించిన దేశం?
తమ దేశం ఉక్రెయిన్‌పై దాడికి దిగిందని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ పలు మీడియా సంస్థలపై మార్చి 5న రష్యా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా, డూషెవెల్లి, మెడుజా సంస్థలను నిషేధించిన రష్యా, తాజాగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను కూడా నిలిపివేసింది. రష్యాపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలు కల్పించేలా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. మీడియాపై నియంత్రణకు ఉద్దేశించిన బిల్లును రష్యా చట్టసభలు వెనువెంటనే ఆమోదించగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంపై తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే ఇకపై 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
తప్పుకుంటున్న సంస్థలు
మీడియాపై నియంత్రణ పెరగడంతో పలు విదేశీ మీడియా సంస్థలు రష్యాలో కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నాయి. రష్యాల ప్రసారాలు తాత్కాలికంగా నిలిపివేస్తామని సీఎన్‌ఎన్, బ్లూమ్‌బర్గ్ లాంటి సంస్థలు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : రష్యా
ఎక్కడ : రష్యా వ్యాప్తంగా...
ఎందుకు : రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగిందని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ..
Maharashtra: రాష్ట్రంలోని ఏ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు?
మహారాష్ట్రలోని పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టును మార్చి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. గర్వారే స్టేషన్‌లో రైలుకు పంచ్చజెండా ఊపారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఎంఐటీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ... నగరాలు, పట్టణాల్లో మెట్రో రైలు అనుసంధానంతో సహా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
రూ.11,400 కోట్లతో..
పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. రూ.11,400 కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 32.2 కిలోమీటర్లకు గాను నిర్మాణం పూర్తయిన 12 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు.
సీఐఎస్‌ఎఫ్ 53వ ఆవిర్భావ దినోత్సవం..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నిర్వహించిన కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్–సీఐఎస్‌ఎఫ్) 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్చి 6న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొని, ప్రసంగించారు. సీఐఎస్‌ఎఫ్ ఒక కర్మయోగిలాగా పారిశ్రామికాభివృద్ధి, ప్రైవేట్ ఉత్పత్తి యూనిట్ల రక్షణలో పాలుపంచుకుంటోందని పేర్కొన్నారు. ఇకపై సంస్థ హైబ్రిడ్ మోడల్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా నాణ్యమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయాలన్నారు. 1969, మార్చి 10న సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుణే మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
ఎందుకు : నగరాభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా..
ISSF World Cup 2022: ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకం
ఈజిప్ట్ రాజధాని నగరం కైరో వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్-2022 టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. మార్చి 7న జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, రాహీ సర్నోబత్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో భారత జట్టు 17–13తో సింగపూర్ జట్టును ఓడించింది. మరోవైపు 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అఖిల్ షెరాన్–శ్రియాంక జోడీ(భారత్) కాంస్య పతకాన్ని సాధించింది. అఖిల్–శ్రియాంక జంట 16–10తో రెబెకా–రుంప్లెర్ (ఆస్ట్రియా) ద్వయంపై గెలిచింది.
ఇషాకు మూడో పతకం
తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ టోర్నిలో ఇప్పటివరకు మొత్తం మూడు పతకాలు సాధించింది. ఇందులో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గెలిచిన స్వర్ణ పతకం, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గెలిచిన స్వర్ణ పతకం, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సాధించిన రజత పతకం ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన జట్టు?
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఇషా సింగ్, రాహీ సర్నోబత్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు
ఎక్కడ : కైరో, ఈజిప్ట్
ఎందుకు : మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 17–13తో సింగపూర్ జట్టును ఓడించడంతో..
Tennis: ఐటీఎఫ్ టోర్నీ సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్చి 6న జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్ ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సహజను విజేతగా ప్రకటించారు. సహజ కెరీర్‌లో ఇదే తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.
రన్నరప్ రష్మిక జంట
ఐటీఎఫ్ మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–శ్రీవల్లి రష్మిక జంట రన్నరప్‌గా నిలిచింది. మార్చి 6న జరిగిన డబుల్స్ ఫైనల్లో సాత్విక–రష్మిక ద్వయం 6–3, 4–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో సోహా సాదిక్–చామర్తి సాయి సంహిత (భారత్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.
అహిక జోడీకి రజతం..
ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో జరిగిన సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ(భారత్) 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్ రుయ్–కుయ్ మాన్ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : సహజ యామలపల్లి
ఎక్కడ : నాగ్‌పూర్, మహారాష్ట్ర
ఎందుకు : సింగిల్స్ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్ ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలగడంతో..
CBI: ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణను ఏ కేసులో అరెస్ట్ చేశారు?
కొ–లొకేషన్ కేసు(co-location)లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మార్చి 6న అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం(న్యూఢిల్లీ) లాకప్‌లో ఉంచారు. ఎన్‌ఎస్‌ఈ కొ–లొకేషన్ కేసుకు సంబంధించి సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ–ఎస్‌ఈబీఐ) నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్‌ఎస్‌ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్‌ఎస్‌ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను 2022, ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. ముంబై నగరంలో ఎన్‌ఎస్‌ఈ ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరెస్ట్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో?
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : చిత్రా రామకృష్ణ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఎన్‌ఎస్‌ఈ కొ–లొకేషన్ కేసు(co-location)కు సంబంధించి..
Financial Action Task Force: ఎఫ్‌ఏటీఎఫ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను 2022, జూన్ వరకు ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) మార్చి 5న ప్రకటించింది. గ్రేలిస్టు నుంచి బయటపడేందుకు అవసరమైన లక్ష్యాలను పాక్ అందుకోలేకపోయిందని తెలిపింది. ఈ జాబితాలో పాక్ 2018 జూన్ నుంచి కొనసాగుతోంది. మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను అడ్డుకోలేకపోవడంతో పాక్‌ను ఈ జాబితాలో చేర్చారు. దీనిలోంచి బయటపడేందుకు 2019 అక్టోబర్‌ను డెడ్‌లైన్‌గా విధించారు. అప్పటినుంచి ఈ గడువును పొడిగిస్తూ వస్తున్నారు.
పాకిస్తాన్ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం. ఎఫ్‌ఏటీఎఫ్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఉంది.
రష్యాలో వీసా, మాస్టర్‌కార్డ్ సేవల నిలిపివేత
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలు ప్రకటించాయి. రష్యా బ్యాంకులు జారీ చేసిన తమ కార్డులు పనిచేయవని, ఇతర దేశాల్లో తాము జారీ చేసిన కార్డులు రష్యా స్టోర్లలో, ఏటీఎంల్లో పనిచేయవని మాస్టర్‌కార్డ్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, జూన్ వరకు పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)
ఎందుకు : ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైనందున..
FM Nirmala Sitharaman: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నాసిన్‌ను ఏర్పాటు చేయనున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, గోరంట్ల మండలం, పాలసముద్రం గ్రామ సమీపంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ డ్యూటీస్ అండ్ నార్కొటిక్స్(నాసిన్) ఏర్పాటు కానుంది. ‘నాసిన్’ భవన సముదాయానికి భూమిపూజ మార్చి 5న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మ్రంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు.
నాసిన్ భూమిపూజ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... నాసిన్ ఏర్పాటుతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని చెప్పారు. 2024 నాటికి నాసిన్ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూలు, మత్తు పదార్థాల నిర్మూలన విస్తృతంగా చేపడతామన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే విధంగానే ఇక్కడి నాసిన్‌లో ఐఆర్‌ఎస్‌లకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇస్తామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కస్టమ్స్ ఉద్యోగులు అకాడమీకి అనుసంధానమై ఉంటారన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ డ్యూటీస్ అండ్ నార్కొటిక్స్(నాసిన్) ఏర్పాటుకు భూమిపూజ
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : పాలసముద్రం గ్రామం, గోరంట్ల మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఐఆర్‌ఎస్‌లకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు..
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, మార్చి 05 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్