Daily Current Affairs in Telugu: 2022, మార్చి 21 కరెంట్ అఫైర్స్
Asian Billiards Championship 2022: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు?
భారత మేటి క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. మార్చి 19న ఖతర్ రాజధాని దోహాలో జరిగిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్–2022 ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ 6–2 (101–66, 100–0, 101–29, 44–100, 104–90, 101–21, 88–100, 101–78) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాపై గెలుపొందాడు. 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లలో కూడా పంకజ్ ఆసియా బిలియర్డ్స్ టైటిల్‌ను సాధించాడు.
బొమ్మదేవర ధీరజ్ ఏ క్రీడల్లో ప్రసిద్ధి చెందాడు?
ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్ రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ వేదికగా జరిగిన ఫైనల్లో ధీరజ్, సుశాంత్ పార్థ్ సాలుంకె, రాహుల్ కుమార్ నగర్వాల్‌లతో కూడిన భారత జట్టు 6–2తో కజకిస్తాన్ జట్టును ఓడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్–2022లో చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : భారత మేటి క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ
ఎక్కడ : దోహా, ఖతర్
ఎందుకు : ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ 6–2 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాపై విజయం సాధించడంతో..
Sharad Yadav: లోక్‌తాంత్రిక్ జనతాదళ్‌ను ఏ పార్టీలో విలీనం చేశారు?
బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (74) తన నేతృత్వంలోని లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ )లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్చి 20న ఆయన తెలిపారు. బీజేపీని దీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉందన్నారు. 1997లో దాణా కుంభకోణం బయటపడ్డాక జనతాదళ్ పార్టీలో విభేదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్... 1997, జూలై 5న ఆర్‌జేడీని స్థాపించారు. అప్పట్లో జనతాదళ్‌లో లాలూకు గట్టి పోటీ ఇచ్చే నేతగా శరద్ యాదవ్ ఉండేవారు. 2018, మే 18వ తేదీన లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ)ను శరద్ యాదవ్ స్థాపించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ )లో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) పార్టీ విలీనం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్
ఎక్కడ : బిహార్
ఎందుకు : బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమని..
PM Modi, Japan PM Fumio Kishida: భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీ ఎక్కడ జరిగింది?
భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని మార్చి 19న భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుదృఢం చేసుకునేందుకు గల అవకాశాలను చర్చించారు. సహజ ఇంధన వనరుల అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల ప్రతినిధులు వివిధ రంగాల్లో సహకారానికి మరింత బలోపేతం చేసుకునేందుకు సంబంధించి ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కిషిడా జపాన్ ప్రధాని అయిన తర్వాత ప్రధాని మోదీతో భేటీ అవడం ఇదే తొలిసారి.
భారత్‌లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీ సందర్భంగా జపాన్ ప్రధాని కిషిడా మాట్లాడుతూ.. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడి తీవ్రమైన అంశమని, ఈ చర్యతో అంతర్జాతీయ ప్రాథమిక సంప్రదాయాలను సైతం రష్యా తుంగలోకి తొక్కిందన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని భారత్, జపాన్ గుర్తించాయని చెప్పారు. భారత్, జపాన్‌ల సంబంధాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేస్తాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా
ఎక్కడ : నూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుదృఢం చేసుకునేందుకు గల అవకాశాలపై చర్చించేందుకు..
Rupee-Rial Mechanism: భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన దేశం?
భారత్‌కు చమురు, గ్యాస్ సరఫరా చేసేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. దేశీయ ఇంధన అవసరాలను తీరుస్తామని భారత్‌లోని ఇరాన్ రాయబారి అలీ చెగెని మార్చి 19న వెల్లడించారు. రూపాయి–రియాల్ వాణిజ్య వ్యవస్థను తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ విధానం కార్యరూపంలోకి వస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.2,28,000 కోట్లను తాకుతుందని అన్నారు. సహజ వాయువును రవాణా చేయడం కోసం ఇరాన్–పాకిస్తాన్–ఇండియా పైప్‌లైన్ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి, ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడానికి భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
రూపాయి–రియాల్ విధానం కింద...
భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా గతంలో ఇరాన్ ఉండేది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైదొలిగి చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో.. ఇరాన్ నుంచి దిగుమతులను భారత్ నిలిపివేయాల్సి వచ్చింది. 2018–19లో భారత్–ఇరాన్ మధ్య వాణిజ్యం రూ.1,29,200 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య ఇది రూ.15,200 కోట్లకు పరిమితమైంది. రూపాయి–రియాల్ విధానం కింద భారత చమురు శుద్ధి కంపెనీలు స్థానిక ఇరానియన్ బ్యాంకుకు రూపాయల్లో చెల్లిస్తాయి. భారత్ నుండి తనకు అవసరమైన వస్తువుల దిగుమతుల కోసం చెల్లించడానికి ఇరాన్ ఈ నిధులను ఉపయోగిస్తుంది.
Football: ఐఎస్‌ఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న జట్టు?
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) చాంపియన్‌గా అవతరించింది. మార్చి 20న గోవాలోని ఫటోర్డా స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ‘షూటౌట్’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్ జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. చాంపియన్ హైదరాబాద్ జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. కేరళ జట్టు మూడోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014, 2016లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడింది.
చార్లెస్ లెక్‌లెర్క్ ఏ క్రీడకు చెందినవాడు?
ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ విజేతగా నిలిచాడు. మార్చి 20న బహ్రెయిన్‌లోని సఖిర్ ప్రాంతంలో జరిగిన ప్రధాన రేసులో.. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్‌లెర్క్.. అందరికంటే ముందుగా ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా కెరీర్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్‌లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)
ఎక్కడ : ఫటోర్డా స్టేడియం, గోవా
ఎందుకు : ఫైనల్లో హైదరాబాద్ జట్టు ‘షూటౌట్’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్ జట్టును ఓడించినందున..
GDP Growth Rate: ఎస్‌అండ్‌పీ అంచనా ప్రకారం.. 2022–23లో భారత్ వృద్ధి రేటు?
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చమురును గణనీయంగా దిగుమతి చేసుకునే భారత్, థాయిలాండ్‌పై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అధికంగా ఉంటుందని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో.. భారతదేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది. 2023–24లో 6 శాతం, 2024–25లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని తెలిపింది. దేశ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులపైనే భారత్ ఆధారపడిన విషయం విదితమే.
ఆర్‌బీఎల్ బ్యాంక్ సీఈవోగా ఎవరు ఉన్నారు?
ప్రైవేటు రంగంలోని ఆర్‌బీఎల్ బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ అహూజా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలు లేదా రెగ్యులర్ ఎండీ అండ్ సీఈఓ నియామకం జరిగే వరకూ ఏది ముందయితే దానికి వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
Mallu Swarajyam: సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధురాలు మల్లు స్వరాజ్యం(91) ఇకలేరు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 19న తుది శ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని అప్పగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాం రెడ్డి–చొక్కమ్మ దంపతులకు 1931లో స్వరాజ్యం జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల కోసం పాటుబడ్డారు.
పోరాటమే ఊపిరిగా..
- నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.
- తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఆకర్షించి వారూ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు.
- 1945–48 సంవత్సరాల మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు.
- సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించారు.
- సాయుధ పోరాటం తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది.
రాజకీయ ప్రస్థానం ఇలా..
- సాయుధ పోరాటం ముగిసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్వరాజ్యం రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు.
- హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) తరఫున ఎన్నికయ్యారు.
- 1985లో ప్రభుత్వం కూలిపోవడంతో.. 1985, 1989 రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
- పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు.
- స్వరాజ్యం జీవితకథ ‘నా మాటే తుపాకీ తూటా’ పుస్తక రూపంలో ప్రచురించారు.
- వామపక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ’చైతన్య మానవి’సంపాదకవర్గంలో ఒకరుగా స్వరాజ్యం సేవలు అందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధురాలు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : మల్లు స్వరాజ్యం(91)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా..చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 19 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్